నిన్న మొన్నటివరకు మన మధ్య చలాకీగా తిరిగిన కల్పన హఠాత్తుగా మాయమైపోయిందంటే ఇంకా నమ్మశక్యంగా లేదు. ఇట్లా తన గురించి రాయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. బరువెక్కిన హృదయంతో కన్నీటిని తుడుచుకుంటూ రాస్తున్నాను.
యాక్టివిస్ట్, కార్యకర్త, ఉద్యమకారిణి, నాయకురాలు… ఇట్లా తనను ఎన్నిరకాలుగా వర్ణించవచ్చో వాటన్నింటికీ సరైన నిర్వచనం కల్పన. చిరునవ్వుతో, విషయ పరిజ్ఞానంతో, వాక్పటిమతో అందరి మనసులు గెలుచుకుంది కల్పన. తను ఇక లేదు అన్న దిగ్భ్రాంతి గొలిపే వార్త తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో తనకు నివాళి అర్పిస్తూ, జోహార్లు పలుకుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామీణ ప్రాంత కార్యకర్తలు పెట్టిన పోస్టులు చూసినప్పుడు కల్పన ఎంతమంది ప్రజా సంఘాల కార్యకర్తలతో కలిసి పనిచేసి, వారిపై ఎంత బలమైన ముద్ర వేసిందో అర్థమవుతుంది. మహిళలపై హింస, పేద ప్రజల హక్కులు, చేనేతను నిలబెట్టటం… ఇలా అనేక అంశాలపై క్షేత్రస్థాయిలో ఆయా సంస్థలతో కలిసి పనిచేసింది కల్పన. అనేక సంస్థలలో మహిళల పని ప్రదేశంలో వేధింపుల నివారణ కోసం ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో సభ్యురాలిగా ఉండేది.
కల్పనతో నాకు ఎనిమిదేళ్ళ పరిచయమే అయినా చాలా కాలంగా తెలుసనే అనిపిస్తుంది. తను యాక్షన్ ఎయిడ్ సంస్థలో పనిచేస్తున్నప్పుడు నాకు పరిచయం. అనేక సమావేశాలు, వర్క్‌షాప్‌లలో కలిశాం. కొన్నిసార్లు కలిసి ప్రయాణం చేశాం. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కానీ ఒకటి, రెండు సంఘటనలు మాత్రం మనసులో నిలిచిపోయాయి. ఎప్పుడూ చేనేత దుస్తులలో హ్యాండ్లూమ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌లాగా ప్రత్యేకంగా కనిపించేది.
ఒకసారి భువనగిరిలో స్వరభారతి మహిళా సహకార సంఘం వార్షికోత్సవానికి కలిసి వెళ్ళాము. పెద్ద హాలులో 300 మందికి పైగా గ్రామీణ మహిళలు హాజరయ్యారు. మేమిద్దరమూ కాకుండా కొంతమంది స్థానిక బ్యాంక్ అధికారులు, ఎం.పి.టి.సి, రాజకీయ నాయకులు… అందరూ మగవాళ్ళు వక్తలుగా హాజరయ్యారు. ముందుగా వాళ్ళంతా మాట్లాడారు. మహిళల సాధికారత గురించి వాళ్ళు పెద్ద పెద్ద మాటల మాట్లాడారు. సమావేశానికి హాజరైన మహిళలకు వాళ్ళు చెప్పింది పెద్దగా అర్థం కాలేదు. తర్వాత కల్పన లేచి మాట్లాడిరది. ముందుగా అందరి దృష్టినీ తనవైపు తిప్పుకునే విధంగా వాళ్ళతో సంభాషణ మొదలుపెట్టింది. వాళ్ళ భాషలో ప్రశ్నలు అడిగింది. కొంత హాస్యం కలిపి విషయాలు వివరించింది. హాజరైన మహిళలందరూ కల్పనవైపు కళ్ళార్పకుండా చూస్తూ ఆమె చెప్పేది విన్నారు. సమావేశానికి హాజరైన పత్రికలు, టీవీల వాళ్ళు కూడా స్థానిక అధికారులను వదిలేసి కల్పన బైట్స్ తీసుకున్నారు, ఇంటర్వ్యూ చేశారు. ఆ రోజు తను అంత బాగా మాట్లాడిరది. మీటింగ్ అయిపోయిన తర్వాత స్త్రీలందరూ వచ్చి కల్పనను చుట్టేశారు, చేతులు కలిపారు.
కల్పనకి పాటలంటే ప్రాణం. ఒకసారి చెన్నైకి రైలులో వెళ్తున్నాము. సాయంత్రం ఆరు గంటలకి రైలెక్కితే పది గంటలకి పడుకునే వరకు పాటలు పాడుకుంటూనే ఉన్నాము. పాత తెలుగు, హిందీ పాటల లిరిక్స్ ఏది కావాలంటే అది తన ఫోన్‌లో రెడీగా ఉండేవి. తాను పాడుతుంటే మిగిలిన వాళ్ళం కూడా కోరస్ కలిపి సరదాగా పాడుకున్నాం. ఇంట్లో కూడా తన ఇద్దరి కూతుళ్ళతో కలిసి వీలైనప్పుడల్లా పాటలు పాడుకుంటామని చెప్పింది.
మూడేళ్ళ క్రితం క్యాన్సర్ వచ్చినపుడు మాలాంటి వారెవ్వరికీ ఆ విషయం తెలియనివ్వలేదు. 2018లో ‘మార్పు కోసం మహిళా మార్చ్’ అనే జాతీయ స్థాయి కార్యక్రమం ప్లానింగ్ కోసం ఐద్వా ఆఫీసులో మీటింగ్ పెట్టినపుడు తలకు విగ్ పెట్టుకుని వచ్చింది. అప్పుడు తెలిసింది, తనకు క్యాన్సర్ వచ్చిందని. దానికోసం ట్రీట్‌మెంట్‌లో భాగంగా కీమోథెరపీ ఫలితంగా జుట్టు ఊడిపోయిందని చెప్పింది. ఆ పరిస్థితిలో కూడా మీటింగ్‌కి వచ్చి, తర్వాత మార్చి 8వ తేదీన జరిగిన ఆ కార్యక్రమంలో పాల్గొంది, ఇంకా చాలామందిని పాల్గొనేటట్లు ప్రోత్సహించింది.
తనను చివరిసారి చూసింది 2021 ఫిబ్రవరిలో గిరిజా పైడిమర్రి వాళ్ళింట్లో చిన్న గెట్ టుగెదర్ లో. అప్పుడు కూడా ఎప్పటిలాగే చాలా ఉత్సాహంగా కనిపించింది. అంతకుముందు కొన్నాళ్ళు తనకు ఆరోగ్యం బాగుండలేదు. కానీ ఇప్పుడు చాలా బాగున్నానని చెప్పింది. పనిచేయడంతో పాటు జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో, ఎలా అనుభవించాలో కల్పనను దగ్గరగా చూసిన తర్వాత మరింత స్పష్టంగా అర్థమైంది.
నాకంటే వయసులో 20 ఏళ్ళు చిన్నది. కానీ స్నేహానికి వయసు అడ్డుకాదు కదా. ఒక అందమైన, ఆనందకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయిన కల్పనకు హృదయపూర్వక నివాళి. ప్రియ మిత్రమా! కల్పనా! నువ్వెప్పుడూ మాతోనే, మా ఆలోచనలలోనే ఉంటావు.