వి. ప్రతిమ
మనిషిలో సంస్కారాన్ని ప్రేరేపించి ఒక గొప్ప సంస్కృతీ మార్గంలో నడిపించే శక్తిని అందించే సాహిత్యాన్ని సృష్టించి యిచ్చిన కొడవటిగంటి కుటుంబరావుగారు సాహితీప్రియులందరికీ ప్రాతఃస్మరణీయుడు…
కథ, గల్పిక, నవల, నాటకం, వ్యాసం వంటి అన్ని ప్రక్రియలనూ స్పృశించి పదిహేనువేల పేజీలకు పైగా సాహిత్య సృజన చేసిన కొ.కుని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది… కల్పనా సాహిత్య సృజనకారులు యిన్ని వేల పేజీల వ్యాసాలు… అదీ వివిధరంగాలకు సంబంధించిన వెయ్యి వ్యాసాలకు పైగా రాయడం చిన్న విషయమేమీ కాదు… ఇవ్వాల్టి రచయితలు, లేదా ఏనాటి తెలుగు రచయితలయినా స్ఫూర్తివంతంగా తీసుకోవడానికి బహుశా కుటుంబరావుని మించిన రచయిత వేరొకరు లేరేమొ అన్పిస్తుంది.
ఆయన కథల్లో విస్తారమైన జీవితం కన్పిస్తుంది.
నాకు తెలిసిన జీవితాన్ని మాత్రమే నేను సాహిత్యంలో చిత్రిస్తూ వచ్చాను అని చెప్పే కొ.కు. కథల్లో ఎక్కడా నీతిప్రబోధాలూ, నినాదాలూ, పరిష్కారాలూ కన్పించవు… మధ్యతరగతి జీవితాలను తనకు తెలిసినంత వరకూ వాస్తవికంగా వర్ణించి, విశ్లేషించి చర్చకు పెట్టారు.
మధ్యతరగతి (ఇవ్వాల్టి మధ్యతరగతి కాదు) వాళ్ళ ఆశలూ, ఆలోచనలూ, ఆవేదనలూ, ప్రేమలూ, ద్వేషాలూ, కష్టాలు, అనివార్య శత్రుత్వాలూ, విషయవాంఛలూ, వారిలోని జంకులూ, భయాలూ… యింకా ఆర్థికపరమైన ఎగుడుదిగుడులూ ఎలా వారివారి ప్రవృత్తి మీద ప్రభావం చూపిస్తాయో లోతుగా కథల్లో చిత్రించిన రచయిత కొ.కు.
కుటుంబరావు కథలు ఒక పట్టాన అర్థం కావు అన్న విమర్శ ఆయన మీదుంది… అందుకు ఆయనే ఒకచోట ఏమంటారంటే
”నా కథలు చప్పున అందరికీ అర్థం కావు అన్న విషయం నా అంతట నాకు తట్టినది కాదు. అది కాలక్రమాన నాకు అవగాహన అయిన సంగతి… చాలాకాలంనుంచీ నేను అందరికీ అర్థమయ్యేట్టు వ్రాయాలని ప్రయత్నం చేస్తూ వున్నాను… కానీ నా కథలు నాకు ఎప్పుడూ అర్థమవుతూ వుండడం వల్ల కథను చవుకు చేయకుండా నేను కథలో ఎత్తుకునే అంశాలను ఎంత విపులీకరించితే పాఠకులకు సులభంగా అర్థమవుతుందో నా అంతట నేను వూహించుకోలేని స్థితిలో వుంటూ వుంటిని… నన్ను విమర్శించేవాళ్ళు నేనంత తేలిగ్గా ప్రతి ముమ్మాయికీ, జగ్గాయికీ దొరికిపొయ్యేట్టు వ్రాసేవాడిని కాదు అని తెలుసుకుంటే మంచిది” అంటారు.
కొ.కు. కథలు ఎక్కడయినా అర్థం కాకపోయినప్పుడల్లా, ఈ కథలో ఏం చెప్పారు అన్న ప్రశ్న ఉత్పన్నమయినపుడల్లా పై వాక్యం గుర్తొచ్చి నాలో నేను హాయిగా నవ్వుకుంటూ వుంటాను.
