ఒక ఊళ్ళో రాజయ్య అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒకసారి వరహాలతో నిండిన తన సంచిని పోగొట్టుకున్నాడు. చాలా బాధపడ్డాడు. తిన్నది ఏదీ రుచించేది కాదు. ఏ పనిలో ఉన్నా అదే గుర్తుకువచ్చేది. చివరకు ఒక నిర్ణయానికి వచ్చి రాజుగారికి తన బాధ చెప్పుకున్నాడు. అప్పుడు ”రాజయ్యగారి వరహాల సంచిని తెచ్చి ఇచ్చిన వారికి పది వరహాలు బహుమతిగా ఇస్తారొహోయ్” అని రాజుగారు చాటింపు వేయించారు.
కొంతకాలం తర్వాత ఒక రైతు తనకు వరహాల సంచి దొరికిందని చెప్పి రాజయ్యకు తెచ్చి ఇచ్చాడు. వర్తకుడు సంచి విప్పి వరహాలను లెక్కబెట్టాడు. అందులో ఉన్న వంద వరహాల లెక్క సరిగ్గా ఉంది. ”ఓహో! ఎలాగూ పది వరహాలు బహుమతిగా ఇస్తారని ముందుగానే సంచిలోంచి తీసుకున్నావా?” అని రాజయ్య రైతుతో అన్నాడు. అందుకు రైతు కంగారుపడుతూ ”లేదు… లేదు… అసలు నేను ఆ సంచి విప్పలేదు. నాకు ఎలా దొరికిందో అలాగే తీసుకొని వచ్చాను” అన్నాడు. కానీ వర్తకుడు ఆ రైతు మాటలు నమ్మలేదు. దీని గురించి ఇద్దరూ చాలాసేపు వాదులాడారు. చివరికి ఇద్దరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. జరిగిన విషయం చెప్పారు.
రాజు ఇద్దరి వాదననూ విన్నాడు. సంచిని తెప్పించారు. సంచి మూతి విప్పి వరహాలను కిందపోసి ఇద్దరినీ లెక్క పెట్టమన్నాడు. ఇద్దరూ లెక్కించారు. వంద వరహాలూ ఉన్నాయి. రాజయ్యతో రాజు ఇలా అన్నాడు ”నీ సంచిలో నూట పది వరహాలు ఉన్నాయన్నావు, కానీ ఇందులో నూరు వరహాలే ఉన్నాయి. కాబట్టి ఇది నీ సంచి కాదు. నీ సంచి కోసం మళ్ళీ చాటింపు వేయిద్దాం” అని చెప్పి రైతు చేతిలో ఆ సంచిని పెట్టి అతన్ని తీసుకుపొమ్మన్నాడు. రాజయ్య కంగుతిన్నాడు. బాధను మింగలేకా, కక్కలేకా తల వేలాడేసుకుని ఇంటిముఖం పట్టాడు.