ఇంకా చెమర్చగల కళ్ళున్న వృద్ధులను చూసినప్పుడు
నా హృదయం బాధతో అల్లాడుతుంది
ఇక దేన్నీ మోయలేని, ఏమీ దాచుకోలేని
పసిపిల్లల అమాయకపు బిత్తర చూపులతో
అందాకా ఎవరి కోసమో పరుగెత్తిన పాదాలను
మరెవరి కోసమో ఎన్నెన్నో పోగేసిన చేతులను
ఇక ఇప్పుడు ఏమి చేయాలో తెలియక
వాలిపోయిన వాటికేసి తికమకగా చూస్తారు
వేగంగా దూసుకుపోయిన రైలుబండి
దృశ్యాలను తనతో పాటు ఈడ్చుకు పోయినట్లుగా
జీవితపు వేగానికి అన్ని అనుభవాలూ
లోనికి ఇంకని అస్పష్ట నీటి చిత్రాలై చెరిగి పోయాక
వాళ్ళకు తెలియకనే కళ్ళనిండా నీళ్ళు నిండుతాయి
నిజంగా వాళ్ళు ఎలా ఉండాలని అనుకున్నారో
అలా ఎన్నడూ ఉండలేక పోయినవాళ్ళని
నిజంగా వాళ్ళు ఎలా ఉండకూడదని అనుకున్నారో
అచ్చం అలాగే ఉండవలసి వచ్చిన వాళ్ళని
ఆ మునిమాపు వేళ తెలిసిపోయిన తర్వాత
భయవిహల్వతని దాచుకోలేని వాళ్ళ కళ్ళు చెమరుస్తాయి.
మంచివాళ్ళు, దుష్టులు, పిసినారులు, ఉదారులు,
నిరంకుశులు, సౌందర్యవంతులు, అనాకారులు,
దీనులు, హీనులు, విఫల ప్రేమికులు, ధార్మికులు,
కులహీనులు, నాస్తికులు అన్న మకుటాలను పొందేందుకు
వాళ్ళ యవ్వనకాలం నుండి ఎంతగానో
శ్రమించిన వాళ్ళు కావచ్చు వాళ్ళు.
అనేక రంగు రంగుల ఆకర్షణీయ రూపాలలోకి దూరి
ఎంతో గట్టిగా ఇంత కాలంగా పట్టుకున్న
వాళ్ళ యవ్వనాలు, సంపదలు, అహాలు,
అధికారాలూ, బంధాలూ
వాళ్ళకు తెలియకుండానే పండిన ఆకుల వలే
చేతుల నుండి నేలజారిపోయాక
ఇప్పుడు నిస్సహాయ పసిపిల్లలవలెనో
లోకం ఎరుగని అమాయకపు అల్లరి పిల్లల వలెనో
అకారణంగా ఏడ్చి, నవ్వి, అలిగి, కోపించి, ప్రేమించి
ఎవరికీ ఏమీ తోచనివ్వరు వాళ్ళు
శిశువు కళ్ళలోని అనిర్వచనీయ
అలౌకిక భాషవలే ఉండే
వృద్ధుల కళ్ళల్లోని కన్నీటి భాషను
చదివే తీరిక ఎవ్వరికీ లేదు ఈ లోకాన
అనేక అనుభవాల భారాలను మోసిన
వృద్ధుల హృదయాలు ఇప్పుడిక
జల్లెడల వలే అనేక చిల్లులు పడి
ప్రతి అనుభవమూ, జ్ఞానమూ దుఃఖమై
వెచ్చటి కన్నీటి జల్లయి కురుస్తుంది
ఏ మాటలూ నిలకడగా మనసు నిండా
పట్టి నిలపలేని ఆ ముసలి వారిలో కూడా
వాళ్ళ అమ్మ పెట్టిన భోజనపు రుచుల పరిమళాలు
నాన్న కోపాలూ, తొలి యవ్వనపు ప్రేమలూ
విరహోద్వేగ మధుర క్షణాలూ
ఇంకా పదిలంగానే మిగిలి ఉంటాయి
