ఒక చిన్న ఉపోద్ఘాతం
ఈ మహమ్మారి విజృంభణ కాలంలో ప్రజల ఆరోగ్యపు హక్కు, వారి జీవితంలోని అన్ని అంశాలపైన దాని ప్రభావం ఇందులో ప్రస్తావించాము. ప్రజల ఆరోగ్యం అనే అంశాన్ని అనేక సంక్లిష్ట విషయాల సమాహారంగా భావించాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని నిర్ణయించే రాజకీయ, సాంఘిక అంశాలు, అంటే పేదరికం, ఉపాధి, లైంగికత వారి శారీరక వైకల్యాలు మొదలైనవి. ఈ విషయాలన్నీ చాలా సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలు, స్త్రీల ఉద్యమాలు, ఆరోగ్యాన్ని గురించి విశ్లేషించే సంస్థలు చర్చిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ హక్కుల గురించిన భాషణలో భాగాలే. కులం, వర్గం, జెండర్, మతం, లైంగికత మొదలైన విషయాలలో ఎదురవుతున్న వివక్ష, అప్రధానీకరణను ముందు పోగొడితే కానీ ఆరోగ్యపు హక్కు సాధించడం కుదరదు. సాంఘిక స్థాయి వలన, స్థానికత వలన వాళ్ళు ఎలా ఒక పద్ధతిలో బలైపోతున్నారో కోవిడ్-19 విజృంభణ అర్థం చేయించింది.
నగరాలకు వలస వచ్చిన స్త్రీ కార్మికులకు ప్రసవం, తదనంతర చికిత్స అందుబాటులో ఉండదు. స్త్రీలు, ట్రాన్స్జెండర్లు ప్రధాన స్రవంతికి చెందని ఇతర సమూహాల వ్యక్తులు లైంగిక హింసకు గురవుతున్నారు. ఈ కోవిడ్ మహమ్మారి కాలంలో ఈ అంశాలు ఎక్కువ బహిర్గతమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రజారోగ్య వ్యవస్థలోని సదుపాయాల పరిధిలోనే అన్ని సమూహాలకూ ఆరోగ్య సదుపాయాలు, చికిత్సలు అందాలి. అనియంత్రితమైన ప్రైవేటు వైద్య విధానం, పటువుగా లేని ప్రభుత్వ వైద్య విధానమూ, ఆహార భద్రత లేమి, సాంఘిక భద్రతా వ్యవస్థ సరిగ్గా లేకపోవడం మొదలైన కారణాల వలన ఈ దేశంలో లక్షలాది మంది ఆరోగ్యం ప్రమాదంలో ఉంది.
నిజాలూ గణాంకాలూ
భారతదేశంలో ప్రజారోగ్యానికి ఖర్చుపెట్టే మొత్తం అతి తక్కువ. 2015-16లో అది కేవలం జి.డి.పి.లో 1.02%గా ఉంది. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయవలసిన అవసరం ఎంతైనా ఉండగా ఆ విషయంలో ప్రభుత్వం ఖర్చుపెట్టే మొత్తంలో మార్పు లేదు.
2017లో ప్రవేశపెట్టిన జాతీయ ఆరోగ్య విధానాన్ని అనుసరించి ‘జిడిపిలో 2.5 శాతం కేటాయించి వైద్యాన్ని వీలైనంత ధరకు అందించడం ద్వారా అన్ని వయసుల వారికి ఆరోగ్య సదుపాయం కల్పించడం’ అనే ఆలోచన అందని మానిపండే అయిపోయింది. దాని కోసం జరిగిన కృషి అతి స్వల్పం.
భారతదేశంలో ఒక ప్రభుత్వ వైద్యుడు/వైద్యురాలు సగటున 11,082 మంది రోగులకు చికిత్స చేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినదానికన్నా ఈ సంఖ్య 10 రెట్లు ఎక్కువ. బీహార్‌లో ఒక ప్రభుత్వ డాక్టర్ 28,391 మందికి చికిత్స చేస్తే, ఉత్తరప్రదేశ్‌లో ఆ సంఖ్య 19,962, ఝార్ఖండ్‌లో 18,518 మందికి కాగా, మధ్యప్రదేశ్‌లో 16,996 మందికి, ఛత్తీస్‌గఢ్‌లో 15,916 మందికి, కర్నాటకలో 13,556 మందికిగా ఉంది. నానాటికీ తగ్గిపోతున్న వైద్య సదుపాయాలు అలా ఉంచి ప్రభుత్వ సంస్థలలోని అన్ని రకాల అసమానతలకు, వివక్షలకు, అప్రధానీకరణకు గురవుతున్న వారిలో మహిళలే ఎక్కువ. నయా ఉదార విధానాలలోని స్థూల ఆర్థిక శక్తులు మహిళల ఆర్థిక వెతలను మరింత పెంచుతున్నాయి. ప్రపంచ ఆర్థిక విధానాలు దేశీయ వ్యవస్థలలోకి చొరబడి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ విషయం కోవిడ్ విజృంభణ సమయంలో మరింతగా బహిర్గతమయింది.
