When the pundits contradict each other so flagrantly the field is open to enquiry – E.H. Carr
(పండితులు విభేదించినపుడు, సత్యాన్వేషణ సమాజంలో అందరిదవుతుంది – జు.న. కార్)
గత మూడు వారాలుగా (సెప్టెంబరు మొదటి వారం నుండి) ఒక వార్త పదే పదే దినపత్రికలలో, ప్రసార మాధ్యమాలలో వస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా సంవాదం లోపించి వాదోపవాదాలే కేంద్రబిందువయ్యాయి. ఐలయ్యగారు వ్రాసిన ‘సామాజిక స్మగ్లర్లు – కోమటోళ్ళు’ అనే వ్యాసానికి వస్తున్న ఆరోపణలు వెర్రితలలు వేస్తున్నాయి. ప్రభుత్వం, మీడియా ”నువ్వు సత్యాన్వేషణ చెయ్యొద్దు, అది మన ధర్మం కాదు. సమాజంలో సామరస్యాన్ని పెంచడం మన ధర్మం. అందుకోసం కృషి చెయ్యి” అని బోధ చేస్తున్నారు. దీనినే ఇంటరాగేషన్ కాదు, చర్చ అంటున్నారు. ఒక ధోరణేమో తమకు ఐలయ్యగారి రచనలతో అభిప్రాయభేదాలు ఉన్నాయనీ, కానీ కోమటోళ్ళు మాత్రం వీథి గొడవలు ఆపేయాలని అంటున్నారు. దీన్నే వారి దృష్టిలో జ్ఞాన చర్చ అంటారేమో. మరొక ధోరణేమో ఐలయ్యగారి దిష్టిబొమ్మలు మరియు పుస్తకాలను తగలబెట్టడం విశృంఖలంగా జరుగుతూ ఉంది. 2009లో రాసిన ఇంగ్లీష్ వ్యాసాన్ని / పుస్తకాన్ని ఇప్పుడెందుకు ప్రశ్నిస్తున్నారంటే తప్పకుండా ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న అసహన పరిస్థితులే కారణమనుకోవాలి. కేవలం శీర్షిక మాత్రమే కారణమని సరిపెట్టుకుంటే తగదు. ఈ సందర్భంలో వాదోపవాదాల గుట్టు విప్పడం చాలా అవసరం. ఈ వాదోపవాదాలంతా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భావ స్థబ్దతను, బాలగోపాల్ అన్నట్లు భయాంధ్రప్రదేశ్‌ను తలపిస్తున్నాయి. అదేమిటో చూడడానికి ప్రయత్నం చేద్దాం.
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు’ – ఐలయ్యగారు వ్రాసిన హిందూ మతాంతర భారతదేశం పుస్తకంలో ముఖ్యమైన వ్యాసం. ఈ వ్యాసంలో కోమటోళ్ళ తాత్విక భూమికను అత్యంత విమర్శనాత్మకంగా వ్రాశారు. ఈ వ్యాసం కోమటోళ్ళ గురించిన రచనలలో మొట్ట మొదటిది. ఈ కులం గురించిన ఏ వ్యాసం కానీ, పుస్తకం కానీ గతంలో లేవు. (వ్యాపారం గురించిన రచనలు వీరి గురించే అనుకుంటే, వేరే మాట). ఐలయ్యగారు వివరించిన విధానం అత్యంత కఠినమైన విషయాన్ని ఎంతో సులువుగా రాసిన వ్యాసం. కానీ ప్రస్తుతం జరుగుతున్న వాస్తవం మాత్రం అవగాహన లేమి, ఇంకా చెప్పాలంటే ”మనం చేస్తే పర్లేదు, కానీ ఎదుటివాడు అంటేనే నేరం” అనే రీతిలో జరుగుతోంది.
