బాల్య వివాహమనే తంతులో ముదుసలికి ఇల్లాలై,
విధి వక్రించి ఊహ తెలియక మునుపే విధవయై,
మూఢాచారాల పేరిట ‘సతి’ కుప్రథకు ఆహుతియై,
అవమానాలపాలై నిస్సహాయతన జీవించిన…
అలనాటి మగువ
తల్లిదండ్రుల చాటు కూతురిగా ఒదిగియుండి,
భర్త చాటు భార్యగా భయాన అణిగి ఉండి,
పిల్లలను కనిపెంచే యంత్రంగా భావింపబడి,
వంటింటి కుందేలుగా జీవనం సాగించిన…
మొన్నటి ముదిత
తల్లిదండ్రులకు గారాల కూతురై ఉన్నత విద్యనభ్యసించి,
భర్తతో పాటు సంసార బాధ్యతలు సమానంగా పంచుకుని,
బిడ్డల పెంపకం, గృహ నిర్వహణ
చాకచక్యరగా నిర్వహించుకుని,
అన్నింటా మేటియని పలువురి మన్ననలందుకున్న…
నిన్నటి వనిత
విద్య, రాజకీయ, రక్షణ, పరిశోధక…
ఇత్యాది పలురంగాల
ప్రతిభతో ప్రవేశించి అద్భుత పాటవాన్ని కనబరుస్తూ…
వంటింటి కుందేలు స్థానం నుండి కదిలి, ఎదిగి, రయాన
కీర్తి శిఖరాలనధిరోహిస్తూ నేటి భావి తరాలకు కూడా
మార్గదర్శకమై నిలచి ఎల్లరి ప్రశంసలందుకుంటున్నది…
నేటి నారీమణి