మహాత్మా గాంధీ చొక్కా తీసివేసినా, అంబేద్కర్ సూటు, బూటు తొడిగినా, రెండింటి వెనుకా ఉన్నది రాజకీయమే.. అంటాడు రజనీకాంత్ సరికొత్త సినిమా ‘కబాలి’లో కథానాయకుడు.
ఐతే ప్రపంచవ్యాప్తంగా, మహిళల వస్త్రధారణ వెనుక మాత్రం కుల, మత, వర్గ, రాజకీయాలే కాక సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబగౌరవం, పాతివ్రత్యం, వాణిజ్యం వంటి అనేక రాజకీయాలు దాగున్నాయి. ఇస్లామిక్ దేశాలు మతం పేరిట తమ స్త్రీలకు బురఖాలు తొడిగినా, పాశ్చాత్య దేశాలు స్వేచ్ఛ పేరిట జీన్స్, స్కర్టులు వంటివి నిర్దేశించినా, వాటిని నడిపించేది పితృస్వామ్యపు బలమైన జాడలే.
స్త్రీలకు తమ శరీరాలపై, లైంగికతపై, పునరుత్పత్తిపై పూర్తి అధికారం లేనట్టే వస్త్రధారణపై కూడా లేదు. అనేక ప్రత్యక్ష, పరోక్ష అంశాలు, ఒత్తిళ్ళు ఆమె దుస్తులను, వేషభాషలను, నడవడిని నియంత్రిస్తూ ఉంటాయి.
మౌలికంగా పురుషుల దుస్తులు సౌకర్యానికి ప్రాధాన్యతను ఇస్తూ, ఆయా ప్రాంత వాతావరణం, సంస్కృతిని బట్టి రూపొందించబడతాయి. కానీ స్త్రీల దుస్తులు మాత్రం సౌకర్యానికి ఆఖరి ప్రాధాన్యం ఇస్తూ ఆమె శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే విధంగానో లేక సమాజ నిర్దేశిత సౌందర్య నమూనాలకు కట్టుబడి
ఉంటూ, చూపరులకు కనువిందు చేయడమే లక్ష్యంగానో ఉంటాయి. ఈ రెండూ నిజానికి రెండు తీవ్ర స్థితులు.. కానీ వీటి నడుమ చాలా పద్ధతులు, సంప్రదాయాలు, వస్త్ర రీతులూ ఉన్నాయి. అయితే అవన్నీ కూడా స్త్రీలను విభజించి, వివక్షను పెంచి నియంత్రించడానికి పితృస్వామ్యం వాడే అనేక ఆయుధాలలో కొన్ని.
మన దేశంలో వస్త్రధారణ ఇళ్ళల్లో మరుగుదొడ్లు కట్టాలనే ప్రభుత్వ ప్రచార ప్రకటనలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కొత్త కోడలిని ఉద్దేశించి ఇలా అంటుంది… ”కోడలా! నెత్తిమీద ఆ ముసుగు తీసెయ్! ఈ ఇంట్లో మరుగు దొడ్డే లేదట…” (అంటే ఆ పనికి బయటికి వెళ్ళాక కుటుంబ పరువు ఎలాగూ పోతుంది కాబట్టి ఇంకా ఆ ముసుగు ఎందుకు అని). ఇక్కడ ఒక విషయం గమనించాలి. బహిరంగ మలవిసర్జన వల్ల మంటగలిసేది ఇంట్లో స్త్రీల ఆత్మగౌరవమే. పురుషులు అలా చేసినా వారికి పోయేదేమీ లేదు. ప్రభుత్వానికి మరుగుదొడ్ల వాడకాన్ని ప్రోత్సహించడానికి వేరే కారణమే దొరకలేదు. పరిశుభ్రత, ఆరోగ్యం వంటి శాస్త్రీయ కారణాలు చెప్పి ఒప్పించలేరా?