ఐలయ్యగారి రచనల విశిష్టత : ముఖ్యంగా వ్యవస్థలోని డొల్లతనాన్ని ఎండగట్టడమే కాకుండా, దాని మూలాలను విపులంగా విశ్లేషిస్తూ వాటిని అధిగమించడానికి సూచనలు, సిద్ధాంతం అందిస్తారు. ఇది ప్రస్తుతం ఉన్న ఏ ఇతర సామాజికవేత్తల్లో వెదికినా కనిపించదు. ఇక ప్రస్తుత విషయంలోకి వస్తే స్థూలంగా ఐలయ్యగారు ఉటంకించింది ఏమిటంటే, కోమటోళ్ళు బ్రాహ్మణీయ భావజాల మాయాజాలంలో ఇరుక్కొని ”దీనికి తన అవకాశవాదం తోడు కలిసి” (ఇది ఐలయ్యగారి వాదన కాదు, నాది) దానికి బానిసలయ్యారని. దీనికి ప్రత్యామ్నాయం గాంధీగారు 20వ శతాబ్దం ప్రథమార్ధంలో సామాజిక స్మగ్లర్లుగా ఉన్న వారిని, సామాజిక నిర్మాతలుగా మార్చే క్రమం బోధించారు. జనం అనుసరించారు. తరువాత గాంధీగారిని బ్రాహ్మణుల ప్రతినిధి, పూనా బ్రాహ్మణుడు నాతురాం గాడ్సే హత్య చేసిన తర్వాత ఈ మార్గం బోధించేవారు కరువయ్యారు. ఫలితంగా కోమటోళ్ళు మళ్ళీ బ్రాహ్మణీయ భావజాల బానిసలయ్యారు. ఐలయ్యగారి అధ్యయనం ప్రకారం కోమటోళ్ళు బ్రాహ్మణులకు మరియు శూద్రులకు వారధిగా ఉండాల్సిన చారిత్ర పాత్రకు బదులుగా బ్రాహ్మణీయ భావజాల బానిసలయ్యారు, తద్వారా కోమటోళ్ళు శూద్రులను అణచివేతకు గురిచేస్తున్నారు.
కోమటోళ్ళు మరియు / లేదా ఆర్య వైశ్యులు అని ఎందుకు వచ్చిందో ఈ కులం వారు తప్పక ఆలోచించుకోవాలి. (అవునా కాదా అన్నది వేరే కథ – ఐలయ్యగారు అన్నట్లు అలా పాన్ ఇండియన్ (అఖండ భారత) కులాలు అసలు ఉన్నాయా?). పాన్ భారతదేశ వైశ్య కులం ఉండగా వీరు ఎందుకు ఆర్య వైశ్య అని సంబోధించుకుంటున్నారో ఒక్కసారి చూసుకోవాలి. దీని చరిత్ర కూడా బ్రాహ్మణీయ భావజాలంలోనే ఉంది. 20వ శతాబ్దం మొదట్లో బ్రాహ్మణులు ఈ కోమటోళ్ళు, వైశ్య అని సంబోధించుకోవడాన్ని అధిక్షేపిస్తూ మద్రాసు హైకోర్టుకు వెళ్ళారు. అప్పటినుండి వైశ్యకు బదులుగా ఆర్య వైశ్య అని వాడుకలోకి వచ్చింది.
ఐలయ్యగారి వ్యాసంపై ప్రసార మాధ్యమాల ద్వారా జరిగిన రాద్ధాంతం చూద్దాం. మీరు లుచ్ఛాలనవచ్చు, ఇంకా ఏమైనా అనవచ్చు కానీ స్మగ్లర్లు అనడమేంటి? (ఆర్య వైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షులు) కోమటోళ్ళు కాదు, ఆర్య వైశ్యులు అనాలని (కె.రోశయ్య గారు); కొంతమందిని పేరుపెట్టి అనొచ్చు కానీ మొత్తం కులాన్ని అనడం సబబు కాదు అని, కులాలను విమర్శించడం హిందూ మతాన్ని అగౌరవ పరచడమే అని, ఒకవైపు పై కులాల్ని కింది కులాలు ఏదైనా అనే హక్కు నీకెవరిచ్చారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆయన క్రిస్టియన్ మత ప్రచారకుడని దూషిస్తున్నారు (స్వామి పరిపూర్ణానంద గారు). ఐలయ్య గారిని బహిరంగంగా ఉరి తీయాలనో, కాల్చి చంపాలనో, తాలిబన్ల లాగా నాలుక కత్తిరించాలనో వారే శిక్షలు నిర్ణయిస్తున్నారు. మళ్ళీ మనుస్మృతి రావాలని, ప్రస్తుత చట్టాలు మార్చాలని (టి.జి.వెంకటేష్ గారు) అంటున్నారు. ఈ వితండవాదులంతా ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న అసహనానికి నిదర్శనంగా కనిపిస్తున్నారు. నిజానికి సంవాదమంటే, తాము ఐలయ్య సిద్ధాంతాన్ని కాదనుకుంటే మాత్రం వాదన ఇది కాదు. ఐలయ్యగారు చాలా ఆసక్తితో ఇచ్చిన సమాధానాలకు స్వాములు సైతం మైకులు పడవేసి విషయాన్ని దాటవేశారు. అది వారిలోని ఆవేశం, స్వార్థాన్ని మాత్రమే నిరూపించింది. దీనిద్వారా అర్థమయ్యేది ఏమిటంటే ద్వేషం, సంకుచితత్వం సులభంగా ప్రచారమవుతాయి. మంచి ప్రచారం కావడమే కష్టం.
