అలుపెరుగని ప్రయాణంలో
ఆకస్మిక విరామం… విరమణ!
జగమెరిగిన విధి నిర్వహణలో
శాశ్వత విశ్రామం… విరమణ!
ఒదగబడ్డ మనుషులకు విరామం
అణచబడ్డ రెక్కలకు విహారం!
నిన్నటిదాకా చేతినిండా పనులు
రేపటి నుండి చేతులు ఖాళీ!
నిన్నటిదాకా మనసునిండా మనుషులు
రేపటినుండి మనసంతా ఒంటరి!
అలవాటైన అడుగులకు
ఎటు వెళ్ళాలో తెలియదు!
ఒక్కసారిగా హృదయం ఆగినట్లు
ఒక్కసారిగా అలలు నిలిచినట్లు
రంగుల చిత్రమే మారిపోవును!
బ్రతుకు చిత్రమే మారిపోవు!
హోదాలు, అధికారాలు ఆశాశ్వతాలు
హంగులు, ఆర్భాటాలు అర్థరహితాలు!
నలుగురితో నిలుపుకున్న బంధాలే
నలుగురితో నిలుపుకున్న చేతులే
మనదాకా తోడుంటాయి!
కడదాకా నిలిచుంటాయి!