అబ్బూరి ఛాయాదేవి గారిని నేను మొదటిసారిగా వారి ఇంటిలో కలిశాను. చివరిసారి సి.ఆర్.ఫౌండేషన్‌లో కలిసాను. రెండు సార్లు కూడా ఆమె పోస్చర్ ఒకేలా ఉంది. అది నా మనసులో ఒక ముద్ర వేసింది. ఛాయాదేవి గారు ఒక చెయిర్‌లో కూర్చుని ముందు
ఉన్న టేబుల్‌పై వ్రాసుకుంటున్నారు (మొదటిసారి చూసినప్పుడు), చివరిసారి చూసినప్పుడు చదువుకుంటున్నారు. నా ఉద్యోగరీత్యా ఛాయాదేవి గారిని నాలుగుసార్లు కలిశాను.
నేను CCC (caring Citizens Collective) లో Child Sponsorship Coordinator గా పనిచేస్తున్నాను. మా ప్రాజెక్టులో భాగంగా మేము 600 అమ్మాయిలతో (ప్రభుత్వ పాఠశాల) సిద్ధిపేట చుట్టుపక్కల మండలాలలో పనిచేసేవారం. ఆ అమ్మాయిల సందేశాలు (మెసేజెస్) ఇంగ్లీషులోకి తర్జుమా చేసి ప్రాజెక్టు ఆఫీసుకి పంపాలి. ఇది ప్రాజెక్టు వచ్చిన కొత్త రోజులలో అమ్మాయిలతో డ్రాయింగ్ గీయించి సందేశాలు వ్రాయించి నా కొలీగ్స్ ఆఫీసుకి పంపేవారు. 600 సందేశాలు అనువదించడం ఎలా అని ఆలోచిస్తుండగా సజయ గారు కొంతమంది పేర్లు చెప్పి వారిని కలవమని చెప్పారు. అందులో ఛాయాదేవి గారి పేరు ఉంది. వారు వారి పనులలో బిజీగా ఉంటారు, మనకు స్నేహపూర్వకంగా చేస్తున్న సహాయం, వారు ఎన్ని అనువాదాలు చేస్తాను అంటే అన్ని ఇవ్వమని చెప్పారు. అప్పుడు మా ఆఫీసు యుగాంతర్ ఆఫీసు పరిసరాల్లో ఉండేది. నేను బాగ్‌లింగంపల్లిలో ఉండేదాన్ని.
ఆఫీసుకి వెళ్ళకుండా ఛాయాదేవి గారి ఇంటికి వెళ్ళాను. గేటు తీయగానే పూలమొక్కలు, పిల్లలు స్వాగతం పలికాయి. కాలింగ్‌బెల్ కోసం చూస్తే దొరకలేదు. ఒక మందమైన దారానికి గాజు కట్టి ఉంది. ఇది ఏంటా అని కొంచెం గట్టిగా పట్టుకున్నా, గంట మోగింది. మళ్ళీ మోగించాలని అనిపించింది కానీ చిన్నపిల్లల చేష్టగా ఉంటుందని చేయలేదు. చిన్నగా, సన్నగా, కాటన్ చీరలో చాలా సాదాసీదాగా ఉన్న ఛాయాదేవి గారు వచ్చి తలుపు తీస్తూనే ఎవరమ్మా అని అడిగారు. నేను సుప్రియ మేడం, సజయ గారు మిమ్మల్ని కలవమని పంపించారు. నన్ను లోపలికి పిలిచి కూర్చోమన్నారు. సోఫాలో కూర్చుంటూ చుట్టూ చూస్తే ముద్దు వచ్చే బొమ్మలు అన్నీ అమర్చి ఉన్నాయి. ఇంట్లో పిల్లులు తిరుగుతూ ఉంటే నాకు భయంగా ఉంది. అది గమనించి అవేమీ అనవు అన్నారు. నేను హైదరాబాద్‌లో పాత బస్తీలో పనిచేస్తున్నప్పుడు ఎక్కువగా పిల్లులు ముస్లిమ్‌ల వద్ద ఉండేవి. పిల్లులు, బొమ్మలు, గంట ఇవన్నీ నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. తేరుకొని ఛాయాదేవి గారికి ప్రాజెక్టు గురించి పిల్లల సందేశాలను ఇంగ్లీషులోకి తర్జుమా చేయాల్సి ఉంది మేడమ్, ఈ సందర్భంగా మీ సహాయం కోరి వచ్చాను అని చెప్పాను. సజయ ఎన్ని పంపించారు అని అడిగారు. మేడమ్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ వీలునుబట్టి ఇవ్వమన్నారు అన్నాను. మీ వద్ద ఎన్ని ఉన్నాయన్నారు. యాభై