స్మగ్లర్లకు – సామాజిక స్మగ్లర్లకు చాలా తేడా ఉంది. ఇది గుర్తించకే జరుగుతున్న ఈ వాదాలు, ప్రొ.నాగేశ్వర్ లాంటి వాళ్ళను సృష్టించింది. కుల వ్యవస్థ నాశనం కావాలంటారు, కానీ కులాన్ని మాత్రం విమర్శించవద్దంటారు, వారికే దీనిలోని భావం అర్థమవ్వాలి. ఐలయ్యగారు ఈ తేడాను స్పష్టంగా వివరించారు. సమాజం ద్వారా సంపాదించిన లాభాన్ని తిరిగి సమాజంలో పునఃపెట్టుబడి పెట్టకుండా దాన్ని దాచిపెట్టుకోవడం (గుప్త ధనం – మార్క్సిస్టు పద్ధతిలో ప్రిమిటివ్ ఎక్యుమలేషన్; మర్కెంటైల్ కాపిటల్ లేదా వ్యాపార పెట్టుబడి అంటారు); గుడులకు, గోపురాలకు ఖర్చు చేయడాన్ని ఐలయ్యగారు సామాజిక స్మగ్లర్లు అన్నారు. ఆయన మాటల్లోనే – భారతదేశంలో సంకుచిత కోమటి వ్యాపారం వాణిజ్య పెట్టుబడి వ్యవస్థీకృతం అయ్యేందుకు ఎలాంటి సామాజిక ప్రాతిపదికను అనుమతించలేదు. కోమటి వ్యాపార విధానం, వాళ్ళు సంపదను కూడబెట్టుకునే తీరు సామాజికంగా ఉపయోగపడే పెట్టుబడి ఏర్పడకుండా అడ్డుకుంది. శాశ్వత సుఖం కోసం డబ్బును పోగేసుకోవడం, సొంత మోక్షం కోసం హిందూ మత ఆచార ప్రక్రియలకు విరివిగా ఖర్చు చేయడం – ఇదే కోమటి వ్యాపారపు సామాజిక ప్రయోజనం. ఇంకా చెప్పాలంటే రిలయన్స్, అదాని లాంటి వ్యాపార కుటుంబాల ఉదాహరణలు ఐలయ్యగారి దృష్టిలోని విషయాలు. వీరంతా స్వాతంత్య్రానంతర భారతదేశ సంపదపై ఎదిగిన కాంప్రొడార్ పెట్టుబడిదారులు. వీరు దేశ సంపదను రాజ్యంతో కుమ్మక్కై అప్పనంగా దండుకున్న ప్రబుద్ధులు. ఊలు / బట్టల పరిశ్రమ కావచ్చు; ఐరన్ పాలిసీ కావచ్చు; ఖనిజ పాలిసీ కావచ్చు; పారిశ్రామిక విధానం కావొచ్చు… ఏదైతేనేం దేశ విధానాలను గుప్పిట్లో పెట్టుకున్న కులం. పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవి మరీ విపరీత ధోరణి తీసుకున్నాయి. గుజరాత్ రాష్ట్ర బనియా వ్యవస్థను గమనిస్తే ఈ సత్యం తెలుస్తుంది. ధీరూభాయి అంబానీ కావచ్చు, కిర్లోస్కర్ కావచ్చు, జింధాల్ కావచ్చు, టాటా.. బిర్లా కావొచ్చు.. ఒక్కొక్కరు ఒక్కొక్క సామాజిక స్మగ్లర్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నదేమిటంటే ఊరి కోమటోళ్ళను ఉసిగొల్పి పైన చెప్పిన స్మగ్లర్లపై చేసిన రచనను కప్పి పుచ్చాలనుకుంటున్నారు. గాంధీగారి గురించి ఒక ఉదాహరణ చెబుతాను – లూయిస్ ఫిషర్ అనే ఒక విలేకరి గాంధీని ఒక ప్రశ్న అడిగారు. కాంగ్రెస్ పార్టీ కొంతమంది పెట్టుబడిదారుల హస్తాల్లో ఉందని. ఈ ప్రశ్నకు గాంధీగారు పూర్తిగా అవును అని బొంబాయి మిల్లు అధిపతుల హస్తాల్లో
ఉందని ఒప్పుకున్నారు. దీన్నిబట్టి ఈ కులం రాజ్యంతో కలిసి ఏ విధంగా దేశాన్ని దోచుకున్నాయో అర్థమవుతుంది.
