గర్భిణీల వార్డు – అయోధ్యా రెడ్డి

డోరిస్‌ లెస్సింగ్‌ (1919-2013) పరిచయం :

సుప్రసిద్ధ బ్రిటన్‌ రచయిత్రి, నోబెల్‌ సాహిత్య బహుమతి గ్రహీత డోరిస్‌ లెస్సింగ్‌, 1919 అక్టోబర్‌లో పెర్షియా (ఇరాన్‌)లోని కెర్మాన్‌ షాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ బ్రిటిష్‌ సంతతివాళ్ళే. చాలాకాలం రొడేషియా (ప్రస్తుత జింబాబ్వే)లో నివసించి తొలుత నర్స్‌ మెయిడ్‌గా, టెలిఫోన్‌ ఆపరేటర్‌గా పనిచేశారు. అక్కడే ఆమె సాహిత్య సృజనకు శ్రీకారం చుట్టారు. తన 15వ ఏట మొట్టమొదటి కథ రాసిన ఆమె, దాదాపు 20వ శతాబ్ది ఆసాంతం రచన కొనసాగించి యూరప్‌ సమకాలీన సాహిత్యంపై చెరగని ముద్ర వేశారు.

బహు గ్రంథ రచయిత్రిగా పేరొందిన లెస్సింగ్‌ కవిత్వం, చిన్న కథ, నవల, నాటకం, పాట, ఆటోబయోగ్రఫీ, నాన్‌ ఫిక్షన్‌… ఇలా సాహిత్యంలోని పలు జోనర్స్‌లో విస్తృతంగా కృషి చేశారు. మోడర్నిజం, పోస్ట్‌ మోడర్నిజం, సూఫీయిజం, సోషలిజం, ఫెమినిజం వంటి ఉద్యమాల్లో ఆమె సాహితీ సృజన సాగింది. తమ జీవిత కాలంలో దాదాపు 90 వరకూ రాసిన వివిధ గ్రంథాల్లో యాభైకి పైగా నవలలున్నాయి.

2007లో ఆమెకు ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి లభించింది. సాహిత్యంలో నోబెల్‌ బహుమతి పొందిన 11వ రచయిత్రిగా, అది కూడా 88 ఏళ్ళ వయసులో నోబెల్‌ అందుకున్న అతి పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించారు.

డోరిస్‌ లెస్సింగ్‌ రాసిన ప్రతి నవలా ఒక సంచలనమే. 1950లో వచ్చిన మొట్టమొదటి నవల ”ది గ్రాస్‌ ఈజ్‌ సింగింగ్‌” యూరప్‌ అంతటా ఆమె పేరు మార్మోగిపోయేలా చేసింది. రచయిత్రిగా తొలిరోజుల్లో కమ్యూనిస్ట్‌ భావజాలంతో రాసిన ”చిల్డ్రన్‌ ఆఫ్‌ వయొలెన్స్‌” గొలుసు నవలతో ఆమెకు అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ”ది గ్రాస్‌ ఈజ్‌ సింగింగ్‌”, ”ది గోల్డెన్‌ నోట్‌బుక్‌”, ”ది గుడ్‌ టెర్రరిస్ట్‌”, ”కానోపస్‌ ఇన్‌ ఆర్గోస్‌” నవలలు ఆమెను ప్రపంచ లెజెండ్స్‌ సరసన నిలిపాయి. 1962లో ప్రచురించిన ”ది గోల్డెన్‌ నోటుబుక్‌”ను ఒక ఫెమినిస్ట్‌ క్లాసిక్‌గా ప్రపంచం కీర్తించింది. ”కానోపస్‌ ఇన్‌ ఆర్గోస్‌” నవల సైన్స్‌ ఫిక్షన్‌లో సంచలనం సృష్టించింది.

ఈ నవలల ప్రాచుర్యంతో లెస్సింగ్‌ పెద్ద సంఖ్యలో అవార్డులు గెలుచుకున్నారు. నోబెల్‌ బహుమతి సహా పదుల సంఖ్యలో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి సోమర్సెట్‌ మామ్‌ అవార్డు, ఆస్ట్రియన్‌ అవార్డు, డబ్ల్యూ స్మిత్‌ లిటరరీ అవార్డు, ప్రీమియో గ్రీన్జానే కేవోర్‌ పురస్కారం, జేమ్స్‌ టెయిట్‌ స్మారక బహుమతి, ప్రీమియో ప్రిన్సిపి డీఆస్ట్రస్‌ అవార్డు, చివర్లో నోబెల్‌ బహుమతి. యూరప్‌ ఖండంలో తనకు రాని పురస్కారం లేదని నోబెల్‌ పురస్కార ప్రదాన సభలో ప్రసంగిస్తూ ఆమె స్వయంగా చెప్పుకున్నారు. ది టైమ్స్‌ రూపొందించిన 20వ శతాబ్ది బ్రిటన్‌ 50 మంది మహా రచయితల జాబితాలో లెస్సింగ్‌ ఐదవ స్థానంలో నిలిచారు. ఆమె తన 94వ ఏట 2019లో మరణించారు.

డోరిస్‌ లెస్సింగ్‌ ప్రసిద్ధ కథాసంపుటి ”లండన్‌ అబ్జర్వ్‌డ్‌”లోని ”ది ఊంబ్‌ వార్డ్‌” కథకు ఇది తెలుగు అనువాదం.

… … …

విశాలమైన హాలు లాంటి ఒక గదిలో రెండువైపులా నాలుగేసి చొప్పున ఎనిమిది పడకలు. గది చివర్లో ఎదురెదురుగా ఒకదానికొకటి ఆనుకొని మరో రెండు మంచాలు వేసి ఉన్నాయి. ఉత్తర లండన్‌లోని అతి ప్రాచీన విక్టోరియన్‌ ఆస్పత్రిలోని ఒక దృశ్యమిది. విశాలమైన గదిని తాత్కాలికంగా గైనిక్‌ వార్డుగా మార్చి ఉపయోగిస్తున్నారు. అయితే ఆ గదినింకా అన్ని సౌకర్యాలతో పూర్తిస్థాయి వార్డుగా రూపొందించలేదు. గదిలో కిటికీలకు గులాబి పువ్వుల డిజైన్లున్న కర్టెన్లు వేలాడుతున్నాయి. రోగుల నడుమ గోప్యత కోసం అవసరమైనప్పుడు మంచాలను వేరుచేసేందుకు రన్నర్‌ స్క్రీన్లను అడ్డంగా జరుపుతూ పని కానిచ్చేస్తున్నారు. తాత్కాలిక వార్డుగా మార్చినప్పటికీ ఆ గది రోగులకు సౌకర్యంగానే కనిపిస్తోంది.

సాయంత్రం సందర్శకుల కోసం కేటాయించిన సమయమైంది. రోగులను చూసేందుకు ఆ రోజు చాలామందే వచ్చారు. రోగుల పక్కనే ఉన్న కుర్చీల మీదా, మంచాల మీదా కూర్చున్నారు. నాన్నలు, అమ్మలు, తోడబుట్టినవాళ్ళు, బంధుమిత్రులు, పిల్లలు… ఇలా చాలామంది నిర్దేశిత సమయంకన్నా ముందే మధ్యాహ్నం రెండు గంటల నుండే వస్తూపోతూ ఉన్నారు. కానీ వాళ్ళలో రోగుల భర్తలెవరూ లేరు. వాళ్ళు మరి కొద్దిసేపటి తర్వాత వస్తారు. అంతా ఎక్కడెక్కడో ఉద్యోగాల మీదా, పనులమీదా వెళ్ళి ఉంటారు.