ఆయుష్మాన్ భారత్ పథకం వంటి ప్రైవేటు భీమా పద్ధతి ప్రవేశపెట్టడం అంటే ఆరోగ్య రక్షణ అనేది ఒక వినిమయ వస్తువుగా తయారు కాబోతోందని అర్థమవుతుంది. ఏప్రిల్ 2020లో జాతీయ ఆరోగ్య సంస్థ కోవిడ్ పరీక్షలను, చికిత్సను ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రిందకు తెస్తున్నట్లు ప్రకటించింది. కానీ కేవలం 3.1 శాతం పాజిటివ్ వ్యక్తులే ఈ పథకాన్ని వినియోగించుకున్నట్లు తెలుస్తోంది.
స్త్రీలు, ఎల్.జి.బి.టి.క్యు.ఐ. సమూహాలు మూడు రకాల వివక్షను ఎదుర్కొంటున్నారు. పేదరికం ఒకటి, సమాజం చేత అప్రధానీకరణ చెందిన సమూహాలకు చెంది ఉండడం మరొకటి కాగా, స్త్రీలు, తదితర అప్రధానీకరణకు గురైన వర్గాల ఆరోగ్యాన్ని సమాజం పట్టించుకోకపోవడం మామూలే. ఇది పైకి కనబడని వివక్ష.
ఒక పద్ధతి ప్రకారం సాగుతున్న ఈ వివక్షను మనం ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో స్త్రీలకు అందుతున్న స్వల్ప ఆరోగ్య సదుపాయాలను బట్టి గమనించవచ్చు. ప్రస్తుతం మాతా శిశు ఆరోగ్య సౌకర్యాలు ఒక క్లిష్ట సమస్యగా తయారయ్యాయి. సమాజంలో అంచులకు నెట్టబడి అప్రధానీకరణకు గురైన స్త్రీలు పడుతున్న కష్టాలను మనం మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. వలస కార్మిక స్త్రీలు రహదారుల మీద ప్రసవించడం కూడా విన్నాం, చూశాం. ప్రసవ సమయంలో మరణించే స్త్రీల సంఖ్య కూడా పెరిగింది. సెప్టెంబర్ 2020 నాటికి ఈ మృతుల సంఖ్య 1743కి పెరగవచ్చునని ఊహిస్తున్నారు. దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వలన మాతా శిశు వైద్యం సకాలంలో అందుబాటులో లేకపోవడం, అంబులెన్స్‌లు, ప్రయాణ సౌకర్యాలు దొరక్కపోవడం, సమయానికి వైద్య సౌకర్యం అందకపోవడం దీనికి ఒక కారణం. అత్యవసర సేవల గురించి కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ వెలువరించిన సూచనలు సరిగ్గా అమలు పరచకపోవడం ఒక్కటే.
అంతేకాక లాక్డౌన్ కాలంలో 1.85 మిలియన్ల మంది స్త్రీలకు ఎం.టి.పి. సేవలు అందలేదు. బ్రతికించుకోగల వాళ్ళను బ్రతికించుకోలేకపోవడం రాజ్యం వైఫల్యం, స్త్రీ హక్కులకు భంగం.
ఆరోగ్య రంగం యొక్క ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ… ఎంతవరకూ ప్రైవేటు వ్యక్తులకు లాభించిందో అంచనాకు అందదు.
ఆరోగ్య వైద్య రంగంలోకి మతతత్వం ప్రవేశించిందనడానికి ఢిల్లీలో జరిగిన మారణకాండ, దాని తర్వాత ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన ప్రకటనలే నిదర్శనం.
కరోనా మహమ్మారిని మతతత్వ ప్రేరేపణలకు ఉపయోగించడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అస్సలు సహించకూడదు. ప్రతి ఒక్కరికీ వివక్షారహితంగా ఆరోగ్య సేవలు అందేలా చూడాలి, ముఖ్యంగా ఇటువంటి సంక్లిష్ట సమయంలో.
