ఈ తరానికి దిక్సూచి లాంటి వారు అబ్బూరి ఛాయాదేవి గారు. ఒక వెలుగు రేఖ, ఒక వెన్నెల మడుగు, ఒక కాంతి కిరణం, ఒక జ్ఞాన జ్యోతి, ఒక మానవతా మూర్తి, ఒక స్నేహ చెలిమి.
ఛాయాదేవి గారు భౌతికంగా మన మధ్య లేరు కానీ, మనందరి హృదయాల్లోను ఉన్నారు. ఆమె ఏమిటి అనేది ఆమె చివరగా చేసిన అమూల్య సహాయమే చెప్తోంది. కళ్ళను డొనేట్ చేయడమే కాక, శరీరాన్ని మెడికల్ విద్యార్థులకు ఇవ్వడం అనేది ఆమె హృదయౌన్నత్యానికి నిదర్శనం.
ఎంతో అటాచ్‌మెంట్ ఉన్నట్లు కనిపించినా చాలా డిటాచ్డ్‌గా ఉండడానికి ప్రాక్టీస్ చేశారావిడ.
నాకు అత్యంత ఆత్మీయురాలు. నాకే కాదు, పరిచయమున్న ప్రతి ఒక్కరూ ఆమె స్నేహ సౌరభాన్ని అనుభవించిన వాళ్ళే. ఆమె నవ్వరు. సీరియస్‌గా ఉన్నట్లుగా ఉంటూనే హాస్యాన్ని పండించడం ఆమెకే చేతనవును.
ఛాయాదేవి గారికి మనమందరం ఛాయలుగానే మిగిలిపోయామనిపిస్తోంది.
ఆమె శైలి ప్రత్యేకమైనది, అద్భుతమైనది. చాలా సాదాసీదాగా చిన్న చిన్న మాటలతో, నెమ్మది స్వరంతో, నచ్చచెప్పే దోరణితో మెత్తటి ప్రవాహంలా అక్షరాలు నడిచి వెళ్ళిపోతుంటాయి. రచనలో కన్విన్సింగ్ ధోరణి ఎక్కవగా కనిపించినట్లు అనిపించినా ఆమె నిర్భయ ప్రకటనలు చాలా దృఢంగా ఉంటాయి. లోతైన రాజకీయ అవగాహన ఉంటుంది. కుటుంబ సమస్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పరిష్కరించుకోవాలో మార్గ నిర్దేశనం చేస్తారు. భాష సరళంగా ఉండడం వల్ల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చదివించే గుణాన్ని కలిగి
ఉంటాయామె రచనలు.
నిన్న పాలకుర్తిలో గురుకుల పాఠశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళల్లో ఎవేర్‌నెస్ కోసం జరుగుతున్న ఆ సెమినార్‌లో అబ్బూరి ఛాయాదేవి గారు తెలుసా అంటే కొంచెం ఆలోచిస్తూ కనబడిన వాళ్ళు నేను బోన్సాయ్ బతుకులు అంటుండగానే మాకు తెలుసు, మాకు తెలుసు అంటూ చాలామంది మా పాఠమది అని గట్టిగా అరిచారు. నాకెంత సంతోషమనిపించిందో అప్పుడు. ఛాయాదేవి గారి కథ అంత బలమైన ముద్ర వేయగలదు మరి.
‘తన మార్గం’ అనే కథల సంపుటికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినపుడు ఆమె ఎంతో సింపుల్‌గా చాలామంది మంచి కథకులున్నారు, నాకెందుకిచ్చారు అని నెమ్మదిగా అంటుంటే ఇప్పుడవార్డుల కోసం ఎన్నెన్నో నిచ్చెన మెట్లు వేసుకున్నవారంతా గుర్తుకొచ్చారు.
చాలా నిరాడంబర జీవి ఆమె. ఆమె నుంచి నాలాంటివారమెందరమో చాలా నేర్చుకున్నాము. పిల్లల్లో పిల్లల్లా కలిసిపోయేవారు. పెద్దల్లో పెద్దగా వ్యవహరించేవారు. ఏ అరమరికలు లేని ఆమె తీరు, స్నేహశీలత నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. బాగ్‌లింగంపల్లిలో భూమిక ఆఫీసుకు దగ్గర్లో ఉన్నప్పుడు ఎక్కువగా కలిసేవారు. సి.ఆర్.ఫౌండేషన్‌కి వెళ్ళిన తర్వాత దూరం అవడంతో కలిసే సంఖ్య తగ్గిపోయింది.
కొన్నాళ్ళపాటు ‘కవిత’ పత్రికకు సంపాదకత్వం వహించారు. ‘అలాగే’ అనే కవితను కూడా రాశారందులో. చాలా చిన్న చిన్న మాటలతో స్త్రీల జీవితాన్ని గురించి బాగా రాశారు. ఆరేడు కవితల కంటే ఎక్కువ రాయలేదు. ఒకవేళ దృష్టి పెట్టి ఉంటే చాలా కవితలు రాసుండేవారు.