వార్డు మొత్తంమీద ఒక మంచం దగ్గర మాత్రం ఒక స్త్రీ భర్త ఆమె తలవైపున కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆ రోగి పేరు మిల్డ్రెడ్‌ గ్రాంట్‌. ఆమెకు దాదాపు 45 ఏళ్ళుంటాయి. బలహీనంగా కనిపిస్తున్నా మనిషి చాలా అందంగా ఉంది. భర్తకు సమీపంగా కూర్చొని అతని ముఖంలోకి తదేకంగా ఆరాధనగా చూస్తోంది. అతడామె రెండు చేతుల్ని తన చేతులతో మృదువుగా బిగించి పట్టుకున్నాడు. అతడు మంచి పర్సనాలిటీతో భారీగా ఉన్నాడు. చేతులు దృఢంగా, అరచేతులు విశాలంగా ఉన్నాయి. ఖరీదైన బట్టలు ధరించి హుందాగా ఉన్నాడు. ట్విడీ బూడిద రంగు జాకెట్‌, తెల్ల చొక్కా అతని ఒంటిమీద మెరిసిపోతూ ఏదో ప్రకటనలో నటుడి మాదిరి కనిపిస్తున్నాడు.

అతడు తను కట్టుకున్న టై విప్పి కుర్చీ వెనుక వేలాడేశాడు. ఇదతన్ని అనధికార రూపంలోకి మార్చేసింది. ఇప్పుడు సాదాసీదాగా కనిపిస్తున్నాడు. భార్యపట్ల అతను పడుతున్న ఆందోళన ముఖంలో వ్యక్తమవుతోంది. భర్తనూ, అతను పడుతున్న బాధనూ కళ్ళనిండా నింపుకుంటున్నట్లుగా ఉన్నాయామె చూపులు. అంతమందిలోనూ వాళ్ళు పరిసరాలు మరిచి ఏకాంతమైపోయారు. అది జనరల్‌ ఆస్పత్రి అని కాకుండా తమ ఇంట్లోని ఒక గదిలో ఏకాంతంగా ఉన్నట్లున్నారు. వార్డులోకి ఎవరొస్తున్నారో, ఎవరు పోతున్నారో వాళ్ళకు అసలు గుర్తులేదు.

అతడారోజు ఉదయమే భార్యను ఆస్పత్రిలో చేర్పించాడు. అప్పటినుంచి ఎక్కడికీ వెళ్ళకుండా ఆమె దగ్గరే కూర్చుని ఉన్నాడు.

అది మహిళల గర్భకోశ వ్యాధుల ప్రత్యేక వార్డు. నేమ్‌ బోర్డు మీద గైనిక్‌ వార్డు అని కనిపిస్తున్నప్పటికీ అక్కడందరూ వాడుకలో ‘గర్భిణీల వార్డు’ అని చెప్పుకుంటారు.

మిసెస్‌ గ్రాంట్‌ కాకుండా వార్డులో మరో తొమ్మిదిమంది రోగులు ఉన్నారు. చిత్రమేమంటే ఆ సమయంలో వార్డు మొత్తానికి ప్రసవం కోసం వచ్చిన స్త్రీలెవరూ లేరు. వివిధ గర్భాశయ సంబంధ సమస్యలతో చేరినవాళ్ళే అందరూ. వాళ్ళల్లో కొందరికి వివిధ ఆపరేషన్లు, మరికొందరికి ఇతరత్రా వైద్యచికిత్సలు జరగాల్సి ఉంది. పరిశీలించి చూస్తే వాస్తవానికి అక్కడెవరూ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నట్లు కనిపించడం లేదు. అంతేకాదు, మరే వార్డులోనూ లేనివిధంగా ఒకింత సరదాగానూ కనిపిస్తున్నారు. కానీ లోపల్లోపల ఎవరి భయాలు, ఆందోళనలు వారికి ఉండే ఉంటాయి.

వార్డు లోపలికీ, బయటకూ హడావిడిగా తిరిగే నర్సులు రోదించే వాళ్ళపైనా, అలాగే చాలాసేపు నిశ్శబ్దంగా ఉండి బాధపడే వాళ్ళపైనా ప్రత్యేకంగా ఒక కన్నేసి ఉంచుతున్నారు. రాత్రి ఏడవుతుండగా వార్డులోకి భోజనాలొచ్చాయి. సందర్శకులు చాలావరకు అప్పటికే ఇళ్ళకు వెళ్ళిపోయారు. అక్కడ రోగులెవరికీ ఆకలి ఉన్నట్లు అనిపించడం లేదు. తిండి కోసం ఎవరూ ఆరాటపడుతున్నట్లు లేరు.

కానీ గ్రాంట్‌ భర్త మాత్రం భార్యను తినమని ఎంతగానో బ్రతిమాలుతున్నాడు. ఆమె తినలేనంటూ నిరాకరిస్తోంది. భార్య మొండితనం పట్ల అతను కాస్త చిరాకుపడ్డాడు. మందలించబోతూ ఆమె జాలిగొలిపే ముఖాన్ని చూసి తగ్గాడు. ప్రేమగా, ఒక తండ్రిలాగా సముదాయించాడు. గ్రాంట్‌ తన చేతిలో ప్లేటు పట్టుకుని అలాగే కూర్చుంది. అతడే చెంచాతో మెల్లిగా తినిపించసాగాడు. ఆమె కళ్ళవెంట నీళ్ళు అదేపనిగా కారిపోతున్నాయి. అతను మధ్య మధ్య చెంచా ప్లేటులో ఉంచి కర్చీఫ్‌తో భార్య కళ్ళు తుడుస్తున్నాడు.

ఆమె చిన్నపిల్లలా వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తోంది. బలహీనమైన ఆమె ఛాతీ ఎగిరి పడుతోంది. కన్నీళ్ళతో తడిసిన తన విశాల నీలినేత్రాలతో అతన్నే తదేకంగా, తనివితీరా చూస్తోంది. నీలి నేత్రాలు ఎప్పుడైనా సంతోషానికి నిర్వచనంగా ఉండాలి. వర్షించే మేఘాలు కాకూడదు. దుఃఖం ఆమెకు ఎంత మాత్రం నప్పలేదన్నట్లు వార్డులోని ఇతర రోగులు ఆమెవైపే చూస్తూ మధ్య మధ్య ముఖాలు తిప్పుకుని చిన్నగా గుసగుసలాడుతున్నారు.

తమ ఆఫీసులూ, ఇతరత్రా పనులు ముగించుకుని ఆస్పత్రికి వచ్చిన ఇతర రోగుల భర్తలు ఒక్కొక్కరు వార్డులోకి చేరుతున్నారు. కొద్దిసేపు ఆ వార్డులో కొన్ని జంటలు సన్నిహితంగా కూర్చొని ఇల్లు, తమ పిల్లలు, తదితర విషయాల గురించి చిన్నగా చర్చించుకున్నారు.

