డా. పి.శర్వాణ
మా అమ్మ 1950-60 మధ్యలో కథానికలు రచించిన ప్రముఖ రచయిత్రి పి. సరళాదేవి. తన కథానికలలో ఇతివృత్తం స్త్రీల చుట్టురా తిరుగుతుంది. ‘కాలాతీత వ్యక్తులు’ రచయిత్రి పి.శ్రీదేవి స్నేహ, ప్రోత్సాహాలతో రచనా వ్యాసంగం చేపట్టి, స్త్రీ కుటుంబ జీవనంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకుని కథలు , గేయలు రాసారు.
అలాగే తెలుగు వారి కుటుంబ జీవనంలో వినవచ్చే సామెతలకు సంబంధించి ‘తెలుగు సామెతలు-సాంఘిక చరిత్ర’ అనే పుస్తకాన్ని రచించారు.అందులో ఆమెకు విషయసేకరణ పట్ల ఆసక్తి ఉందని తెలుస్తుంది. తన కుటుంబ బాధ్యతలను నిర్వహించడానికి తన రచనా వ్యాసంగాన్ని ప్రక్కన పెట్టింది. దానిని నేను నిర్వహిస్తూ ఆమె పేరును దశదిశలా వ్యాపింప చేయలనుకుంటున్నాను. దానికి మా అమ్మ ఆశీర్వాదం ఉంటుందని భావిస్తున్నాను.
మా అమ్మ ఆత్మీయతకు ప్రతిరూపం. అమ్మకి ఇద్దరు పిల్లలం-నేను, మా అక్క. అమ్మ తన ప్రేమను ఎల్లప్పుడూ చిన్నదానిపైన నా మీదే ప్రసరింపచేసేది. నేను అమ్మ ముద్దుల కూతురును. అందుని మా అక్క ఎప్పుడూ ముద్దు చేసి తెలియకుండా చేస్తున్నావని అంటుండేది.
నాన్నగారి ఉద్యోగరీత్యా ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాం. చివరికి హైదరాబాద్‌లో పదవీ విరమణ చేసి సొంత ఊరుకు వస్తున్న సమయంలో, నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్. ఏ చేస్తున్నాను. నన్ను వదలలేక స్టేసన్‌లో ఏడ్చేసారు. కానీ ఆ తరువాత ఎప్పుడైనా ఇంటికి వస్తానంటే, ముందు చదువు ఆ తరువాతే నా దగ్గరకు రా అనేవారు.
అమ్మ ఉన్నంతలో పొదుపుగా సంసారం చేసేది. కట్టెల పొయ్యి నుండి గ్యాస్ పొయ్యి స్థాయికి చేరింది. కానీ తను పడిన కష్టాలను పిల్లలమైన మాకు ఎప్పుడూ చెప్పేది కాదు.
చివరకు తాను క్యాన్సర్ బారినపడి అయిదు సంవత్సరాలలో చనిపోతుందని డాక్టరు చెప్పినప్పుడు, మా అక్క, నేను ఒకే నిర్ణయం తీసుకున్నాం, తన చివరి క్షణాలు సంతోషంగా గడవాలని. దానికి కావలసినంతగా సేవ చేసి అమ్మ రుణం తీర్చుకున్నామనే అనుకుంటున్నాము. అమ్మ చనిపోయి ఒక సంవత్సరం దాటింది. ఎల్లప్పుడూ అమ్మ ఆశీర్వాదం మాకు ఉంటుందనే భావిస్తున్నాము.
ఉంటే తినాలి, లేకపోతే లేదు అనే సూక్తి అమ్మ ద్వారా తెలుసుకున్నాను. అప్పు చేయడం మాత్రం నేర్పలేదు. డబ్బును పొదుపుగా వాడుకోవడం నేర్చుకున్నాను. దానివల్ల ఎంత సుఖం ఉందో అర్ధమవుతోంది.
ఇంటికి ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలకరించడం, ఎవరు తమ వేడుకలకు పలిచినా తానే ముందుగా ప్రయణమవ్వడంచేసేది. ఆ అడుగుజాడలలో నేను ఇప్పుడు నడుచుకుంటూ అమ్మ పేరు నిలబెడతాను.
ఆత్మీయతకు ప్రతిరూపమైన మా అమ్మను కోల్పోయినందుకు బాధ కలిగినా, ఈ రూపంగా మా అమ్మను మరొక్కసారి తలచుకోవడానికి అవకాశం కల్పించిన ‘భూమిక’ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.