పన్నెండో ఏట శివరాజు వేంకట సుబ్బారావు (బుచ్చిబాబు) చిటికెనవేలు పట్టుకొని సంసార బంధంలోకి వచ్చిన సుబ్బలక్ష్మిగారు… కథకుడు, చిత్రకారుడు అయిన బుచ్చిబాబు భార్యగా మాత్రమే ఒదిగిపోలేదు. బుచ్చిబాబు గారి స్ఫూర్తితోనే కలం, కుంచె చేతిలోకి తీసుకొని ఒక చేత కథలల్లటం మొదలుపెట్టి ‘కావ్య సుందరి కథ, ఒడ్డుకు చేరిన కెరటం, మనోవ్యాధికి మందుంది, మగతజీవి చివరి చూపు, శివరాజు సుబ్బలక్ష్మి కథలు అనే అయిదు కథా సంపుటాలు, అదృష్ట రేఖ, నీలంగేటు అయ్యగారు, తీర్పు (తరుణ మాసపత్రికలో సీరియల్) నవల”లు రాసి తనకంటూ సాహిత్య రంగంలో ఒక ముద్రని సాధించుకున్నారు. అదేవిధంగా భర్త బుచ్చిబాబుతో పోటీగా కుంచెతో కాన్వాసుపై రంగులు చిందించి అద్భుతమైన ప్రకృతి దృశ్యాల్ని తీర్చారు. దేవికారాణి, ఇందిరాగాంధీ వంటి ప్రముఖుల చిత్రాల్ని కూడా సజీవంగా చిత్రించారు. 2015లో ‘నేచర్ ఇన్ థాట్స్’ పేరుతో బుచ్చిబాబుగారు వేసిన 177 రంగుల చిత్రాల్ని, సుబ్బలక్ష్మి గారి 140 వర్ణ చిత్రాల్నీ కలిపి ఒక విలువైన ఆర్ట్ పుస్తకాన్ని కూడా వెలువరించారు.
బుచ్చిబాబు గారు కొన్నాళ్ళు అనంతపురం కాలేజీలో ఆంగ్లోపన్యాసకులుగా పనిచేసే రోజుల్లో అదే కాలేజీలో భౌతిక శాస్త్రం బోధించే మా పెదనాన్న కొడుకు లక్ష్మణరావు ఇరుగు పొరుగు ఇంట్లో ఉండేవారు. వారి స్నేహాన్ని గురించి ఇటీవల ‘పాలపిట్ట’ సాహిత్య మాసపత్రికలో సుబ్బలక్ష్మిగారు రాసిన ‘జ్ఞాపకాలు’లో తెలిపారు. సుబ్బలక్ష్మిగారు తర్వాత హైదరాబాద్‌లో తమ్ముడి ఇంట్లో ఉన్నప్పుడు 1970లలో లక్ష్మణరావు కుటుంబంతో తొలిసారి ఆమెని కలిసాను. ఆ తర్వాత ఆమెను మా దంపతులం పలుమార్లు కలవటం జరిగింది. బెంగుళూరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె పురస్కారాలు అందుకునే సందర్భంలో హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆమె ఫోన్ చేసి పిలవటంతో ఆమె బస చేసిన హోటల్‌కి వెళ్ళి కలిసేవాళ్ళం. బుచ్చిబాబులా నా రచనల్లో వర్ణనలు ఎక్కువగా ఉండవని సుబ్బలక్ష్మిగారు చెప్పుకున్నా కథల్లోని ప్రకృతి దృశ్యాల్ని వర్ణించే విధానం చదివినప్పుడు సుబ్బలక్ష్మి గారికి ప్రకృతి పట్ల ఆరాధన కన్పిస్తుంది. అదే వారి చిత్రకళలో దర్శనమిస్తుంది.
పెళ్ళంటే తెలియని వయసులో బాల్యవివాహాల వలన ఎదుర్కొన్న సమస్యల్ని, అమాయకులైన అమ్మాయిలు మూర్ఖపు అత్తగార్లతో అత్తింట పడిన ఆరళ్ళు, మొదటి భార్య చనిపోతే రెండవ భార్యగా వెళ్ళిన అమ్మాయిల మనోభావనలు, మొదటి భార్య పిల్లల అగచాట్లు, ఆర్థిక స్వాతంత్య్రం లేని భార్యలు, ఆడబిడ్డల పెత్తనాలు, అక్క పోతే ఇష్టం లేకపోయినా బావని పెళ్ళాడవలసిన పరిస్థితులు… ఇలా సుబ్బలక్ష్మి గారి సుదీర్ఘ జీవనయానంలో పరిశీలించిన సుమారు యాభై ఏళ్ళనాటి మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలలోని స్త్రీ జీవిత చిత్రణలే సుబ్బలక్ష్మి గారి కథలు. ‘మట్టిగోడల మధ్య గడ్డిపోచ’ కథలో అక్క మరణానంతరం బావని పెళ్ళి చేసుకున్న పార్వతి జీవితం, కాలం వేసిన ఎగుడుదిగుడు బండలపైన జీవితంగా రచయిత్రి అభివర్ణిస్తారు.