ఒక మంచం మీద రోగి ఒకామె సీరియస్‌గా చేతిలో మ్యాగజైన్‌ పేజీలు తిప్పుతూ మధ్యమధ్య తలెత్తి పుస్తకం మీద నుంచి ఓరగా అందరినీ చూస్తోంది. ఇంకో మంచంలో నడివయసు దాటిన మిస్‌ కుక్‌, చేతిలో ఏదో అల్లిక పని చేసుకుంటూ వార్డు నలువైపులా కలియచూస్తోంది. ఆ పక్కనే తనను చూసేందుకు ఎవరూ రాక ఒంటరిగా ఉన్న యువతి ఏదో నవల చదువుతూ వాక్‌మెన్‌లో పాటలు వింటోంది. ఆమె ధోరణి చూస్తే మనిషి ఉన్నత కుటుంబానికి చెందినదానిలా (అవునో కాదో తెలియదు) కనిపిస్తోంది. ఇంకా ఇతర రోగులు అక్కడికి వచ్చిన సందర్శకులతో ముచ్చట్లాడుతున్నారు. ఇక కొత్తగా ఆ ఉదయమే వార్డులో చేరిన మిల్డ్రెడ్‌ గ్రాంట్‌ మాత్రం భర్తకు అతుక్కుపోయి కూర్చొని బేలగా కన్నీళ్ళు పెట్టుకుంటోంది.

కాసేపటికి సందర్శకుల సమయం ముగిసింది. నర్సు పదేపదే గుర్తుచేయడంతో వచ్చినవాళ్ళు ఒక్కొక్కరూ వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ప్రేమగా ముద్దులు, ఆలింగనాలు, చేతులూపుతూ వీడ్కోలు చెబుతున్నారు. ”రేపు మళ్ళీ వస్తానుగా” అనే వాగ్దానాలు.

ఆగకుండా అదేపనిగా ఏడుస్తున్న మిల్డ్రెడ్‌ గ్రాంట్‌ కుర్చీలోంచి లేవబోయిన భర్తను మరింత గట్టిగా కావలించుకుని భోరుమంది. ”టామ్‌! వద్దు… దయచేసి మీరు వెళ్ళిపోవద్దు” అంటూ ఏడుస్తూనే బ్రతిమాలింది.

టామ్‌ బలవంతంగా ఆమెను తననుంచి విడదీసి సరిగ్గా కూర్చోబెట్టాడు. ప్రేమగా భార్య వెన్ను నిమురుతూ ఆమె భుజాలచుట్టూ చెయ్యి వేశాడు. చక్కగా దువ్వుకున్న ఆమె మృదువైన బూడిదరంగు జుట్టు ఫ్యాన్‌ గాలికి చిందరవందరగా, అస్తవ్యస్తంగా ఎగురుతోంది.

”ప్లీజ్‌ టామ్‌, మీరిక్కడే ఉండండి. వెళ్ళిపోవద్దు” వేడుకుంది.

”లేదు డియర్‌, ఒక ముఖ్యమైన పని ఉంది. నేను తప్పక వెళ్ళాలి. మళ్ళీ పొద్దున్నే వస్తానుగా. నువ్వు ముందు ఏడుపు ఆపు గ్రాంట్‌. అనవసరంగా టెన్షన్‌ పడుతున్నావు. నిబ్బరంగా ఉండు. నీకేమీ కాదు. ప్లీజ్‌… నా మాట విని ఏడవకు” అతను అనునయిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్పాడు.

కానీ ఎంత చెప్పినా ఆమె ఏడుపు ఆపలేదు. జాలిగా, విషాదంగా భర్త ముఖంలోకి చూసింది. తర్వాత అతని భుజానికి తలానించి ఇంకా గట్టిగా ఏడవసాగింది.

”అబ్బా… గ్రాంట్‌, దయచేసి ఏడవకు. నేను చెబుతున్నానుగా, నీకేమీ కాదు. మనం భయపడినట్లు నీది ప్రమాదకరమైన జబ్బు కాదని డాక్టర్‌ చెప్పాడు. అది నువ్వూ విన్నావుగా. పరిస్థితి ఎంత సీరియస్‌ అయినా ఫర్వాలేదు నిజం చెప్పమని కూడా నేను డాక్టర్ని అడిగాను. దానికాయన మరేం ప్రమాదం లేదన్నాడు. వారం రోజుల్లో నువ్వు ఆరోగ్యంగా ఇంటికొస్తావు” టామ్‌ గొంతు తగ్గించి మంద్రస్థాయిలో భార్యకు భరోసా ఇచ్చాడు. తను మాట్లాడుతున్నంతసేపూ భార్య వీపుమీద లాలనగా తడుతున్నాడు. కంగారుపడొద్దనీ, మరేం భయంలేదనీ బుజ్జగించాడు.

కాసేపటికి ఆమె ఏడుపు కొంచెం నెమ్మదించింది. కానీ తీవ్రంగా వచ్చే వెక్కిళ్ళు ఆగటం లేదు. తను భయపడేది తన జబ్బు గురించీ, వైద్యం గురించీ కాదని భర్తకు చెప్పాలనుకుని మాటిమాటికీ తల అడ్డంగా ఊపుతోంది. నిజానికి ఆమె అంతలా ఎందుకేడుస్తోందో అతనికి తెలీయనిది కాదు. కానీ తన భావోద్వేగాలు బయటపడకుండా అతను జాగ్రత్త పడుతున్నాడు.

ఆమె వెక్కిళ్ళ రోదన మరింక వినలేక ఒక నర్సు విసురుగా అక్కడికొచ్చింది. చాలాసేపటి నుంచి ఆమె వీళ్ళిద్దరినీ గమనిస్తోంది. భర్తను వెళ్ళకుండా ఆమె అడ్డుకోవడం, అతడేమో ఎంతసేపైనా ఓపిగ్గా భార్యను సమాధానపరుస్తూ ఓదార్చడం చూసింది. నర్సు అక్కడికి రానైతే వచ్చిందికానీ ఏం చేయాలో చప్పున తోచలేదు. అతని చూపు నిస్సహాయతే కాకుండా ఒకింత నిగూఢంగా ఉంది.

”మేడమ్‌! ఇక నేను చేయగలిగిందేమీ లేదు. మీదే బాధ్యత” అన్నాడు నర్సునుద్దేశించి. తర్వాత భార్యవైపు తిరిగి ”గ్రాంట్‌, నేనిక వెళ్తాను” అని చెప్పాడు.

అలా చెప్పి ఆమెనుంచి విడివడ్డాడు. కానీ ఆ మరుక్షణమే గ్రాంట్‌ అతని మెడచుట్టూ చేతులు గట్టిగా పెనవేసి వదల్లేదు. బలవంతంగానే చేతులు విడిపించుకుని, దిండు ఆసరా చేసి ఆమెను పడుకోబెట్టాడు. తర్వాత లేచి నిలబడుతూ నర్సువైపు సాదరంగా చూశాడు. ”మీరైనా చెప్పండి మేడమ్‌. నా భార్య అనవసరంగా భయపడుతోంది. అందుకు కారణం కూడా ఉందనుకోండి. మా పెళ్ళయిన ఇన్నేళ్ళలో ఆమె నన్ను విడిచి ఎప్పుడూ ఉండలేదు. ఒక్క రాత్రి కాదు, ఇరవై ఐదు సంవత్సరాలుగా” అన్నాడు నవ్వుతూ.