ఇవ్వాళ బహుశా తొంభయిల నుండీ మనం మధ్యతరగతి మనుషులు బూర్జువా వర్గాలుగా మారుతోన్న, మారిపోయిన క్రమాన్ని గుర్తించి కాల్పనిక సాహిత్యంలోనో, వ్యాసరూపంగానో ప్రస్తావించుకుంటూ వస్తున్నాం. నలభయ్యిల్లోనే ఆర్థిక సంక్షోభం మూలంగా మానవ ప్రవృత్తిలోని మార్పులను, మధ్యతరగతిలోని కొందరు ఎలా మధ్యతరగతిని విడిచి క్రమంగా పెట్టుబడిదారులుగా మారిపోయిన వైనాన్ని, ధనం ఏవిధంగా మనుషుల్ని లోబరుచుకుంటుందో వ్రాసి చూపిస్తారు.
ఇటీవల మనందర్నీ ఆకర్షించిన ‘పడమటిగాలి’ నాటకంలోని ‘మాయలోడు’ పాత్రని కొ.కు నలభయ్యిల్లోనే రంగయ్యగా, సుబ్బయ్యగా, సీతారామారావుగా యిలా అనేక రూపాల్లో మన ముందుంచారు.
మాల మాదిగలు బాధితుల చేత బాధితులు అంటారు కొ.కు.
ఆయన వ్రాసిన తొలి నవల ‘కులంలేని మనిషి’. ఆ తర్వాత ‘కులంగాడి అంత్యక్రియలు’, ‘కులద్వేషం’ అన్న కథలు కులాన్ని నిర్మూలించడం కోసం వ్రాసినవే… కొ.కు. ఒకవేళ యిప్పుడు గనక బతికివున్నట్టయితే ఈ కులసంఘాల పిచ్చిని చూసి ఆత్మహత్య చేసుకుని వుండేవారేమొ అన్పిస్తుంది.
ఈ నేపథ్యంలోంచి చూసినపుడు కుటుంబరావు గారి కథలు యివ్వాల్టికీ రెలెవెంట్‌గా వున్నందుకు సంతోషపడాలో, యిప్పటికీ మనం కులాన్ని నిర్మూలించలేకపోయినందుకు బాధపడాలో అర్థం కాదు.
”లోకంలో వున్న అనేక ఆత్మవంచిత కుటుంబాల్లో పిల్లలూ, ఆడవాళ్ళూ వంచితులే… ఇందులో కూడ ఆడవాళ్ళు తమ కసిని పిల్లల మీద తీర్చుకుంటారు కాబట్టి పిల్లల పరిస్థితి మరీ అన్యాయం” అంటరు కొ.కు.
ఆయనకి పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ… పిల్లల గురించి పెద్దలకోసం చాలా కథలు వ్రాసారాయన… పసిపిల్లలను ఎలా అర్థం చేసుకోవాలి? వారి సాంఘిక జీవితంలో కుటుంబం నిర్వహించే పాత్ర ఏమిటి? వారికి కుటుంబం ఎంతవరకూ రక్షణనిస్తోంది? వీటన్నింటికీ కూడ ఆయన పిల్లల పెంపకం మీద వ్రాసిన అనేక కథల్లో మనకి సమాధానాలు దొరుకుతాయి.
పిల్లల సరదాలు తీర్చని తల్లిదండ్రుల లోభత్వాన్ని గురించీ, మితిమీరిన మమకారం మూలంగా ఎదురయ్యే పర్యవసానాల గురించీ, పిల్లలకి ఆకలయినా, కాకపోయినా గడియారం చూచి తూచి అన్నం తినిపించే తల్లుల గురించీ, అన్నంత తినని పిల్లల్ని మొటిక్కాయల వేసి, ఛావబాది వాళ్ళు ఏడుస్తూ నోరు తెరిస్తే అన్నం ముద్దలు దురిగి తృప్తిపడేవారి గురించి, గోముతో, గారాబంతో, ఛాదస్తంతో పిల్లలను రణపెంకెలుగా తయారుచేసే నాయినమ్మ, మేనత్తల గురించీ… పెద్దలకీ, పిల్లలకీ నడుమవున్న, వుండాల్సిన సంబంధాల గురించీ అనేక కోణాలలోంచి విస్తారంగా కొ.కు. వ్రాసిన కథలు నిజానికి యివ్వాల్టి తరానికే ఎక్కువ వుపయుక్తమైన వనిపిస్తుంది…
ప్రేమ స్థానంలో హింస ప్రవేశించడానికి తగిన కారణాలను గురించి కొ.కు. ఆనాడే చెప్పారు… స్త్రీలంటే కేవలం శృంగారపరమైన ప్రతీకలుగా, స్త్రీలంటే తమ చెప్పుచేతల్లో పడి వుండాల్సిన పనిమనుషులుగా, మార్కెట్ సంస్కృతి మూలంగా సరుకులుగా మారిపోయిన స్త్రీల మీద దాడులు ఎక్కువయ్యాయని మనం చెప్పుకుంటున్నాం కానీ నిజానికి ఆనాడే ప్రేమ హింసగా మారడాన్ని గురించి కొ.కు మాట్లాడతారు… కుటుంబ సంబంధాలలోని వైషమ్యాలు పిల్లల మానసిక ప్రపంచం మీద అమితంగా ప్రభావం చూపిస్తాయనీ, ప్రేమించేటువంటి శక్తి తల్లిదండ్రుల నుంచి అబ్బినపుడు… చుట్టూ అనుభవాల్లో ఎక్కడా ప్రేమ దొరకనపుడు మనిషిలో హింస ప్రవేశిస్తుంది అని కొ.కు. వుద్దేశ్యం.
