మూడు రోజుల రహస్యయుద్దాన్ని
కడుపులోనే సమాధి చేసి
ఈరోజే ఫ్రెష్షుగా తలారబోసుకుని
దేవుడి ఫోటో దగ్గరొక అగరబత్తి వెలిగించాను
సుగంధపరిమళాలను పీలుస్తూ అడిగాడు చంటోడు
అమ్మా… ఈరోజేంటే స్పెషల్ అని
ఏమని… చెప్పనూ…
ప్రతీ నెలా విరామం లేని యుద్ధంలో
ఓడి గెలిచానని
నిన్నటిదాకా విసుగ్గా చూసిన శ్రీవారు
ఈరోజు మల్లెపూలు తీపిమిఠాయిలు
బలికి ముందు అలంకరణల్లా
నవ్వుతూ చేతికిస్తోంటే
చిన్నితల్లి అడిగింది
అమ్మా… ఈరోజేంటే స్పెషల్ అని
ఏమని… చెప్పనూ…
ఇక ప్రతిరాత్రీ…
గెలవలేక… ఓడిపోతూనే ఉంటానని
పట్టుమని పదేళ్ళైనా నిండాయోలేదో
పుట్టినరోజని వేసిన పట్టులంగా
ఎర్రని పూవై పూసి కనబడగానే
నా గుండెల్లో ఫాస్ట్ ట్రెయిన్ పరుగులు
మొహంలో మారుతున్న రంగులు
బిక్కచచ్చిన నన్ను కుదుపుతూ
అడిగారు పిల్లలిద్దరూ
అమ్మా… ఈరోజేంటే స్పెషల్ అని
అమ్మను గెలిపించాలన్నా…
అక్కను గెలిపించాలన్నా…
ఓడని యుద్ధం చేయాలని కొడుక్కీ
తానెప్పుడూ విజేతగానే నిలవాలంటే
వీడని యుద్ధం చేయాలని కూతురికీ
అదే… మీ తరానికి స్పెషల్ అని..
నేనెలా చెప్పనూ…