మేమంతా సిగ్గుపడుతున్నాం
దించుకుంటున్న తలలతో
దుక్కబావులమై నిజంగా…
మేమంతా సిగ్గుపడాల్సినంతగా సిగ్గుపడుతున్నాం.
తాతలు తండ్రులు
అన్నలు మేమూ…
మా మృగత్వాలకు
మగత్వాలకు ప్రాణభిక్షలు పెడుతున్న
అమ్మలక్కలందర్నీ చూస్తూ…
మామీద మేమే జాలిపడుతున్నాం.
కాలేజిలో, సినిమా హాళ్ళలో,
బాత్‌రూమ్ తలుపులపైనా
బస్టాండ్లలో బహిరంగప్రదేశాల్లో
పాడుబడ్డ గోడలమీదో
మా జన్మస్థానాల బొమ్మల్ని
మాకు జీవంపోసిన జీవనదుల రూపాల్ని
అతిహేయంగా చిత్రించుకున్నందుకు…
నాగరికతకు ఆటవిక సంస్కారానికి
మాకు మేమే మా ముఖాలపై ఉమ్ముకుంటున్నాం…
అర్థనగ్నంగానో
నగ్నంగానో
సిన్మానో, వీడియోన్నో తీస్తూ చూస్తూ
మనుషులుగా మమ్మల్ని చంపుకుంటూ
ప్రతి వస్తువుకి
ఆడతనాన్ని అమ్మకపు సరుకుని చేసిన
మా అవిటబుద్ధికి మేము
అవమానంగా బతుకుతున్నాం…
ఎంత అహంకారంతో ప్రవర్తించినా
ఎన్ని ఘోరాలకు ఒడిగట్టినా
మమ్మల్ని ఇంకా ఇంకా ప్రేమిస్తున్న
తల్లుల్ని చూస్తూ…
మా ముఖం యాడా చూపించలేనంతగా
మా తలేడ పెట్టుకోవాలో తెలియన్నంత రోతగా…
మేము సిన్నపోతున్నాం…
అమ్మ కొంగుచాటే పాలుతాగి పెరిగిన మేము
ఏ అమ్మ పైట తొలిగినా
పశుత్వంలోకి జారిపోతున్నందుకు
సిగ్గుతో కుమిలిపోతున్నాం…
అక్కల సంకలో ఆలనాపాలనలో
ఇంతవాళ్ళమైన మేము
ఏ అక్క కనబడ్డా అంగాంగాలపై సొంగలా కారుతున్న
నీచత్వాల ఊబిలో కూరుకుపోతున్నందుకు
అమ్మ చేతికూడు తింటూనే
అమ్మనా బూతులమవుతున్నందుకు
ఆడరూపు కనపడగానే
ఒక ఉన్మాదం ఆవహించినంతగా
ఊగిపోతున్న మేము…
మా పురుషాహంకారత్వాన్ని
ఎప్పుడు ఎలా ఉరితీసుకోవాలని
మనుషులుగా మొలకెత్తడానికి మరణిస్తున్నాం…
ఇప్పుడు సిగ్గుతో తలల్ని తుంచి
అమ్మలకు చేసిన అవమానాలు
అర్పించుకుంటున్నాం…