అతని మాటలకు నర్సులో ఏ స్పందనా కనిపించలేదు కానీ, గ్రాంట్‌ మాత్రం తల అడ్డంగా ఊపుతూ లేచి నిలబడేందుకు ప్రయత్నించింది. కన్నీళ్ళతో ఆమె గులాబీ రంగు జాకెట్‌ తడిచిపోయింది. అతను భార్యను లేవకుండా అడ్డుకున్నాడు. తిరిగి ఆమెను సరిగ్గా పడుకోబెట్టాడు. ఆమెకు అందకుండా జరుగుతూ నిటారుగా నిలబడ్డాడు. అది చూసి ఆమె చిన్నబుచ్చుకున్నట్టు గోడవైపు తల తిప్పుకుంది.

”నేను వెళ్తున్నాను గ్రాంట్‌” అని చెప్పి టామ్‌ ముందుకు నడిచాడు. వెళ్తూ ఆమెను చూసుకోమని నర్సువైపు తలూపి సైగ చేశాడు.

”మీకేం ఫర్వాలేదు మిసెస్‌ గ్రాంట్‌” నర్సు ఎంతో క్రమశిక్షణగా చిరునవ్వు నవ్వుతూ మంచం దగ్గరికొచ్చింది. ఆమెది చాలా చిన్నవయసు. ఇరవై ఉంటాయేమో. పొద్దుటి నుంచీ డ్యూటీ చేయడం వల్ల కావొచ్చు బాగా అలసిపోయినట్లు కనిపిస్తోంది. టామ్‌ వెళ్ళిపోయేవరకూ ఏమీ అనలేక మౌనంగా ఉన్న పక్క మంచం మీది ఒక పెద్దావిడ, వార్డులో అందరి తరపునా ఫిర్యాదు చేస్తున్నట్లు, ”ఇదిగో అమ్మాయ్‌! నువ్వు నీ ఏడుపుతో ఇక్కడున్న ఇతర రోగుల్ని ఇబ్బంది పెడుతున్నావు. చప్పుడు చేయకుండా పడుకుంటే మంచిది” గట్టిగా అంది.

నర్సు కూడా ఆమెను సముదాయించే ప్రయత్నం చేసింది. కానీ ఎవరి మాటలూ మిల్డ్రెడ్‌ గ్రాంట్‌ మీద పనిచేయలేదు. ఆమె ఆగకుండా అలాగే ఏడుస్తోంది. ఇదంతా తాము ఊహించిందే అన్నట్లు ఇతర రోగులు పెద్దావిడవైపు ఎగతాళిగా చూశారు. కొన్ని క్షణాల తర్వాత గ్రాంట్‌ కొద్దిగా శాంతించినట్లు గొంతు తగ్గించి ఏడవసాగింది.

”మేడం, మీకు మంచి టీ ఏమైనా కావాలా?” నర్సు మర్యాదగా అడిగింది. ఆమె దానికి సమాధానం చెప్పకుండా గట్టిగా ఊపిరి తీస్తూ, మధ్యమధ్య ముక్కు ఎగబీలుస్తోంది. నర్సు వార్డులో అందరివైపూ ఓ మారు చూసింది. తర్వాత మరింకేమీ అనలేక బయటికి వెళ్ళిపోయింది.

రాత్రి తొమ్మిది గంటలవుతోంది. సాధారణంగా మరికొద్దిసేపట్లో వార్డులో అందరూ నిద్రపోతారు. ఈలోపు రోగులకు నిద్రకు మందిచ్చే పాలపానీయాలతో ట్రాలీని నెట్టుకుంటూ ఒక వ్యక్తి లోపలికొచ్చాడు. మంచాల మీద రోగులు రకరకాల పనుల్లో ఉన్నారు. ఒకరిద్దరు మంచాల మధ్యలో కూర్చొని చేతులతోనే జుట్టు దువ్వుకుంటున్నారు. ఇంకొకరు జుట్టుకు రబ్బరు బ్యాండు చుడుతున్నారు. కొందరేమో ఒక పద్ధతి ప్రకారం ముఖాలకూ, మెడకూ క్రీములు రాసుకుంటున్నారు.

వార్డులో పరిస్థితి మందకొడిగా మారి, గడుస్తున్న సమయాన్ని గుర్తించలేని విధంగా మారింది. పగటి షిఫ్టులో పనిచేసిన సిబ్బంది ఇళ్ళకు వెళ్ళిపోయి కొత్తవాళ్ళు డ్యూటీకి వచ్చారు. వార్డులో ఉన్న రోగులందరిలోకి పెద్దావిడ గొంతు సవరించుకొని చెప్పసాగింది. అక్కడ పనిచేసే నర్సులు ఆమెను గ్రాన్నీ అని పిలుస్తారు.

”చూడండి…నా భర్త పాతికేళ్ళ క్రితం చనిపోయాడు. అప్పట్నుంచీ, అంటే ఇరవయ్యేళ్ళుగా నేను ఒంటరిగా బ్రతుకుతున్నాను. ఆయన ఉన్నప్పుడు మేమెంతో సంతోషంగా ఉన్నాం. కానీ చనిపోయాక ఒక్కదాన్నీ… ఒంటిదాన్నీ అయిపోయాను. అప్పటినుంచి ఎవరూ లేకుండా బతుకుతున్నాను.”

ఆమె చెప్పేది వింటున్న గ్రాంట్‌ హఠాత్తుగా ఏడుపు ఆపేసింది. మిగతావాళ్ళు ఆశ్చర్యపోయి పెద్దావిడ వైపు మెచ్చుకోలుగా చేతులూపి సైగలు చేశారు. అయితే ఊహించని విధంగా ఈసారి గ్రాంట్‌ నుంచి కాకుండా మరో వైపు నుంచి ఏడుపు వినిపించింది. గది ఎడమ మూలన మంచం మీద పడుకొని ఉన్న స్త్రీ ఉన్నట్టుండి పెద్దగా రోదిస్తోంది. ఆమె కూడా ఒంటరి మహిళే. కానీ ఆమె వితంతువు కాదు. చాలా కాలం క్రితమే ఆమె భర్త ఆమెను వదిలేశాడు.

గ్రాన్నీ ఆమెను చూస్తూ పెద్దగా నిట్టూర్చి భుజాలు ఎగరేసింది. తర్వాత అందరినీ ఉద్దేశించి ”కొంతమంది మహిళలకు వాళ్ళ ఆదృష్టం గురించి తెలియదు” అంది విసుగ్గా.

”అవును, నిజమే. అదృష్టవంతులకు ఆ గ్రహింపు ఉండదు” ఎదుటి మంచం మీదున్న మిస్‌ కుక్‌ సమర్ధించింది.

”నా సంగతే చూడరాదూ. నేనందరికన్నా దురదృష్టవంతురాల్ని. నాది జాలిగొలిపే దయనీయ స్థితి. ఇంతవరకు నాకు పెళ్ళే కాలేదు. భర్త ప్రేమ, అనురాగం, తోడు, స్నేహం… ఈ అదృష్టాలేవీ తెలియవు. నా మనసుకు నచ్చి నాకు దగ్గరైనవాడు ప్రతిసారీ అందినట్లే అంది దూరమైపోయాడు. చివరికి తోడెవరూ లేక ఇలా ఒంటరిగా గుండ్రాయిలా మిగిలాను” తనను తాను ఎగతాళి చేసుకుంటూ, అది తనకు మామూలేనన్నట్టు చెప్పి పగలబడి నవ్వింది. తర్వాత తలతిప్పి చూసింది ఎవరు ఏ విధంగా రియాక్టయ్యారో అన్నట్లు.