ఉన్నాయి మేడం అన్నాను. అయితే ఎప్పుడు ఇవ్వాలని అడిగారు. మీ ఇష్టం మేడమ్ అన్నాను. అయితే నెలకు ఇస్తాను ఓకేనా అన్నారు. కాదండి, మేడమ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు అన్నారు అన్నాను. నేను చేస్తానని సజయకు చెప్పాను, చేసి ఇస్తాను, 2, 3 రోజుల్లో ఇవ్వనా అన్నారు. ఫర్వాలేదు మేడమ్ మూడు రోజుల్లో ఇవ్వండి అని అనాలోచితంగా అన్నాను. ఛాయాదేవి గారు నవ్వి ఇలా ఇవ్వు అన్నారు. ఎన్ని ఇమ్మంటారంటే అన్నీ ఇవ్వు అని తీసుకున్నారు. థాంక్స్ చెప్పి ఆఫీసుకి వచ్చి సుజయ, నరేష్‌లకు ఆ రోజు సందర్బం దొరికినప్పుడల్లా ఎన్నోసార్లు ఛాయాదేవి గారి పరిసరాల గురించి చెప్పాను. సజయగారు ఆ బొమ్మలు, గంట తానే తయారుచేశానని చెప్పారు.
నేను మొదటిసారి ఛాయాదేవిగారి ఇంటికి వెళ్ళినప్పుడు పది గంటల సమయంలో ఆఫీసులో పనిచేస్తున్నట్లుగా కుర్చీలో కూర్చుని టేబుల్‌పై వ్రాసుకుంటూ కనిపించారు. టేబుల్‌పై పుస్తకాలు అమర్చబడి ఉన్నాయి. అందులో నిఘంటువు కూడా ఉంది. ఇల్లు బొమ్మలతో, పుస్తకాలతో అమర్చబడి ఉంది. లోపలికి వస్తూనే కుడివైపుగా చిన్న వంటగది నీట్‌గా సర్ది ఉంది. ఎంత క్రమశిక్షణ అనిపించింది. నేనెవర్నో తెలియదు, సజయగారు మిమ్మల్ని కలవమన్నారంటే ఎంతో ఆప్యాయంగా మాట్లాడి వచ్చిన పని తెలుసుకుని చేసి పెడతాను అన్నారు. ఛాయాదేవి గారికి, సజయ గారికి వయసు పరంగా తల్లీ, కూతుళ్ళ వ్యత్యాసం అయినప్పటికీ, ఒకరి మీద ఒకరికి నమ్మకం, వారు చేస్తున్న పనుల మీద గౌరవం నాకు చాలా నచ్చింది. ఆ రోజు మాటల సందర్భంగా ఛాయాదేవి గారు ఏదో పుస్తకం అనువాదం చేస్తున్నాను అన్నారు. ఆ గందరగోళం/ఆశ్చర్యంలో కొన్ని విషయాలను నేను వినిపించుకోలేదు. 3 రోజుల తర్వాత వెళ్ళి పిల్లల సందేశ పత్రాలను తీసుకున్నాను. ఛాయాదేవిగారు ”మీ ప్రాజెక్టు కాలంలో పిల్లల ఆలోచనలో మార్పు రావాలి, అది వారు గీసే డ్రాయింగ్‌లో మరియు వారి సందేశాలలో కనబడుతుంది” అని సజయకు చెప్పండి అన్నారు. నేను సజయ గారికి చెప్పాను. మాకు ఇలాంటి సూచన ఇచ్చిన మొదటి వ్యక్తి ఛాయాదేవి గారు.
నేను తరువాత ఛాయాదేవిగారి ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు, కానీ తరచు బాగ్‌లింగంపల్లికి డా.రామకృష్ణారెడ్డి గారి క్లినిక్ పక్కనే చిన్న కూరగాయల మార్కెట్ ఉంది. అక్కడే ఒక చిన్న తినుబండారాల దుకాణం ఉంది. తాజాగా చేసి అమ్ముతారు. అక్కడ భుజానికి ఒక్క బట్ట సంచి వేసుకుని కనబడేవారు. అందులో కొంచెం కొంచెంగా కొనేవారు. మేడమ్ బాగున్నారా అంటే ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంది అని అడిగేవారు. మేడమ్ నాకు ఇవ్వండి నేను తీసుకువస్తాను అంటే లేదు, మీ పని మీరు చూసుకోండి నేను వెళ్ళగలను అనేవారు.
