ఆడపిల్ల ఒకసారి ‘నో’ అంటే అది ‘నో’ అంతే.. -పి. ప్రశాంతి

ప్రేమ… ఎంత అద్భుతమైన మాట… ఎంత భావోద్వేగమున్న పదం… ప్రకృతిలోని ప్రతి జీవి… చరాచరాలన్నీ అనుభూతించే ఏకైక ప్రాణదాయిని బహుశా ఇదేనేమో! ప్రేమతో క్రూర జంతువుల్ని సాధు జంతువులుగా మార్చొచ్చని, ప్రేమతో పెంచే మొక్కలు, చెట్లు పచ్చగా ప్రేమని వెదజల్లు తాయని… ప్రేమగా స్పర్శిస్తే మతిస్థిమితం లేనివారు కూడా స్థిమిత పడ్తారని, ప్రేమగా పలకరిస్తే శత్రువులూ మిత్రులైపోతారని… ప్రేమతో ప్రపంచాన్నే జయించొచ్చని… ఎన్ని వింటాం! ఎన్నెన్ని చెప్తాం!! ఎన్నెన్నో అనుభవంలోకి తెచ్చుకుంటాం.

కానీ, ఈ ప్రేమలోనూ వర్గీకరణ లున్నాయనీ… నిబంధన లున్నాయనీ… ఎల్లలు ఉన్నాయనీ… ఉండాలనీ, ఉండి తీరాలని అంటుంటే ఎలా నమ్మేది, ఎలా జీర్ణించుకునేది. తల్లిని ప్రేమించాలి కానీ తండ్రిని ప్రేమించొద్దట… ఒక తల్లి నిబంధన. తండ్రినీ ప్రేమించొచ్చు కానీ నేస్తాన్ని కూడదట, నెయ్యానికే కానీ వియ్యానికి పనికిరాదట. స్వకులాన్ని ప్రేమించాలి కానీ అన్య కులాల్ని కాదట.

ప్రేమకి పరిధుల్ని విధించు కోవాలని, కులమతాల్ని చూసుకునే ప్రేమించాలి కానీ మనసు స్పందింపచేసిన వారిని ప్రేమించడం బరితెగింపని, చెయ్యి దాటిపోయిందని, కుటుంబానికి, కులానికి, వంశానికి మచ్చని… ఎన్ని వికృతభావాలు! కొడుకుకైతే అన్నింట్లో సడలింపు లుంటాయట. కూతురైతే… చుట్టూ గోడలే. కనపడని, అభేద్యమైన లోహపు గోడలు. ఏకపక్షపు నియంతృత్వ ‘ప్రేమ’తో ఏర్పరచిన కంచు గోడలు.

చంటిబిడ్డగా ఉన్నప్పుడు అన్నీ ఎవరో ఒకరు చేయాల్సిందే. పెరుగుతున్న కొద్దీ ఇష్టాయిష్టాలు ఏర్పడుతుంటే, అదొద్దు… ఇది కావాలి… అని అడుగుతుంటే ఒక్కోసారి మురిపెంగా, మరోసారి కోపంగా పెద్దదైపోతోందని నిష్టూరం. అయినా చాలాసార్లు నీకేం తెలియదని గద్దించి తన హోదాకి తగినట్లుగా, తన ఇష్టాన్ని బిడ్డమీద రుద్దే తండ్రులే ఎక్కువ. గోళ్ళ రంగు, బొట్టుబిళ్ళ దగ్గర్నుంచి వేసుకునే చెప్పులు, బట్టలదాకా అన్నింట్లో కుటుంబ హోదా, తన దర్పం కనబడాలనుకునే తండ్రి ‘ప్రేమ’ ఆ ‘ఆడపిల్ల’ మనసుమీదా, మనోభావాల మీదా ఎంత ప్రభావం చూపిస్తుందో అని తండ్రులకి తెలియదా! తెలిసే ఆ ప్రభావం తనకను కూలంగా ఉండాలనే ఆ దాష్టీకం. దానికి లొంగని, సొంత వ్యక్తిత్వం ఏర్పరచుకున్న ఎదిగిన కూతుళ్ళు పరువు, మర్యాద అని ప్రాకులాడే తల్లిదండ్రులకి కంట్లో నలుసుల్లాగే…

అమ్మాయి బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సాధించడం తప్పకుండా తల్లిదండ్రుల సహకార ఫలితమే. కానీ చదివి, పరీక్షలు రాసి, ర్యాంకులు సాధించేది, ఇంటర్వ్యూలో రాణించేది తమ తెలివి తేటలతోనే కదా! తన సామర్ధ్యం తనకి తెలుసు. ఇంట్లోవాళ్ళకీ అర్థమౌతున్నా కసిరి, ఇతరుల్తో పోల్చి, గేలిచేసి పిల్లల ప్రమేయం లేకుండానే వాళ్ళకి నచ్చిన కలల్ని కనేసి వాటిని నిజం చేయడం పిల్లల బాధ్యత అని ఒత్తిడి చేసే పెద్దల వల్లే కదా ఈ పిల్లలు హాస్టళ్ళలోనే ఉరేసుకోవడం, బిల్డింగుల పైనుంచి దూకేయడం, ఏదో ఒకరకంగా తమ ప్రాణాల్ని బలివ్వడం… అయినా అర్థం కావట్లేదా ఈ ఉన్మాదపు పెద్దలకి.

