”చిట్టచివరికి మూడేళ్ళ నుండి ఎదురు చూసిన రోజు వచ్చింది. నా పంతొమ్మిదో పుట్టినరోజున ఫ్రెండ్సందరికీ చాక్లెట్స్ పంచాను. మళ్ళీ వాళ్ళతో కలిసి నవ్వుకుంటూ చాక్లెట్లు తినే రోజొస్తుందో లేదో అనేది అనుమానమే… పది రోజులు ఆగి రాజీవ్‌తో వెళ్ళిపోయాను. పెళ్ళి చేసుకుని ఏడాదైంది. ఇప్పటికీ రోజూలా ‘మేం చేసిన తప్పేంటి? చట్టపరంగా అర్హత వచ్చాకే పెళ్ళి చేసుకున్నాం. కదా? అని ఆలోచిస్తూనే ఉన్నాం. మరి ఊరూ… వాడా… ఇంటివారు… బైటివారు.. అందరూ ఒకటే మాట… తప్పు చేశారు అని’ ఎందుకిలా?” నవత మాట్లాడుతోంది.
‘అక్కా, మీరు చట్టపరంగా రైటే అయినా సమాజపరంగా తప్పే చేశారు’ ఇంటర్ చదువుతున్న రవి అన్నాడు. అతని మాట ఇంకా పూర్తవకుండానే అంజలి అందుకుని ‘సమాజ శ్రేయస్సు కోసమే చట్టాలు చేసినపుడు వాటిని గౌరవించకపోతే అది వారి తప్పు’ తీక్షణంగా అంది.
వెంటనే పావని ‘సమాజంలో మనమూ భాగమేగా! మనకేం కావాలో చెప్తే దాన్ని చట్టం చేస్తున్నారా? మీరు పిల్లలు, మీకంత అనుభవం లేదు, మీ గురించి ఆలోచించుకునే తెలివి మీకింకా రాలేదు అంటూ మనకేం కావాలో కూడా వాళ్ళే నిర్ణయించేసినంత కాలం ఇవి తప్పవు’ అంది. ‘మరి పదిహేనేళ్ళకి పెళ్ళి వద్దంటే వినకుండా బలవంతపు పెళ్ళిచేసి, నీ మంచి కోసమే… మా నిర్ణయం సరైనదే అనేవాళ్ళను ఏమనాలి? చట్టాన్ని ధిక్కరించిన వారిగా వారి మీద చర్యలు తీసుకోరేం?’ సూటిగా ప్రశ్నించింది మమత. ”రెండు నాలుకలు…” వ్యంగ్యంగా అన్నాడు వెంకీ.
‘అమ్మాయిలకి పద్దెనిమిదేళ్ళు నిండాకే పెళ్ళి చేయాలని చట్టం ఉన్నా తల్లిదండ్రులు, పెద్దలు కూడా అంతవరకు ఆగకుండానే అమ్మాయి ఇష్టంతో పనిలేకుండా పెళ్ళి చేసేస్తున్నారు. అలా అని అమ్మాయికి ఇష్టమైన వాడితో పెళ్ళి చేయడానికి ఒప్పుకోరు. అందుకని పద్దెనిమిది నిండకుండా వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుంటే అబ్బాయి మీద కిడ్నాప్ కేసో, పోక్సో కేసో పెట్టేస్తారు. మరసలు తనకేం కావాలో ఎంచుకునే అవకాశం ఎప్పుడూ, ఎందులోనూ లేకపోతే అది హక్కుల మరణం కాదా’ ఆశ్యర్యంగా అడిగింది అనిత.
‘కరెక్ట్ అనితా. ఇప్పుడు కూడా అదే జరుగుతోందిగా! పద్దెనిమిదేళ్ళకి పాలకుల్ని ఎంచుకునే విచక్షణ, తెలివి వస్తాయని ఓటుహక్కు ఇచ్చిన రాజ్యం తన జీవిత భాగస్వామిని ఎంచుకునే వయసు రాలేదని అమ్మాయి పెళ్ళి వయసుని 21కి పెంచే ఆలోచన చేస్తోందంటే ఎంత విచిత్రం. దానికి మళ్ళీ ఒక అందమైన సాకు… బాగా చదువుకుని, స్వతంత్రురాలై జీవితంలోని చక్కని నిర్ణయాలు తీసుకోవాలంట! అప్పుడు కానీ చేతకాదంట!! మరి ఓటు హక్కు కూడా అప్పటికే ఇవ్వొచ్చుగా’ చాలా కోపంగా, వ్యంగ్యంగా అంది కరుణ.