బాధను నవ్వుగా మార్చుకుని బతుకుతున్న కుక్‌ మాటల్లోని విషాదాన్ని ఎవరెంత గ్రహించారో తెలియదుకానీ, ఇతర స్త్రీలు మిస్‌ కుక్‌ నవ్వుతో శృతి కలిపారు. కొద్దిసేపు వార్డులో ఆహ్లాదం కురిసి వాతావరణం కొంత తేలికైంది.

మిస్‌ కుక్‌ మంచి మాటకారి. హాస్య చతురత కలిగిన వ్యక్తి. బహుశా తనమీద తాను అలా జోకులేసుకోవడం ఆమెకు ఎంతోకాలంగా అలవాటైనట్లుంది. భారీ మనిషి. చక్కటి దేహఛాయ. వయసు డెబ్భై వరకూ ఉండొచ్చు. అయినా ఆమెలోని చురుకుతనం వల్ల చిన్నదానిలా కనిపిస్తోంది.

వార్డులో రోగులందరూ నిద్రకు ఉపక్రమించారు. నైట్‌ డ్యూటీలో ఉన్న నర్సు మళ్ళీ వచ్చింది. అన్ని మంచాల వద్ద తిరుగుతూ సమస్యలు కనుక్కొంటోంది. మిల్డ్రెడ్‌ గ్రాంట్‌ అందరినీ బాగా ఇబ్బంది పెడుతోందని డ్యూటీ దిగిపోతూ సహచర నర్సు చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. మిసెస్‌ గ్రాంట్‌ వైపు అనుమానంగా చూస్తూ పలకరించేందుకు దగ్గరకొచ్చింది. మళ్ళీ ఏమనుకుందో ”గుడ్‌నైట్‌ లేడీస్‌, గుడ్‌నైట్‌’ అని రోగులందరినీ ఉద్దేశించి చెప్పింది. తన మాట రోగులు పట్టించుకున్నారో లేదో పరిశీలించుకుంటూ లైట్లు ఆర్పేసి బయటికి వెళ్ళిపోయింది.

లైట్లు లేకపోయినా వార్డులో పూర్తి చీకటిగా లేదు. హాస్పిటల్‌ ముందున్న కారు పార్కింగ్‌ ప్రదేశంలోని పసుపురంగు నియాన్‌ లైట్ల వెలుగులు ఇక్కడివరకూ ప్రసరిస్తున్నాయి. గది గోడలమీద పల్చటి వెలుతురు, మసక చీకట్లు కలగలసిన పొడవాటి నీడలు పరుచుకున్నాయి. కిటికీలకు వేలాడుతున్న కర్టెన్లు తమ నారింజ రంగు ప్రకాశాన్ని కొంత కోల్పోయినట్టు కనిపించాయి.

మిల్డ్రెడ్‌ గ్రాంట్‌ హఠాత్తుగా మళ్ళీ ఏడవసాగింది. అది విని మిగతా స్త్రీలు ఆందోళన చెందారు. గ్రాంట్‌ మంచం ద్వారానికి దగ్గరగా ఉంది. ఆమెకు పక్కన వరుసగా రెండు మంచాల మీద ఇద్దరు నడివయసు రోగులు మిసెస్‌ జోన్లీ, మిసెస్‌ రోస్‌ మేరీ ఉన్నారు. ఇద్దరూ ఆరోగ్యంగానూ, హుషారుగానూ కనిపిస్తున్నారు. అది ఆస్పత్రి అని కాకుండా తమ ఇంట్లో ఉన్నట్లు వాళ్ళెప్పుడూ సందడి చేస్తుంటారు. ఎంతసేపూ ఫోన్‌లో తమ భర్తలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధుమిత్రులతో మాట్లాడుతూ హడావిడి సృష్టిస్తారు. వాళ్ళకేవో పనులు పురమాయిస్తారు. ఎన్నో విషయాలు చర్చిస్తారు. వివిధ పనుల్లో సలహాలు, సూచనలు చేస్తుంటారు. ఇంట్లోకి కావలసిన సరుకులు, అలాగే తమ కోసం ఇష్టమైన ఫుడ్‌ ఇక్కడినుంచే ఆర్డర్‌ చేసేస్తుంటారు. అంతేకాదు, ఇతర డాక్టర్లను కలిసేందుకు ఇక్కడినుంచే అపాయింట్‌మెంట్లు బుక్‌ చేస్తుంటారు.

వీళ్ళను చూసేందుకు చాలామంది కట్టకట్టుకుని ఆస్పత్రికి వచ్చేస్తుంటారు. పండ్లు, రకరకాల చిరుతిండ్లు, పూలబొకేలు, గడబిడగా మాటలు, చేసే హడావిడి, చూసేవాళ్ళకు ఆ మంచాల దగ్గరేదో ఫ్యామిలీ పార్టీ జరుగుతున్నట్టు ఉంటుంది.

చూస్తుంటే వాళ్ళేదో గర్భాశయ సంబంధ సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు కనిపించరు. వాళ్ళ దేహాలు తప్ప ఆత్మలు ఇక్కడ లేనట్లు కనిపిస్తుంది. వాళ్ళది మనోధైర్యమో, మొండిధైర్యమో చూసేవాళ్ళకు విచిత్రంగా తోస్తుంది. ఏదో విధిలేక, బలవంతంగా ఆస్పత్రిలో చేరినట్లు ఉంటుంది వాళ్ళ ప్రవర్తన.

అదే వరుసలో నాలుగో మంచం ఎప్పుడూ సెటైర్లూ… జోకులూ వేస్తుండే మిస్‌ కుక్‌ది. ఆమెకెదురుగా వృద్ధ వితంతు మహిళ. ఆమెకు పక్కన పొట్టిగా, బొద్దుగా ఉన్న అందమైన యువతి. ఉన్నత కుటుంబం నుంచి వచ్చినట్టుంది. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు. కానీ ఎప్పుడైనా క్లుప్తంగా మాట్లాడినా స్పష్టంగా శాసించినట్లు ఉండే స్వరం. ఎవరితో సంబంధం లేకుండా ఎప్పుడూ పుస్తకాలు, వాక్‌మన్‌తో తన ఏకాంతాన్ని ప్రత్యేకంగా సృష్టించుకుంటుంది.

వార్డులో ఇతర రోగులకు ఆమె ఎందుకో అంతగా నచ్చినట్లు లేదు. ఆ యువతి వార్డులో లేనప్పుడు ఆమె గురించి చిన్నగా గుసగుసలాడుకుంటారు. నిజానికి ఆమె స్థాయికి బయటేదైనా పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరొచ్చు. ఆ స్థోమత ఉందనే అందరికీ అనిపిస్తుంది. అలా కాకుండా ఆమె ఇక్కడ నేషనల్‌ హెల్త్‌ సెంటర్‌లో అబార్షన్‌ కోసం రావడం వెనుక ఏదో మతలబు, స్వార్థం ఉండే ఉంటాయని వాళ్ళు చెవులు కొరుక్కుంటారు. హాస్పిటల్‌లోనూ ఆమె ధరించే ఖరీదైన దుస్తులు, నడవడి అలా అనిపిస్తాయి.

