‘పూజా… పూజా… మీ అమ్మ కోసం ఎవరో మేడమ్ వాళ్ళొచ్చిన్రు…’ పరిగెట్టుకుంటూ వచ్చిన ఆరేళ్ళ కుర్రాడు ఓ ఇంటిముందాగి గేటు దగ్గర్నుంచి అరిచాడు. ఊళ్ళోకొచ్చాక ‘హనుమి వాళ్ళిల్లు తెల్సా’ అని అడగ్గానే ‘ఓ… రాన్రి’ అంటూ చెయ్యూపుతూ రయ్యిన పరిగెత్తుతూ జీప్కన్నా ముందొచ్చి ఇంటి ముందాగాడు. జీప్ ఆగగానే కిందకి దిగారు శాంతి, మరో నలుగురు టీం మెంబర్స్. ఒక అధ్యయనంలో భాగంగా రాజ్య తండాకి వచ్చారు శాంతి వాళ్ళు.
ఊరంతా కోలాహలంగా ఉంది. రంగురంగుల బట్టలు, చేతుల్నిండా గాజులు, చెవులకి పెద్ద పెద్ద జూకాలు, మెళ్ళో పూసల దండలు, గిల్టు నగలతో, నుదుట డ్రస్కి మ్యాచయ్యే రెండు, మూడు రంగుల బొట్లతో ఆర్భాటంగా ఉన్నారు ఆడపిల్లలు. జీన్స్ ప్యాంట్ల మీద కొట్టొచ్చినట్టున్న ఎరుపు, పచ్చ, నీలం, చిలకపచ్చ, నలుపు, తెలుపు షర్టులతో, మ్యాచింగ్ బూట్లు, చేతులకి పూసల చైన్లు, స్టీల్ కడియాలు, రంగుల కళ్ళద్దాలతో మగపిల్లలూ తీసిపోలేదు. చిన్నవి, పెద్దవి అద్దాలు, వాటి చుట్టూ పూసల్తో డిజైన్లు కుట్టిన రంగురంగుల లంగాలు, రంగు కనపడనంతగా అద్దాలు, పూసలు కుట్టిన చోళీలు, సాంప్రదాయ చాందీ నగలు, ముంజేతుల నుండి భుజాల వరకు దంతపు గాజులు, జుట్టు నున్నగా దువ్వి చెవుల దగ్గరగా వేలాడేసిన పెద్ద వెండి బుట్టల జుంకీలు, కాళ్ళకి ఘల్లుఘల్లుమనే కడియాలు ధరించిన స్త్రీలు… ఇవన్నీ ఒకెత్తైతే స్త్రీలు తలలమీదుగా వేసుకున్న మేలిముసుగు – అద్దాలు, పూసలు, దారాలకి తోడు ప్రత్యేకమైన డిజైన్లతో చేసిన వెండి గుండ్లు, అంచులా ఎంతో నైపుణ్యంతో కుట్టిన బరువైన ఘూంగట్లు – తలతిప్పాలన్నా బరువుతో భారంగా కదులుతున్నట్లుంది. మొలకల పండగ్గా పిలవబడే ‘తీజ్’ సందర్భంగా తొమ్మిది రోజుల్నుంచి లంబాడ తండాలన్నీ సందడిగా ఉన్నాయి. హోలీ తర్వాత వారు ఎంతో ఆర్భాటంగా చేసుకునే పండుగ ఇదేనట.
ఇవన్నీ గమనిస్తూ, పిల్లలు పెద్ద గుంపుగా వెంటవస్తుంటే వారితో మాట్లాడ్తూ బడిదగ్గరకొచ్చి కూర్చున్నారు శాంతివాళ్ళ టీం అంతా. హనుమి పిలుపుతో పావు గంటలో ఓ ఇరవై మంది స్త్రీలు కూడా వచ్చి కూర్చున్నారు. ”తొమ్మిది రోజుల్నుంచి పాటలు, డాన్సుల్తో సంబరం చేసుకున్నాం.. బాగా తిన్నాం… అలిసిపోయాం… ఇన్ని రోజుల్నుంచి వేసుకున్న ఈ బట్టలు, నగలు, అన్నీ బరువుగా ఉన్నై. ఇంక తీసేస్తం” అంటూనే ”మగవాళ్ళదేముంది… ఒక పంచె, సన్నని అంగీతో తేలికగా
ఉంటరు… వాళ్ళ ఖుషీ కోసం ఈ బరువులు మేం మొయ్యాలె” అని గునిసింది రుక్మి. మరి కొంతమంది యువతుల ముఖాల్లోనూ అసంతృప్తి, నిర్వేదపు ఛాయలు కదలాడినై.
