పొగడ పూల నక్షత్రాలు రాత్రంతా
చేస్తూనే వున్నాయి తపస్సు నిర్నిద్ర కళ్ళతో
నల్లని ఆకాశంలో మినుకూ మినుకూ మంటూ
తారాకాంతి వెలిగించిన దీప దారుల్లో
నడుస్తున్న ఆమె మానసం…
ఉట్టిలో పెట్టిన చిల్లి కుండలా దీనంగా
మడతపెట్టిన చింకి బొంతలా మురికిగా
ఇంటి ముందు వూడ్వని వాకిలిలా చెత్తగా వుంది.
వానలో… మంచులో తడిసిన కాళ్ళు
గోడవారగా ఎత్తిన నులక మంచం ఆనవాళ్ళ కోసం
ఆర్తిగా వెతుకుతున్నాయి… శరీరం కృశించి పోతోంటే!
నరకమనేది ఆమెని భయపెట్టదు
ఎంతో మంది వారసులను స్వర్గ ద్వారాల ముందు
మోకరిల్ల చేసిన ఆ చేతులు ఎప్పుడూ
వినమ్రతనే కోరాయి!
పెంచి పోషించిన కళ్ళతో
కన్న శరీరాలను తడిమే మాత్రు హృదయం
ఏడూళ్ళ చక్రవర్తిని చేసేందుకు ఎన్నో పరాన్న భుక్కులను
పక్కన పెట్టి మరీ శత్రుసంహారం చేసింది!
ఆత్మీయ బంధనాల నుండీ
అర్థరాత్రి భయాల నుండీ
తీసుకొచ్చే దుఃఖాల నుండీ విముక్తి కోసం
ఆమె మానసం
అంతం లేని మైదానమైంది!
జ్ఞాపకాల ఖజానాలోంచి వెలుతురు పిట్ట ఎప్పుడో ఎగిరిపోయింది,
దారులు మూసుకుపోయిన రాదారు లెంబడి!
తెల తెల వారుతుండగా శవత్వం నుండి
జీవత్త్వంలోకి మళ్ళుతూ తెరిచింది నిద్ర కళ్ళు!
ఇంత సేపూ దర్శించింది అనంత జీవితాన్ని
ఒక్క ఘడియలోనే నని చెప్తూ!!