ఆమె అమ్మగా కంటే హేమలతగా అపురూపమైనది. నిజానికి ఏ తల్లయినా అంతే. ప్రతి తండ్రీ పిల్లల కోసం ఆరాటపడతాడు. ప్రతి తల్లీ కడుపులో మోసే పెంచుతుంది. నానా చాకిరీ చేస్తుంది. వాటిని కారణంగా చేసుకుని నేనెప్పుడూ నా తల్లిదండ్రుల్ని ప్రేమించలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక వయసు వరకు వాళ్ళు నన్ను ఎంత ప్రేమించారు, ఏ విధంగా ప్రేమించారు అని గమనించేదాన్ని. ‘అమ్మ ఒక దేవత, నవమాసాలు, పురిటినొప్పుల’ సాహిత్యం చిన్నతనం నుంచే చదివినా ఆ మాయలో నేను పడలేదు. అమ్మ కూడా ఆ రాతలను, కూతలను ఖండిస్తుంది.
అమ్మ అమోఘంగా చేసే రొయ్యల వేపుళ్ళు, బిర్యానీలు వగైరా ఆమె పదునైన ఆలోచనల ముందు ఒక మూలకి కూడా రావు, రాకూడదు. అమ్మ గొప్పదనం ఆమె వంటలో ఉండదు. ఆమె మమ్మల్ని ఎత్తుకుని పెంచిన శ్రమలోనూ
ఉండదు. ఆమె ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు, ఉండాలనుకున్నప్పుడే ఏ తల్లయినా గొప్పదవుతుంది. ఆ విధంగా మా అమ్మ హేమలత గొప్పది.
ఆమెతో నేను వయసుకొచ్చాక మొదటిసారి ప్రేమలో పడింది ‘నీ ముట్టు బట్టలు నేను ఉతకను, నీ పని నువ్వే చేసుకోవాలి’ అని చెప్పినప్పుడు. చాలా గౌరవం కలిగింది అమ్మమీద. నన్ను నేను గౌరవించుకోవడమూ బావుంది.
అమ్మగా ఆమె అందరిలాంటిదే. వ్యక్తిగా విలక్షణమైనది. నాన్న చదువులో, సాహిత్యంలో ఆమె అందించిన కుడి భుజం భార్యది మాత్రమే కాదు, సహచరుడి కోసం కొండంత తపన పడ్డ స్నేహితురాలిది కూడా.
అమ్మ తన డిగ్రీ, పీజీ, పిహెచ్‌డీ పెళ్ళయ్యాకే చేసింది. కేవలం సొంతగా పుస్తకాలు చదువుకుని కంప్యూటర్ తల తన్నింది. ఇవన్నీ నాన్న ప్రోత్సాహంతో మాత్రమే కాదు, తన కొండంత పట్టుదలతో.
ఆరోగ్యం బావుండకపోయినా ఎందుకింత పని చేస్తావు, విహంగ వెబ్ పత్రిక అనీ, సాహిత్య సభలనీ ఎందుకు తిరుగుతావు అంటే ఆమెకు నచ్చదు. ‘వెళ్తాను అంటే వెళ్తాను అనే. మీ మాట వింటాను అని కాదు’ అన్నట్లు చూస్తుంది. ప్రయాణాల్లో ఇబ్బంది పడినా, రాత్రంతా క్యాండీ క్రష్ అంటూ స్పైనల్ స్టెనోసిస్ వల్ల రోజంతా బాధపడుతున్నా మేం చూస్తూ ఉండాల్సిందే. ఎదురు చెప్పకూడదు. ఆమె చూపు ఆమె మాట ఆమె మొండితనమే గెలుస్తుంది.
నాకు ఇంగ్లీష్‌లో బాగా నచ్చే వాక్యం ‘A clean house is a sign of wasted life’ ఇది చాలా బలమైన వాక్యంగా నేనెప్పుడూ గుర్తు చేసుకుంటాను. అమ్మ చదివిందో లేదో నాకు తెలీదు కానీ మమ్మల్నెప్పుడూ ఇల్లు సర్దమని, వంట నేర్చుకోమనీ చెప్పలేదు. పెరిగే క్రమంలో అవి అలవాటుపడ్డాయి తప్ప ప్రత్యేకంగా శ్రద్ధపెట్టి నేర్చుకున్నది లేదు.
అమ్మ చాలా క్రియేటివ్. పెయింటింగ్స్ దగ్గర నుంచి వెబ్ డిజైనింగ్ దాకా అన్నీ వచ్చు. తన పదమూడవ ఏటే తన మొదటి కథ పత్రికలో అచ్చయింది. కథలు వ్యాసాలు, కవితలు రాసింది.
అలా మా కోసం రాసిన ఒక కవిత…
స్వప్న ముఖి
– పుట్ల హేమలత
ఒత్తిగిలి హత్తుకోవటానికి
మరో రెండు చేతులుంటే
ఎంత బాగుణ్ణు
ఒక రెంటితో నిన్నూ…
మరో రెంటితో మరో నిన్నూ…
కనీసం
నాకు రెండు ముఖాలైనా లేవు
ఒకటి ‘నీ’ వెంపుకీ
మరొకటి
‘మరో నీ’ వెంపుకీ…
నా ‘మానస’ మహతిపై
నీ ప్రేమ తంత్రుల నాదం
నీ ‘మనోజ్ఞ’ మధూలికల పరిమళాలు
నా తలపుల వాకిట్లో…
వినటానికి రెండు చెవులేనా?
ఏరుకోవటానికి రెండు చేతులేనా?
అవయవాలకి ‘ధాత’ కరువు
ఒక నీకూ
మరో నీకూ
ఇంకా తెలీదు
ఒకప్పుడు
మా అమ్మ కూడా ఇంతే
పది చేతుల కోసం
పంచముఖియై
కలలు కంటూ ఉండేది!