పారిశ్రామికీకరణ – కార్మిక స్థితిగతులు -కవిని ఆలూరి

 

భారత ఆర్థికాభివృద్ధికి ఎదురవుతున్న సమస్యలకు గల కారణాలను పరిశీలించి, ”సరళీకరణ మీదనే ఎక్కువ కేంద్రీకరించి మిగతా రంగాలన్నింటినీ పట్టించుకోకపోవడం వల్ల అంటే అసమాన కేంద్రీకరణ వలన భారీగా నష్టపోతున్నాము” అని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు. అంటే మన దేశ ఆర్థికాభివృద్ధిలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, కుటీర పరిశ్రమలు లాంటి రంగాల పట్ల వివక్షే కాకుండా ఆయా రంగాలలో సామాన్య ప్రజలకు తగిన అవకాశాలు లేవనేది సుస్పష్టం. మన సమాజం అసమానతల నిలయమనీ, వర్గ పునాదుల మీద ఉన్నదనీ మనకు విదితమే. ఇటువంటి పరిస్థితులలో దేశం మొత్తం అన్ని రంగాలలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందటం సాధ్యమా? అసలు అభివృద్ధికి నిర్వచనం ఏమిటి? ఎలాంటి ఆర్థికాభివృద్ధిని మనం కాంక్షిస్తున్నాం. ఇలాంటి అనేక ప్రశ్నలు మన ముందుకు వస్తాయి. అయితే మేడే సందర్భంగా ప్రైవేటీకరణ-నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తరువాత పారిశ్రామిక రంగంలో కార్మికుల స్థితిగతులపై ఒక సమాలోచన.

భారత దేశ కార్మిక వర్గ చరిత్రను గమనిస్తే ఇతర అభివృద్ధి చెందిన దేశాలలోలాగా మన దేశంలో కార్మిక వర్గానికి పునాదులు ఏర్పడలేదనేది సుస్పష్టం. పాశ్చాత్య దేశాలలో భూస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తూ పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది. వృత్తులు పోయి ఫ్యాక్టరీలు వచ్చాయి. వృత్తులు కోల్పోయిన వారు సంబంధిత ఫ్యాక్టరీలలో కార్మికులుగా మారారు. కానీ ఈ విదంగా భారతదేశంలో కార్మిక వర్గ పునాదులు ఏర్పడలేదు. భారతదేశం వలస దేశం. 1757 నుండి 1812 దాకా ఈస్టిండియా కంపెనీ ద్వారా బ్రిటన్‌ పట్టు వస్త్రాలను భారతదేశం నుండి ఎగుమతి చేస్తూ ఉండేది. అలాగే నూలు బట్టలను కూడా ఎగుమతి చేస్తూ ఉండేది. ఎగుమతుల మీద విపరీతమైన పన్నులు విధించేవాళ్ళు. అధిక మొత్తంలో పన్నులు విధించి ముడి సరుకులను బ్రిటన్‌కు దిగుమతి చేసుకోవడం వలన వృత్తులు దెబ్బతిన్నాయి. వాణిజ్యం కోసం రైల్వేలను ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు బ్రిటిష్‌ వాళ్ళు. రైల్వేల కోసం బొగ్గు గనులు తవ్వవలసి వచ్చింది. బ్రిటన్‌కు ఎగుమతి అయ్యే సరుకులకు బదులుగా భారతదేశం నుండి జనపనార, తేయాకు లాంటి ముడి సరుకులను దిగుమతి చేసుకున్నారు. మొదటగా కార్మిక వర్గ పుట్టుక భారతదేశంలో గనులలో, తేయాకు తోటలలో, జనపనార మిల్లులలో ఏర్పడిందని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. వలస పెట్టుబడిదారీ వ్యవస్థ ఏర్పడింది. కార్మికులలో గ్రామీణ భూస్వామ్య వ్యవస్థ తాలూకు మూలాలు, రైతాంగ స్ప్పహ ఉన్నదే తప్ప కార్మిక వర్గ లక్షణాలు తక్కువ ఉన్నాయి. వీరు భూమినే నమ్ముకున్నారు. కొంతకాలం ఏదన్నా ఫ్యాక్టరీలో పనిచేసి తర్వాత గ్రామాలకు తిరిగి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళే ఎక్కువ. భూస్వామ్య వ్యవస్థ తాలూకు దాస్య భావనలు ఎక్కువ. కానీ యజమానిలో పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు లక్షణాలు ఉన్నాయి. దీనివలన పెట్టుబడిదారుడికి లాభం, కార్మికులకు నఫ్టం జరుగుతుంది. వలస పారిశ్రామికీకరణ వలన భారత దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మన పారిశ్రామిక రంగంలో ఇప్పటికీ వలస విధానమే నడుస్తోంది. భారతదేశంలోని కర్మాగారాలలో బల్క్‌ డ్రగ్స్‌ తయారీ ఎక్కువ. బల్క్‌ డ్రగ్స్‌ అంటే ఏదైనా ఒక ముడి పదార్ధాన్ని ఔషధ రూపంలో వాడుకలోకి తీసుకుని రావటం. ముడి పదార్ధాల నుండి రసాయనాలను తీసే క్రమంలో చెప్పలేనంత వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. మిశ్రమ ఔషధ ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌లలోనూ వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. పారిశ్రామిక ప్రాంతాలలో ఉండే నాలాలలో రసాయనాలను కలపటంవల్ల రాత్రి పూట వ్యర్థ రసాయనాలను విడుదల చేయడంతో అక్కడి భూమి, నీరు, గాలి సమస్తం కలుషితమవుతున్నాయి. అక్కడి ప్రజలు అనేక రకాల అంటు వ్యాధులకు గురవుతున్నారు. హైదరాబాద్‌లోని సుబాష్‌ నగర్‌, బాలాజీనగర్‌, నాచారం, ఉప్పల్‌, జీడిమెట్ల, మల్లాపూర్‌… ఒకటేమిటి చాలా పారిశ్రామిక ప్రాంతాలలో విషవాయువు, జలాల మూలకంగా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారు.

