పియమైన కృష్ణాబాయి గారికి,
నమస్కారం. మీరు అంత వెంటనే సమాధానం రాసినందుకు నాకు చాలా ఆనందం కలిగింది. ఈ రోజుల్లో అటువంటి సంస్కృతి ఉన్నవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. సావిత్రి కవితల్ని ఎలాగైనా సరే సంకలనంలో చేర్చాలనే ఉంది. అందుకే అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాను. సతీష్ చందర్, అరణ్య కృష్ణ ద్వారానూ, ఇతరుల ద్వారానూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. తెలుసుకోగలనన్న ఆశ కలుగుతోంది. ఇంకా ముగ్గురు పాత తరం రచయిత్రుల గురించి కూడా సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఎవరూ సులభంగా చెప్పలేకపోతున్నారు. అయినా ఆశ వదులుకోవడం లేదు. వారసులలో ఎవరికీ సాహిత్యం మీద అభిలాష లేకపోయినా హక్కుల విషయంలో మాత్రం పట్టుదలగా ఉంటారు. ఈ మధ్య పురాణం సుబ్రహ్యణ్య శర్మ గారి పెద్దమ్మాయి ఇలాంటి గొడవే రేకెత్తించింది. తల్లిచేత హక్కులన్నీ తనకు వచ్చేటట్లు రాయించుకుందట. ఒక చిన్న నవలని ఎవరో ఒకతను ప్రచురించడానికి ముందుకు వస్తే ఆవిడ అంగీకరించిందట. తనకు చెప్పకుండా, తన అనుమతి లేకుండా ప్రచురించినందుకు ఆ ప్రచురణ కర్తకి, తల్లికి లాయర్ నోటీసు ఇచ్చింది. ఆవిడ గోల పెడుతూ నా దగ్గరికి వస్తే నందిగం కృష్ణారావు దగ్గరికి నిన్ననే తీసుకువెళ్ళాను. ఇటువంటి వాళ్ళెవరయినా ఉంటారనే నా భయం. నెహ్రు కూడా తన పుస్తకాల పైన వచ్చే ఆదాయాన్ని, అన్ని హక్కుల్నీ తన వాళ్ళకి వదిలి వెళ్ళాడు కానీ, జాతికి ఇవ్వలేదు. ఒక పుస్తక సమీక్షలు చేసుకోవడానికి మాత్రమే జనానికి హక్కు ఉంటోంది. ఇది విచారించదగిన విషయమే కానీ, ఆర్థిక సూత్రం ప్రబలమైనది కదా! ఈ మధ్య మరో సంఘటన (దుర్ఘటన) జరిగింది. మీరు పేపరులో చదివే ఉంటారు. యద్ధనపూడి సులోచనారాణి నవలల్ని తమిళంలోకి తర్జుమా చేయడమే కాకుండా, ఆవిడకి చెప్పకుండా ఆవిడ పేరు లేకుండా యండమూరి పేరుతోను, మరొకావిడ పేరుతోను ప్రచురించి డబ్బు చేసుకున్నారట. ఆ విషయం యద్ధనపూడికి చాలా ఆలస్యంగా తెలిసింది. ఆ విషయమై ఏవో తంటాలు పడుతోంది. మీ మనవరాలు బాగా చదువుకుంటోందనుకుంటాను. మీ ఆరోగ్యం బాగుందనుకుంటాను. మీ వారికి నా నమస్కారాలని చెప్పండి.
దీపావళి శుభాకాంక్షలతో… – అబ్బూరి ఛాయాదేవి