ఇక్కడ కోడలు బయటకు వెళ్ళడం వాంఛనీయం కాదు అని చెప్తూ పైగా ఆమె నెత్తిమీద ముసుగుతోనే ఇంటి పరువు, కుటుంబ గౌరవం (ఘర్ కీ ఇజ్జత్) ముడిపడి ఉన్నాయనడం ఎంత దారుణం.
ఉత్తరాదిన… ఈ ముసుగు ఎంత ముఖ్యమో, దక్షిణాదిన ఛాతీని కప్పి ఉంచే పమిట లేదా కొంగుకు చాలా ప్రాధాన్యత ఉంది. మహిళలు సదా ఆ పైటను జాగ్రత్తగా స్థానభ్రంశం చెందకుండా కాపాడుకుంటూ ఉంటారు. పైట జారడం అనేది సిగ్గులేనితనానికి, శృంగారానికి సంకేతంగా భావించబడుతోంది. ప్రముఖ కవయిత్రి జయప్రభ తన కవితలో ‘పైటను తగలెయ్యండి’ అంటారు. ‘నా భుజాలపై నుండి గుదిబండలా వేలాడుతూ అది నా స్వేచ్ఛను హరిస్తూనే ఉంటుంది’ అంటారు. స్త్రీల దుస్తుల అసౌకర్యాన్ని గురించి ఉర్దూ కవయిత్రి ఇస్మత్ చుగ్తాయి కూడా తన కథ ‘ఘర్ వాలీ’లో కథానాయిక ‘లాజో’తో ఇలా అనిపిస్తారు. ‘ఎవరు కనిపెట్టారో ఈ చుడిదార్ పైజమాను… సైతాను పేగుల్లా పొడుగ్గా… తుపాకి పెట్టెలా సన్నగా…’ అని.
కానీ మీకు తెలుసా! కొన్నేళ్ళ క్రితం దక్షిణాదిన అంటే కేరళలో స్త్రీలు తమ ఛాతీని కప్పుకునే హక్కు కోసం పోరాటం చేశారు.
నంగేలీ-చన్నార్ తిరుగుబాటు
19వ శతాబ్ది తొలినాళ్ళలో కేరళలో బ్రాహ్మణ కులానికి చెందిన స్త్రీలు మాత్రమే ఛాతీ నుండి కిందదాక చీరను చుట్టుకునేవారు. కొంతవరకు నాయర్ కులానికి చెందిన స్త్రీలకు ఈ వెసులుబాటు ఉండేది. మిగతా కులాల స్త్రీలందరూ తమ రొమ్ములపై వస్త్రం ఏమీ ధరించేవారు కాదు. సామ్యూల్ మాటీర్ వ్రాసిన ‘నేటివ్ లైఫ్ ఇన్ ట్రావన్‌కోర్’లో ఆయన ఈ సంగతి ప్రస్తావిస్తూ అగ్రవర్ణాల వాళ్ళు కింది కులాల వారిపై అనేక అంశాలపై 110 దాకా అధిక పన్నులు విధించేవారని, వాటిలో ‘ములక్కరం’ (రొమ్ము పన్ను) ఒకటని అంటారు. అంటే కింది కులాల స్త్రీలు ఛాతీని కప్పుకుంటే దానికి పన్ను కట్టాలి. కట్టని వారిని అనేక రకాలుగా హింసించేవారు. అగ్రకుల అహంకారానికి, అన్యాయంగా విధించే ఈ పన్నులకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత నంగేలి. పన్ను కట్టమని హింసిస్తున్న అధికారులకు పన్నుకు బదులు… ఒక కొడవలితో తన రొమ్ములను తెగ నరికి అరిటాకులో పెట్టి ఇచ్చి చనిపోతుంది నంగేలీ. ఆ దుఃఖాన్ని భరించలేని ఆమె భర్త ఆమె చితిలోకి దూకి తనూ మరణిస్తాడు. ఆమె తిరుగుబాటుతో పెద్దదైన ఆ ఉద్యమం చన్నార్ తిరుగుబాటుగా పేరు పొంది అనేక పోరాటాల పిమ్మట అప్పటి బ్రిటిష్ మద్రాస్ గవర్నర్ జోక్యంతో మహిళలందరూ ఛాతీపై వస్త్రం ధరించవచ్చనే చట్టం తేవడానికి కారణమయింది.