”గుడుంబా కాయడం, తాగటం మానేసినం కానీ ఇప్పుడు ఇంగ్లీషు మందుకా కోర్టర్లు మా ప్రాణాల మీదికి తెస్తోంది. పండగని మరింత తాగుడు… అది చెయ్యలేదు… ఇది బాగలేదు అని కొట్టుడు, సంపుడు… మా మొగోళ్ళకి ఇంకో పనే లేదు” అంటూ ఆవేశంగా అంది సోనా. తాగిన మైకంలో రెండేళ్ళ కిందట ఆమె అక్కని నరికి చంపేశాడట అనుమానపు భర్త. దాన్తో తాను పెళ్ళి చేసుకోనని… అక్క ఇద్దరి కూతుళ్ళని ఆమే పెంచుతోంది.
”పండగ కదా! సంతోషంగా
ఉండాలన్పిస్తుంది. అందరం కల్సి సంబరం చేసుకుంటాం. కానీ తాగిన కుర్రాళ్ళు… మా వాళ్ళే… అయినా మైకంలో ఈళ్ళు, ఆళ్ళని లేదు, మీదపడ్తుంటరు. ఖుషీగా పాడుకుంటూ డాన్సులేస్తుంటే, ఇదే సందని పక్కన్చేరిపోయి మీద చేతులేస్తరు. యాడేడో ముడ్తరు. మస్తు కోపమొస్తది. కొట్టి సంపాలనిపిస్తది… పండక్కదా… అల్లరైతది, అంతా ఖరాబైతదని వదిలేస్తం… కానీ పురుగులు పాకినట్లుంటది… ఏం చెయ్యలేక ఏడుపొస్తది” కోపం, బాధ కలగలిసిన గొంతుతో వాపోయింది పదహారేళ్ళ రేష్మ.
ఎండాకాలం ఎండల వేడికి ఒట్టిపోయినట్టైన భూమిని శుభ్రంచేసి వానలు పడగానే దున్ని, విత్తులు నాటి, మళ్ళీ సరిపడా వానలు పడి అవి మొలకెత్తి మొక్కలు నిలబడ్డాక ఆ యేడిక పంటలు పండుతాయన్న నమ్మకం కుదిరి ప్రకృతికి కృతజ్ఞతలు చెప్తూ చల్లగా చూసి ధాన్యంతో ఇల్లు నింపమని వేడుకుంటూ చేసుకునే ‘మొలకల పండగ’, భర్తలు పడ్డ శ్రమని మరిపించి వారికి ఆనందాన్ని పంచుతూ రంజింపచేయడానికి వారి కోసం బాగా అలంకరించుకుని, తాను ఉపవాసముండి భర్త మేలు కోసం పూజ చేసి, వారికి మాత్రం షడ్రసోపేతంగా వండి పెట్టే ‘తీజ్’ పండగ… ఇప్పుడిలా బరువైన బట్టలు, నగలు, అలంకారాలు భారమై; తాగుడు మైకంలో శారీరక, మానసిక హింసలకి పాల్పడ్తూ, ఆడపిల్లలకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్న మగవారి ‘సంతోషం’… దేనికోసం సంబరం? ఏది పండగ?
ప్రశ్నలకి సమాధానాలు దొరక్కముందే ”పండక్కి మా ఊరొచ్చారు, మీరూ మాతో ఆడాలి” అంటూ శాంతీ వాళ్ళందర్నీ చేతులు పట్టి లేపి వాళ్ళందరి మీద ఆసువుగా పాట పాడ్తూ చేతుల్ని గాల్లోకి లేపి శరీరాన్ని సునాయాసంగా చుట్లు తిప్పుతూ స్త్రీలందరూ లంబాడ సాంప్రదాయ నృత్యం చేస్తుంటే శాంతి, టీంలోని వారంతా జతకలిశారు. కానీ శాంతి ముందు చప్పట్లు కొడ్తూ నృత్యం చేస్తున్న ప్రశ్నలు నిలువెత్తు రూపంలో నిలిచాయి. ఈ భౌతిక మెరుపులు స్త్రీల జీవితాన్ని మెరిపించగలవా? ఈ బాహ్య స్వేచ్ఛ వీరి జీవితాల్లో అంతర్గత స్వేచ్ఛని ఎప్పటికి తేగలదు??