ఆమెకు పక్కన మరో మంచంలో కొత్తగా పెళ్ళయిన యువతి ఉంది. ఆమెకీమధ్యనే గర్భస్రావమై ఏవో తీవ్రమైన సమస్యలేర్పడ్డాయి. నిశ్శబ్దంగా, నిస్త్రాణగా పడుకుంది. ముఖం అమాయకంగా, లేతగా ఉంది. ఆ ముఖంలో అంతులేని విచారం గూడుకట్టుకొని ఉంది. కానీ, పైకి తొణక్కుండా ధైర్యంగానే కనిపిస్తుంది. ఆమెకు అవతల మిల్డ్రెడ్‌ గ్రాంట్‌కు ఎదుటి మంచం మీద మరో నడివయసు స్త్రీ. ఒకప్పుడామె మంచి నర్తకి. ప్రస్తుతం నృత్య కార్యక్రమాలు చేసే వయసు దాటిపోయింది కనుక ఆమె డ్యాన్స్‌ టీచర్‌గా పనిచేస్తోంది. రెండ్రోజుల క్రితం ఇంట్లో పనిచేసుకుంటూ మెట్లమీద నుంచి జారిపడింది. ఫలితంగా అంతర్గత గాయమైంది. ఆమె మానసిక ఆందోళనతో ఉన్నప్పటికీ నిబ్బరాన్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ”ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. అప్పుడే ప్రపంచం మీతోపాటు శృతి కలిపి నవ్వుతుంది” అని సరదాగా అందరికీ చెప్తుంది. ”మీరు బలహీనులు కాకుండా ఉంటే అదే గొప్ప జీవితం” అన్నది కూడా ఆమె లక్ష్యమైనట్లు ఉంటుంది.

రోగులు తమ తమ పడకల మీద సర్దుకొని పడుకుంటున్నారు. బయట కారు పార్కింగ్‌ నుండి వచ్చే వెలుతురు వాళ్ళమీద మసగ్గా ప్రసరిస్తోంది. అలా అరగంట గడిచింది. లోపలినుంచి ఏడుస్తున్న శబ్దం ఇంకా ఆగకపోవడంతో నైట్‌ డ్యూటీ నర్సు లోపలికొచ్చింది. మిల్డ్రెడ్‌ గ్రాంట్‌ ఏడుపు ఆపలేదు. నర్సు ఆమె మంచం దగ్గరికొచ్చి నిలబడింది.

”మిసెస్‌ గ్రాంట్‌, ఏంటి మీరు చేస్తున్నది? మీరిలా రాత్రంతా ఏడుస్తూ ఉంటే ఇతర రోగులు కొద్దిసేపైనా నిద్రపోవద్దా? మీకు కూడా నిద్ర అవసరం. రేప్రొద్దున్నే మీకు ఒక టెస్ట్‌ ఉందన్న సంగతి మరిచారా? అనవసరంగా టెన్షన్‌ పడకండి. మీకొచ్చిన భయమేమీ లేదు. ప్రశాంతంగా నిద్రపోండి” నచ్చచెపుతూ అంది.

అయినా సరే, గ్రాంట్‌ రోదన ఆపలేదు. ఇంకా పెద్దగా రాగం తీసింది. కొద్దిసేపు ఓపిగ్గా చూసిన నర్సు ”సరే, నేనింత చెప్పినా మీరు వినడంలేదు. ఇంక నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు” అంటూ వెనుదిరిగింది. వార్డులో అందరినీ చూస్తూ ”ఇంకొద్ది నిమిషాల్లో మిసెస్‌ గ్రాంట్‌ ఏడుపు మానకుంటే బెల్లు కొట్టండి. ఆమెను వేరేచోటికి మార్చేస్తాం” అని చెప్పి వెళ్ళిపోయింది.

నర్సు కోపంతో అన్న మాటకి గ్రాంట్‌ స్వరం తగ్గించింది. కానీ ఏడుపు మాత్రం ఆపలేదు. వెక్కిళ్ళు అణచుకోవడం ఆమెకు సాధ్యపడడం లేదు. చిన్నపిల్లలా ఆమె వెక్కిళ్ళు ఏడుపును మించి వినిపిస్తూ ఇతరుల్ని ఒక విధమైన కంపనకు గురిచేస్తున్నాయి. అక్కడున్న ప్రతి స్త్రీ మనసు మూలలోనూ ఎంతో సున్నితమైన సహజ లక్షణాలు కలిగిన ఒక పసికందు దాగి ఉంది. కానీ ఆ పసిబిడ్డ తన సహజ హక్కులు, లక్షణాలను ఎప్పుడో కోల్పోయిందన్న వాస్తవాన్ని మిసెస్‌ గ్రాంట్‌ రోదన వాళ్ళకి బలవంతంగా స్ఫురణకి తెస్తోంది. ఆ పసికందుని శాంతింపజేసే, సంతోషపెట్టే క్రమంలో తామెన్ని సంఘర్షణలు పడ్డారు, ఎన్ని విషాదాలు భరించారు, ఎన్నెన్ని కోల్పోయారో పలువురు గుర్తుచేసుకున్నారు.

గర్భస్రావమై చికిత్స పొందుతున్న అమ్మాయి తనలో తాను నిశ్శబ్దంగా కుమిలిపోతోంది. ఏడుపు బయటకు వినిపించకున్నా చెంపల మీద నుంచి జారుతున్న కన్నీళ్ళు మసకలో మెరుస్తున్నాయి. అందరూ ఆమెవైపు జాలిగా చూశారు. ఆ పక్క మంచం మీద నర్తకి మహిళ మెలికలు తిరిగిన స్థితిలో పడుకొని ఉంది. చిన్నపిల్ల మాదిరి తన కుడిచేతి బొటనవేలు నోట్లో పెట్టుకుంది. వార్డులో జరిగేదంతా గమనిస్తున్న హైక్లాస్‌ యువతి ఎవరి మాటలూ, ఏడుపులూ వినిపించకుండా చెవులకు వాక్‌మన్‌ ఇయర్‌ పీసెస్‌ తగిలించుకుని ఇష్టమైన సంగీతాన్ని మాత్రమే తన చెవులను చేరేలా జాగ్రత్త పడుతోంది.

మొత్తమ్తీద వార్డులోని స్త్రీలందరూ పరస్పరం తెలుసుకున్నట్లు, అర్థం చేసుకున్నట్లు ఒకరినొకరు చూసుకున్నారు. అంతరంగంలో తెలియని కంగారుగా ఉన్నారు. పైకి నిబ్బరంగా కనిపిస్తున్నారు. వారిలో ఏ ఒక్కరో… ఏ క్షణంలోనో భళ్ళున బద్దలై ప్రస్తుతం రోదిస్తున్న వాళ్ళకంటే పెద్దగా శోకాలు పెడతామేమోననే ఆందోళన వాళ్ళలో ఉంది.

