ఏ మహిళల దినమిది?
రాత్రి రెండు కొసల నుంచి
కొంత తన పగటిలో చేర్చి
సంసారం బండి నడపటానికి
రెండు, నాల్గు, ఆరు ఎన్ని చక్రాలైనా
ఆమే అవగలదని గుర్తించిన రోజునా?
అందరి విజయాలు సంబరమైన వేళ
ఆమె కళ్ళు సంతోషం వర్షించిన చోట
ఆమె పాదాల నెత్తుటి ఆనవాళ్ళు కనిపిస్తే
ముళ్ళు మొలిచిన తన కలల సమాధులపై
నిల్చున్నందుకని గుర్తించిన రోజునా?
చింపి పోగులు పెట్టిన తన
ఆత్మగౌరవపు పీలికలపై నుంచి
చిరునవ్వులతో రోజూ నడిచిపోతుందనా
తృప్తిపడని అహాలు చిమ్మే విషాన్ని
మనసు వాకిల్నుంచి ఉదయాన్నే చిమ్మేసి
కొత్త ముగ్గుతో తన రోజు అలంకరించుకుంటుందనా?
మానానికీ, ప్రాణానికీ, ఆత్మాభిమానానికీ
గడ్డిపోచంత విలువ ఏ సంస్కృతి చూపిందని,
అమ్మలకీ అమ్మాయిలకీ వైఫైకున్న విలువ లేని
వర్చువల్ వర్డ్ల్లో శీలం పోవడమంటే
రెండ్రోజుల టీఆర్పీలు పెరగడమని
మీడియా బ్రేకింగ్ న్యూస్‌ల వరదలో
శీలం విలువ కొన్ని క్షణాలని
టీవీ రిమోట్ సాక్షిగా సమాజం ఫిక్స్ అయిందనా?
అండర్వేర్ లేని మాలవేర్ అన్ని నానో చిప్స్,
మగ హార్డ్ డిస్క్లలోనూ చేరి
పార్లమెంటులోనే పాస్టైమ్ అయ్యాకా
ఆమె రేపిస్ట్‌నే ఆమె మైనారిటీ తీరాకా
పెళ్ళాడి శిక్ష తప్పించమని తీర్పిచ్చాకా
న్యాయానికి మెజారిటీ రావడానికి ఎన్నేళ్ళు
ఎన్ని మైలా దినాలు జరుపుకోవాలో తెలియనందుకా?
ఏ మహిళా దినమిది, ఏ మహిళల కోసమిది
ఎవరికి ఎవరు పెట్టే తద్దినమిది?