తెలంగాణలో మహిళలు, పిల్లల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రారంభమైన సఖి సెంటర్లు పాత తొమ్మిది జిల్లాల్లోను ప్రారంభోత్సవాలను ముగించుకున్నాయ్. భూమిక నిర్వహణలో నడుస్తున్న కరీంనగర్ సఖి సెంటర్‌ని మార్చి 31న, తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. మంత్రితో పాటు ఎమ్ఎల్ఏ, ఎమ్ఎల్ఎసి, జిల్లా పరిషత్ చైర్పర్సన్, అధికారులు, అనధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సమస్యలను, రకరకాల హింసలను ఎదుర్కొనే మహిళలకు సఖిసెంటర్లు తోడు, నీడగా ఉంటాయని, వనరుల పరంగా ఎలాంటి లోటు రానివ్వమని మంత్రి చెప్పారు. జెడ్పి చైర్పర్సన్ తుల ఉమగారు మాట్లాడుతూ సఖి సెంటర్ల ఏర్పాటు చాలా మంచి ఆలోచనని, వాటి నిర్వహణ స్వచ్ఛంద సంస్థలకి అప్పజెప్పడం వల్ల, ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా స్త్రీల అంశాల మీద నిబద్ధతతో పని చేస్తున్న భూమిక లాంటి సంస్థలకు ఇవ్వడం చాలా మంచి పరిణామమని చెప్పారు. ఎమ్ఎల్ఎ గంగుల కరుణాకర్, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణరావు గార్లు క్లుప్తంగా సఖిసెంటర్ల ఆవశ్యకతల గురించి మాట్లాడారు. ప్రారంభోత్సవానికి ముందు రోజు ఎంతో ఉత్సాహంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయించి, సఖి సెంటర్‌కి ఎంపి కోటా కింద వాహనాన్ని, స్వంత భవనం కట్టుకోవడానికి విశాలమైన స్థలాన్ని కేటాయిస్తామని, త్వరితగతిన భవన నిర్మాణం పూర్తి చేయిస్తామని చెప్పిన ఎంపి శ్రీ వినోద్‌కూమార్ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోవడం సభలో చాలా లోటుగా అనిపించింది. భూమిక నుంచి సత్యవతి మాట్లాడుతూ సమస్యతో సఖి సెంటర్‌కి వచ్చిన మహిళకి అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఒకే చోటునుండి అందుతాయని, కౌన్సిలింగ్, న్యాయసహాయం, వైద్యం, నష్టపరిహారం, తాత్కాలిక వసతి సఖిసెంటర్ నుండే అందడం వల్ల బాధిత స్త్రీ సహాయం కోసం వివిధ విభాగాలకి తిరగాల్సిన అవసరముండదని, అదే సఖి సెంటర్ల ప్రత్యేకత అని చెప్పారు.
సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి సఖిసెంటర్ నడుస్తున్న విధానాన్ని, సిబ్బంది వివరాల గురించి చెప్పారు. సఖిసెంటర్ని ప్రారంభించిన మంత్రి తదితరులు సఖి కార్యాలయంలోని వివిధ క్యాబిన్స్‌ని సందర్శించినపుడు ప్రశాంతి ఒక్కొక్క క్యాబిన్ గురించి, అక్కడి నుండి సేవలందించే కౌన్సిలర్ల గురించి వివరించారు. బాధిత స్త్రీ తన పిల్లలతో సహా ఐదు రోజుల పాటు ఉండగలిగిన తాత్కాలిక వసతి గురించి, ఎవరైనా బాధితులు గాయాలతో వస్తే వారికి ప్రాథమిక చికిత్స చేయడానికి సిద్దంగా ఉండే ఇద్దరు పారామెడికల్ సిబ్బంది గురించి, ప్రాథమిక చికిత్సకు సంబంధించిన కిట్‌ను, మందులను చూపించి వివరించారు. అత్యవసర స్థితిలో వచ్చే బాధితులకు అందించే వెల్కమ్ కిట్… రెండు చీరలు, నైటీలు, లంగాలు, బ్లౌజులు, తువ్వాల, చెప్పులు, టూత్ బ్రష్, పేస్ట్‌లాంటి నిత్యావసర వస్తువులతో తయారుగా ఉంచిన వెల్కమ్ కిట్ అందరినీ ఆకర్షించింది. సఖి సెంటర్లు ఎంతో నిబద్ధతతో, బాధిత స్త్రీలు, పిల్లల కోసమే 24గంటలూ పనిచేస్తాయనే విషయాన్ని ఈ ఏర్పాట్లన్నీ ఋజువు చేస్తున్నాయని అందరూ అన్నారు.
వందన సమర్పణతో ఆనాటి కార్యక్రమం ముగిసింది. సభలో అథితులకు పువ్వులకు బదులుగా పూల మొక్కలను బహూకరించడంతో అందరూ మొక్కలను తమతో తీసుకెళ్ళడం చూడ ముచ్చటగా అనిపించింది.