ఈ రోజు పొద్దున్నే నా మిత్రుడొకాయన నన్నడిగారు – ”యద్ధనపూడి సులోచనారాణి రచనల పట్ల నీ అభిప్రాయమేంటి? నాకైతే ఇష్టం లేదబ్బా. పైగా ద్వేషిస్తాను కూడా. చనిపోయిన వ్యక్తి మీద గౌరవం చూపిస్తూ అబద్ధాలు నేను మాట్లాడలేను” అని.
నేనన్నాను కదా… నాకేం ద్వేషం లేదు. చిన్నప్పుడు పిల్లలతో చందమామ కథలూ, పంచతంత్ర కథలూ చదివిస్తే ఎంత నష్టం జరుగుతుందో, యుక్తవయసులో పిల్లలు సులోచనారాణి నవలలు చదివితే అంత నష్టం జరుగుతుంది.
చిన్నప్పుడు చదివే చందమామ, బాలమిత్ర కథలు పిల్లల్లో ఊహాశక్తిని పెంపొందిస్తాయని మనస్తత్వ శాస్త్రవేత్తల నుండీ మార్క్సిస్టు మేథావుల దాకా ఒప్పుకునే విషయమే కదా! అందుకని హాయిగా ఊహాలోకాలలో విహరింపచేసే సులోచనా రాణి గారి నవలలంటే నాకిష్టమే. నాకవి చిన్నప్పటి చందమామ కథల నుండీ పెద్దయ్యాక చదివే సీరియస్ రచనలకి మధ్య కాలంలో అవి ఒక వారధిలాగా అనిపించాయి.
ఆవిడ రచనలలోని కథా కథన కౌశలం అనితరసాధ్యమయినది. ఆవిడ పుస్తకమేదయినా మొదలుపెడితే ఆపడం మన చేతిలో ఉండదు. ఆవిడ రచనలలో ఇంకో సుగుణం విషాదాంతా లుండకపోవడం. మధ్యలో చిన్నా, చితకా ట్రాజడీలున్నా అన్నీ హాయిగా ముగిసే కథలే.
ఇక్కడ ఆవిడ పాఠకులలో పెంచిన పఠనాసక్తిని విస్మరించడానికి వీల్లేదు.
చక్కటి భాష, ఉత్కంఠ, ఊహించని మలుపులతో కథ నడిపించడం ఆవిడ ప్రత్యేకత.
చక్కటి భాష అని ఎందుకంటున్నానంటే, ఆవిడ సమకాలికురాలయిన ఒక రచయిత్రి గ్రాంథికాన్నీ, వ్వావహారికాన్నీ కలిపి విచిత్రమయిన భాష రాసేవారు. ఉదాహరణకి ”అతను ఆమె దెస పరికించాడు. ఆమె కరవీర వృక్షము చెంత నిలచి తల పంకించింది”. ఇలాంటి వాక్యాలన్న మాట. సులోచనా రాణిగారితో ఈ సమస్య లేదు ఆమెది చక్కటి భాష.
నా వరకూ నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆవిడ రచనలు చదివి సంతోషించిన దాన్నే. ఒకటి కన్నా ఎక్కువ సార్లు కూడా చదివాను (సెక్రటరీ, మీనా, జీవన తరంగాలు). అయితే ఆవిడ నా అభిమాన రచయిత్రి అని చెప్పలేను. ఒక దశలో ఆవిడ పుస్తకాలు చదువుతున్నానని చెబితే సీరియస్ రీడర్ని కాదనుకుంటారేమోనని సందేహించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఆవిడ తీర్చిదిద్దిన పాత్రలకు రూపం కల్పించి మన కళ్ళముందు నిలిపిన బాపూ బొమ్మల గురించి తలుచుకోకుండా
ఉండలేకపోతున్నాను. ఎన్ని బొమ్మలేశారు బాపూ యద్ధనపూడి వారికి! దాదాపు 70 నవలలకి వేసిన ముఖచిత్రాలతో పాటు వారం వారమో, నెల నెలానో సీరియల్‌గా వచ్చేటపుడూ, కథలు ప్రచురించినపుడూ సన్నివేశానికి తగినట్టుగానూ, పాత్రలను రూపు కడుతూనూ ఆయన వేసిన బొమ్మలు సులోచనారాణి గారి పనిని సులభతరం చేశాయి. ఆ పాత్రలను కళ్ళ ముందుంచడంలో ముఖ్య పాత్ర వహించాయి అని నాకనిపించింది. ”సెక్రటరీ” ముఖచిత్రం – జయంతి కుర్చీలో నిద్రపోతుంటే, రాజశేఖరం ఠీవిగా నుంచున్నది ఇంకా నా కళ్ళకు కట్టినట్లుగా గుర్తొస్తోంది.
విచిత్రమేమంటే, ఆవిడది ”వంటింటి సాహిత్యం” అని వెక్కిరించే మగ మహానుభావులు చాలామంది ఆవిడ రచనలు చాటుగా చదవడం నాకు తెలుసు. ఆవిడ రచనలతో మగవాళ్ళెలా ఐడెంటిఫై అవుతారో నాకీరోజుకీ ఆశ్చర్యమే!
మిత్రురాలు మృణాళిని ”తాంబూలం” పుస్తకావిష్కరణ సందర్భంలో ఆవిడని కలిసి పక్కన కూచుని కాసేపు మాట్లాడే అవకాశం లభించింది. మాది ఆవిడ పుట్టిన ఊరు కాజ కి దగ్గరలో ఊరు అని తెలుసుకుని ఆనందించారు.
ఒక రచనకి కావలసిన ముఖ్య లక్షణమయిన రీడబులిటీ పుష్కలంగా ఉన్న రచనలు చేసి ఆంధ్ర పాఠకుల ఆదరాభిమానాలతో నవలారాణిగా నీరాజనాలందుకున్న సులోచనారాణిగారు, కాలిఫోర్నియాలో కుమార్తె దగ్గరికి వెళ్ళి నిద్రలోనే శాశ్వత నిద్రలోకి జారుకున్నారని విన్నప్పుడు నాకేమనిపించిందంటే, మరణం కూడా ఆమెను గౌరవించిందని. ఎంతమందికి దొరుకుతుంది అలాంటి అనాయాస మరణం. పాఠకుల హృదయాలలో ఆవిడ సృష్టించిన పాత్రల ద్వారా ఎప్పటికీ చిరంజీవే.
——భార్గవి గారి ఎఫ్ బి పేజ్ నుండి.