మంచు వీడిన కొండ, ఒడ్డుకు చేరిన ఒంటి కెరటం, మూతపడని కన్ను, మరుగుపడిన ఆత్మీయత… ఇలా సుబ్బలక్ష్మి గారి కథలు, శీర్షికలు ప్రత్యేకంగా కవితాత్మకంగా ఉంటాయి. శీర్షికలోనే కాక కథలో కూడా ”చినుకులు చిటపటలాడుతూ ఒక్కసారిగా సైన్యంలా నేలపైకి ఉరికాయి” వంటి కవిత్వ పంక్తులు కూడా మెరిపిస్తాయి. వీరి కథలలో చాలావరకూ యాభై-అరవై ఏళ్ళనాటి పల్లె జీవితాలు, గ్రామీణ వాతావరణం ఎక్కువగా ప్రతిబింబిస్తుంటాయి. పచ్చని నేలపై నుండి వీచే గాలుల సవ్వడులు, కొబ్బరాకుల మధ్యనుండి వినిపించే చిరుగాలి గలగలలూ, గూడుబండి ప్రయాణాలు మొదలైనవన్నీ పాఠకుల గ్రామీణ దారుల పంక్తుల్లో వీక్షించవచ్చు. ”కర్త-కర్మ-పూర్తి చేసిన కథ”లో రామచంద్రయ్య కూతుళ్ళకు గుడి దగ్గర స్వామీజీ. తానిచ్చే తావీదు కట్టుకుంటే గొప్ప దశ వస్తుందనీ, రాజకుమారుడు వచ్చి ఎత్తుకుపోతాడనీ చెప్పేసరికి వాళ్ళిద్దరూ ఎప్పుడు తమ కల సాకారమౌతుందా అని కలల్లో తేలిపోయే క్రమంలో తమ చేతి గాజులు పోయినది కూడా గమనించరు. రామచంద్రయ్య తనలాగే స్వామీజీ అవుతాడని చెప్పేసరికి బలహీన మనస్కుడైన రామచంద్రయ్య ఇల్లు వదిలిపోతాడు. తర్వాత అనేక మలుపులతో కథ సుఖాంతం చేస్తారు. కానీ కట్టు కథలు చెప్పి వెర్రి మోహాల్ని కల్పించే దొంగస్వాముల గుట్టు రట్టు చేసి, వ్యామోహాల పర్యవసానాల్ని కథంతా హాప్యంగా చెప్పే పద్ధతి రచయిత్రి మన ఎదుట కూర్చొని చెప్పేలా ఉంటాయి.
”ఆడవాళ్ళ పెట్టెలో” ప్రయాణం కూడా సుబ్బలక్ష్మి గారి సున్నితమైన హాస్యం కన్పిస్తుంది. ”నల్ల మబ్బులు” అనే కథలో డాక్టర్ భార్య సుశీల, తాను చనిపోతే భర్త అభిమానించే సుధని పెళ్ళి చేసుకుంటాడన్న అపోహతో కృశించి జబ్బు తెచ్చుకుని మరణానికి ముందు తన స్నేహితురాలికి రాసే ఉత్తరంలో భర్త, సుధ కోసం పడే తపన గురించి రాస్తుంది. ఆ ఉత్తరాన్ని తిరిగి సుశీలకు పంపుతూ ఆ స్నేహితురాలు భరోసా కల్పిస్తూ రాసిన ఉత్తరం సుశీల చనిపోయాక భర్తకి అందుతుంది. మాటలు రచయిత్రి ఆధునిక భావాలకు సూచనగా ఉంటాయి.
”మనం ఉండి సాధించలేనిది పోతే మాత్రం ఎవరికి నష్టం. ఎవరి జీవితం వారిది. ఇంకొకరి కోసం జీవిస్తున్నామన్న మాట వట్టిదే. మనకోసమే మనం పాటుపడుతున్నాం. అది మాత్రం ప్రతివాళ్ళు ఒప్పుకోవాలి” అని చెప్పిన మాటలు సుబ్బలక్ష్మి అనుభవ సారంలోంచి రాసినవిగా ఉంటాయి. పనివాళ్ళ మీద, మధ్యతరగతి కొలమానాలతో రాసిన రచనలు చాలానే ఉంటాయి. కేవలం పనిమనిషి దృష్టి కోణంలో రాసిన నవల ”నీలంగేటు అయ్యగారు” (1964). పనిమనిషి పొన్ని పెద్ద అయ్యగారింట జరిగిన భాగోతాన్ని సూక్ష్మ పరిశీలనతో వివరించిన నవల.
తొంభై అయిదేళ్ళ సంపూర్ణ జీవితాన్ని సాహిత్యం, చిత్ర లేఖనం రెండు కళ్ళుగా పరిపూర్ణత గావించుకొని చివరి దశ వరకూ సాధన చేస్తూ సాహితీవేత్తలతో ఆత్మీయంగా సంభాషిస్తూ, ప్రతిభకు తగిన ఎన్నో పురస్కారాలను అందుకున్న సుబ్బలక్ష్మి గారు జీవితం, జీవన విధానం ఏనాడూ నిరాశా నిస్పృహలకు తావివ్వని రీతిలో నిత్యచైతన్యంగా జీవించారు. సాహిత్యం, చిత్రలేఖన రంగాలలో కృషి చేసిన శివరాజు సుబ్బలక్ష్మి గారు లేని లోటు ఎవరూ పూరించలేనిది. వారికి అశ్రునివాళులు.