మహిళలందు పుణ్య మహిళలు వేరయా ముందే చెప్పుకున్నట్లు మహిళల వస్త్రధారణకి, కుటుంబ గౌరవానికి ముడిపెట్టారు కనుక ‘కుల స్త్రీల'(అంటే కుటుంబ వ్యవస్థలో ఉంటూ వంశాభివృద్ధి చేసేవారు)కు వేరుగా ‘వేశ్యల’కు వేరుగా దుస్తులు పెట్టారు. ఒకరు శరీరాన్ని వీలైనంత కప్పుకుని ‘మర్యాద’గా ఉంటే వేరొకరు ఆకర్షణీయంగా, ఇంకా చెప్పాలంటే ‘రెచ్చగొట్టే’ విధంగా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ విభజన అన్ని సంస్కృతుల్లో ఉంది. కర్రీబియన్ కవయిత్రి జమైకా కిన్కెయిడ్… ప్రసిద్ధ కవిత ‘గర్ల్’లో తన తల్లి తన పన్నెండేళ్ళ కూతురికి ఒక ఆడపిల్ల ఎలా ప్రవర్తించాలో నేర్పుతూ ”ఇదిగో… అలా తిప్పుకుంటూ బజారుదాని లాగా నడవకు. లంగా కింద కుట్లు ఊడిపోతే అలాగే వెళ్ళిపోకు. బజారుదానివని అనుకుంటారు అందరూ” అంటుంది. ప్రముఖ దక్షిణాఫ్రికా రచయిత్రి ‘అడిచ్చీ’ కూడా ఆడవాళ్ళ దుస్తులను బట్టి ఆమె గుణగణాలు అంచనా వేయడం అన్యాయం అంటారు.
అయితే మన దేశంలో ఈ విభజనలే కాక వివాహితులకు వేరుగా, అవివాహితులకు వేరుగా, భర్త కోల్పోయిన స్త్రీలకు వేరుగా… ఇలా అందరికీ రకరకాల వస్త్రధారణ నిర్దేశించారు. భర్తలేని వారిని విధవలుగా పరిగణిస్తూ వారు బొట్టు, పూలు, గాజులు వంటి అలంకారాలేవీ ధరించరాదని, వారు ఏ శుభకార్యాలకూ పనికిరారని చెబుతారు. అక్కడక్కడ కొంత మార్పు వచ్చినా, ఇప్పటికీ ఇలాంటి పద్ధతులన్నీ తు.చ. తప్పక పాటించే వారి సంఖ్యే అధికం!
సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ స్త్రీల బాధ్యతేనా?
పురుషులలో పైన చెప్పుకునే విభజన ఏదీ కనబడదు. పైగా మన దేశంలో 90 శాతం మంది పురుషులు మన సంప్రదాయ దుస్తులను వదిలేసి పాశ్యాత్య దుస్తులైన ప్యాంటు, షర్టులకు ఏనాడో మారిపోయారు. జుట్టు కూడా పొట్టిగా కత్తిరించేసుకున్నారు. వారు ఆఫీసుకైనా, గుడికైనా, విందు వినోదాలకైనా అవే దుస్తులతో హాజరవుతారు.
కానీ అదే మగవారు… తమ స్త్రీలు మాత్రం సంప్రదాయకంగా చీర కట్టుకుని, బారెడు జడతో భారతీయత ఉట్టిపడుతూ హుందాగా ఉండాలని కోరుకుంటారు. ఇక పెళ్ళిళ్ళు వగైరాల్లో ఆడవారి అలంకరణ అంతా ఇంతా కాదు. ఏ కాలమైనా, ఏ సమయమైనా భారీ పట్టుచీరలతో… నగలతో… అవస్థ పడైనా సరే, పందిట్లో సందడినీ.. చూపరులకు ముచ్చటనీ.. వెరసి ‘భారతీయ సంస్కృతి’నీ ప్రదర్శించాల్సిన బాధ్యత వారిదే.