మనదేశంలో చట్టాలను రూపొందించటం వాటిని సంపూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం… ఈ రెండింటికీ మధ్య ఎంతో వైరుధ్యం ఉంది. కార్మిక సంఘాలకు ప్రత్యేక హక్కులూ, రక్షణ, సదుపాయాలూ కల్పించే 1926లో తెచ్చిన కార్మిక చట్టం నుండి మొదలకుంటే 1928లో వచ్చిన కార్మికుల నష్ట పరిహార చట్టం, 1935లో వేతన చెల్లింపుల చట్టం, 1948లో ఏర్పడిన కనీస వేతనాల చట్టం జీవనభృతి, మినహాయింపుల నగదు విలువను కలిపి కనీస వేతనంగా పేర్కొంది. 1970లో కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా అసలు కార్మికులతో సమానంగా సౌకర్యాలను కల్పించాలని పేర్కొన్న కాంట్రాక్ట్‌ కార్మికుల చట్టం-1976లో సమాన వేతనాల చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం 1979, అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం 2008, అసంఘటిత కార్మికుల భద్రతా చట్టం… ఇలా చెప్పుకుంటూ పోతే చట్టాలకు కొదవ లేదు. ఆచరణే శూన్యం. ఇక ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ కార్మికులకు అనేక హక్కులను, యజమానులకు అనేక బాధ్యతలను నిర్దేశించింది. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 19(1)(సి) కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవటం, ఇదివరకే కాపాడిన కార్మిక సంఘాలను కొనసాగించటం పౌరుల ప్రాథమిక గుర్తుగా గుర్తించింది.

భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటి నుంచీ అంటే 1990 నుంచీ అసంఘటిత కార్మిక వర్గం పెరిగిపోయిందన్నది కాదనలేని సత్యం. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పారిశ్రామిక ప్రాంతాలలో కొన్ని వేల సంఖ్యలో ఫ్యాక్టరీలు, చిన్న తరహా, అతి చిన్న కంపెనీలు ఉన్నాయి. బల్క్‌ డ్రగ్‌ తయారుచేసే రసాయన కంపెనీల నుండి అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ చేసే అతి చిన్న కంపెనీల దాకా ఉన్నాయి. లక్షల సంఖ్యలో అసంఘటిత కార్మికులు ఉన్నారు. కాంట్రాక్టు కార్మికులు పెరిగిపోయారు. దళారీ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంది. కాంట్రాక్టు కార్మికులను స్కిల్డ్‌ వర్కర్స్‌గా కాకుండా అన్‌ స్కిల్డ్‌ వర్కర్స్‌గా గుర్తించడం జరుగుతోంది. కొన్ని కంపెనీలలో అయితే ఎం.డి, పర్సనల్‌ ఎండి తప్ప మిగతా అందరూ స్కిల్డ్‌ వర్క్‌లోకి రాకుండా పోయారు. కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు. హైదరాబాద్‌లో ఉన్న ఫ్యాక్టరీలలో, కంపెనీలలో మొత్తం 20% మాత్రమే పర్మనెంట్‌ కార్మికులు ఉన్నారు. 80% కాంట్రాక్ట్‌ కార్మికులు

