ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 11

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌ అనువాదం : ఆర్‌. శాంతసుందరి
మా ఆయన ఇరవై నాలుగ్గంటలూ రచయితల గురించే ఆలోచిస్తూ ఉండేవారు. సత్యజీవన్‌ వర్మ గారితో కలిసి ‘రచయితల సంఘం’ (లేఖక్‌ సంఘ్‌) అనే సంస్థని కూడా తెరిచారు. ఆ తరవాత ఆ సంఘంలో ఎప్పుడూ ఈ విషయం గురించే చర్చ జరుగుతూ ఉండేది. 35లో ప్రగతిశీల రచయితల సంఘం ప్రారంభమైంది. దానికి మొదటి అధ్యక్షుడు కూడా మా ఆయనే.
ఆ పని మొదలుపెట్టిన ఘడియలు మంచివి కావేమో, దాన్ని ప్రారంభించిన మనిషే లేకుండా పోయారు. ఆలోచిస్తే, ఆయన సాహిత్యం కోసం ఎంత చేశారో కదా, అనిపిస్తుంది. ఇంకా ఏమీ సాధించ కుండానే, మధ్యలోనే అంతా వదిలేసి వెళ్లిపోయారు. అన్ని ప్రాంతీయ భాషలూ ఒకే దండగా తయారవాలనే ఉద్దేశంతోనే ఆయన భారతీ సాహిత్య పరిషత్తుకి ‘హంస్‌’ పత్రికని ఇచ్చారు. దానివల్ల అందరూ ఒక కుటుంబంలాగ ఉండగలుగుతారని, ఆయన అనుకున్నారు. దీనివల్ల దేశ రాజకీయాల్లోని చిక్కు ముడులన్నీ విడిపోతాయని ఆయన నమ్మారు. ఆయన బతికుండగానే పరిషత్తు ‘హంస్‌’ పత్రికని దూరంగా ఉంచింది. ఎంతో జబ్బుతో ఉన్నప్పుడు కూడా ఆయన ‘హంస్‌’ని మర్చిపోలేదు. గవర్నమెంట్‌ వాళ్లని జామీను కూడా అడిగింది. సాహిత్య పరిషత్తు జామీను ఇవ్వలేదు. దాంతో ‘హంస్‌’ పత్రిక ఆగిపోయింది.
ఆయనకి బాగా జబ్బు చేసింది, ”హంస్‌” పత్రికకి జామీను నువ్వు ఇచ్చెయ్యి. నేను కోలుకున్నాక దాని విషయం చూసు కుంటాను,” అన్నారు నాతో. ఆయన జబ్బు పడ్డారే అని నేను ఒక పక్క ఆందోళన పడుతుంటే, ఆయన ‘హంస్‌’ గురించి ఆందోళన పడసాగారు.
”ముందు ఆరోగ్యం కుదుట పడ నివ్వండి. మిగతావన్నీ వాటంతట అవే జరుగుతాయి,” అన్నాను.
”లేదు, జామీను కట్టెయ్యి. నేనున్నా లేకపోయినా ‘హంస్‌’ కొనసాగుతుంది. అది నా జ్ఞాపకార్ధం ఉండిపోతుంది,” అన్నారు.
నాకు ఏడుపు తన్నుకొచ్చింది. గుండె దడదడలాడింది. జామీను కట్టే ఏర్పాటు చేశాను. దయా నారాయణ్‌ నిగమ్‌ గారికి టెలిగ్రాం పంపించి రప్పించాను. మా ఆయన నిగమ్‌ గారిని చూడగానే ఏడవసాగారు. ఇద్దరూ చాలాసేపు ఒకర్నొకరు పట్టుకుని ఏడ్చారు. నేను కూడా ఏడ్చాను. ”మరోసారి కలుసుకుంటామో లేదో, ఇప్పుడే మీకు అన్ని విషయాలు చెపుతాను. ‘హంస్‌’ కి జామీను కట్టడానికే మిమ్మల్ని పిలిపించాను,” అన్నారాయన.
”ధున్నూ ఎప్పుడో కట్టేశాడు,” అన్నాను.