చివరికి మిసెస్‌ రోస్‌ మేరీ స్టాంఫోర్డ్‌ తన వంతు ప్రయత్నంగా ”ఏమిటండీ ఇది? ఎవ్వరూ ఏమీ పట్టనట్లున్నారు? ఎంత చెప్పినా ఆమె ఏడుపు ఆపడంలేదు. అందరికీ ఇబ్బందిగా ఉంది. ఆమె ఈ వార్డులోనే ఉంటే మనమింక నిద్రపోలేం. నర్సులు ఆమెను వేరే చోటుకు మార్చాల్సిందే. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతా” గట్టిగా బెదిరిస్తూ ఆమె కదిలేలోగానే మిస్‌ కుక్‌ తన మంచం మీద నుంచి దిగుతూ ”ఒక్క నిమిషం ఆగండి” అంది.

భారీ మనిషి కావడం వల్ల ఆమె చురుగ్గా కదల్లేదు. పైగా తీవ్రమైన కీళ్ళనొప్పులు. అందుకే మంచం మీదనుంచి దిగడానికి కొంత సమయం పట్టింది. మంచం మీద ఉంచిన బ్యాగ్‌లోనుంచి డ్రస్సింగ్‌ గౌను తీసి నెమ్మదిగా వేసుకుంది. ఆ గది బాగా చల్లగా ఉంది. ఆమె చలిని అస్సలు తట్టుకోలేదు. అలాగని ఒళ్ళు వెచ్చబడేందుకు తోడ్పడే ఉలెన్‌ స్వెట్టర్లూ, కోట్లూ కొనుక్కుని ధరించే స్థోమత ఆమెకు లేదు. కింద స్లిప్పర్లు వెతికి కాళ్ళకు తొడుక్కుంది.

మిస్‌ కుక్‌ నర్సుకు ఫిర్యాదు చేసేందుకు స్వయంగా వెళ్తోందో, లేక టాయిలెట్‌కు బయల్దేరిందో కొద్ది క్షణాలపాటు అక్కడెవరికీ అర్థం కాలేదు. అంతా ఆమెనే చూస్తూ కాసేపు గ్రాంట్‌ ఏడుపు విషయం మరిచారు.

మిస్‌ కుక్‌ నెమ్మదిగా నడుస్తూ గ్రాంట్‌ వద్దకు వెళ్ళింది. ఆమె మంచం పక్కన ఆ రోజు పగలంతా గ్రాంట్‌ భర్త కూర్చుని వెళ్ళిన కుర్చీలో తన స్థూలకాయాన్ని కూలేసింది. తర్వాత ఆప్యాయంగా మిల్డ్రెడ్‌ భుజంపై చెయ్యేసింది. ”చూడమ్మాయ్‌, నువ్వలా అదేపనిగా ఏడవకూడదు” ప్రేమగా అయినా మందలించే స్వరంతో అంది. ”అలా ఎంతసేపని ఏడుస్తావు? ఆరోగ్యానికి అదంత మంచిది కాదు. నీకో సంగతి చెబుతాను విను. వింటావు కదూ! ఇక్కడున్న మనమందరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నవాళ్ళమనే సంగతి నువ్వు గ్రహించాలి. ఈ వార్డులో ఉన్నవాళ్ళంతా గర్భాశయ సంబంధమైన ఏదో సమస్యలతో బాధపడుతున్నవాళ్ళే. ఒక్కొక్కరికీ ఒక్కొక్క విధమైన జబ్బు. అందరూ కష్టాలు పడుతున్నవాళ్ళే. తమ జబ్బులకు వైద్యం కోసమే ఇక్కడికొచ్చారు. అంతెందుకు, నన్నే తీసుకో. నాకు పిల్లలు లేరు. జీవితంలో గర్బధారణకే నోచుకోని గర్భాశయం నాది. అలాంటిది ఈ వయసులో పెద్దాపరేషన్‌ చేయించుకొని గర్భసంచిని తొలగించుకోవాల్సిన దుస్థితి కలిగింది.”

మిస్‌ కుక్‌ ఈ మాటను ఏదో జోక్‌లాగా చెబుతూ బిగ్గరగా నవ్వేసింది. ఆమె పాతకాలపు శ్రామిక మహిళ. సూటిదనం, మోటుదనం ఆమె సహజత్వాలు. నిజానికి తాను చెప్పింది కొంచెం మంచి భాషలో ఎలా చెప్పాలో ఆమెకు తెలియక కాదు. ”గర్భసంచిని గురించి నేను మాట్లాడే పద్ధతి మోటుగా ఉండొచ్చు. దానిపట్ల నా దృష్టి విధానం కూడా సరైంది కాకపోవచ్చు. కానీ, ఈ గర్భసంచి జీవితంలో నాకోసం ఏం చేసిందని?” ఆగి ఒకసారి తలెత్తి అందరినీ చూసింది.

”లోపలెన్ని లోతులున్నా నేనెప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండేందుకే ప్రయత్నిస్తా. నవ్వడం అన్నిటికీ మంచిది” మిసెస్‌ గ్రాంట్‌ వెక్కిళ్ళను మించి పెద్దగా, అందరికీ వినిపించేలా అంది.

”చూడు బేబీ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకంటే నీ జీవితంలో ప్రతి రాత్రి నీకు గుడ్‌నైట్‌ చెప్పే ఒక మనిషి నీకు తోడున్నాడు. అదెంతో గొప్ప విషయం. ఈ అదృఫ్టం ఎందరికి ఉంటుంది? చాలామంది స్త్రీలకు ఊహల్లో తప్ప నిజజీవితంలో అనుభవంలోకి రానిది. అటువంటి మంచి భర్త నీకున్నాడు. ఇంత గొప్ప వాస్తవాన్ని నువ్వు గుర్తించలేదా?” అనునయిస్తూ రెండు క్షణాలు ఆగింది.

గ్రాంట్‌ ఏ ప్రతిస్పందన లేకుండా ఏడుస్తూనే ఉంది. కిటికీలోంచి ప్రసరించే మసక వెలుతుర్లో ఇతర స్త్రీలు ఈ సందర్భాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మిస్‌ కుక్‌ స్వరంలోని కారుణ్యం వాళ్ళని కట్టిపడేస్తోంది. కుక్‌ కొంత అలసటగా, ఆందోళనగా కనిపిస్తోంది. ఏదో నిగూఢ వేదన ఆమె అంతరంగాన్ని పరుచుకున్నట్లుగా ఉంది.

ఏడుస్తున్న మిసెస్‌ గ్రాంట్‌ భుజాల చుట్టూ చెయ్యేసింది. ”మరిక ఏడవొద్దు అమ్మాయ్‌. ఏడుపువల్ల మనసూ, ఆరోగ్యమూ రెండూ పాడవుతాయి” కుదుపుతూ చిన్నగా చెప్పింది.

హఠాత్తుగా మిస్‌ కుక్‌ వైపు తిరిగి ఆమె మెడచుట్టూ రెండు చేతులతో పెనవేసి భోరుమంది గ్రాంట్‌. కొంతసేపు

ఉధృతంగా రోదించి బరువు దించుకుంది. ”నా నిస్సహాయతను మన్నించండి. ఎంత ప్రయత్నించినా మామూలుగా ఉండలేకపోతున్నా. ఇప్పటివరకూ నేనేరోజూ ఒంటరిగా నిద్రపోలేదు. ఎల్లవేళలా నా టామ్‌ నాకు తోడుగా ఉన్నాడు”.

