ధైర్యం ఆరిపోతేనే
పిరికితనపు చీకటి ఆవరిస్తుంది.
నమ్మకం చిగుర్లు రాకపోతేనే
అశాంతి మోడుగా నిలబడుతుంది.
పగలు పలకరించకపోతేనే
రాత్రి పరిచయంలోకి వస్తుంది.
వేడంటూ జ్వలించకపోతే
చల్లదనం రాజ్యమేలుతుంది.
ఎంతటి మదాంధకార చక్రవర్తివైనా
ఓ గుడ్డి వెలుతురుని తరిమేయగల
చిన్న చీకటి దీపం వెలిగించు చూద్దాం?
శబ్దపు ప్రకంపనలేవీ లేకుంటేనే
నిశ్శబ్దానికి నెలవుంటుంది
నీవెంత పీకల్ని నొక్కేయగల
ఉక్కు పాదపు అధికారివైనా
ఒక్క గుసగుసను ఛిద్రం చేసే
నిశ్శబపు తరంగాన్ని
పుట్టించు చూద్దాం??
చేపకు జీవం లేనప్పుడే
ప్రవాహం ఈడ్చుకుపోతుంది
మనిషికి ఆశ్చర్యం శ్వాసగా లేనప్పుడే
చీకటి గుహలు మింగేస్తుంటాయి.