ఆయన ఏ పనిచేసినా మనస్ఫూర్తిగా చేసేవారు. నామీద ఎంత ప్రేమ ఉండేదో, సాహిత్యమంటే కూడా అంతే ప్రేమ ఉండేది. ఈరోజు ఆయన లేరు. ఏ విషయాల గురించి నేను ఆయన మీద విసుక్కునే దాన్నో, విమర్శించే దాన్నో, వాటినే ఈరోజు పొగిడి పొగిడి అలిసిపోతున్నాను. ఆ విషయాలంటే నాకు అపరిమితమైన ప్రేమ, నాకు సంబంధించిన విషయాలకన్నా, ఆయనకి సంబంధించిన ఆ విషయాలంటేనే నాకెక్కువ ప్రేమ. అసలు నా రక్తంతో తడిపి వాటిని ఎప్పటికీ తాజాగా ఉంచాలని అనిపిస్తూ ఉంటుంది. నా అస్తిత్వం అంటూ ఏమీ లేదు. నా పరిస్థితిని నేను కాయితం మీద పెట్టలేకపోతున్నాను. ఆ గాయాలని నాలో దాచుకోవడానికి కారణం, వాటిని ఎప్పుడూ తాజాగా ఉంచుకోవాలనే. సాహిత్యాన్ని వాడిపోకుండా పచ్చగా ఉంచేవాళ్ళందరూ ఆయనకి సేవ చేసేవారనే నేను అనుకుంటున్నాను.
మహారాజు గారు అల్వర్‌
అది 1924వ సంవత్సరం. ఈయన లక్నోలో ఉండేవారు. ‘రంగు భూమి’ అచ్చవుతోంది. అల్వర్‌ సంస్థానంనించి రాజుగారి ఉత్తరం పట్టుకుని ఐదారుగురు వచ్చారు. రాజుగారు ఈయన్ని తన దగ్గరకొచ్చి ఉండమని కబురంపారు. ఆయనకి కథలూ, నవలలూ అంటే ఇష్టం. నెల నెలా నాలుగువందలు రొక్కం, కారు, బంగళా ఇస్తామని ఆయన ఆ ఉత్తరంలో రాశాడు. వచ్చిన వాళ్లకి ఈయన, తను చాలా తలతిక్క మనిషనీ, అందుకే ప్రభుత్వ నౌకిరీ కూడా వదిలేశాననీ చెప్పి, రాజుగారికి ఉత్తరం రాశారు,” మీరు నాకు ఉత్తరం రాసినందుకు ధన్యవాదాలు. నేను నా జీవితాన్ని సాహిత్య సేవకి అంకితం చేసేశాను. నేను రాసేదంతా మీరు చదువుతున్నందుకు ధన్యవాదాలు. మీరు నాకిస్తానన్న పదవికి నేను తగినవాడిని కాను. మీరు నేను రాసే రచనలని అంత శ్రద్ధగా చదవడమే నేను అదృష్టంగా భావిస్తున్నాను. వీలైతే ఎప్పుడైనా వచ్చి మీ దర్శనం చేసుకుంటాను.
ఒక సాహిత్య సేవకుడు,
ధన్‌పత్‌రాయ్‌.
తరవాత నాదగ్గరకొచ్చి, ”అల్వర్‌ రాజావారు నన్ను రమ్మన్నారు”, అన్నారు.
”ఎందుకు?”
”నన్ను ప్రైవేట్‌ సెక్రెటరీగా నియమించడానికి.”
”రాజా మహారాజాల దగ్గర మీరేం చేస్తారు?”
”ఏం? కారు, నాలుగు వందలు జీతం, బంగళా, అన్నీ ఇస్తారుట. బాగానే ఉంటుందిగా?”
”మీకసలు ఎవరితోనన్నా పడు తోందా?”
”అంటే నేను పోట్లాట రాయణ్ణనా నీ ఉద్దేశం?”