‘ఉట్టికి ఎగరలేనమ్మ… సామెతలా ఉందిది. ఊళ్ళో బళ్ళు సరిగ్గా లేవు. బడినుంచి అందరూ కాలేజికి వెళ్ళడానికి సరిపడా కాలేజీలు లేవు. ఆపై చదువులకి దారి అసలు లేదు. ఇక ఈ మిడిమిడి చదువుల్తో అందరం ఉద్యోగాలు తెచ్చేసుకుని, అద్భుతంగా ఎదిగిపోయి, దేశాన్ని జోడు గుర్రాల్తో పరిగెత్తిస్తాం మరి…’ కచ్చగా అన్నాడు హరి.
‘అదలా ఉంచు హరి. అమ్మాయిలు, అబ్బాయిలు కౌమారం దాటకుండానే శారీరక సంబంధాలవైపు పోతున్నారని, టీవీలు, సినిమాలు , సెల్‌ఫోన్లు కలిసి ఈ వయసు వారందరినీ చెడగొడుతున్నాయని, అమ్మాయి లు పెళ్ళిళ్ళు కాకుండానే తల్లులవడమో లేదా అశాస్త్రీయంగా గర్బస్రావాలు చేసే వారి బారినపడి గర్భసంచీకే ప్రమాదాలు తెచ్చు కోవడం, వయసు ప్రభావంతో జరుగుతన్న ఇవన్నీ పెళ్ళికి ముందు, తర్వాత తీవ్ర హింసకి దారి తీయడం… చాలాసార్లు విడాకులకి, కోర్టు కేసులకి, విడిపోడాలకి, అదే వీక్ మైండ్ అయితే ఆత్మహత్యలకి కూడా కారణాలవడం… ఇవన్నీ ఏంటి మరి? ఎందుకు జరుగుతు న్నాయో మనకి తెలియదా’ అడిగింది విమలక్క.
‘నాకో డౌటుంది అడగనా…’ అని మొదలుపెట్టాడు రాజు. ‘ఏడెనిమిదేళ్ళ కిందట నిర్భయ కేసప్పుడు మన ఈ నాయకులంతా కలిసి బాలనేరస్తుల వయసు 18 ఏళ్ళ నుంచి 16కి తగ్గించాలని కదా వాదించారు! అదేమో రెండేళ్ళు తగ్గించేసి, ఇప్పుడు పెళ్ళి వయసు మాత్రం మూడు, నాలుగేళ్ళు పెంచెయ్యాలని చూస్తున్నారంటే… వాళ్ళ మతుల్ని దేంతో పోల్చాలో కూడా అర్థం కావట్లేదు. ఇదే కదా ద్వంద్వ వైఖరంటే…’ అని ఆవేశంగా అన్నాడు.
‘అవును, ఒక పక్క పదో తరగతన్నా పూర్తవ్వకుండానే అన్నీ తెలిసిపోతున్నా యంటూనే ఇంకో పక్క బాగా చదువుకుని అన్నీ తెలుసుకున్నాకే పెళ్ళి చేసుకోవాలనే పెళ్ళి వయసు పెంచాలని అంటున్న వారిని ఏం చెయ్యాలి!!’ అంది మమత. ‘నాకేం కావాలో నేను ఎంచుకునే వయసు రాలేదనే పెద్ద మనుషులకి బాలల హక్కుల గురించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? మీ అభివృద్ధి మా బాధ్యత అనే వారికి మా అభివృద్ధిలో మమ్మల్ని భాగస్థుల్ని చేస్తేనే కానీ మీరు సరైన దారిలో పోతున్నట్లు కాదు అని ఎవరు చెప్పాలి? ఆ తెలివి వాళ్ళకు ఎప్పటికొస్తుంది?’ వాపోయాడు వెంకీ.
15-25 సంవత్సరాల వయసు లోని బాలదండు పిల్లలు, పీర్ ఎడ్యుకేటర్ యువ సంఘం సభ్యులు కలిసి లేవనెత్తిన ఈ విలువైన, అతి ముఖ్యమైన ప్రశ్నలు వినేవారేరీ? విని వాటికి జవాబులిచ్చేవారెవరు? వారి ఆలోచనల్ని తీసుకుని, వారి కోసం చేసే చట్టాలు, కార్యక్రమాల రూపకల్పనలో వారి కోసం ఆలోచించడం కాకుండా… వారితో కలిసి ఆలోచించడం చేస్తే, వారిని భాగ స్వాముల్ని చేస్తే… శక్తివంతమైన చట్టాలు, అంగీకార యోగ్యమైన విధానాలు అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలకు దారి సులువవ్వదా!! మరి ఈ కీలకమైన అంశాన్ని విస్మరిస్తే ఎలా??