తర్వాత ఛాయాదేవి గారిని చాలాకాలం తర్వాత 2014 జులై/ఆగస్టులో మా స్టూడెంట్స్‌తో కలిసి సి.ఆర్.ఫౌండేషన్ వెళ్ళి కలిశాను. ఛాయాదేవి గారు స్టూడెంట్స్‌తో మాట్లాడడానికి చాలా ఇష్టపడేవారు. నేను స్టూడెంట్స్‌తో రెండుసార్లు వెళ్ళాను. రెండోసారి వెళ్ళినపుడు నేను భూమిక సెలబ్రేషన్స్‌లో పాల్గొనలేకపోయాను, రాత్రివేళ దూరం కూడా అన్నారు. ఛాయాదేవి గారి గదిలో పిల్లలందరూ (60కు పైగా) పట్టరు కాబట్టి నేను కుర్చీని గది బయట వేస్తే, ఆ చుట్టూ చేరి పిల్లలు మొక్కలవద్ద కూర్చుని స్టూడెంట్స్ గురించి అడిగి తెలుసుకుని చదువు ఆలోచనను పెంచుతుంది కాబట్టి చదువుకోవాలి అని సూచించేవారు. సి.ఆర్.ఫౌండేషన్‌లో లంచ్ టైం అయ్యాక స్టూడెంట్స్‌తో కబుర్లు చెప్పేవారు. ఛాయాదేవి గారు చనిపోయినరోజు నేను కాలేజ్ తరపున ఒక మీటింగ్‌కి వెళ్ళాను. మర్నాడు ఉదయం డా.కనకదుర్గ గారు ఫోన్ చేసి విషయం చెప్పారు. అప్పుడు దినపత్రిక చూసి షాక్ అయ్యాను. వాట్సాప్ చూస్తే ఛాయాదేవి గారి దేహాన్ని ఈఎస్‌ఐ ఆస్పత్రికి అప్పగించారని తెలిసింది. సంస్మరణ సభ ఎప్పుడు చేస్తున్నది దయచేసి చెప్పగలరు అంటూ సజయగారికి మెసేజ్ చేశాను. ఆ రోజు శనివారం. కాలేజి స్టూడెంట్స్ ఎక్కువగా లేరు. కాలేజీలో రెండు గంటలు అనుమతి తీసుకుని ఈఎస్‌ఐ ఆస్పత్రికి వెళ్ళాను. శనివారం మధ్యాహ్నం వరకే ఈఎస్‌ఐ మెడికల్ కాలేజి పనిచేస్తుందని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. నేను వచ్చిన పని చెప్పి డీన్‌ని ఎప్పుడు కలవొచ్చని అడిగాను. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు డీన్‌ని కలవండి అని చెప్పారు. సోమవారం వెళ్ళాలా వద్దా అన్న ఆలోచనలో, వెళితే చూపిస్తారా? మళ్ళీ రమ్మంటారేమో. శనివారం పర్మిషన్ అడిగి ఇప్పుడు లేట్‌గా వెళితే లక్డికపూల్‌లో బస్ దిగలేదు. కానీ మొండిగా అనుకున్న చూపిస్తే చూపిస్తారు. లేదంటే మళ్ళీ రమ్మంటారు. చూపించలేము అంటారు. కాని నా ప్రయత్నం నేను చేయాలని ఉదయం 9.30కి ఈఎస్‌ఐ హాస్పిటల్‌కి వెళ్ళాను. కాలేజి ఎంట్రన్స్‌లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో డీన్‌ని కలవాలని చెప్పగా కారణం చెప్పమన్నారు. నేను సోషల్ వర్కర్ ఛాయాదేవిగారి పార్ధివ దేహాన్ని చూడడానికి వచ్చానని, అనుమతి