”ఉద్దేశం అంటారేమిటి, ప్రత్యక్షంగా కనబడటంలే? గోరఖ్‌పూర్‌లో ఇన్‌స్పెక్టర్‌ మీద కేసు వెయ్యడానికి తయారైపోయారు. మహోచాలో కలెక్టర్‌తో విరోధం పెట్టు కున్నారు. ముస్లిముల రాజ్యమై ఉంటే ఈ పాటికి చేతులు నరికేసి ఉండేవారని, ఆయన మిమ్మల్ని బెదిరించాడు. ఇక రాజులతో మీకెలా పొసుగుతుంది? అది అసాధ్యం! ఒక్కరోజు కూడా భరించలేరు. మీకు అన్నిటికన్నా చక్కగా సరిపోయేది కూలిపని. రాజుగారి చెప్పులు మోసు కుంటూ తిరగ్గలిగిన వాళ్లే అక్కడ పనిచెయ్యగలరు. ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా రాజుగారి దగ్గర ఉద్యోగం చెయ్యడం అనేది కుదరదు.
”కానీ నాకు కొన్నాళ్లు అక్కడికెళ్లి, ఆ కారులో తిరగాలనీ, బంగళాలో ఉండాలనీ అనిపిస్తోంది. ఇప్పుడు సంపా దిస్తున్న జీతంలో అవన్నీ ఎలా వస్తాయి?” అన్నారు.
నేను నవ్వి, ”ఇదెలా ఉందంటే, తన అవసరాలు తీర్చుకోవడం కోసం ఒక వేశ్య వేశ్యవాడకి వెళ్లి కూర్చోవటం లాగుంది! ఇక కూలీ పనే ధ్యేయంగా ఉన్నవాళ్లకి కార్లూ, బంగళాలూ కావాలన్న కోరిక ఉండదే!” అన్నాను.
”నాకులేకపోవచ్చు నీకుండచ్చుగా?”
”నాకే కనక అలాంటి కోరిక ఉంటే మిమ్మల్ని ప్రభుత్వోద్యోగం వదిలెయ్యమని అనేదాన్నా?”
”పిల్లలు ఇవన్నీ కావాలను కుంటేనో?”
”పిల్లలు ఈ కోరికల్ని తీర్చుకోవాలను కుంటే, సొంతంగా కష్టపడి తీర్చుకుంటారు. పైగా వాళ్లుకూడా మీలాగే తయారవాలి!” అన్నాను విసుక్కుంటూ.
”ఒకవేళ అలా తయారవకపోతే చావగొట్టి మరీ తయారుచేస్తావా?”
”అలా తయారు కాకపోతే, అసలు వాళ్లు నా పిల్లలే కాదనుకుంటాను”.
ఆయన నవ్వి, ”నేను ముందే రానని చెప్పానులే!” అన్నారు.
”నన్నలా విసిగించటం మీకు సరదా!”
”లేదు, నీకొకవేళ అలాంటి కోరిక ఉంటే తీరుద్దామనే ఆలోచనతో ఇదంతా మాట్లాడాను.”
”మీరు కథల్లో, నవలల్లో పాత్రలని చక్కగా మలుస్తారు, కానీ నన్ను అర్థం చేసుకోవటం అంత కష్టమా?”
”నవలలూ, కథలూ నా ఇష్టప్రకారం తయారవుతాయి. కానీ అవతలి వ్యక్తిని నా ఇష్టం వచ్చినట్టు ఎలా మలుచుకోగలను? అలా బలవంతంగా ఎవరినీ మార్చే ప్రయత్నం చెయ్యకూడదు.”
”నేను కూడా నాకు నచ్చని వ్యక్తితో కలిసి బతకలేను.”
”సరే, ఒప్పుకుంటున్నాను, నా ఇష్టమే నీ ఇష్టం కూడా, సరేనా?”
ప్రెస్‌లో పని ఒత్తిడి
ఆయేడాదే జరిగిన మరో సంఘటన… నేను ఊళ్లో ఉన్నాను. అది ఆశ్వయుజ మాసం. ఆయనకి మలబద్ధకం పట్టుకుంది. రెండు నెలలు గడిచినా తగ్గలేదు. మందుకోసం నేనిచ్చే డబ్బుని ప్రెస్‌లో ఇచ్చేసి వచ్చేవారు. ఎవరు పడితే వారితో వైద్యం చేయించుకునేవారు. ఆ వైద్యులు బాధ్యతగా చికిత్స చేసేవారు కారు. మందు అలా రెండు నెలలపైగానే వేసుకున్నారు. కానీ ఆరోగ్యం కుదుట పడటం లేదు. ఇక ఆయన త్వరగా కోలుకోరని నాకర్థమై పోయి, ”పదండి, మన పల్లెటూరికి పోదాం,” అన్నాను.