ఉన్నారు. ఈ.ఎస్‌.ఐ., డి.ఎ, బోనస్‌లు ఏమీ ఉండవు. ప్రభుత్వం ఇచ్చే ఎటువంటి పథకాలు, రాయితీలు వీరికి వర్తించవు.

దాదాపుగా అన్ని కర్మాగారాలలో 12 గంటల కంటే ఎక్కువ చాకిరీ ఉంటుంది. ఓ.టి.గా ఎక్కువ జీతం ఇస్తామని చెప్తుంటారు. ఎక్కువ శాతం రూ.6,000 జీతం ఉంటుంది. ఓ.టి.చేస్తే రూ.9,000 దాకా జీతం వస్తుంది. కార్మికులకు కనీస హక్కులు లేవు. కనీస వేతనాల చట్టం అమలులో లేదు. కంపెనీలు తామిచ్చే వాస్తవ వేతనాల గురించి చెప్పవు. హైదరాబాద్‌లోని చాలా కంపెనీలు కాంట్ట్రార్లకు గుత్తకు ఇస్తాయి. కాంట్రాక్టర్లు బీహార్‌, జార్ఖండ్‌, నేపాల్‌ల నుండి కార్మికులను తీసుకువచ్చి రూమ్‌లు ఇచ్చి అతి తక్కువ జీతానికి రోజుకు 12 గంటలు పని చేయిస్తారు. ఆ కార్మికులకు ఎటువంటి భద్రతా ఉండదు. జీడిమెట్ల ఇండస్ట్రియల్‌ ఏరియాలో 10 శాతం మాత్రమే స్థానికులు ఉన్నారు. మిగతా 90 శాతం వివిధ జిల్లాల నుండీ, రాష్ట్రాల నుండీ వచ్చి స్థిరపడిన వారే. స్థానికులు కాకపోవటాన వీళ్ళు ఇంకా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది.

వేలాదిమంది స్థానిక కార్మికులకు కంపెనీలలో పని దొరకదు. కంపెనీలో పని కావాలంటే కాంట్రాక్టర్‌ చెప్పినట్టు దినసరి కూలీ రూ.600 ల్లో రూ.200 కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిందే. ఇవికాక పి.ఎఫ్‌.అనో, మరొకటనో కార్మికుల నుండి కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు. హైదరాబాద్‌లోని పారిశ్రామిక ప్రాంతాలలో దళారీ కాంట్రాక్ట్‌ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే దళారీ మాఫియా నడుస్తోంది. కాంట్రాక్ట్‌ వ్యవస్థనే రద్దు చేయాలని ప్రతి ఒక్క కార్మికుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాడు.

