భూమికతో నా ప్రయాణం
ఈ మధ్య కొన్ని సందర్భాలు నా సాహిత్య సామాజిక ప్రయాణం మొదలై ముప్పయ్ నలభై ఏళ్ళయిందని గుర్తు చేస్తే అప్పుడే అన్నేళ్లు గడిచిపోయాయా!? అని అశ్చర్యపోయా.. ఆ ప్రయాణంలో నా నేస్తాలు పత్రికలు పుస్తకాలే కదా! అలా నాకు లభించిన ఒక నేస్తం భూమిక
పత్రిక. అది కూడా మూడుపదుల మైలురాళ్ళు దాటి వర్తమానంలో ప్రయాణం చేస్తున్నది. గతం వర్తమానంగా సజీవం గా ఉన్నప్పుడు భవిష్యత్తు మనదే… అన్న నమ్మకం పువ్వై పరిమళిస్తుంది కదా! మనమైనా, భూమిక అయినా స్త్రీ పురుష అసమానతలు లేని, ఆధిపత్యం లేని ప్రజాస్వామిక మానవ సంబంధాల కుటుంబాన్ని, సమాజాన్నీ, సంస్కృతిని కలలు కంటూనే కదా నడక మొదలుపెట్టింది!? ఈ సామూహిక నడకలో మనం ఎన్నెన్ని నేర్చుకున్నాం? స్త్రీ పురుష భేదమే కాక వివక్షకు కులం, మతం, ఒక్కొక్కప్పుడు ప్రాంతం కూడా కారణం అవుతున్న వాస్తవాన్ని తెలుసుకున్నాం. స్త్రీ పురుష అస్తిత్వాల పరిధి నుండి బయటపడి ట్రాన్స్ జెండర్ అస్తిత్వాన్ని గుర్తించి గౌరవించటం నేర్చుకున్నాం. స్త్రీలుగానే కాక బహుళ అస్తిత్వ సమూహాలలో భాగంగా అనేక అస్తిత్వాలతో జీవిస్తున్న మనం వాటి మధ్య వైరుధ్యం మిత్రపూరితమే కానీ శత్రుపూరితం కాదని గ్రహించాం. స్నేహం, సహానుభూతి, సోదరీ తత్వం అభివృద్ధి చేసుకొన్నాం. అన్ని అస్తిత్వాలు వర్గ సంబంధాలకు లోబడినవే అని రూఢ అవుతున్న కొద్దీ మన కార్యరంగం విస్తృతమవుతూ వచ్చింది. ఈ క్రమంలో మన సంభాషణలకు, మన అంతర బాహిర సంఘర్షణలకు, సంవేదనలకు వేదిక అయింది భూమిక. ఆ వెలుగులో భూమిక పత్రికను ప్రత్యేకంగా అధ్యయనం చేస్తే అది తెలుగునాట మూడు దశకాల మహిళా ఉద్యమ గతిక్రమాన్ని పటం కట్టి చూపుతుందని నా విశ్వాసం.
మహిళాజీవన అధ్యయనాలపట్ల, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైనా నాకున్న ఆసక్తిని సంతృప్తి పరచటంలో భూమిక నిర్వహించిన పాత్ర సదా గుర్తుంటుంది. భండారు అచ్చమాంబ స్త్రీ విద్యపై చేసిన ఉపన్యాస పాఠం భూమికలో వచ్చినప్పుడు చదివి ఉద్వేగానికి లోనయ్యాను. చరిత్రలో ఆలాంటి స్త్రీలు చేసిన కృషి మరుగున పడిపోకూడదని వాళ్ళ రచనలను, మహిళా ఉద్యమానికి వాళ్ళు వేసిన బాటలను, కార్యాచరణకు వాళ్ళు అందించిన అవగాహనను ఈ తరానికి అందించాలని అనుకొని పని చేయటానికి అది ఒక ప్రేరణ. 1875 నుండి 1903 వరకు జీవించి రచించిన ఇరవై ఎనిమిది మంది (28) స్త్రీ సాహిత్య సామాజిక కృషిని సమీక్షిస్తూ వ్రాసిన వ్యాసాల సంకలనం ‘తొలి అడుగులు’ ఈ సంవత్సరమే వచ్చింది. ఆనాటి స్త్రీల జ్ఞాన చైతన్యాల చరిత్రను నమోదు చేయటంలో, విమర్శనాత్మకంగా కొత్త తరానికి అందించటంలో భూమిక మరింత ప్రణాళికా బద్ధంగా పని చేయాలని ఆశిస్తున్నాను.
పరిశోధన విద్యార్థులకు భూమిక ఇచ్చే ప్రొత్సాహం అభినందనీయం. సబ్జెక్టు ఎక్స్ఫర్ట్ కమిటీని ఒకదానిని వేసుకొని విద్యార్థుల వ్యాసాలను రివ్యూ చేయించి ప్రచురించటం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కథ, కవిత్వం వంటి సృజనరచనలు మరింత ప్రభావవంతంగా ఉండే గాఢతను, పదునును సమకూర్చుకొనటానికి కూడా ఇలాంటి రివ్యూ కమిటీల అవసరం ఉంది.
వర్తమాన సందర్భాలను మహిళల కోణంనుండి పరీక్షకు పెట్టి నిగ్గు తేల్చే రచనలు భూమికలో విరివిగా రావాలని కోరుకొంటాను. భూమిక పాఠకురాలిగా, భూమిక రచయితగా నా ప్రయాణం కొనసాగుతుంది. అభినందనలతో….
` కాత్యాయనీ విద్మహే