ఏముంది మనకి మనదీ అని గర్వంగా చెప్పుకోవడానికి
ఆకాశంలో సగమని అనుకోవడమే కానీ
శూన్యంలో భాగస్వామ్యం యిచ్చి
మిగిలిన సగంలోనే పగ్గాలన్నీ పట్టుకున్నారు
తల్లిపాల ఉగ్గుతోనే తండ్రి చెప్పినట్టు వినాలని నూరిపోస్తారు
నా కూతురు నా మాట జవదాటదు అన్న గర్వము కోసం
ఆశలు, కోరికలు సమాధి చేసుకుంటూ పసితనం నుంచే
సొంత అభిప్రాయమంటూ లేకుండా ఆప్యాయతల ముసుగులో
మురిపాల కూతురిగా ఒద్దికగా ఒదిగిపోతాం
తనకన్నా చిన్నవాడైనా సరే తమ్ముడిని తోడు తీసుకెళ్ళమ్మా అని
మగతోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళలేని బలహీనురాలిని
చేస్తారు
ఒంచిన తల ఎత్తని సుగుణాల రాశిగా పొగడ్తలందుకుంటూ
తల్లిదండ్రులకు, కుటుంబానికి పేరు తీసుకొస్తాం
అలా కాని పక్షంలో ఎటూ పరువు హత్యలు ఉంటాయి
పెళ్ళి మంత్రాల సాక్షిగా అడుగులో అడుగు వేసి నడిపిస్తారు
అలంకరణ ముసుగులో ముగ్ధలా కూర్చోపెట్టి
అందాల భరిణకు సరయిన రక్షణ కల్పించామని చెప్తూ
ఎంత సాధించినా అబలవే నీవు అన్న భావన కల్పించి
సొంతంగా నిర్ణయం తీసుకోలేని పరాన్నజీవిగా మార్చేస్తారు
పాదాల క్రింద కొంచెం చోటు కావాలని ప్రాధేయపడే రోజులు పోయినా
పగటి అవమానాలను పంటి బిగువున దాచుకుంటూ
రాత్రి మాత్రమే చూపించే పశ్చాత్తాపానికి లొంగిపోతూ
తామెంతో ఉన్నతులమన్న భ్రమలో జీవితాన్ని గడిపేస్తాం
చివరికి కన్నపాపానికి నీకేమీ తెలియదు అని
ఈసడించుకుంటుంటే కళ్ళనీళ్ళని కంట్లోనే ఇంకించుకుని
తను కన్నవాడు తనకన్నా తెలివైనవాడని మురిసిపోతూ
తన జీవితానికి సాఫల్యం కలిగిందని తృప్తి పొందుతాం
తలుపు చాటునుంచి మాట్లాడే రోజులు పోయి
వేదికలెక్కి అభిప్రాయాలను తెలియచేసే రోజులొచ్చినా
గుండెలోని తడి, కళ్ళలోని చెమ్మ కడవరకు మనతోనే
మనువు రాసిన రాతో లేక మనసు యొక్క బలహీనతో తెలియదు
కానీ ఇకనుంచీ యుగయుగాల ఈ చరిత్రని మార్చేద్దాం
కొంత కరకుతనం తెచ్చుకుని మన సొంత గళాన్ని వినిపిద్దాం
సగం కాదు మనం సంపూర్ణం అని నిరూపిద్దాం.