”ప్రెస్‌ పని ఎవరు చూస్తారు?” అన్నారు.
”ఆరోగ్యం బాగవటం లేదుగా, మరేం చేద్దాం?”
”కానీ నాకు చాలా పని ఉంది,” అన్నారు.
నాకు కోపం వచ్చింది, ”పనీ లేదు గినీ లేదు. ఎవరో ఒకరు చూసుకుంటారు.”
”పని అలా వదిలేస్తే ఎలా? అది ముగించాకే తీరిక దొరుకుతుంది.”
ఇక ఈయన కదిలేట్లు లేడని తెలిసి పోయాక, ”సరే మీరొక్కరే ఇక్కడ ఉండండి. నేను ఊరికి పోతున్నా!” అన్నాను.
”నాకోసం సామానంతా ఇక్కడే ఉంచి,” అన్నారు.
”పిల్లలు మాత్రమే నాతో వస్తారు. అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తాను.”
బైట మా బావగారు కూర్చుని ఉన్నారు. మా అమ్మాయితో, ”సాయంత్రం ఇంటికెళ్లేప్పుడు నేను కూడా ఆయన వెంట వస్తున్నానని పెదనాన్నగారితో చెప్పిరా,” అన్నాను.
ప్రెస్‌కి వెళ్లేముందు, ”సామానంతా సర్దు. నేను కూడా వస్తున్నా,” అన్నారు.
”మీరిక్కడే ఉండండి, ఎందుకు రావడం?”
”నేనలా అంటే నువ్వు కూడా వెళ్లడం మానేస్తావనుకున్నాను.”
”నాకు తెలుసు. నేను లేకుండా మీరిక్కడ ఒక్కరోజు కూడా ఉండలేరు.”
 ఆ రోజు మా బావగారు ఇద్దరు కూలీలనీ, ఒక తోపుడు బండినీ, ఒక టాంగానీ తీసుకుని మూడుగంటలకల్లా నన్ను తీసుకెళ్లేందుకు వచ్చారు. సామాన్లతో నేనూ పిల్లలూ బైలుదేరాం. అదేరోజు సాయంకాలం మా ఆయన కూడా వచ్చేశారు.
మర్నాడు పొద్దున్న బావగారికి కొంత డబ్బిచ్చి మా ఆయన్ని మంచి హోమియో డాక్టరుకి చూపించమని కోరాను. బావగారు మందు తెచ్చిచ్చారు. రెండు మూడు రోజులు ఆ మందులు వేసుకున్నాక ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు కనిపించింది. చివరికి ఎలాగైతేనేం త్వరగానే కోలుకున్నారు. పట్నానికి వెళ్లిరావడం మాత్రం మానలేదు.
ఒకరోజు ఆయన బైలుదేరే సమయానికి ఎండ చాలా తీవ్రంగా ఉంది. ”బాగా ఎండగా ఉందే!” అన్నాను.
”నీకెందుకు? చస్తే నేనే కదా చస్తాను!” అన్నారు.
నాకు కోపం వచ్చింది, ”ఇక మీరు వెళ్లడానికి ఒప్పుకోను, జాగ్రత్త! మీరు కూర్చోండి, నేను ప్రెస్‌కి వెళ్తున్నాను. అక్కణ్ణించి ఏమైనా కావాలంటే చెప్పండి, వచ్చేప్పుడు తీసుకొస్తాను,” అన్నాను.
”అబ్బ, నన్ను వెళ్లనిద్దూ!” అన్నారు.
”వెళ్లనివ్వను గాక వెళ్లనివ్వను. మళ్లీ అలాగే దెప్పుతారు. మీరు నామీద అధికారం చెలాయిస్తే నేనెందుకు భరించాలి?