జెండర్ హింసకు గురై బ్రతికి బయటపడినవారు ఇప్పుడు మరింత అభద్రతకు లోనవుతున్నారు. లాక్డౌన్ విధించే సమయంలో ఈ ముఖ్యమైన విషయాన్ని గురించి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఒక వ్యక్తి ఆరోగ్యాన్నీ, సంక్షేమాన్నీ నిర్ణయించేది ఆ వ్యక్తి హింసలేని జీవితమే. ముఖ్యంగా స్త్రీలు, యువతులు, క్వీర్ వ్యక్తుల విషయంలో. ఈ విషయాన్ని ప్రజారోగ్య శాఖ పట్టించుకోవాలి.
ప్రజారోగ్యాన్ని సార్వజనీనం చెయ్యాలి, అప్పుడే ప్రజారోగ్య వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రైవేటు రంగాన్ని గట్టిగా క్రమబద్ధీకరించాలి.
జవాబుదారీతనం : డిమాండ్లు
స్త్రీలకు ప్రసవం, శిశు పోషణ విషయంలో తప్పనిసరిగా నాణ్యమైన, గౌరవప్రదమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. కుల, వర్గ, మత వివక్ష, అసమానతలు లేకుండా అందరికీ ఉచిత వైద్యం అందాలి.
గర్భస్రావం కూడా ఒక అత్యవసర వైద్య సహాయంగా చూడాలి. కోవిడ్-19 చికిత్స, ఇతర అత్యవసరమైన వైద్యానికి అడ్డు రాకూడదు. హెచ్ఐవి, ఎయిడ్స్ ఉన్నవాళ్ళకు కూడా సరైన వైద్యం అందాలి.
కోవిడ్ 19 సందర్భంలో దేశంలోని అనేక ప్రాంతాలలో (నగర/గ్రామ) దాని వలన ప్రభావం సోకి చికిత్స పొందిన స్త్రీ, పురుషుల ప్రత్యేక డేటాను సేకరించాలి. అందువల్ల ప్రభుత్వం తగిన రుజువులు పొందగలదు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను రూపొందించగలదు.
జెండర్‌పరంగా జరిగే హింసను ఒక ప్రజారోగ్య సమస్యగా పరిగణించాలి. ఈ హింసను అరికట్టడానికి ఒక క్రియాశీలక పథకాన్ని రచించాలి. ప్రజారోగ్య సంబంధమైన అత్యవసర పరిస్థితులలో (కరోనా వంటి సందర్భాలలో) జెండర్ సంబంధిత హింసపై పనిచేసే స్త్రీల సంఘాల నుంచి, ఆరోగ్య సంబంధమైన సంస్థల నుంచి సమాచారాన్ని సేకరించి వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చెయ్యాలి.
జెండర్ స్థాయిలో జరిగే ఏ హింసనైనా, వివక్షనైనా, లైంగిక హింసనైనా ఖండించాలి. ఆరోగ్య సంరక్షణ రంగంలోకి మతతత్వ ధోరణులు ప్రవేశించనివ్వకుండా అదుపు చేసే కార్యాలయాలు ఉండాలి.
క్వారంటైన్ సదుపాయాలలో, ఐసోలేషన్ వార్డులలో అన్ని నియమాలు పాటించేలా చూడాలి. స్త్రీల, క్విర్ వ్యక్తుల భద్రత వారి ప్రైవసీ సరిగ్గా ఉండేలా చూడాలి, వారందరికీ అవన్నీ అందేలా చూడాలి.
కోవిడ్‌తో సంబంధం లేని ఆరోగ్య సమస్యలకు కూడా (క్యాన్సర్, మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధులు క్షయ, గుండె జబ్బుల వంటివి) అందరికీ అందుబాటులో ఉండే వైద్యాన్ని అందించి అకాల మృత్యువుల సంఖ్యను అరికట్టాలి.
వీలైనన్ని చోట్ల టెలిమెడిసిన్ సౌకర్యాన్ని పెంచాలి.
కోవిడ్-19 కానీ, మరే ఇతర అనారోగ్యాలకు కానీ ఖైదీలకు వైద్య సదుపాయాలు పెంచాలి.
రాజకీయ ఖైదీలను, పశ్చాత్తాపం పొందుతున్న ఖైదీలను విడుదల చేసే విషయం తీవ్రంగా ఆలోచించాలి.