ప్యాంట్లు, స్కర్టులు ధరించే స్త్రీలు భారతీయ సంస్కృతిని మట్టిగలుపుతున్నారని కొన్ని మతవాద సంస్థలు వారిపై దాడులకు పాల్పడుతున్నారు. మంగళూరు పబ్‌లో యువతులపై దాడి, బెంగళూరు నూతన సంవత్సర వేడుకల్లో లైంగిక వేధింపులు వీటికి ఉదాహరణలు!
రాజకీయవేత్తల వస్త్రధారణ
రాజకీయాల్లో ఉన్న మహిళలు కూడా చాలావరకు సంప్రదాయ దుస్తులనే వాడతారు. సోనియాగాంధీ విదేశీ వనిత అయినా, ఎల్లప్పుడూ నేత చీరల్లో, సల్వార్ కమీజుల్లో కనబడతారు. ఆమె కూతురు ప్రియాంకా గాంధీ కూడా బయట పాశ్చాత్య దుస్తులు ధరించినా, పార్టీ ప్రచార కార్యక్రమాల్లో మాత్రం… తల్లి, నాయనమ్మలాగా నేత చీరలే ధరిస్తారు. ఇక సుష్మాస్వరాజ్ ఫక్తు భారతీయ నారిలాగా పాపిట్లో సింధూరం, జుట్టు ముడి, చీరతో ఆమె వ్యక్తిగత అభిరుచితో పాటు పార్టీ విధానాలను కూడా చాటుతారు. బెంగాల్లో మమతా బెనర్జీ తన జీవన శైలిని ప్రతిబింబిస్తూ నిరాడంబరంగా తెల్ల చీరలో కనిపిస్తే, బహుజన సమాజ్ పార్టీ నేత మాయావతి పొట్టి జుట్టు, సల్వార్ కమీజులతో నిరాడంబరంగా ఉంటారు.
మీడియాలో దుస్తులు
ఈ మధ్య న్యూస్ ఛానళ్ళలో కనబడే చాలామంది న్యూస్ రీడర్లు, యాంకర్లు, యూనిసెక్స్ లేదా కార్పొరేట్ పవర్ డ్రెస్సింగ్ పేరిట సూటు, ప్యాంట్లు ధరిస్తున్నారు. అది స్వాగతించదగ్గ పరిణామమే అయినా, సీరియల్స్, వివిధ షోల యాంకర్లు మాత్రం మితిమీరిన అలంకరణతో ఉంటారు.
రెచ్చగొట్టే దుస్తులే అత్యాచారాలకు కారణమా?
దేశంలో ఏ మూల అత్యాచారం జరిగినా నేతలు, మత పెద్దలు, అందరూ ఆడవారికి హితోపదేశాలు చేస్తూ ముందుగా వారి దుస్తుల పట్ల, వారి నడవడిక పట్ల అనేక వ్యాఖ్యలు చేస్తారు. వాటిలో చాలావరకు ఆడవారినే ఆ అత్యాచారాలకు కారకులుగా, దోషులుగా నిర్ధారిస్తారు. వీరు పొట్టి స్కర్టు వేసుకోవడం వల్ల దాడి చేశారని, టైట్ జీన్స్వల్ల వేధించబడ్డారని నోరుపారేసుకుంటుంటారు. కానీ అత్యాచార ఘటనలు పరిశీలిస్తే, ఈ వ్యాఖ్యలు తప్పని రుజువవుతాయి. ఒక అధ్యయనం ప్రకారం, అత్యాచార సమయంలో బాధితులు ధరించిన దుస్తులు గమనిస్తే, చీర, సల్వార్ కమీజు, వదులు ప్యాంట్, స్కూల్ యూనిఫారం ఇలా అన్ని రకాలు ఉన్నాయి. అంటే అత్యాచారాలు దుర్మార్గులు, బలవంతులు, అధికారంలో ఉన్నవారి వల్ల నిస్సహాయులపైన జరుగుతాయి, కానీ వేరేమీ కాదు. సమస్య దుస్తుల్లో కాదు స్త్రీలను భోగ వస్తువులుగా, తమ అవసరాలు తీర్చే యంత్రాలుగా, తమకంటూ వ్యక్తిత్వం, కోరికలు లేని మనుషులుగా భావించే పితృస్వామ్య భావజాలంలో దాగి ఉంది.