అసలు ఈ పుస్తకంలో ఏముందో ప్రస్తుతం ఏమి జరుగుతుందో చూడడం అవసరం. ఇది ఎవరి తప్పు ఎంత అని తూకం వేయడం కోసం కాదు. ఈ ఘటనల వెనకున్న కార్యాచరణ లక్ష్యం ఏమిటి అని తెలుసుకోవడం కోసం. ”ఆధ్మాత్మిక గూండాలు” వ్యాసంపైనా ఈ విధంగానే జరిగింది. వీటన్నింటిలో ఒక ధోరణి ఉంది, అదేమంటే ”ఇది హిందువుల దేశం” అనే సంకుచితమైన విశ్వాసాన్ని ప్రచారం చేయడమే. ఇది స్వాతంత్య్రానంతరం నుండి సంఘ్ పరివార్ శక్తులు నిర్విరామంగా చేస్తున్నవే. కానీ దానికి తగిన రీతిలో ప్రజాస్వామ్య శక్తులు ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వెనుకబడే ఉన్నాయి. ఇక టీవీ వ్యాఖ్యాతలు, రాజకీయ పార్టీల నాయకుల ధోరణి ఎలా ఉందంటే… (టీవీ 1 నుండి టీవీ 99 వరకు; వారికి కులం పట్ల ఉన్నది కపట నాటకం మాత్రమే) దబాయించి మీకు కులాల గురించి ఎందుకు అధ్యాపక వృత్తి చూసుకోక అని. దీనిగురించి బాలగోపాల్ గారు 2000 సంవత్సరంలో ఐలయ్యగారి రచనలను ఉద్దేశించి చెప్పిన మాటలు తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఆయన ఏమన్నారంటే, ”సమాజాన్ని ‘మొత్తం’గానే బాగు చేయాలనేది ఎందుకు సత్యం అయింది? సమాజంలో అసమానంగా ఉన్న వారి బాగును కాంక్షించడం, అదే సమాజం బాగుకు దారి తీస్తుందని నమ్మడం – పెద్దలచేత హితవచనాలు చెప్పించుకోవలసిన పిల్ల చేష్ట ఎందుకైంది? అధ్యాపక వృత్తి తగని ఆకతాయితనం ఎందుకయింది? అధ్యాపకులు సమాజంలో భిన్న వర్గాల మధ్య మానసిక ఏకత్వాన్ని మాత్రమే ఎందుకు పెంచాలి? మానసిక ఏకత్వం ఎందుకు లేకుండా పోయిందో చెప్పి విశ్లేషణ ఎందుకు చేయకూడదు? అవి సామరస్యాన్ని పెంచేవిగానే ఎందుకుండాలి, సామరస్యం ఎవరు లేకుండా చేశారో చెప్పేవి ఎందుకు కాకూడదు?” ఇంకా చెప్పాలంటే, ఈ మీడియా ఉద్దేశ్యం ఏమిటంటే ఈయనకు ఇవన్నీ ఎందుకు అని, సత్యాన్వేషణ తప్పనీ. దీన్నిబట్టి మీడియా ధోరణి ఏమిటంటే తమకు తెలిసిందే సత్యమని, అది రిసెర్చ్ కావచ్చు, మరేదైనా కావచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వితండ వాదాలు దేనికి దారితీస్తున్నాయంటే, ఐలయ్యగారు దిద్దుకోలేని తప్పు చేశారు, కాబట్టి ఆయనపై ఎలాంటి విమర్శ అవసరం లేదు, గౌరీ లంకేష్‌కు పట్టిన గతే ఐలయ్య గారికి పట్టినా అది ఆయన చేసుకున్న స్వయం కృతాపరాధమే, తమ చేతులకు ఏ నేరం / రక్తం అంటలేదని ఒక మధ్య తరగతి సగటుజీవిలాగా మిగిలిపోదామని. ఇది ఒక భావ విధ్వంసకర పరిస్థితిని సృష్టించడమే.