పగటి సూరీడి వంటికి తమ కంటి కాటుకంటి
మసక వెలుతురు నిరీక్షిస్తున్న గ్రామ ఆకాశ సగాలు…
సరిగ్గా ఆ సమయానికి
సిగ్గులై పొంగి ఆమె చేతి చెంబులో నిండుతున్న సముద్రాలు…
తోడు మొలిచిన నీడలు చూస్తూ
మిణుగురు కాంతి దేహాలతో కీచురాళ్ళను ధ్వనించే చీకటి తుప్పలు…
అలికిడి చేటు… మగ సంచారపు వేటు
ఆకాశ దేహం నుండి కొన్ని తారల తలలు తడవకోసారి నేలకు రాలి పడతాయి…
సంక్రాంతి ప్రభలు… జాతర బలులు పక్కూరికన్నా
గొప్పగా జరిపేందుకు రచ్చబండ కాడ మీసాలు రోషాలు పడుతుంటాయి…
తాతతో కలిసి పట్నమెళ్ళి వస్తూ
తెగిపడుతున్న ఆడ తలలు లెక్కిస్తున్న పదేళ్ళ పాప…
ఏ నేరం కారణంగా వాళ్ళు తలవంచుకున్నారని నిలదీస్తుంది
ఊరి పెద్దైన తాతతో పాటు మగ తలలన్నీ ఒక్కసారిగా నేల రాలుతాయి…
మరుసటి ఉదయం నుండి
గ్రామంలో మరుగు దొడ్ల నిర్మాణ జాతర…
ఏ జంతువూ బలవ్వకుండానే గ్రామ దేవత సంతోషిస్తుంది
ఎందుకంటే అతివ ఆత్మ గౌరవ రక్షణే దేవత అసలు కోరిక…