జీడిమెట్ల సుభాష్‌నగర్‌లో ఉండే ముస్తఫా అనే కార్మికుడు, ”కెమికల్‌ డ్రమ్ములను గత 15 సంవత్సరాలుగా కటింగ్‌ చేస్తున్నాము. కాంట్రాక్టర్‌ పిలిస్తే గోడౌన్‌ల దగ్గరికి వెళ్తాము. రోజుకు 20 డ్రమ్ముల దాకా కటింగ్‌ చేస్తాము. ఒక్కొక్క డ్రమ్‌కు రూ.10 ఇస్తారు. బస్తీలో చాలామంది ఇదే పని చేస్తుంటారు. కెమికల్‌ డ్రమ్ములు కంపెనీ నుండి గోడౌన్‌కు వస్తుంటాయి” అని చెప్పాడు. కెమికల్‌ కంపెనీల వలన వస్తున్న ఇబ్బందుల గురించి స్థానికులు ఇలా అంటున్నారు. ”నిద్ర పోయాక రాత్రి రెండు, మూడు గంటలకు కెమికల్‌ గ్యాస్‌ వదులుతుంటారు. కిటికీలు కూడా వేసుకుని ఉండవలసిన పరిస్థితి. బయటకు వచ్చి ఇంటి ముందు నిలబడలేము. ఉతికిన బట్టలు వేసుకుంటే దురదలు, మంటలు వస్తాయి. చర్మ సంబంధ వ్యాధులు, ఎలర్జీలు వస్తున్నాయి. దుమ్ము, ధూళి ఎంత ఉంటుందో చెప్పలేము. పిల్లల మీద ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటోంది. మా వయసులకంటే 15, 20 ఏళ్ళు పెద్దవాళ్ళుగా కనబడుతున్నాము. నాలా దగ్గరైతే నిలబడలేనంతటి దుర్వాసన. ఉదయం 6 గంటలకు విపరీతంగా వస్తుంది. వర్షాకాలం ఇంకా కష్టం. గుంతల రోడ్లు. వర్షం వస్తే మొత్తం నీరంతా నిలిచిపోతుంది. వర్షం వచ్చేటపుడు నిల్వ ఉంచిన వేల లీటర్ల రసాయన జలాలను నివాస ప్రాంతాలలోకి వదిలేస్తుంటారు. వ్యర్థ పదార్థాలను తెచ్చి ఇక్కడ కంపెనీలలో శుభ్రం చేస్తుండడం వలన ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఎక్స్‌పైర్‌ అయినవీ, ఫెయిల్‌ అయినవీ ఇక్కడికే తెస్తుంటారు. ఇక్కడకు వచ్చేవాటిలో 30 శాతం ఇలాంటివే. ప్రశ్నించే వారిని గుర్తించి అవకాశం దొరికినప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు ఇబ్బందులకు గురిచేస్తుంటారు”.

జీడిమెట్ల చుట్టుపక్కల ప్రాంతాలతో సహా 2,000 పైగా కంపెనీలు ఉన్నాయి. 60, 70 వేల మంది కంటే ఎక్కువగానే హమాలీ పనులు చేసేవాళ్ళు ఉంటారు. మహిళలు ఎవరూ హమాలీలుగా లేరు. మహిళా కార్మికులు ఎక్కువ శాతం కంపెనీలలో ప్యాకింగ్‌, కీపింగ్‌, లేబుల్‌ అతికించడం లాంటి పనులు చేస్తుంటారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కలిపి 5 లక్షల దాకా హమాలీ కార్మికులుంటారని ఒక అంచనా. గతంలో హమాలీ కార్మికుల కోసం ఒక చట్టం ఉండేది. 1978లో హమాలీ కార్మికుల చట్టాన్ని రద్దు చేశారు. 2008లో వచ్చిన అసంఘటిత కార్మికుల చట్టంలో హమాలీలను చేరుస్తామని చెప్పారు కానీ చేర్చలేదు. హమాలీ దేవదానం మాట్లాడుతూ, ”పరిశ్రమలలో ఉత్పత్తయ్యే వాటిని లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేస్తుంటాము. ఉదయం 7 గంటల నుంచీ సాయంత్రం దాకా సిమెంట్‌, బొగ్గు, బూడిద, ప్లాస్టిక్‌, పేపర్‌ లాంటివి లోడింగ్‌-అన్‌లోడింగ్‌ చేస్తుంటాము. టన్నుకు ఇంత అని ఇస్తుంటారు. ఒక్కొక్కళ్ళం 100, 120, 180 కేజీలదాకా బరువులు మోస్తుంటాము. రోజుకు 300 నుండీ 500 రూపాయల దాకా వస్తాయి. 40 ఏళ్ళుదాకానే ఆరోగ్యంగా ఉంటాము. మోకాళ్ళు, నడుములు నొప్పులు వస్తాయి, మల మూత్రాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి” అన్నాడు. ఇ.ఎస్‌.ఐ., పి.ఎఫ్‌. సౌకర్యాలు కల్పించి హమాలీలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అంటున్నారు హమాలీ బీరప్ప.

తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల దాకా ఉంటారని ఒక అంచనా. తునికాకు తెంపటం మహిళలే చేస్తారు. బీడీ కార్మికురాలు పుష్ప ఇలా అంటోంది, ”తునికాకును సేఠ్‌లు తెచ్చి ఇస్తారు. తునికాకును రాత్రి నీళ్ళల్లో నానబెట్టి తెల్లవారి తడి ఆరబెడతాము. ఆకు నారను తీసి బీడీలు చుడతాము. రోజు మొత్తం చేసినా 500 బీడీలు మించి చేయలేము. 500 బీడీలు చేస్తే 50 రూపాయలు వస్తాయి. మెడలు, చేతులు గుంజుతాయి. ఆదాయం లేదు”. బీడీ కార్మికులు గతంలో అనేక పోరాటాలు చేశారు. కొత్త కొత్త జి.ఓ.లు వస్తున్నాయే తప్ప పరిస్థితులలో ఎటువంటి మార్పు రాలేదు.

నాచారంలో 256 కంపెనీలున్నాయి. 13,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అందులో 6,000 మంది మహిళా కార్మికులే. దాదాపుగా ఏ కంపెనీలోనూ మహిళలకంటూ ప్రత్యేక సదుపాయాలు లేవు. తక్కువ కూలీ, సీజనల్‌ పనులకు మాత్రమే ఎక్కువ శాతం మహిళా కార్మికులను తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌, నాచారం, మల్లాపూర్‌, కుషాయిగూడా, చర్లపల్లి, మేడిచర్ల, జీడిమెట్ల, బాలానగర్‌, విఎస్‌టి, సనత్‌నగర్‌, రాజేంద్ర నగర్‌, కార్వాన్‌, కాటేదాన్‌, చాంద్రనారాయణ గుట్ట, సరూర్‌ నగర్‌ ఇలా అన్ని ప్రాంతాలలో ఒకేరకమైన పరిస్థితులు ఉన్నాయి.

ఇక స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీస్‌కు వస్తే జిఎస్‌టి ప్రభావం పెద్ద కంపెనీల బదులు వీళ్ళమీద దారుణంగా పడింది. పెద్ద కంపెనీల నుండి సప్లై చేసుకునే చిన్న కంపెనీలకు జి.ఎస్‌.టి.తో సహా కట్టించుకుంటున్నారు పెద్ద కంపెనీల వాళ్ళు. దీనివల్ల మినీ స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీస్‌ మూసేసుకునే పరిస్థితి ఏర్పడిందని బాలానగర్‌లోని అనేకమంది అభిప్రాయపడ్డారు. మినీ స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీస్‌లో కార్మికునితో పాటు యజమాని కూడా సమానంగా కష్టపడుతూ ఉంటాడు. బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని వీళ్ళు నడుపుతుంటారు. సరైన ఆదరణ లేక అప్పుల పాలవుతున్న వాళ్ళే ఎక్కువ.

రాబోయే రోజులలో అతి చిన్న తరహా పరిశ్రమల పరిస్థితి ఏంటి? లక్షల సంఖ్యలో ఉన్న అసంఘటిత కార్మికుల పరిస్థితి ఏమిటి? పాలకులు వీళ్ళకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు. అనేవి ప్రశ్నార్థకమే? కార్మిక యూనియన్‌లు దాదాపుగా నిర్వీర్యమైపోయాయి. పేరుకు మాత్రమే అన్ని పార్టీల యూనియన్‌లు ఉన్నాయి. కార్మికులు యూనియన్‌ల ద్వారా సంఘటితమవటానికి అత్యంత అననుకూల పరిస్థితులు ఉన్నాయి. సి.సి. కెమెరాల నిఘాల మాటున వీళ్ళు పనిచేయవలసి ఉంటుంది.

అభివృద్ది చెందిన దేశాలలో ఉన్న పరిస్థితులకు, మనదేశ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది. మన దేశ పారిశ్రామిక రంగాన్ని ఆకళింపు చేసుకుంటూ, కార్మికులలో కార్మిక వర్గ చైతన్యాన్ని తెచ్చే విధంగా ప్రణాళికలను చేస్తూ, కార్మికుల న్యాయమైన హక్కుల కోసం మేధావులు, సామాజిక వేత్తలు, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ నినదించవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.