పెళ్ళంటే మూడుముళ్ళు
ఏడడుగులు కట్నాలు కానుకలు
పట్టువస్త్రాల బంగరు వన్నెల
దగదగలు దాండియా నృత్యాల నడుమ
బుల్లెట్టు బండెక్కి పోయే
కన్యాదాన వైభవోపేత మహోత్సవం కాదు.
జీవితమంతా కలిసి నడవ వలసిన
రెండు హృదయాల అపూర్వ సంగమం…
పెళ్ళంటే కనిపించని అరుంధతీ
నక్షత్రం కోసం వెతుకులాట కాదు…
ఆకాశంలో సగం నీ జీవిత భాగస్వామిగ
నీ ఎదుటే నిలుచున్న మహా స్వప్నం…
కొత్త బ(క)ంగారు లోకాల్లోకి అడుగిడే
ఆ జంట ఒకరిలోకి ఒకరు తొంగి
చూసుకోవాల్సిన ఉద్విగ్న క్షణాలవి.
పెళ్ళంటే… కాళ్ళు తొక్కడం
వేళ్ళు గిచ్చడం కాదు
ఒకరినొకరు గుండెల్లో
గూడుకట్టుకున్న అసమాన
ఆధిపత్యాల అహంకారపు గోడలను
కూలగొట్టుకొని సమానతా ‘ప్రేమ’
సౌధాల్ని నిర్మించుకోవాల్సిన సందర్భం…
పెళ్ళంటే…
కార్లు కలర్ టీవీలు …………
బంగరు ఆభరణాలు పట్టు వస్త్రాల
దగదగల మడతల్లో ఫోటో ప్రదర్శనే కాదు.
వంటిమీద నగల వెనుకాల
ఆమె హృదయ స్పందనల్ని
వినగలగడం…
పట్టు చీరల మడతల్లో
ముడుచున్న ముతక ఆలోచనల్ని
మూఢ అంధకారాల్ని సరిచేసుకొని
అరమరికలు లేని మరో ప్రపంచంలోకి
అడుగేయడం…
పెళ్ళంటే… దోసిళ్ళకొద్దీ తలంబ్రాలు
పోటీపడి పోసుకొని… అప్పగింతల్లో
దుఃఖ సముద్రాల్ని ఈదడం కాదు.
జీవన గమనంలో ఎదురయ్యే
సవాళ్ళను బతుకుబాటలో ఎక్కి
దిగాల్సిన ఎత్తు పల్లాలను
మగువకు మనసుంటుందని…
మగపెత్తనపు కోటల్ని మనసు
సుత్తెల్తో సున్నితంగా చెక్కుకొని
మానవీయంగా బ్రతికే మనుషులుగా
చెక్కుకోవడం… పెళ్ళంటే
సామాజిక సహజీవనంలా
సాగాల్సిన జీవన సమరం!