”అబ్బ, ఈసారి అలా మాట్లాడితే నన్ను చీవాట్లు పెట్టు. తప్పయిపోయింది!”
”మీ ఆరోగ్యం బాగయిందా లేదా, అది చెప్పండి. అక్కడే ఉండి ఉంటే అనారోగ్యంగానే ఉండేవారు కదా? నాకు జబ్బులంటే చికాకు. డబ్బుదేముంది?”
”తప్పనిసరి పరిస్థితుల్లో ఏమైనా చెయ్యాల్సిందే!”
”మనకి వీలైనంతవరకే కదా చెయ్యగలుగుతాం? మీరే మంచం పడితే ఇక మా పరిస్థితి ఎలా ఉంటుంది?”
”అయితే వెళ్లద్దంటావా?”
”బాగా ఎండగా ఉంది, వెళ్లకండి. పని అదే జరుగుతుంది.”
ఆయన కాళ్లకున్న జోళ్లు తీసి పక్కన పెట్టాను. ఆయన పక్కనే ఉన్న మంచంమీద పడుకున్నారు. లేచి కూర్చుని తొడుక్కున్న కోటు విప్పేసి, ”ఇక నీకు సంతోషమేగా?” అన్నారు.
”అవును, మీరు విశ్రాంతి తీసు కోండి.”
1924
మా ఆయన ప్రయాగకి వెళ్లారు. బేదార్‌ సాహబ్‌ని కలిసి ‘మాధురి’ ఆఫీసు వాళ్ల కొన్ని పుస్తకాల గురించి బోర్డు అనుమతి తీసుకోవడానికి వెళ్లారు. బేదార్‌ సాహబ్‌ ఒక తాగుబోతు. తను తాగడమే కాక ఈయన చేత కూడా తాగించాడు. ఇంటికి తిరిగి వచ్చారు, బాగా తాగి ఉన్నారని గ్రహించాను. అదేరోజు నా చెవిలోని పుండు పగిలింది. చెవిలో దూది పెట్టుకుని పడుకున్నాను. ఆయన ఎప్పట్నించీ తలుపు తడుతూ ఉండిపోయారో తెలీదు. పిల్లలు విని వెళ్లి తలుపు తీశారు. ఆ సంగతి కూడా నాకు తెలీలేదు. పిల్లల్ని చూడగానే కుక్కల్ని ఛీకొట్టినట్టు కసరడం మొదలుపెట్టారు. అది మట్టుకు నాకు వినిపించింది. ”ఏమిటమ్మా, కుక్క లోపలికొచ్చిందా?” అని అడిగాను మా అమ్మాయిని. ”నీకు వినబడడం లేదా, నాన్న వచ్చారు? నన్నూ, ధున్నూనీ కోప్పడు తున్నారు,” అంది అది. ”ఏమైంది?” అన్నాను.
”నాన్నా చాలాసేపట్నించీ తలుపు కొడుతున్నారుట. మాకు వినబడలేదు.”
”టైమెంతయిందమ్మా?” అని అడిగాను.
”ఒంటిగంటన్నరయింది.”
లేచి ఆయనకి ఏమైనా అవసర మేమో చూద్దామనుకున్నాను. ‘పిల్లల్ని అలా కసరచ్చా?’ అని అడుగుదామని కూడా అనుకున్నాను.
”అమ్మా, నువ్వు లేచి వెళ్లద్దు. నాన్న తాగేసి ఉన్నారు. నిన్ను కూడా కసురు కుంటారు,” అంది మా అమ్మాయి.
”ఓహో, కొత్తగా ఇదొకటా?”
నాకు కోపం వచ్చింది. పడుకునే ఉండిపోయాను. పొద్దున్న నిద్రలేచి చూసేసరికి ఆయన మైకం పూర్తిగా దిగిపోయింది. ”పిల్లల్ని ఎవరైనా అలా కసురుకుంటారా?” అన్నాను.
”అరగంటసేపు తలుపు దగ్గర అరిచి అరిచి విసుగొచ్చింది. నీకసలు తెలీనేలేదు!” అన్నారు.