ఇస్లామిక్ దేశాల్లో వస్త్రధారణ
లౌకిక రాజ్యాలవలె కాకుండా అధికారిక మతం గల రాజ్యాలలో, మతం, రాజ్యం… భావైక్యతతో పనిచేస్తాయి కాబట్టి మతం నిర్దేశించినవి రాజ్యం అమలుపరిచే విధానం ఉంటుంది. అలాంటి చోట మతపరమైన ఆంక్షలు, వాటిని పాటించాలనే ఒత్తిడి కూడా అధికమే. ముస్లిం స్త్రీలకు చాలా చోట్ల బురఖా తప్పనిసరి!
ఇదేకాక, ఛాందస మత వాదం అధికంగా ఉన్న ఇరాన్, సిరియా, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాలలో స్త్రీ స్వేచ్ఛపై తీవ్ర కట్టడి ఉంది. స్త్రీలు బయట అడుగు పెట్టాలంటే, ఒక మగ తోడు (మహ్రం) ఉండడం తప్పనిసరి. ఇక బుర్ఖాతో పాటు డబుల్ హిజాబ్ (ముఖాన్ని కప్పే రెండు పొరల పరదా) కూడా ఉండాలి. అలా లేకపోతే, ఆ మహిళతో వచ్చిన తోడు (మహ్రం)కు కూడా కొరడా దెబ్బల శిక్ష విధిస్తారు.
గార్డియన్ పత్రికలో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం… ఒక గర్భిణీ స్త్రీ నొప్పులతో బాధపడుతూ అత్యవసర పరిస్థితుల్లో బురఖా లేకుండా ఆస్పత్రికి వస్తే… అక్కడి అధికారులు ఆమెకు వైద్యం చేయడానికి నిరాకరిస్తూ, ఇంటికి వెళ్ళి బురఖా ధరించి రావాలని పంపేశారట. అంటే అక్కడి మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఒక స్త్రీ ప్రాణం కన్నా మానమే ముఖ్యమన్నమాట!
పాశ్యాత్య దేశాలలో వస్త్రధారణ
మిగతా దేశాలతో పోలిస్తే, పాశ్చాత్య దేశాలలో మహిళలకు దుస్తుల విషయంలో స్వేచ్ఛ ఎక్కువే. ప్రపంచ యుద్ధాల తర్వాత పారిశ్రామికీకరణ… పెద్ద ఎత్తున మహిళలు ఉద్యోగాలలోకి రావటం… సమాజం కూడా పరువు, గౌరవం, మర్యాద వంటి వాటి స్థానే, ఆరోగ్యం, చైతన్యం, సౌకర్యం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, స్త్రీ వాద ఉద్యమాలు వంటి అనేక అంశాలు ఆ దేశాలలో స్త్రీల వస్త్రధారణలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. పెద్ద పెద్ద గౌన్లు, స్కర్టుల స్థానంలో ప్యాంట్లు, షర్టులు వంటివి వాడుకలోకి వచ్చాయి.
