2017 జులై 13న బహుమతుల ప్రదానోత్సవాన్ని ‘భూమిక’ సంతోష సంబరాల మధ్య జరుపుకొంది. ప్రముఖ తెలంగాణా పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యంగారు రావడంతో సభకు నిండుదనం వచ్చింది. అలాగే రచయిత వాసిరెడ్డి నారాయణరావుగారు ఆత్మీయ అతిధులుగా వచ్చారు.
వేదిక మీదకు అత్యంత ఆత్మీయంగా ప్రశాంతి ఆహ్వాన వాక్యాలతో సభ ప్రారంభమైంది. భూమికలోని ఉద్యోగులు, రకరకాల ఎన్జీఓలతో సందడి సందడిగా ఉంది ఆ సాయంత్రం. ప్రతి సంవత్సరంలానే ఈ ఏడు కూడా కథ, వ్యాసాలకు బహుమతులు ఇవ్వడాన్ని గురించి ప్రశాంతి చాలా విపులంగా కథాంశం యొక్క గొప్పదనాన్ని, రచనా వైశిష్ట్యాన్ని చెప్పారు. కొండవీటి సత్యవతిని వేదికమీదకు ఆహ్వానించడంతో సభ మొదలైంది. అనివార్య కారణాలవల్ల కొద్దిగా ఆలస్యమైనా ‘దేవి’ సభలో పాల్గొన్నారు. కవిత్వానికి తగిన స్థాయి ఉన్న కవితలు రాకపోవడం వల్ల, ఇవ్వలేకపోవడం అన్నది విషాదకరమైన
విషయమని శిలాలోలిత అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గతంలో – కొత్తగా రాస్తున్న కొత్తవాళ్ళను ప్రోత్సహించే ఉద్దేశ్యంతోనే ఈ అవార్డులు నెలకొల్పామని, ఈసారి ఆ అర్హత గల కవితలేవీ రాలేదని అన్నారు.
ఈ సభ ఎఐటియుసి, సత్యనారాయణరెడ్డి భవన్, హిమాయత్‌నగర్‌లో జరిగింది. చల్లటి సాయంత్రం పూట మబ్బులు కమ్మిన ఆహ్లాదంతో సభ మొదలైంది. మల్లు స్వరాజ్యం గారు ఉపన్యసించిన తీరు శ్రోతలను ముగ్ధుల్ని చేసింది. తుపాకి తూటా లాంటి ఆమె మాటలు చైతన్యాన్ని నింపాయి. వెనుకటి ఆవేశంతోనే ఆమె పాట అందుకుంటే పద్మ, దేవి, సత్యా, ప్రశాంతి లాంటి ఉత్సాహవంతులు గళం కలిపారు. నారాయణరావుగారు ముక్తసరిగా మాట్లాడినా భూమికపట్ల తనకున్న అమూల్యమైన గౌరవాన్ని తెలియచేశారు. మల్లు స్వరాజ్యంగారి ఆటోబయోగ్రఫీని ఆరు నెలల్లోగా తయారుచేస్తే పుస్తకరూపంగా తీసుకొస్తానని అన్నారు. దేవి చైతన్యవంతమైన స్వరంతో, మాటలతో ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. బహుమతుల ప్రదానోత్సవం ఫార్మల్‌గా కాక, కొండవీటి సత్యవతి ఆధ్వర్యంలో విభిన్నంగా ఒక పండుగలా జరిగింది. కొందరు బహుమతి గ్రహీతలు అనివార్య కారణాల వల్ల రాలేకపోవడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి తీసుకుని భూమిక ఎంత విలువైన బహుమతో వారి స్పందనలో తెలియచేశారు. సభలో పాల్గొన్న ముదిగంటి సుజాతారెడ్డి, సుజాతాపట్వారి, రుక్మిణిరావ్, సుజాతామూర్తి, కె.బి. లక్ష్మి వంటి కొందరు తమ సంతోషాన్ని సభాముఖంగా వెలిబుచ్చారు.
కథలు : ప్రథమ బహుమతి – అప్పరాజు నాగజ్యోతి
ద్వితీయ బహుమతి – సౌజన్యకిరణ్
తృతీయ బహుమతి – పి.రాజ్యలక్ష్మి
వ్యాసాలు : ప్రథమ బహుమతి – నిశ్శంకర్రావు శిరీష
ద్వితీయ బహుమతి – కె.రాజశ్రీ
తృతీయ బహుమతి – డా||సమ్మెట విజయ
బహుమతి గ్రహీతల స్పందనలతో ఆనాటి సభ ముగిసింది.