ఎల్.జి.బి.టి.క్యు.ఐ.ఏ సమూహాలకు చెందిన వారు, సెక్స్ వర్కర్లు, అంగవైకల్యం కలవారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది. ఉపాధి కోల్పోవడం, ప్రయాణ సౌకర్యాలు లేకపోవడం, కదలికల మీద నియంత్రణ వల్లనూ వీరికి వైద్య సదుపాయం అందుబాటులో లేదు.
ఈ కరోనా మహమ్మారి వారి జీవితాలపై వేసిన ప్రభావాల వలన వారి మానసిక సమతౌల్య పరిరక్షణ కోసం మానసిక వైద్యసలహాలు అందుబాటులోకి తేవాలి. ఇవి తాత్కాలికంగా కాక శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి.
సర్వజనులకూ జవాబుదారీగా ఉండే ఒక ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రభుత్వం రూపొందించాలి. ఇందుకు తగిన పెట్టుబడి పెట్టాలి, సదుపాయాలు పెంచాలి. ఈ మహమ్మారి కాలంలో మనకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ప్రభుత్వ ప్రైవేటు రంగాల సహకారంతో అమలు చేస్తున్న సార్వజనిక ఆరోగ్య విధానం (ఇన్సూరెన్స్ ప్రాతిపదికన) నిష్ఫలమని. ప్రైవేటు రంగాన్ని గట్టిగా కట్టుదిట్టం చేసే విధానం మనకి కావాలి. ప్రజారోగ్య వ్యవస్థకి మరింత డబ్బు కేటాయించాలి.
కోవిడ్ సోకిన వారితో నేరుగా పనిచేసే ఆశా వర్కర్ల వంటి వారికి పని ప్రదేశాలలో కల్పించే రక్షణ పరికరాల స్థితి అన్యాయంగా ఉంది. వారి ఉద్యోగాలను క్రమబద్దీకరించడమే కాక వారికి సరైన జీతాలు, నాణ్యమైన రక్షణ సామగ్రి (పిపిఇ), క్రమానుసారంగా ఆరోగ్య పరీక్షలు, ఐసొలేషన్ సదుపాయం కల్పించాలి. దేశంలోని ఆరోగ్య పనివారిలో 85 శాతం స్త్రీలే. అదే పనిలో ఉండే పురుషులకన్నా వీరు మరింత ప్రమాదానికి చేరువలో ఉంటారు.
తీసుకోవలసిన తక్షణ చర్యలు
సమాజంలో అంచులకు నెట్టబడిన, లేదా అప్రధానీకరణకు గురైన వారికి సరైన ప్రాథమిక వైద్య సదుపాయం అందేలా చర్య తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర, జిల్లాలలోని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శులను ఎన్‌హెచ్చార్సీ, ఎస్హెచ్చార్సీలకు డిమాండ్ చేస్తూ రాయాలి.
ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సాంఘిక మాధ్యమాల్లో ఈ విషయాలను గురించి లైవ్ కార్యక్రమాలు చేయాలి. ప్రస్తుతం నడుస్తున్న ఎంటిపి బిల్లు సవరణ వంటి వాటిలో పౌరసమాజం పాల్గొనేలా చూడాలి.
ఆశా వంటి కార్యకర్తలకు స్థానికంగా మద్దతుదారులను తయారుచేయాలి. వారి డిమాండ్లను ప్రభుత్వానికి చేరేలా చూడాలి.
ఒక ఆశాకిరణం
యువతీ బృందాలు కొన్ని ముందుకు వచ్చి సామాజిక స్థాయిలో కోవిడ్-19కు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుని, వారి కుటుంబాలకూ, స్నేహితులకూ, ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు.
పౌర బృందాలు, సామాజిక కార్యకర్తలు అట్టడుగు వర్గాల వారికి, ఉపాధి కోల్పోయిన వారికి భోజనం, రేషన్లు, ఇతర నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు.
స్త్రీల సంఘాలు, సామాజిక కార్యకర్తలు, రవాణా పాస్‌లు సంపాదించి పెట్టడం, హాస్పిటల్స్‌కు చేర్చడం, కొన్ని ఆరోగ్య సదుపాయాలు కల్పించడం, రవాణా సౌకర్యాలు కల్పించడం, ప్రసవాలు చేయించడం వంటి సహాయక చర్యలు చేపట్టారు.