కార్యాలయంలో ప్రవేశించగానే
అంతా లేచి నమస్కారాలు పెడుతుంటే
అర్థరాత్రి వరకు కాళ్ళు పట్టిన చేతులు
ప్రతి నమస్కారానికెందుకో సహకరించవు
టీ త్రాగిన మరుక్షణం ఖాళీ కప్పుని
అటెండర్ అందుకుంటుంటే
సింకు నిండా పడివున్న తోమవలసిన అంట్లు,
గుట్టలుగా పడివున్న మాసిన బట్టలు గుర్తొస్తాయి
ఎంతయినా కార్యేషుదాసివి కదా!
షేర్స్, పెట్టుబడులు, పొదుపులూ ఇత్యాదివన్నీ
తను చూసుకుంటూ ఉంటే కాఫీ టిఫిన్లు అందిస్తూ
నా ఎకనమిక్స్ మాస్టర్స్ చదువుని ఉపయోగించి
కట్ట కరివేపాకు కొత్తిమీర కలిపి కొంటే లాభమో
తోటకూరతో పాటు కొసరు తీసుకోవడం నయమో
ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంటాను
ఎందుకంటే నేను కరణేషు మంత్రిని కదా!
వంట వడ్డనలు పూర్తయ్యాక తినడానికి కూర్చుంటే
వేడి వేడిగా తిని ఎన్నాళ్ళయ్యిందో అనిపిస్తుంది
ఇంతలో ఉయ్యాల్లోంచి బిడ్డ ఏడుపు వినిపిస్తుంది
చెయ్యి కడిగేసుకుని బిడ్డను హత్తుకుని పాలు త్రాగిస్తుంటే
పంచభక్ష పరమాన్నాలతో తింటున్నంత తృప్తిగా ఉంటుంది
ఏది ఏమైనా నేను భోజ్యేషుమాతనే కదా!
మల్లెపూలను చేతికందిస్తూ వేసిన చిటికెకు సమాధానంగా
పెదవులు బలవంతంగా చిరునవ్వు చిందించినా
హింసకు సిద్ధమవ్వాలన్న సంకేతం మెదడుకు అందుతుంది
మానిన గాయాలు కూడా మళ్ళీ భగ్గుమంటుంటే
పచ్చిగా ఉన్న గాయాలకు మందు పూసుకుంటూ
మనసుని మత్తులో ఉంచి మైమరపించే
సాధనాల కోసం వెతుకుతుంటాను
అవును మరి నేను శయనేషు రంభను కదా!
పచ్చని మేనిఛాయతో కాటుక దిద్దిన సోగకళ్ళతో
కుందనపు బొమ్మలా ఉన్నానని
అద్దంలో నన్ను నేను చూసి మురిసిపోతుంటే
నా ప్రతిబింబం నన్ను చూసి వెక్కిరిస్తుంది,
నిన్ను అత్తారింటికి సాగనంపడానికి ఎన్ని లక్షలు
ఖర్చయ్యాయో గుర్తుందా అని ఎగతాళి చేస్తే
ముసి ముసి నవ్వులు నవ్వుతుంది,
అయినా నా అందానికి ఏమయింది
ఎక్కడ చూసినా అందాల వర్ణనలే
వలువలు విడిచిన అంగాంగ ప్రదర్శనలే
మరి నేను రూపేచ లక్ష్మిని కదా!
పనిమనిషి మొగుడు కొట్టిన దెబ్బలు చూపిస్తూ ఏడుస్తుంటే
ఎందుకో అప్రయత్నంగా ఎడమ చెంప తడుముకుంటాను
బుగ్గమీద ఎరుపేంటి మేడమ్ అని కొలీగ్ అడుగుతుంటే
ఎర్రబడ్డ కళ్ళను దాచేస్తూ ఒక మధుర దృశ్యాన్ని
ఊహించుకునేలా సిగ్గుపడుతూ తల వాల్చేస్తాను
ఎందుకంటే నేను క్షమయా ధరిత్రిని కదా!
కానీ ఎందుకో అప్పుడప్పుడూ
ఆలోచించాల్సిన పద్ధతిని మార్చుకోవాలేమో అనిపిస్తుంది
అద్దంలో కాకుండా మనసుతో నన్ను నేను పరికించుకోవాలని
నేటి మహిళగా సరికొత్త అర్ధాలను తెలుసుకోవాలని అనిపిస్తుంది
అసలెందుకీ అలసత్వం,
మమకారపు భావనలు
సున్నితత్వపు తొడుగులను
ఇకనుంచయినా తొలగించుకొని
స్త్రీ శక్తి స్వరూపిణిని అని నిరూపించాలి.