ఇంతటి ఒత్తిళ్ళలోనూ బయటపడి కన్నవాళ్ళ కలల్ని నిజం చేసినా, తమ ఇష్టాల్ని ఇష్టపడే, తమ చిన్ని కష్టాల్ని అర్థం చేసుకునే, తమ భావాల్తో సరిపోలే వ్యక్తుల పట్ల ఆకర్షితులవ్వడం, వారికే ప్రాధాన్యతనివ్వడం, ఎక్కువసేపు వారితోనే గడపాలనుకోవడం అత్యంత సహజం కదా! అది తండ్రులు చేస్తే కెరీర్‌, అదే పిల్లలు చేస్తే …! ఈ ద్వంద్వ వైఖరే కదా ఎదిగే పిల్లల్లో గందరగోళం సృష్టించేది. ఐనా స్నేహం వరకు మాత్రమే అయితే భరించొచ్చట. తమ మనసుల్ని మభ్యపెట్టుకోకుండా నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనుకోవడం దగ్గర మాత్రం ఒప్పుకోరట. మరి ప్రేమంతా ఎటుపోతుందో ఆనాటికి. కూతుళ్ళని, వాళ్ళ ప్రేమని, ప్రేమించిన వ్యక్తిని కూడా చంపేస్తాయి.

అంతేమరి. ఇరవై ఏళ్ళు (మొదటి ఐదారేళ్ళు తీసేసినా) అదుపాజ్ఞల్లో పెట్టి, తమ ఇష్టాల్నీ పిల్లలపై రుద్ది ‘ప్రేమ’గా పెంచిన తండ్రులకి ఎదిగిన కూతుళ్ళు తమ జీవితాల్ని తామే నిర్ణయించుకోగలగడం శరాఘాతమే. తమ పరువు, మర్యాదలకి కూతుళ్ళే ‘పెట్టుబడు’లనుకుంటున్న కుటుంబాలకి ఇది షాకే. అమ్మాయికి నచ్చింది కాక, తను కావాలనుకున్న రంగు, బ్రాండ్‌, సైజ్‌ల కోసం పది షాపులు తిరిగి కొనిపెట్టి అదే వేసుకోమనటం అంతా ఆమె మీద ప్రేమేనట. మెచ్యూర్‌ అయినప్పుడు అందరికీ తెలియడం నచ్చక స్కూల్‌ మాననంటే అరిష్టమనీ, ఇబ్బందికరంగా ఉంటుంది ఫంక్షన్‌ వద్దంటే మా ముచ్చట తీరేదెలా అనీ, పెద్ద ఎత్తున ఫంక్షన్‌ హాల్లో చేస్తుంటే నవ్వు ముఖం పెట్టలేదనీ గదమాయించే తండ్రులపై అమ్మాయిలకి నిజంగా ప్రేమ ఉంటుందా… తెచ్చిపెట్టుకునే ప్రేమ మాత్రమే తప్పించి!!

అప్పట్నుంచే మొదలయ్యే భావ వ్యతిరేకత పెళ్ళినాటికి ఎలా రూపు దాల్చుతుందో తెలిసిన విషయమే. ఇవేమీ లేకపోయినా, సగం జీవితాన్ని గడిపేసిన తల్లిదండ్రులు, ఇంకా జీవిత ప్రారంభంలో ఉన్న తన జీవితాన్ని వాళ్ళకనుకూలంగా శాసించడం, నియంత్రించడం ఎలా భరించగలదు? నీ కాళ్ళమీద నువ్వు నిలబడాలని నేర్పించిన తండ్రులే అలా కానివ్వకుండా కాళ్ళు నరికేస్తుంటే ఏం చేయాలి? కుల పిచ్చితో నడిరోడ్డు మీద నరికేస్తే అది హత్యగాకన్నా ‘పరువు’ హత్యగా కౌన్సిలింగ్‌ ఇచ్చేవాళ్ళను ఏమనాలి? కోరుకున్నవాడ్ని గౌరవంగా పెళ్ళి చేసుకుంటే తమ మాట వినలేదన్న కసితో ‘లేచిపోయిందని’ వికారం చేసే పెద్దల్ని పెద్దలనాలా? పేదవాళ్ళకి ‘పరిధి’దాటి ప్రేమలుండకూడదు, ‘తక్కువ’ కులపోళ్ళు ‘పెద్ద’ కులాల పిల్లల్ని ‘వల’లో వేసుకుని పెళ్ళి పేరుతో మోసం చేస్తారు, కూతుళ్ళ ఇష్టాలను కుటుంబ పరువు కోసం చంపుకోవాలి, కాదన్నా పెళ్ళి చేసి పడేస్తే కట్టుబడి ఉంటుందనే… ఈ ఉన్మాదం మారదా? ఎదిగిన అమ్మాయిలు వాళ్ళ జీవితాల్ని వాళ్ళు నిర్దేశించుకోగలరని, ఫెయిలైనా నిలదొక్కుకుని ఎదగగలరని ఈ పెద్దలకి ఎప్పుడర్థమవుతుంది? ఆడపిల్ల ‘నో’ అంటే అది ఏ విషయంలోనైనా, ‘నో’నే అని ఈ సమాజం ఎప్పటికి అర్థం చేసుకుంటుంది?

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.