ప్రియాతి ప్రియమైన ‘కుప్పిలి పద్మ’కు ఈ అక్షరాల పలకరింపు. ఎలా
ఉన్నావ్? విభిన్నమైన ధోరణిలో, ఎప్పటికప్పుడు వినూత్నంగా రాసే ధోరణి నీది. పద్మా! గుర్తుందా నీకు? ‘ముక్త’ వచ్చిన కొత్తలో 97లో అనుకుంటా! సి.ధర్మారావు గారితో కలిసి మా ఇంట్లో కలిసాం. హోలీ రోజున కూడా కల్సిన తర్వాత, ఆ రోజు ఇప్పటికీ జ్ఞాపకమై నిలిచిపోయింది.
స్వంత ఊరు రాజమండ్రితో ఎక్కువ అనుబంధం నీకు. గౌతమీ లైబ్రరీ మీదే 3 లేఖలు రాశావప్పుడు. ‘అమృతవర్షిణి’ ప్రేమలేఖలు నీ మొదటి రచన. చలంగారి ప్రేమలేఖలున్నాయి కానీ, స్త్రీలకు రాసినవి లేవు. (93) కథా సంపుటాల విషయానికొస్తే ‘మనసుకో దాహం’ (1994), ‘ముక్త’ (97), ‘సాలభంజిక’ (2001), ‘మంచుపూల వాన’ (2008), ‘వాన చెప్పిన రహస్యం’ (2014), ‘ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్’ (2015), నవలలు – ‘పడగనీడలో…’ (95), ‘అహల్య’ (96), ‘మహి’ (2009, 11), మ్యూజింగ్స్ – ‘శీతవేళ రానీయకు (99, 2009), ఇక కవిత్వం – ‘నెమలీకలు పూసే కాలం’ (2017), ‘కుప్పిలి పద్మ కథలు’ (2017), ‘సాలభంజిక అండ్ అదర్ స్టోరీస్’ (2017) ఇంగ్లీష్‌లో వచ్చాయి కద! పద్మా! ‘సముద్రం’ (నవలిక) ‘గుల్‌మొహర్ ఎవెన్యూ’ (నవలిక)లు కూడా రాశావు కదూ!
ఆంధ్రజ్యోతి వీక్లీలో నీ కవితా, నా కవితా పక్కపక్కనే వచ్చాయి. 95’లో అనుకుంటా, నా కవిత పేరు ‘జీవితం’. నీ కవిత పేరు గుర్తురావడం లేదు. పద్మా నీ రచనలకు నువ్వు పెట్టే పేర్లే అద్భుతంగా
ఉంటాయి. పారిజాతాల పరిమళం, మంచు పూల వానలతో నిండి వాన చెప్పిన రహస్యాలను, గుసగుస శబ్దాల్లో విన్పిస్తూ, మనసుకో దాహాన్ని విడమర్చి చెబ్తూ ఇది నెమలీకలు పూసే కాలం సుమా! అని గుర్తుచేస్తుంటావు. సంభాషణ రూపంలో ఎక్కువుంటాయి నీ రచనలన్నీ. థీమ్స్ సెలక్ట్ చేసుకోవడంలోనే నీ ప్రతిభ ఉంది. ప్రకృతి ప్రేమికురాలివి నువ్వు. అందుకే దాని తాలూకు పరవశం పలు చోట్ల కన్పిస్తూనే ఉంటుంది.
పద్మా! 10 సం||ల పాటు ‘మైదానం’ కాలమ్ రాశావు. దానికి వచ్చిన సంచలనం మామూలుది కాదు. ఆ మధ్య గ్రూప్ వన్ వాళ్ళ ఎగ్జామ్స్‌లో మైదానం రాసిన రచయిత ఎవరు? అనే ప్రశ్నకు చాలామంది నీ పేరు పెట్టారని విన్నానన్నావ్. ఈ తరంలో కొందరికి చలం తెలియకపోయి ఉండవచ్చు. నీ కాలమ్ చదివిన వాళ్ళదే రాశారు. ఒకింత సంతోషం కదూ! అలాగే ఒకింత విచారం కూడా! ‘సాక్షి’లో ‘మల్లెలవేళ’ – కాలమ్, ‘ఎల్లో రిబ్బన్ ప్రేమలేఖలే’ – ‘వాకిలి’ కాలమ్, ‘అర్బన్ మ్యూజింగ్స్’, మన తెలంగాణ కాలమ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. నేచరంటే నీకున్న ఇష్టంవల్ల సముద్రం, నది, సూర్యుడు, పచ్చ దనం, అడవులు, కొండలు, గుట్టలు ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పటివరకూ ఎవరూ వర్ణించని వాతావరణాలు, సన్నివేశాల రూపకల్పనను ఇష్టపడతావు. కొత్తదనం నీ ఆరో ప్రాణం. చిన్నప్పుడు ఇంట్రావర్ట్‌లా ఉండేదానివి. చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ కావడం, పుస్తకాలు ఎక్కువగా దొరుకుతుండడంతో చదవడం అనేది నీ హాబీగా తయారైంది కదూ!