‘కవయిత్రుల కవిత్వంలో స్త్రీ మనోభావాలు’ పేరిట నేను చేసిన ఎం.ఫిల్ పరిశోధనలో ఛాయాదేవి గారు ‘ఛాయ’ అనే ఒక కవితను ఉదహరించాను.
”ఆ శాసనాలు
ఆ ఛాదనాలు
అధికారం పెరిగి
అన్యాయం మీరి
అవనిలో శాంతి
అంతరించింది’
అనే వాస్తవాన్ని చెప్పి ఆ వాస్తవానికి కారణాలుగా శాసనాలను, అధికారాన్ని, అన్యాయాలను పేర్కొన్నారు.
ఒక రోజెప్పుడో కవిత నుంచి డైరెక్టుగా ఛాయాదేవి గారి దగ్గరికి వెళ్ళాను. ఆ రోజెందుకో ఉదయం పనుల ఒత్తిడిలో తినడమూ, బాక్స్ పెట్టుకోవడమూ మర్చిపోయాను. ఆరోజు ఆమె అన్ని రకాల పిండిలను గబగబా కలిపి దోసె వేసిచ్చారు. ఎంత రుచిగా ఉందో. ఆకలి విలువ తెలిసిందప్పుడు. ఆమె ఆప్యాయతకు కన్నీళ్ళు వచ్చాయి. ఏవీ ఆ బంగారు చేతులు?
వారి ఇంటికి విలక్షణమైన కాలింగ్ బెల్ ఉండేది. రొటీన్ కాలింగ్ బెల్‌లకు భిన్నంగా తయారుచేశారది. ఒక గాజుకు తాడుకట్టి ఉండేది. లాగితో లోపల దానికి కట్టి ఉన్న గంట మోగేది. వెంటనే ఛాయాదేవి గారి పెంపుడు పిల్లులు వచ్చి తొంగి చూస్తుండేవి. ఇటువైపు పూల మొక్కల్లోంచి మరో పిల్లి ఎగురుతూ వచ్చేది. చిరునవ్వుతో తలుపు తీసేవారప్పుడు.
ఆమె నిరాడంబరత ఇంటిని అమర్చుకున్న తీరు, అమె తయారుచేసిన బొమ్మలు, కుర్చీలు అమర్చిన తీరు, ఎటు చూసినా కళాత్మకతే కనిపించేది. ముఖ్యంగా ఆమె తయారుచేసిన చాట భారతం అద్భుతం. భారతంలోని ప్రధాన ఘట్టాలను వరుసగా బొమ్మల రూపంలో స్వయంగా తయారుచేశారు. వచ్చినవాళ్ళకు ఏదో ఒక బహుమతినిచ్చేవారు. నా దగ్గర ఒక గాజుప్లేట్ మీద స్త్రీ పురుషుల పెయింటింగ్ వేసింది. ఇప్పటికీ అపురూపంగా దాచుకున్నాను.
ఛాయాదేవి గారి ప్రతి కథా ఆలోచనాత్మకంగానూ, సందేశాత్మకంగానూ ఉంటాయి. రాబోయే తరాలను సైతం ప్రభావితం చేస్తాయి.
భూమిక తరఫున చాలా రైటర్స్ టూర్లు చేశాము. దానివల్ల రచయిత్రులలో సాన్నిహిత్యం, స్నేహం ఎక్కువగా పెరిగాయి. ఒక విధంగా చెప్పాలంటే, కొండవీటి సత్యవతి లాంటి నిరంతర స్నేహ సముద్రం అందర్నీ ఒక దగ్గరికి చేర్చిందని చెప్పొచ్చు. ఒకసారి వాకపల్లి సంఘటన తరువాత అక్కడికి వెళ్ళాము అందరం. చలించిపోయాం. ఆ రోజు చాయాదేవి గారిని మరింత దగ్గరగా చూసే అవకాశం కలిగింది. ఆమె చూపిన ధైర్యం, కొండల్లో గుట్టల్లో సైతం ఆమే స్వయంగా నడిచి రావటం, ఎవరినీ చేయి సైతం పట్టుకోనివ్వకపోవడం, ‘నేను నడవగలను’ అని చేసిన ప్రకటన గొప్పగా ఉన్నాది. అలిసిపోతుంటే ఆగారే కానీ, ఆధారపడలేదు. నాకు అప్పుడు ఆమె వ్యక్తిత్వం బాగా నచ్చింది. నేను చాలాసార్లు పరాన్నజీవిలాగే ప్రవర్తిస్తుంటాను. నేను మారాలి, ఇక తప్పదు అనుకున్నాను.
ఛాయాదేవి గారు బలమైన శక్తి. నేను ఫెమినిస్టును అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అని ప్రకటించుకున్నారు ఆ రోజుల్లో. ఒక చోట అంటారామె ‘స్త్రీలు ప్రేమ అనుకుని అన్ని సపర్యలు చేస్తూ పోతారు. కానీ అది ప్రేమ కాదని, బానిసత్వం అని తెలిసేసరికి జీవితం తెల్లారిపోతుంది’ అని.