కావాలని అన్నాను. దానికి అతను మీవాళ్ళు చాలా ఫోటోలు తీసుకున్నారు, మీరు వారిని ఫోటోలు పంపమనండి అన్నాడు. బాబూ, నేను డీన్‌ని కలవాలి, మీరు చెప్తారా? ఇంకెవరినైనా అడగాలా? అన్నాను. ఇంకో సెక్యూరిటీ అతను కుడివైపున ఉన్న గాజు బంగళా చూపించి అందులో ఉన్నారు కలవండి అన్నారు. అక్కడ డీన్‌గారి పిఏ ఉన్నారు. సర్, నేను డీన్‌ని కలవాలి అన్నాను. నేను వచ్చిన పని చెప్పాను. డీన్‌ని కలిసి వచ్చి, నన్ను ఒక అటెండర్‌తో అనాటమీ లాబ్‌కి పంపించారు. నన్ను ఒక క్యాబిన్‌లో కూర్చోబెట్టి అతను ఇప్పుడే వస్తానని వెళ్ళి కొంతసేపటికి మరొక వ్యక్తితో వచ్చి చూపించాడు. అతను మేడమ్, బాడీ ట్యాంక్‌లో ఉంది తీయాలి, టైమ్‌పడుతుంది అన్నాడు. సరే అన్నాను. కానీ కొద్ది నిమిషాలలో వచ్చి నన్ను ల్యాబ్‌కి తీసుకువెళ్ళారు. అనాటమీ ల్యాబ్‌కి వెళ్తూనే హాల్‌లో స్ట్రెచర్స్ ఉన్నాయి, కుడివైపు చిన్న పార్టిషన్ ఉంది. అందులో టాంక్స్ ఉన్నాయి. మొదటి ట్యాంక్ మూత తెరిచి ఉంది. అందులో ఛాయాదేవి గారి దేహంపై ఒక పెద్ద పలకలాంటి రాయి ఉంచారు. నిర్మలంగా పడుకొని ఉన్నట్లు ఉంది. నాతో వచ్చిన వ్యక్తి ల్యాబ్ అటెండర్ పేరు రమేష్ అని చెప్పినట్లు గుర్తు. మేడమ్, బాడీని శనివారం సేవ్ చేసి ట్యాంక్‌లో
ఉంచాము పాడవకుండా ఉండడానికి అని చెప్పారు. కాళోజీ గారి తర్వాత ఛాయాదేవి గారు ఇలా వారి శరీరాన్ని కూడా సమాజ శ్రేయస్సు కోసం మెడికల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌కు ఉపయోగకరంగా ఇచ్చినందుకు ఆమెపై చాలా గౌరవం పెరిగింది. అప్పుడు వ్రాయాలి అనుకున్నాను. కానీ రొటీన్‌లో పడిపోయాను. జులై 11 ఛాయాదేవిగారి సంస్మరణ సభ. భారీవర్షం. కాలేజిలో పర్మిషన్ దొరకలేదు. ముగింపు సమయానికి వచ్చాను. 4, 5 వక్తలు ఛాయాదేవిగారి జ్ఞాపకలను నెమరు వేస్తున్నారు. సత్యవతిగారు ఇంకా ఎవరైనా మాట్లాడతారా అన్నప్పుడు నేను లేచి నిల్చున్నాను. తడి బట్టలని సంశయిస్తున్నాను. సుజయ గారు, నిర్మల అక్క ముందు వరుసలో తలుపు పక్కన ఛాయాదేవిగారు వ్రాసిన పుస్తకాలు అమ్ముతున్నారు. సుజయగారు నన్ను చూసి ముందుకు రా అన్నారు. సమయాభావం వల్ల రెండు నిమిషాలు మాట్లాడాను. ఆ రోజు నేను షేర్ చేసుకోని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను.
