ఊరూరా ఉండే పుల్లమ్మ, ఎల్లవ్వ, ఎలిజబెత్ అక్కా, నజీర్ బాబాయ్, సుబ్బయ్య తాత… అందరూ ఓ తూరి ఈడకి రాండిరి. నేను మన ‘సొలోమోన్ ఇజియ కుమార్’ రాసిన ‘మునికాంతపల్లి కతలు’ పుస్తకం గురించి సిన్న సమీచ్చ రాసిన. అందరి మాదిరి చెప్పకుండా మన ఇజియ కుమారుకి జాబు రాసినట్టు చెప్పిన. మీరు గుడా చదవండి.
అబ్బయ్యా… ఇజియా నీ మునికాంతపల్లి కతలన్నీ సదివినాను. ముందులాగా మన పరిచయం చిన్న గొడవతోనే కదా మొదలైంది. ఆనక నువ్వు మన నెల్లూరువోడివని తెలిసినాకా శానా సంతోషం అయాళ్ళా నాకా. సరేమని ఏందో ఈ కతల మందల తెలుసుకోవాలని అన్ని కతలు శ్రద్ధగా సదివిన. కొన్ని కతలు నవ్విచ్చినాయి. కొన్ని కతలు చదవతా ఉంటే ఏడుపొచ్చింది. కొన్ని కతలు బాధ కలిగిచ్చినాయి. కొన్ని కతలు చదవతా ఉంటే నీ మీద కోపమొచ్చింది. మొత్తం మీద నీ కతలు ఎలా ఉన్నాయంటే ”జీవితపు రహదారుల వెంట కన్నీటి పునాదుల మీద కట్టబడిన వెతల గుడిసెలు ఈ మునికాంతపల్లి కతలు”.
నక్కలోళ్ళ బిజిలీ లాంటి అన్యాయమైపోయిన ఆడకూతుర్లు ప్రతి ఊరిలో మనకి కనపడతానే ఉంటారు. కత సదివి అయ్యో ఏమి ఈ జీవితం అనిపించింది. దీనయ్యా ఆడ బతుకు అని రొంసేపు ఏడ్చినా. ”మా పెంచిలవ్వ” కత చదివాక మా పల్లిలో పొలం కాడా గుడిసెలో ఉండే మా రామక్క అవ్వ గుర్తుకొచ్చింది. దేశ దిమ్మరి కాశయ్యలాంటి వోళ్ళు దేశమంతా తిరగతా మనకి ఔపడతానే ఉళ్ళా.
మాదిగి సుబ్బులు మాదిరిగానే మా మాదిగి నరసమ్మ అందరి ఇళ్ళకొచ్చి పియ్యెత్తిపోసేది. కన్నతల్లులు మనకి ఊహ తెలిసేదాకా మన ఉచ్చ, పీతులు ఎత్తితే, సుబ్బులు, నరసమ్మ లాంటి వోళ్ళు ఊరందరి పీతిలెత్తి గొప్ప సేవ జేసినారు. వాళ్ళ ఋణం ఏ జనమలోనూ తీర్చలేనిది కదా. ఇప్పుడు గవనానికి దెచ్చుకుంటే ఎంత బాధ, ఏడుపు వస్తాది.
”ఈదికులాయి ఈరోయిన్లు” కత చదవతా ఉంటే ఇంటికాడ మొదలైన తగవును నడీదిలోకి తీసుకొచ్చే ఆడంగులంతా కళ్ళమ్మిడి ఔపడ్డారు. ”అడివి పందిని గొట్టె మొనగోళ్ళు” కతలో రేతిరి పూట చిమ్మ చీకట్లో అడివి పందులను ఏటాడే విధానం నువ్వు చెప్పినాక మునికాంతపల్లి మొనగాళ్ళు సింహాలను, పులులను ఏటాడే వోళ్ళకు ఏ మాత్తరం తీసిపోరని తెలస్తా ఉండాది.
ఇక అన్ని కతల గురించి నేను చెప్పిస్తే ఎట్ల, వోళ్ళు సదవద్దా అని ఈడతో గమ్మునున్నా. ఇక కమ్మటి పాయసం తింటా ఉంటే మద్దిలో కటిక్కిన పంటి కింద రాయి తగిలినట్టు కతలో ఆడాడ నువ్వు వాడిన వెర్రి పదాలు రవ్వంత ఇబ్బంది కలిగిచ్చాయి.
కొన్ని కతల్లో అవి అనసరం అనిపిచ్చాయి. కొన్ని కతల్లో ఆ పదాలు ల్యాకుంటే కతలు ఇంకా మనుషుల మనసుల్లోకి సూటిగా కత్తవల్లా దూసుకుపోతాయి అనిపించింది.
ఇక ఇళ్ళ బుచ్చోడు ఈడికోలు అప్పుడే చెప్పేస్తే ఎట్టా అని. నేనిందాక చెప్పినట్టు జీవితపు రహదారి వెంట నడస్తా ఉంటే ఎన్నో, ఎన్నెన్నో వెతల గుడిసెలు నీకు కనపడతానే ఉంటాయి. ఆ గుడిసెలను గుడిగా మలచి నువ్వు రాసిన కతలు నలుగురికి ఉపయోగపడాలని, చీకటి బతుకుల్లో నీ కతలు వెలుగు నింపాలని కోరుకుంటూ… నీ నెల్లూరి స్నేహితురాలు రోహిణి.
నేను రాసిన జాబు సమీక్ష చదివినారు కదా. అందరూ మన ”సొలోమోన్ విజయ కుమార్” ‘మునికాంతపల్లె కతలు’ చదివి మరిన్ని కతలు రాయాలని మరిగిన్ని ఆశీస్సులు మన ఇజియ కుమారుకి అందిస్తారుగా…