తెలియదు.
కానీ ఈ కల మూడు నెలలుగా రోజూ కవ్విస్తోంది.
కోవిడ్ 19 రిలీఫ్ పనుల్లో నిండా మునిగి ఉన్నా, ఏ వైపు నుంచి వైరస్ ముక్కు మీదో, నోటి మీదో, కంటి మీదో వాలి ఉక్కిరి బిక్కిరి చేస్తుందో తెలియదు. అసలు మామూలు పరిస్థితులు ఇప్పట్లో చూస్తామో లేదో తెలియదు.
అయినా సరే ఈ కల నన్ను కవ్విస్తోంది.
హైదరాబాదు వలస వచ్చి 45 సంవత్సరాలైంది. నేను ఇరవై ఏళ్ళ యవ్వనపు రోజుల్లో మా సీతారామపురం వదిలి ఈ నగరానికి వచ్చాను. తొలి అడుగులు, తప్పటడుగులు, జ్ఞానవంతమైన అడుగులు అన్నీ ఇక్కడే నేర్చుకున్నాను. ఎంతోమంది మేధావుల నుండి సామాజిక ఆచరణ గురించి నేర్చుకున్నాను. రచయిత్రినయ్యాను. ఒక పత్రికకు మూడు దశాబ్దాలుగా ఎడిటర్‌గా ఉన్నాను.
మహిళల హక్కుల కోసం ఒక సంస్థను నడిపే స్థాయికి ఎదిగాను.
హైదరాబాదు నగరం నన్ను నా కాళ్ళ మీద నిలబెట్టింది. నాకో పేరు, ఉనికిని ఇచ్చింది. ఈ నగరాన్ని నేను చాలా ప్రేమిస్తాను.
నేను ప్రేమించే ఎన్నో ప్రదేశాలు నగరం లోపల, నగరం చుట్టూ ఉన్నాయి. నా జీవితంతో పెనవేసుకుపోయి ఉన్నాయి.
ఈ జీవితంలోకి ఎందరో వచ్చారు, వెళ్ళారు. కానీ నగరంలో నేను ప్రేమించేవన్నీ నాతోనే ఉన్నాయి.
మనుష్యులు, వారితో సంబంధాలు శాశ్వతం కావు. ప్రకతితో సంబంధాలు మాత్రమే శాశ్వతం.
చనిపోయేవరకు, చనిపోయాకా కూడా మనిషి శాశ్వత చిరునామా ప్రకతి మాత్రమే.
నగరంతో నా ప్రేమ హాయిగా కొనసాగుతున్న తరుణంలో హఠాత్తుగా నా ఆలోచనలు, ఊహలు మా ఊరి మీదకు మళ్ళు తున్నాయి. ఊరు వెళ్ళి రావడం కాదు.
ఊళ్ళో కొన్నేసి రోజులు ఉండిపోవాలనే ఊహలు. ఇపుడున్న భయానక పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు. కానీ ఈ పరిస్థితి ఇలాగే ఉండిపోదు కదా. ఏమో చెప్పలేం. చావు, బతుకు… ఏమౌతుందో తెలియదు.
అయితేనేం కలలు కనకూడదా? నిజానికి ఇది తీర్చుకోలేని అత్యాస కాదులెండి.
సరే ఆ కలేంటో ఇప్పుడు చెబుతాను. మా ఊళ్ళో నాకు కొంత పొలముంది. అందులో మా నాన్న నాటిన మామిడి తోటుంది.
మా కుటుంబంలో వరకట్న ఆచారం లేదు. ఉమ్మడి కుటుంబంలోంచి కొంత పొలం కూతురికి ఇస్తారు. రాతకోతలు, రిజిస్ట్రేషన్‌లు ఉండవు. ఈ పొలం ఫలానా అమ్మాయిది అంటే ఇంక అది ఆమెదే. దాని మీద ఆదాయం కూడా అమ్మాయిదే. తను అమ్ముకోవాలనుకుంటే అన్నదమ్ములు కొనుక్కుని డబ్బిచ్చేస్తారు.
అలా మానాన్న ఫలానా మామిడితోట అమ్మాజీది అని పేరుపెట్టాడు. మా ఇంట్లో నా పేరు అమ్మాజి.
