గత సంవత్సర కాలంగా దేశమంతా ఎదుర్కొంటున్న ఉద్విగ్న సందర్భాలను చూస్తోంటే సమాజం తిరోగమనం దిశగా వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో దాదాపు 150 ఏండ్ల క్రితం సమాజం మార్పునకు కృషి చేసిన మహనీయుల సేవలను మరొక్కమారు గుర్తు చేసుకోవాలని అనిపిస్తోంది. ముఖ్యంగా తొలి తరం సామాజిక ఉద్యమకారిణి, ఆధునిక భారతదేశపు తొలి మహిళా
ఉపాధ్యాయురాలు అమ్మ ”సావిత్రిబాయి ఫూలే”ను మరియు ఆమె సేవలను జనవరి 3న ఆమె జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవడం అత్యంత అవసరం. నేడు మహిళలు, పేదలు, దళితులు, ఆదివాసీలు, మత మైనారిటీలు మరియు దేశానికి వెన్నెముకగా ఉన్న రైతులు, మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చూస్తోంటే ఆనాడు ఆమె యావత్తు సమాజాన్ని ఎదిరించి అణగారిన వర్గాల వారి కోసం చేసిన ఆదర్శవంతమైన సేవలను గుర్తుచేసుకోవడం అనివార్యం.
సావిత్రిబాయి జనవరి 3, 1981లో సాధారణ శూద్ర దంపతులు ఖండోజీ, లక్ష్మిలకు జన్మించింది. 1840లో తన 9వ ఏటనే మహాత్మ జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగింది. భర్త సహకారంతో చదువుకుని తనలాంటి బాలికలను, అంటరానివాళ్ళను (దళితులను) విద్యావంతులను చేయడానికి పూనుకుంది. పరిస్థితులు ఏవైనా సరే మహిళలు, అంటరానివాళ్ళ (దళితుల) జీవితాలు బాగుపడాలంటే చదువుకోవడం ఒక్కటే మార్గమని నమ్మింది. అందుకోసం సమాజం నుండి ఎంతటి వ్యతిరేకత ఎదురైనా బెదరకుండా, వెనకడుగు వేయకుండా భర్త సహకారంతో పాఠశాలలు స్థాపించి మహిళలకు, అంటరానివాళ్ళకు (దళితులకు) చదువునిచ్చింది. కేవలం చదువే కాకుండా తమ పాఠశాలలకు వచ్చే పిల్లల స్థితిగతులను తెలుసుకుని వారి కుటుంబాలకు సాధ్యమైన చేయూతనిచ్చింది, సంక్షేమ హాస్టళ్ళను నడిపించింది.
పూణే, విదర్భ, దక్కన్ ప్రాంతాల్లో తీవ్రమైన కరువు కాటకాలు సంభవించిన రోజుల్లో, రైతులు ప్రభుత్వం నుంచి సాయం దొరకక, వడ్డీ వ్యాపారుల చేతుల్లో మోసపోయి తినడానికి తిండిలేక పిట్టల్లా రాలిపోతున్న తరుణంలో ఒకవైపు మహాత్మా జ్యోతిరావు ఫూలే రైతుల తరపున బ్రిటిష్ ప్రభుత్వంతో మరియు స్థానిక వడ్డీ వ్యాపారులతో పోరాడుతుంటే, మరోవైపు సావిత్రి బాయి ఫూలే చందాలు, విరాళాలు సేకరించి తాను నడిపే పాఠశాలల సంక్షేమ హాస్టళ్ళ ద్వారా వేలాది రైతు కుటుంబాలకు రొట్టెలు, ఆహారాన్ని సరఫరా చేసి ఎంతోమందిని ఆదుకుంది.