జీ టివి, మా టివిల్లో క్రియేటివ్ హెడ్‌గా, ఫిక్షన్‌లో పనిచేశావు. ‘ు జంక్షన్’ షార్ట్ ఫిలిమ్ కూడా డైరెక్ట్ చేశావు. ఒకసారన్నావ్ గుర్తుందా? ‘మిస్ మయూరం’ కథ నీకు బాగా ఇష్టమని. ‘ఇన్‌స్టెంట్ లైఫ్’ కథ, గ్లోబలైజేషన్ మీద వచ్చిన మొదటి కథగా చెప్తారు. అప్పట్లో చేరా, హరిపురుషోత్తమరావు గార్లు కూడా రాశారీ విషయాన్ని. ప్రపంచీకరణ అనేది ‘బ్యాంక్ దగ్గరే ఆగిపోదు బెడ్‌రూం వరకూ వచ్చిందని’ రాశావు. అర్బన్ సినారియోలోనే ఆధునిక స్త్రీల జీవితం ఉంటుంది.
తెలుగు సాహిత్యంలో ఒక విలక్షణమైన రచయితగా పేరు సంపాదించుకున్నావు. ఇక, నీ అవార్డుల విషయం మాట్లాడుకోవాలంటే చాలా
ఉన్నాయి. అవన్నీ ఇప్పుడిక్కడ ప్రస్తావించలేనేమో. కానీ, కొన్నింటినైనా గుర్తుచేసుకోక తప్పదు. తెలుగు యూనివర్శిటీ వాళ్ళ ‘బెస్ట్ రైటర్’ అవార్డు, ‘రంగవల్లి’ పురస్కారం, ‘చాసో’ అవార్డు, ‘లత’ అవార్డు, వాసిరెడ్డి సీతాదేవి అవార్డు మొదలైనవి. ‘మసిగుడ్డ’ కథలో స్త్రీల ఇళ్ళల్లో ఎన్నెన్ని హింసలు పడ్తారో, ఎటువంటి జీవితా లుంటాయో వివరించావు. ఆ కథకు చాలా పేరు వచ్చిందా రోజుల్లో. నీ మార్క్ కవితగా చర్చించబడింది. నీ కథల్లోని పాత్రలు ఆత్మాభిమానం కలవి. ‘మహి’ నవలలో ‘మహి’ పాత్ర నీకు చాలా ఇష్టమన్నావు. ఊహాజనిత ప్రపంచంలో స్త్రీలనర్ధం చేసుకుని హాయిగా జీవించగలిగే స్థితిని కల్పించే వాతావరణంతో చాలా కథల్ని మలిచావు. నీ పాత్రల్ని ప్రేమించే అభిమానులు చాలామంది ఉన్నారు. నిరాశా నిస్పృహలు ఎక్కడా కన్పించవు. పుట్టిన ప్రతి మనిషీ జీవించడానికి చేసే ఆనందమయ లోకం కోసం పడే తపనే అంతటా ప్రతిఫలిస్తూ
ఉంటుంది. ధైర్యానికీ, ఆత్మవిశ్వాసానికీ ప్రతీకలు నీ పాత్రలు. కాదు కాదు, సజీవ మానవ రూపాలు. అందుకేే నీకంటూ ఉన్న వ్యక్తిత్వంతో మలిచిన అనేక పాత్రల సమూహాలన్నీ అక్షరబద్ధమై నిలిచిపోయాయి.
పద్మా! పైన పేరు తీసేసినాక, చదివితే కూడా ఇది పద్మ కథ అయి
ఉండవచ్చు అనే ఊహను కల్గించేంతగా పరిణితి చెందిన కథకురాలివి నువ్వు. ఈ సారి ఇలా నీతో అక్షరాలతో మాట్లాడడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. రాజమండ్రిలో గౌతమీ లైబ్రరీలో పొగడపూల చెట్టు కింద కూర్చొని ఉన్నట్లుగా నా మనో చిత్రంలో ఎప్పటికీ నిలిచి ఉంటావలానే. ప్రస్తుతానికి ఉండనా మరి. నీ జవాబు కోసం ఎదురు చూస్తూ…