అదే రోజు ఉదయం ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజికి ఒక పనిమీద వెళ్ళాను. తెలంగాణ ఉద్యమం సమయం నుండి ఆర్ట్స్ కాలేజి వైపు బస్సులు చాలా తక్కువ నడుస్తున్నాయి. బస్సులన్నీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్నాయి. అర్జంట్ కాబట్టి ఆటోలో వెళ్ళాను. డిపార్టుమెంట్‌లో పని చూసుకుని ఆటోలో వెళ్ళడానికి ఆర్ట్స్ కాలేజి బస్టాండులో నిల్చున్నాను. నాతోపాటు ఇద్దరు వ్యక్తులు
ఉన్నారు. బస్సు రావడంలేదు. అక్కడ ఉన్నవారిని బస్సు గురించి అడిగాను. మీకు అర్జంట్ అయితే ఆటోలో వెళ్ళండి అన్నారు. నేను రోడ్డుకు అవతలివైపు (ఆర్ట్స్ కాలేజి వైపు) కొంతమంది విద్యార్థులు చెట్లకింద బైక్‌లపై కూర్చొని మాట్లాడుతూ కనిపించారు. అక్కడ రాడ్స్ ఫిక్స్ చేసి ఉన్నాయి. సహజంగా విద్యార్థి సంఘాల బ్యానర్లు అక్కడ కడతారు. నేను వారి వద్దకు వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుని బాబూ మీరు ఓయూ విద్యార్థులా అని అడిగాను. అవునన్నారు. మీకు ఓయూలో ఏమైనా సమస్యలున్నాయా అని అడిగాను. వారు నా నుండి ఇలాంటి ప్రశ్నను ఊహించలేదు. ఏదో అడ్రస్ అడుగుతానని అనుకున్నారు. వారు తేరుకుని మెస్, హాస్టల్‌కి సంబంధించిన సమస్యలు చెప్పారు. మరి మీరు వీటిని ఎలా పరిష్కరిస్తారని అడిగాను. ఓకే, ఫర్వాలేదు, అంత సీరియస్ కాదు, మేనేజ్ చేస్తాం అన్నారు. నాకు చాలా బాధనిపించింది. ఏమీచేయలేక బాబు తెలంగాణ ఉద్యమం నుండి బస్సులు మానికేశ్వర్ నగర్‌నుండి వెళ్తున్నాయి కదా ఇటువైపు కొన్ని మాత్రమే వస్తున్నాయి కదా ఇది మీ విద్యార్థులకు సమస్యగా లేదా అని అడిగినప్పుడు వారు తాము తమ వాహనాలపై వెళ్తామని చెప్పారు. మరి ఇతరులు (వికలాంగులు, అమ్మాయిలు, వృద్ధులు మొదలైన) ఎలా వెళ్తారు? (స్థానిక విద్యార్థులు, వివిధ హాస్టళ్ళలో ఉంటున్న విద్యార్థులు, కోచింగ్‌లకు వెళ్ళడానికి, పుస్తకాలు మరియు ఇతర వస్తువులు కొనుక్కోవడానికి) ఎవరి తిప్పలు వారు పడతారు మేడమ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా కష్టపడి ఇక్కడివరకు వచ్చినవారిలో ఎంతమంది ఆటోలో తిరగగలరు? ఉద్యోగస్థురాలినై ఉండి కూడా నేను ఆలోచిస్తున్నాను. మరి విద్యార్థుల పరిస్థితి ఏమిటి? అంటే మేడమ్, ఎవరూ సహకరించరు టైం వేస్ట్ అన్నాడు ఒక అబ్బాయి. ఒక పేపర్‌పై విషయం వ్రాసి సంతకాలు తీసుకుని డిపోలో ఇచ్చి ఫాలో అప్ చేస్తే చాలు దీనికి ఎక్కువ టైమ్ పట్టదేమో అనిపిస్తుంది. అంటే మేడమ్ ఇప్పుడు ఎవడి బతుకు వాడు బతకడానికి టైం లేదు ఇవన్నీ చేయడానికి అన్న విద్యార్థులను చూసి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కాక, ఒక్కసారి తేలే సమస్య కాదు అని అక్కడినుంచి కాలేజీకి బయలుదేరాను. నా మదిలో ఆలోచన… వ్యక్తి ప్రాధాన్యత, సమష్టితత్వం లోపించడం, నిరాసక్తత.. వీటికి కారణాలేంటి?
ఛాయాదేవిగారి సంస్మరణ సభలో చెప్పాలనుకున్న అంశం ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. యువతలో విశ్వాసం, ఆసక్తి కలిగించడం, మనం అనే భావన కలిగించడం నేటి మన కర్తవ్యం అని నేను భావిస్తున్నాను. ఇది ఛాయాదేవిగారి లాంటి వారికి సమర్పించే నివాళి అనిపిస్తుంది. ఇది సులభమైన పని కాదు, కానీ సమిష్టిగా చేస్తే కొంతవరకయినా సాధ్యమని నేను భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక సఱరషబరరఱశీఅ స్త్రతీశీబజూ తయారుచేయాలని సజయగారితో అన్నాను. అలాగే భూమిక కమ్యూనిటీలో వర్క్ స్టార్ట్ చేశారు. ఇవి పాజిటివ్ ఫ్యాక్టర్స్ అనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమాలలో నేను నా సహాయ సహకారాలు అందిస్తాను.