‘లూయిస్ గాబ్రియెల్’ అనే ఫ్రెంచి ఫిలాసఫర్ అన్నట్లుగా ‘ఒక మనిషి వ్యక్తీకరణ పదం అయితే, సాహిత్యం ఒక సమాజ వ్యక్తీకరణ’ అనే ఈ మాటలు ఛాయాదేవి గారికి సరిగ్గా వర్తిస్తాయి.
ఈనాడు ఆమె మనమధ్య లేకున్నా తన అక్షరాల బాట వెంట విత్తనాల అక్షరాలను జల్లుకుంటూ వెళ్ళిపోయారు. శరీరానికి సెలవు ప్రకటించినప్పటికీ ఆమె అభిమానులందరి మనసుల్లోనూ ఎప్పటికీ సదా చిరునవ్వుతో వెలుగుతూ ఉంటారు. భవిష్యత్ మార్గదర్శి ఆమె.
ఛాయాదేవి గారి దగ్గర నేర్చుకోవలసిన మరో లక్షణం క్రమశిక్షణ. టైం టూ టైం చేసేవారు. స్వయంగా అన్ని పనులనూ చేసుకునేవారు.
ఆరోగ్యం ఎలా ఉంటోంది అని అడిగినప్పుడు శరీరం కదా, దాని పని శిధిలమవ్వడమే కదా దాని పని అది చేసుకుపోతుంది, మనకు విల్‌పవర్ ఉండాలి అనేవారు. గుర్తుపెట్టుకునే మంచి తనం ఆమె సొంతం అన్నారు పి.సత్యవతి. సంయమనానికి, క్రమశిక్షణకు మరోపేరు ఆమె. గుర్తుండే కథలు రాయడమే కాదు గుర్తుపెట్టుకునే లక్షణంతో హుందాగా మనసులో నిలిచారన్నారు.
సమస్యలను భూతద్దంలో కాక స్వచ్ఛమైన కళ్ళతో చూడాలని, సమస్యల పరిష్కారానికి ఆవేశం కంటే ఆలోచన ముఖ్యమైనదని, ఆమె ‘తన మార్గం’ కథలు చెప్తాయని మృణాళిని అన్నారు. స్త్రీలు సంయమనంతో శాంతి సాధన వైపు నడవాలని సూచించారు. ఆ శాంతి సాధనలో ఘర్షణ తప్పినప్పుడు ఎలా సంయమనంతో ఎదుర్కోవాలో తన సాహిత్యం ద్వారా నేర్పారు.
కార్పొరేట్ వైద్యం, దారుణాలు, దోపిడీలను ‘ఆఖరికి ఐదు నక్షత్రాలు’ కథలో ఆమె చర్చించారు. ప్రతి కథ ఒక్కో ప్రత్యేకతను సంతరించుకున్నదే. చుట్టూ ఉన్న ఆడవారే తన కథలకు మూలం అన్నారొక ఇంటర్వ్యూలో.
”నేలమీద స్వేచ్ఛగా పెరిగే మర్రిచెట్టుని కుండీలలో మరుగుజ్జు చెట్లుగా చేస్తున్నారు, ఇదే తరహాలో స్త్రీని ఆమె ఎంత సాధించినా మరుగుజ్జుగానే ఉంచడానికి ఇంకా చూస్తున్నారు. ఇది సామాజికంగా కనిపించే సత్యం. స్త్రీలోని సర్వశక్తులూ వికసించే వాతావరణం పెంపకం నుంచే ఉండాలి. అబ్బాయిలతో సమంగా అమ్మాయిలను పెంచాలి. సమాన అవకాశాలు కల్పించాలి. స్త్రీ సొంతంగా ఆలోచించగలగాలి. వినిపించగలగాలి. ఇవే నేను అర్థం చేసుకున్న స్త్రీ వాదం” అన్నారు ఛాయాదేవి గారు.
మధ్యతరగతి మహిళల అంతరంగాన్ని అక్షరాలుగా మలిచారు. పురుషాధిక్య ఆధిపత్యాన్ని నిలదీశారు. మనమెన్నటికీ మర్చిపోలేని గొప్ప వ్యక్తిగా నిలిచారు.
ఛాయాదేవిగారు తన తదనానంతర బాధ్యతలను కూతురిగా భావించే కొండవీటి సత్యవతికిస్తే అంతే ప్రేమతో ఆ బాధ్యతను నెరవేర్చింది ఆమె.
భూమికలో వచ్చిన వర్తమాన లేఖల్ని చదివి ప్రతినెలా మొదటి ఫోన్ ఛాయాదేవిగారిదే వచ్చేది. లోటుపాట్లను చెప్పేవారు. పుస్తకంగా తేవాలని పదేపదే అనేవారు. ఆమె ప్రేమమయ మాటల్ని ఇకపై వినలేమన్న నిజాన్ని అంగీకరించలేకపోతున్నా. చేదు నిజమిది.