”ఎవరు వినిపించుకుంటారు? పిల్లలు రాత్రంతా మేలుకుని ఉంటారా?”
”పిల్లలు మేలుకోరు సరే, పిల్లల తల్లి మేలుకుని ఉండచ్చుగా?”
”నాకు నిన్ననే కాస్త విశ్రాంతి దొరికింది, నిద్ర పట్టేసింది. అయినా మీరు తాగేసి వచ్చారని తెలిసుంటే, మెలకువగా ఉన్నా తలుపు తీసేదాన్ని కాదు!”
”బేదార్‌ సాహబ్‌ నన్ను వదల్లేదు.”
”ఏం, మీరేమైనా చిన్న పిల్లవాడా, బలవంతంగా ఆయన మీ నోట్లో తాగుడు పొయ్యడానికి? ఇంకెప్పుడైనా ఇలా తాగి వస్తే నేను మేలుకుని ఉన్నా తలుపు తెరవను!”
”ఆ సంగతి ముందే తెలిస్తే నేనక్కడే పడుకుని ఉండేవాణ్ణి.”
”అక్కడ తాగుతానని నాకు చెప్పి వెళ్లారా? ఇలాటి పాడు అలవాట్లు ఎందుకు చేసుకుంటున్నారు?”
”ఆయన వినలేదు.”
”వినేట్టు చెయ్యాల్సింది మీరు.”
”ఆయన మాటల వలలో పడితే బహుశా నువ్వైనా తాగి ఉండేదానివే!”
”అలాంటివాళ్ల మాటల వలలో అసలు నేను పడనే పడను.”
”సరే, ఇకనించీ తాగనులే.”
ఐదారు రోజుల తరువాత మళ్లీ బేదార్‌ సాహబ్‌ దగ్గరకెళ్లి తాగేసి వచ్చారు. కానీ ఎనిమిది గంటలకల్లా ఇల్లు చేరుకున్నారు. రాత్రి రెండుసార్లు వాంతి చేసుకున్నారు. నేనసలు లేవనేలేదు. నా తోడికోడలు లేచి నీళ్లూ అవీ అందించింది. వాంతిని కూడా శుభ్రం చేసింది. పొద్దున్న మత్తు దిగిపోగానే, ”రాత్రి నా పరిస్థితి ఘోరంగా తయారైంది. నువ్వెక్కడున్నావు?”
”నాకు మీ ఈ అలవాట్లతో ఎటు వంటి సంబంధమూ లేదు. ఆరోజే మీకు చెప్పాను!”
”పాపం, మా వదిన లేకపోతే నాకు నీళ్లందించేవాళ్లు కూడా ఉండకపోను.”
”నేను ముందే ఈ విషయం గురించి చెప్పాను కదా?”
”నీ మనసు చాలా కఠినం.”
”ఇవాళ తెలిసిందా మీకా సంగతి?”
ఆరోజు తరవాత ఆయన మళ్లీ తాగుడు జోలికెళ్లలేదు.
‘సాహసం’
1924లో నా మొదటి కథ, ‘సాహస్‌’ అచ్చయింది. ఆయనకి తెలీకుండా రాసి, దాన్ని పత్రికకి పంపాను. అప్పట్లో ‘చాంద్‌’ సంపాదకుడు ఆర్‌. సైగల్‌. ఆ కథలో తప్పులున్నాయి. నేను రాశానని తెలిసి, ఆ తప్పుల్ని దిద్ది, ఆయన దాన్ని ‘చాంద్‌’లో ప్రచురించాడు. పత్రిక కాపీ నాకూ, అభినందనలతో కూడిన ఉత్తరం మా ఆయనకీ పంపాడు. ఆ ఉత్తరంలో, ”మీరు నవలా చక్రవర్తిగా పేరుపడ్డారు. మీ భార్యామణి కూడా రాయడం మొదలు పెట్టారు. అభినందనలు. ఆవిడ పురుషులమీదికే చెప్పు విసిరారు, అయినా ఆవిడకి కూడా అభినందనలు. మనలోని బలహీనతల గురించి ఆవిడ చెప్పారు. దాని పరిణామాలు కూడా చూపించారు. అందుకే మీరిద్దరూ అభినందనలకి అర్హులే.”