పలకరించే తీరికలేని పనుల మధ్య
మనం మునిగి తేలుతున్నప్పుడు
ఒక్క మాటన్నా లేకుండా
వాళ్ళు మనకేసి అలానే చూస్తూ కూర్చున్న దినాలు
గుర్తుకు వస్తాయి ఎప్పుడన్నా
అప్పుడు వాళ్ళ తడి తడి కళ్ళు
ఏమి చెప్పి ఉంటాయంటే
మరేం లేదు
మేము కొంచెం మాట్లాడతాము
మీరు విన్నట్లు నటించండి
అలాగే మీరు మాతో కొంచెం ప్రేమగా
మర్యాదగా మాట్లాడుతున్నట్లు నటించండని
ఆ వృద్ధులకు తెలుసు ఇక వెళ్ళిపోక తప్పదని
దానిపై వాళ్ళకు ఏ మీమాంసా, పేచీ లేదు
ఆ చివరి ప్రయాణపు దారులు
అందుకు జరిగే ఏర్పాట్లలోని
అనిశ్చితతే వాళ్ళను వణికిస్తుంది
ఈ ప్రయాణంలో ఎవరూ తోడురారన్న చింత
వాళ్ళకు ఇసుమంత కూడా ఎన్నడూ లేదు
ఒక్కరుగానే ఏమీ తీసుకు రాకుండా
ఒక్కరుగానే ఏమీ తీసుకుపోకుండా
వచ్చామన్న మాటలను లెక్కలేనన్ని
మార్లు విని ఉన్నవాళ్ళు వాళ్ళు.
హీనమై, భారమై, పశ్చాత్తాపాలతో పేగ్ధమై
గత కాలపు వైభవోపేత సామ్రాజ్యాల
పతన, పరాజయ, పరాభవాల గాధలను
తలచుకొని, తలచుకొని విలపిస్తారు
వాళ్ళ చీకటి మూసిన ఏకాంతంలో
కొంచెం వీలుచేసుకుని పక్కన కూర్చుని
ముడతలుపడ్డ వాళ్ళు పైకి లేచేందుకు అందించు
అనేక సంగతులను బడి నుండి మోసుకువచ్చి
తల్లికి వినిపించే పిల్లలవలే వాళ్ళు
ఏనాటి సంగతులనో గలగలా అదే పనిగా వినిపిస్తారు
భరించడం ఎంతో కష్టంగా ఉన్న
వాళ్ళ పెంకితనాలను, అకారణ ఆగ్రహాలను
ఫిర్యాదులను, దుస్తులను మురికి చేసుకోడాలను
కొంచెం సహించు
ఎందుకంటే వాళ్ళు వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది
ఒకవేళ ఉండమని మనం అడిగినా
ఉండజాల లేమని వాళ్ళకు తెలుసు
మనకు తెలియకనే మన కళ్ళు చెమరిస్తున్నప్పుడు
నెరిసిన తల వెంట్రుకలు, చర్మంపై ముడతలు
మన నిర్వవ్యాపకతలు, ఒంటరితనాలు
ఖాళీ అయిన హృదయాలు, అవ్యక్త గాయాలూ
ఎంతో భారమై తోచినప్పుడు మనం కూడా
వృద్ధులమైనట్లు అనుకోవచ్చు
ఎన్నడన్నా
నన్ను పలకరించేందుకు మీరు వచ్చినపుడు
నా కళ్ళు చెమ్మగిల్లితే ఈమెని కూడా ముసలితనం
ఆవరించిందని గ్రహించి
కొంచెం దయగా నా చేయి పట్టుకుని
నా పక్కన కూర్చుని, నా కళ్ళలోని
కన్నీటి భాషను కూడబలుక్కుని చదివేందుకు
ప్రయత్నించండి చాలు
ఇంకా చెమర్చగల కళ్ళు, కలలూ ఉన్నందుకు
అప్పుడు నేను ఒకింత గర్విస్తాను