నేను నలభై ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్‌లోనే ఉండిపోయాను. ఆ పొలం అలాగే నా పేరు మీద ఉంది. దాని ఆదాయం నేనెప్పుడూ తీసుకోలేదు. నాకు అవసరం పడలేదు. ప్రభుత్వ ఉద్యోగం ఉంది. జీతమొస్తుంది. రిటైర్ అయ్యాకా పెన్షన్ వస్తోంది.
అయితే ఇప్పుడు నా ఆలోచనలు ఆ మామిడితోటలో తచ్చాడుతున్నాయి. అమ్ముకుందామని కాదు సుమా!
ఆ తోటలో ఓ తాటాకు ఇల్లు కట్టాలని, అది అందరికీ అందుబాటులో ఉండాలని. నెలలో సగం రోజులు అక్కడే ఉండాలని. మిగిలిన సగం ఇక్కడుండాలి.
మా ఊరుకు అటూ ఇటూ సముద్రం గోదావరి ఉన్నాయి. మెయిన్ రోడ్డు మీద తల్లి కాలువ, ఊరి వెనక పిల్ల కాలువ ఉంటాయి. ఊరంతా తోటలు. పచ్చగా ఉంటుంది. గోదావరి దాటితే కోనసీమ కొబ్బరి తోటల సోయగం కళ్ళు తిప్పుకోనీయదు.
ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ మిస్ అవుతూనే ఉన్నాను. ఊరికి చుట్టపు చూపుగా తప్ప ఉండడానికి వెళ్ళడం లేదు.
ఎం.ఆర్.ఓ ఉద్యోగం వెలగబెట్టినప్పుడు మూడేళ్ళున్నాను. మళ్ళీ వచ్చేసాను.
ఇప్పుడు మళ్ళీ మా ఊరెళ్ళి ఉండాలనే కోరిక తీవ్రమైపోతోంది.
ఓ ఆనంద కుటీరం కట్టి నా ఫ్రెండ్స్ అందరికీ అందుబాటులో ఉంచాలి. మా ఊరంటే నా స్వేచ్ఛా ప్రపంచం. ఆ ప్రపంచాన్నీ అందరికీ చూపించాలి. అందరికీ నా ఆందార్ణవం పరిచయం చెయ్యాలి. నిజానికి మా ఊళ్ళో ఇళ్ళన్నీ తోటల్లోనే ఉంటాయి.
మా నాన్న చెమట కారిన మామిడితోటలో ఓ ఆనంద కుటీరం కట్టి, కొన్ని రోజులైనా అందులో బతకాలన్నదే ఇప్పుడు నన్ను నిలవనీయని నా కల. నా ఆత్మీయులు, నాకు అత్యంత ప్రియమైనవాళ్ళు వచ్చి ఉండాలని, నిండు పున్నమి రాత్రిళ్ళు గోదావరి గట్టుకో, సముద్రం ఒడ్డుకో వెళ్ళి కాసిన్ని కబుర్లు చెప్పుకోవాలని కల కంటున్నాను.
కరోనా కల్లోలమే నా కలకి ప్రాణం పోసింది. నలభై ఏళ్ళ జీవితాన్ని నగరానికి అంకితమిచ్చాను.
మిగిలిన జీవితంలో కొంత మా ఊరికివ్వాలి. మా ఊరు నాకిచ్చిన సంతోషాన్ని నేను లెక్కగట్టలేను. విలువకట్టలేను.
చావు బతుకుల ఊగిసలాటలో నేను ఇలాంటి కల కంటూ, దాన్ని సాకారం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను.
నా ఆనంద కుటీరాన్ని కట్టాలని ఉవ్విళ్ళూరుతున్నాను. మా గోదావరి గట్టు మీద కూర్చుని సూర్యోదయాన్ని, చంద్రోదయాన్ని చూడాలని ఎదురుచూస్తున్నాను. మా సముద్ర కెరటాల మీదుగా సూర్యాస్తమయాన్ని చూడాలని ఊహలల్లుతున్నాను.
ఇప్పుడు చెప్పండి కోవిడ్ 19 కల్లోల సమయంలో ఇలాంటి కల కుంటున్న నా మానసిక స్థితి సక్కగానే ఉన్నట్టా.