ఆఫీసునించి వస్తూనే పత్రిక నాచేతికిస్తూ, ”ఇక తమరు ఇప్పుడు రచయిత్రి కూడా అయారు! ఇదుగో నీ కథ అచ్చయింది. కథలో కూడా మగవాళ్లమీద దుమ్మెత్తిపొయ్యడమేనా! ఆఫీసులో అందరూ గోలపెట్టారు. మగవాళ్లని ఘోరంగా చిత్రించావని అన్నారు,” అన్నారాయన.
”అది కథేమిటి, ఏదో సరదాగా రాశాను, అంతే!” అన్నాను.
”మగాళ్లందరూ భుజాలు తడుము కుంటూంటే నువ్వు సరదాకి రాశానని అంటావేమిటి?”
”అలాటి పనులు చేసే మగాళ్లే భుజాలు తడుముకుంటారు. అందరూ కాదుగా! మగాళ్లూ అటువంటి పనులు మానెయ్యాలి. అప్పుడిక భుజాలు తడుముకునే అవసరమే ఉండదు.”
”కానీ నువ్వు రాయడం మానేస్తావా?”
”మానేస్తూనే వచ్చాను, కానీ ఎన్నాళ్లు?”
ఆ కథ అచ్చయి నాలుగైదు నెలలు గడిచాక ఒక పంజాబీ ఆయన మా ఇంటికి వచ్చాడు. మా ఆయనతో, ”ఈ కథ మీరే రాసి మీ ఆవిడ పేరుతో ప్రచురించారా?” అని అన్నాడు.
”నేనలాటి కథ రాయగలనా?” అన్నారాయన.
”ఆ కథకి జవాబు, ”పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది,” అని ఒకాయన రాస్తున్నాడు.
”చూడండి, ఆవిడ రాసిన కథ ఒకటి తప్పులు దిద్దమని నాకిచ్చింది. నేను రాయటం లేదని మీరు నమ్మచ్చు. మనవాళ్ల మనసులు మరీ ఇరుకైనవి. వివరాలేవీ తెలుసుకోకుండానే నోటికొచ్చినట్టు మాట్లాడేస్తారు. ఇటువంటికథ మగవాడు రాయగలడా అని ఎవరన్నా అనుకోగలరా?”
ఆ వచ్చిన పెద్దమనిషి వెళ్లిపోయాక నాతో, ”నువ్వు కథలు రాయడం మొదలుపెట్టడం కాదుకాని, నా ప్రాణంమీదికొస్తోంది. హాయిగా ఉండేదానివి, నీకీ ఆలోచనెందుకు వచ్చింది? అనవసరమైనది గొంతుకి చుట్టుకుంది చూడు! ఇకనించీ నువ్వు రాయకుండా ఉంటేనే మంచిది!” అన్నారాయన.
”ఇప్పుడు మానేస్తే మరీ గొడవవు తుంది. దొంగ దొరికిపోయేసరికి, రాయడం మానేశారు, అనుకుంటారు. సొంతపేరు ఎలాగూ వచ్చింది, పెళ్లానికి కూడా పేరు రావాలని ఈ పనిచేశారు, అనుకుంటారు అందరూ,” అన్నాను.
”అయినా ఇందులో నీకేం సుఖం దొరుకుతోంది? పగలూ రాత్రీ ఎంత శ్రమ?”
”ఇది శ్రమే అయితే మీరెందుకు చేస్తున్నారీ పని? నా శ్రమ మీ శ్రమకన్నా విలువైనదని నేననుకోవడం లేదు. మీకు తాగుడు మత్తులాగ నాకు కూడా ఇదొక వ్యసనమే.”
”అనవసరంగా కష్టాలు కొనితెచ్చు కుంటున్నావు.”
”వాళ్లకి భయపడి నేను రాయడం మానెయ్యనా? అసలు విషయం తెలిశాక వాళ్లే తప్పుచేశామని బాధపడతారు.”
– ఇంకా వుంది

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.