నిస్సహాయ స్థితుల్లో కుటుంబాల్లోని మగవాళ్ళ చేతుల్లో లైంగిక హింసకు బలై తద్వారా గర్భవతులై సమాజంలో ఛీత్కారాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న బ్రాహ్మణ వితంతువులను కాపాడి ఆశ్రయమిచ్చి పురుళ్ళు పోసింది. వితంతువులకు గుండు కొట్టించే అమానవీయ ఆచారాన్ని ఎదిరించింది. మంగలి వారిని చైతన్యపరచి ఆ ఆచారాన్ని ఆపగలిగింది. తన చుట్టూ ఉన్న మహిళలను ఒక్కటిగా కూడగట్టి మహిళా మండళ్ళు ఏర్పాటు చేసి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించింది. కులాంతర వివాహాలు, వితంతు వివాహాలు జరిపించింది. పెళ్ళి చేసుకునేటప్పుడు భార్యల పట్ల అమర్యాదగా, అమానవీయంగా ప్రవర్తించనని, ముఖ్యంగా చదివిస్తానని, సమానంగా చూసుకుంటానని భర్తలచే ప్రమాణం చేయించేది.
ఒక మహిళగా తన స్నేహితురాలు ఫాతిమా షేక్‌తో కలిసి ఎంతోమంది పేద దళితులను చేరదీసి చదువు చెప్పించి, తిండిపెట్టి, నాగరికత, సంస్కారాలు నేర్పించిన సావిత్రి బాయి తనకు పిల్లలు కలుగలేదని కుమిలిపోకుండా అనాధ బ్రాహ్మణ వితంతువు కుమారుని దత్తత తీసుకుని పెంచి చదువులు చెప్పించి డాక్టర్‌ను చేసింది. అనాథలు మరియు పిల్లలు లేని తల్లుల సమస్యలకు ఒక పరిష్కారం చూపించింది.
అంటరాని (దళితులైన) మహార్, మాంగ్ వాళ్ళు తాగడానికి నీళ్ళులేక అలమటిస్తుంటే తన ఇంట్లోని మంచినీటి బావి నుండి నీరు సరఫరా చేసింది. మహాత్మ జ్యోతిరావు ఫూలే మరణించినప్పుడు దత్తపుత్రుడు అంతిమ సంస్కారాలు చేయడానికి వీల్లేదని బంధువులు గొడవ పెడుతుంటే ఎవరికీ భయపడకుండా సంప్రదాయాలను కాదని భర్త చితికి నిప్పు పెట్టిన ఆధునిక భావాలు కలిగిన స్త్రీ. ప్లేగు వ్యాధితో ప్రజలంతా అల్లాడుతుంటే కొడుకుతో కలిసి వ్యాథిగ్రస్తులకు సేవచేస్తూ అదే వ్యాధితో బాధపడుతూ కన్నుమూసింది.
ఆమె కేవలం ఉపాధ్యాయురాలు, మహాత్మా జ్యోతిరావు ఫూలే భార్య మాత్రమే కాదు, మంచి రచయిత్రి. మహిళల్ని, పిల్లల్ని
ఉద్దేశిస్తూ ఎన్నో గొప్ప రచనలు, కవితలు రాసింది. ఆమె గొప్ప ధైర్యశాలి. యావత్ బహుజనులకు తల్లి. గొప్ప సంఘ సంస్కర్త. సామాజిక సేవలు చేసిన గొప్ప మానవత్వం ఉన్న మహిళ. కులమతాలకు అతీతంగా నిస్సహాయ స్థితిలో ఉన్న సాటి మహిళల పట్ల ఆమె చూపిన సిస్టర్ హుడ్ తరతరాలకు ఆదర్శం. నేటి విపత్కర పరిస్థితుల్లో మహిళలుగా మనందరం సమాజం పట్ల మన బాధ్యతలను మరింత గొప్పగా నిర్వర్తించడానికి సావిత్రిబాయి ఫూలే ఆచరించి చూపించిన జీవితం గొప్ప ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంది. జనవరి 3న ఆమె జయంతి సందర్భంగా ఆమెకు యావత్ మహిళల తరపున ఘనమైన నివాళులు.