మిస్‌ కుక్‌ ఆమెను దగ్గరకు తీసుకుంది. తలనిమురుతూ చిన్నపిల్లలా లాలించింది. కుక్‌ కొద్దిసేపు అలాగే మౌనంగా

ఉండిపోయింది. ఆమె మనసులో ఏ జ్ఞాపకాలు కదిలాయో, ఏ విషాద పవనాలు వీచాయో తెలియదు కానీ ముఖం నిశ్చల గంభీరంగా

ఉంది. అంతర్లీనంగా ఆమె తనతో తానే సంఘర్షణ పడుతున్నట్టు అనిపించింది. పెద్దగా నిట్టూర్చి ఒకింత కఠినంగా అంది. ”ఇందాకే చెప్పాను, నువ్వు చాలా అదృష్టవంతురాలివని. ప్రతిక్షణం కంటికి రెప్పలా నీ భర్త టామ్‌ నీ వెంట ఉన్నాడు. మేమందరం… ఆ మాటకొస్తే చాలామంది అలాంటి స్థితి మాకూ కలిగితే బాగుండని కోరుకుంటాం. నువ్వు ఇందాకన్నావే ఒక్క రాత్రి కూడా నీ భర్తను విడిచి

ఉండలేదని. అదిగో, ఆ మాటలే మేమూ చెప్పాలని అనుకుంటాం. కానీ సాధ్యం కాదుకదా. అందరికీ ఆ అదృష్టం ఉండదు కదా”.

కుక్‌ స్వరం హఠాత్తుగా విషాదాన్ని నింపుకుంది. అప్పటిదాకా ప్రదర్శించిన కాఠిన్యం పోయి మార్దవంగా చెప్పింది. ”నువ్వింత బేలవైతే ఎట్లా అమ్మాయి? నీ ఈ ఒంటరితనం ఒక్క రాత్రికేగా. రేపొద్దున్న నీ భర్త నీ కళ్ళముందుంటాడు. ఇది చాలామంది ఉండే అస్పత్రి. ఇక్కడ కూడా మీ ఇంట్లో మాదిరి ఉండాలంటే కుదరదుగా. ఈ మాత్రం దానికి ఇంతమందిలో ఏడవటం ఎంత అవమానం?”

మిస్‌ కుక్‌కు సంతానం లేదని, అసలు పెళ్ళే కాలేదని, ఒంటరిగా జీవిస్తోందన్న విషయాన్ని ఇతర మహిళలు గుర్తు చేసుకున్నారు. కుక్‌ ఇప్పటివరకు తన పెంపుడు పిల్లిని తప్ప మరెవరినీ అంత ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని లాలించిన అనుభవం లేదు. అలా అక్కున చేర్చుకునేందుకూ, అనురాగాన్ని పంచేందుకూ ఆమెకీ లోకంలో అయినవాళ్ళెవరూ లేరు. ఇంతకాలానికి ఆమెకిప్పుడా అనుభవం ఎదురైంది. మొదటిసారి కుక్‌ చేతులు సాటి మనిషిని కావలించుకొని ఉన్నాయి. దశాబ్దాల ఆమె జ్ఞాపకాల దొంతరలో మరో మనిషిని దగ్గరకు తీసుకోవడం ఉద్వేగభరిత అనుభవంగా ఉంది. ఇదామెకు కొత్త అనుభూతి కలిగించింది. కొంచెంసేపు ఆమె అప్పటివరకు తనకే తెలియని ప్రేమమయమైన మరో లోకంలో విహరించినట్లయింది. ఆ లోకం చాలా వేరుగా ఉంది. అక్కడ మనుషులు ఆప్యాయతలు కురిపిస్తున్నారు. ప్రేమలు పంచుకుంటున్నారు. ఒకరినొకరు సన్నిహితమై ఆలింగనాలు చేసుకుని, ముద్దులు పెట్టుకొని, రాత్రిళ్ళు సన్నిహితంగా పడుకొని, మధుర అనుభవాలు పంచుకుంటున్నారు.

కలలాంటి ఆలోచనల వలయం నుంచి మిస్‌ కుక్‌ హఠాత్తుగా బయటపడింది. క్షణంపాటు మసక చీకట్లో ఏమీ కనిపించలేదు. ఒళ్ళంతా పదునైన ఆయుధాలు గుచ్చుకున్నట్లు అనుభూతి చెందింది. తర్వాత సర్దుకొని చెప్పసాగింది. ఇదివరకు మందలింపు ధోరణి లేదు. తనకు సంబంధంలేని ఆలోచనల నడుమ ఆమె కంఠంలో అవ్యక్తమైన ఆవేదన తొణికింది. ”చూడమ్మా… ఇంత చిన్న విషయానికి అంతలా ఏడుస్తారా ఎవరైనా? నీ ఆరోగ్యం ఏమవుతుంది? పెద్దదాన్ని చెబుతున్నా. నా మాట విని మరో యోచన లేకుండా పడుకొని నిద్రపో. చిన్నపిల్లలా ఏడవద్దు. అందరూ ఏమనుకుంటారు? నీకేం ఫర్వాలేదు. రేపుదయానికల్లా నీ టామ్‌ నీ ముందుంటాడు సరేనా?”

కొద్ది నిమిషాల తర్వాత మిసెస్‌ గ్రాంట్‌ ఎక్కిళ్ళు తగ్గిపోయాయి. ఆమె ఏడవటం పూర్తిగా ఆపేసింది. కొన్ని గంటలుగా రోదించి బాగా అలసిపోయిన ఆమెను పసిపిల్ల మాదిరి జాగ్రత్తగా బెడ్‌మీద పడుకోబెట్టింది కుక్‌. ఆమె మెడవరకూ దుప్పటి కప్పింది. అలాగే కొన్ని క్షణాలు నిలబడి నిద్రపోతున్న గ్రాంట్‌ కేసి తదేకంగా చూసింది. మిస్‌ కుక్‌ ముఖం ఏ భావాలు వ్యక్తం కాకుండా, రహస్యాలు దాచుకున్నట్లు లోతుగా ఉంది. దీర్ఘంగా నిట్టూర్చి మెల్లగా తన మంచం దగ్గరకు వెళ్ళింది. అంతకుముందు ధరించిన గౌను విప్పేసింది. చెప్పులు మంచం కిందికి నెట్టి నెమ్మదిగా మంచం మీద వాలింది.

ఇదంతా చూస్తున్న ఇతర మహిళలు ఆ గదిలో చీకటంత నిశ్శబ్దంగా తమ అంతరంగాలతో సంభాషించుకున్నారు. వార్డులో తెలియని గంభీరత అలముకుంది. ఆ వాతావరణాన్ని తేలికపరిచేందుకు చొరవగా ఎవరైనా ఏదైనా మాట్లాడటం అవసరం. మిస్‌ కుక్‌ మళ్ళీ తానే పెదవి విప్పింది. ”అందరూ చూశారుగా. మీరూ జీవించి నేర్చుకోండి” అని వ్యాఖ్యానించింది. అంతా మౌనంగా ఉండిపోయారు. ఎవరికి వారే తమవైన లోకాల్లో తిరుగాడుతూ త్వరగా నిద్రపోయారు.

(సారంగ వెబ్‌ మ్యాగజైన్‌ నుండి)

Share
This entry was posted in అనువాదాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.