నువ్వు నేను ఒకే ఇంట్లోవాళ్ళం
నువ్వు పుడితే… ఆహా అనేవాళ్ళు
నేను పుడితే స్వాహా అంటారు
అన్నిసార్లూ నీకు అమ్మ ఒడే ఉయ్యాల
ఎన్నోసార్లు నన్ను కుప్పతొట్టే మొయ్యాల
నెలకోసారి నిండుగా పెరిగే
గడ్డాలు… మీసాలను మెలేస్తూ
తిరిగే నీకేం తెలుసు?
నెలసరి నొప్పితో
నేలపై మెలికలు తిరిగే
నా తిప్పల సంగతి?
నేను నలుపని, లావని
నన్ను నచ్చలేదంటావు
నీకు కన్నొంకరున్నా… కాలొంకరున్నా
కట్టుకోమంటారు నన్ను
ఊసులంటావు… బాసలంటావు
భార్యను చేసుకోమంటే
ఆ ఊసే ఎత్తకంటావు
చాటుగా చేసిన కడుపును
మారుమాటెత్తకుండా
మాయం చేయమంటావు
కత్తిగాట్లకు కత్తెరపోట్లకు
కేకలు పెడుతుంటే కడుపులోని
పిండానికి పిండం పెట్టిస్తావు
నీకు తెలియదు నా (ప్రాణంలోని)
ప్రాణం ఖరీదు
కాన్పయ్యిందని, కొలతలు మారాయని
తల తిప్పేసుకుంటావు
పెరిగిన నీ బానపొట్టని
బట్టతలని నేనెలా భరించను?
నలభై ఏండ్లయినా నవమన్మధుడినని
సోకు చేసుకు తిరుగుతావు
నేను మాత్రం నడీడుకొచ్చానని
నవ్వులాట చేస్తవు
ఒక్క నలుసును మోస్తే తెలిసేది
నడీడు సంగతి… నడికట్టు దుర్గతి
అరవయ్యేండ్లొచ్చినా ఆర్డర్లేసి
అన్నీ అమర్చుకుంటావు… మరి
నాకు వయసు తరుగుతోందా
నువ్వు పోతే… నేను ముండమోపి
నేను పోతే నీకు ఏం పేరు?
ఏ స్త్రీ చరిత్ర చూసినా
ఏముంది గర్వకారణం?
ఎంతో కొంత ఏదో రూపంలో
పురుష పీడిత పరాయణత్వం