అయితే వాటితో పాటే, కాళ్ళూ ప్రదర్శించేలా మినీ స్కర్టులూ, బిగుతుగా ఉండే జీన్స్, ఎత్తు మడమల చెప్పులు, మేకప్ కూడా సంస్కృతిలో భాగమయ్యాయి. సామాజికపరంగా ఒక నిర్దేశిత సౌందర్య నమూనాకి కట్టుబడి ఉండాల్సిన ఒత్తిడి కూడా అక్కడి మహిళలకు ఉంది. పొడుగ్గా, బక్కపల్చగా, పొడుగు కాళ్ళతో ఉండడం అక్కడ అందంగా పరిగణించబడుతుంది. అంటే అక్కడ నల్ల జాతీయులు కానీ, భిన్న రూపం కలిగిన వారికి కానీ సరైన స్థానం లేదు. ఈ ధోరణికి నిరసనగానే ఆ దేశాలలో పెద్ద ఎత్తున ‘బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్’ వంటి
ఉద్యమాలు తలెత్తాయి.
బుర్ఖినీ వివాదం
ఇటీవల ప్యారిస్‌లోని ఒక బీచ్‌లో ఈ సంఘటన జరిగింది. బీచ్‌లలో సాధారణంగా ఈత కోసం బికినీలు వాడతారు. అయితే ఈ బికినీ శరీరంలో చాలా భాగాన్ని బహిర్గతం చేస్తుంది. దీనికి భిన్నంగా ఈ మధ్య ముస్లిం స్త్రీల కోసం బుర్ఖినీ అనే కొత్త దుస్తులను రూపొందించారు. తలచుట్టూ ముసుగుతో చేతులు, కాళ్ళను కప్పి ఉంచే విధంగా ఉండే ఈ బుర్ఖినీ బాగానే ప్రాచుర్యం పొందింది. అయితే లౌకిక రాజ్యమైన ఫ్రాన్స్ దేశంలో బహిరంగ ప్రదేశాలలో మతపరమైన దుస్తులు ధరించరాదన్న కారణం చెబుతూ అది వేసుకున్న ఒక మహిళపై కొందరు దాడిచేసి ఆమెను బీచ్నుండి పంపించేశారు.
ఇక్కడ తన శరీరాన్ని ఏ మేరకు కప్పుకోవాలనే స్వేచ్ఛ మహిళలకు లేనట్టే కదా!
వాణిజ్యపరమైన ఒత్తిడులు
నేడు ప్రపంచవ్యాప్తంగా మతపరమైన, సంస్కృతీపరమైన నియంత్రణలతో పాటు వినిమయ సమాజపు వాణిజ్య కారణాలు మహిళల దుస్తులను, వాటి పోకడలను నిర్దేశిస్తున్నాయి.
దుస్తుల ద్వారా స్త్రీల శరీరాకృతిని, అందాన్ని మరింత బహిర్గతం చేస్తూ స్త్రీ అంటే కేవలం ఆమె బాహ్య సౌందర్యం మాత్రమే అనే భావన కలిగిస్తూ చూపరులకు కనువిందు చేయడమే ప్రధానోద్దేశ్యంగా దుస్తులు రూపొందిస్తున్నారు. తమ వాణిజ్య ఉత్పత్తుల అమ్మకానికై స్త్రీ శరీరాన్ని విరివిగా వాడుకుంటూ దుస్తులు, నగలు, అలంకరణ సామగ్రితోనే ఆమెను నిర్వచించాలని ప్రయత్నిస్తున్నారు.
ఏది ఏమైనా ఈ నియంత్రణలు, కట్టుబాట్లు, ఒత్తిడుల వెనుక ఉన్న రాజకీయాలను గుర్తించి వాటిని అధిగమించి మహిళలు తమ వ్యక్తిగత ఇష్టాల మేరకు, తమకు సౌకర్యవంతంగా దుస్తులను ఎంచుకొని ధరించే స్వాతంత్య్రం కలిగిన రోజునే నిజమైన స్వేచ్ఛ పొందినట్లుగా భావించవచ్చు.