పిల్లల గురించి వ్రాసిన చాలా కథల్లో పురుషుల కంటే స్త్రీ పాత్రలకే ప్రాధాన్యతనిచ్చి వ్రాస్తారు.
”సమర్ధుడయిన మగాడితో సమానంగా చదువూ, వివేకమూ, సరైన దృక్పథమూ గల తల్లులున్న చోట, తల్లిదండ్రులిరువురి సంస్కారమూ, స్థాయీభావం పొందినచోట కుటుంబంలో కాస్త మంచిగాలి వీస్తుంది” అని చెప్పే కొ.కు ఈ విషయాన్ని నిరూపించడం కోసమే ‘సవతితల్లి’లోని రాజ్యం పాత్రను సృష్టించారేమొ అన్పిస్తుంది.
కుటుంబరావుగారి కథల్లోని చాలమంది స్త్రీలు సామాజిక చైతన్యానికి ప్రతీకలే… అయితే ”నిజమైన ఆధునిక మహిళలు ఈ సమాజంలో ఎప్పటికీ రూపొందలేరు… ఒక వర్గరహిత సమాజంలో తప్ప” అని ఆయన అభిప్రాయం.
జ జ జ
సరేఁ కొ.కు సాహిత్యం స్త్రీపురుష సంబంధాలని ఎంత లోతుగా చర్చకు పెట్టిందో మనందరికీ తెలుసు.
”పురుషస్వామ్యం అమలులో వున్న ఈ సమాజంలో స్త్రీకి పురుషుడితో సమానత్వం అన్నది అసాధ్యం… ఇప్పుడున్న ఈ వివాహవ్యవస్థ గొప్ప మార్పులకు లోనయితేనే గానీ స్త్రీపురుషుల సమానత్వం సాధ్యం కాదు. ఇప్పుడు వారి మధ్యనుండే అసమానత కేవలం వ్యక్తిగతమైనది కాదు… సామాజికమైనది” అంటారాయన అప్పుడే…
ఈ సమాజంలో కొందరు తక్కువ కులాల్లో పుడతారు. మరి కొందరు ఆడవాళ్ళుగా పుడతారు అంటుండే కొ.కు నిజానికి ప్రపంచదేశాలన్నింటితో పోలిస్తే భారతదేశంలో స్త్రీలు మరింత అధోగతిలో వున్నారన్న వస్తువుతో ఆడజన్మ నవల రాసారు.
అందులో మూడు తరాల ఆడవాళ్ళ జీవితాలను గురించి లోతుగా విశ్లేషిస్తూ చివరికొచ్చేటప్పటికి అందరూ కూడ అనాథలుగా ఎలా వీధిలో నిలబడాల్సి వస్తుందో చెప్తారు. కుటుంబాల్లో, సంసారాల్లో, సమాజంలో స్త్రీలకున్న స్థానాన్ని, సాంఘిక ఆర్థిక రంగాలలో ఆమెకు జరుగుతోన్న అన్యాయాన్నీ కొ.కు ఆయన కథల్లో, నవలల్లో విస్తృతంగా చర్చకు పెడతారు.
”నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుడ్ని చేసుకోను… పుణ్యం లేకపోతే పీడాపాయ… ఎవరు పడతారమ్మా ఈ తిట్లూ, దెబ్బలూనూ?” అనుకుంటుందో చిన్నపిల్ల ‘ఆడబతుకే మధురం’ అన్న కథలో… ఈ ఒక్క వాక్యంలోనే మనకి సమాజంలోని స్త్రీ స్థానమేమిటో అర్థమయిపోతుంది… పితృస్వామ్య సమాజపు బురదలో కూరుకుపోతోన్న అనేకమంది అభాగినులు, రక్తమాంసాలున్న మనుషులు ఆయన స్త్రీపాత్రలు.
అరవైతొమ్మిదిలోనే వివాహవ్యవస్థ మీద ఆయన చేసిన వ్యాఖ్య వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది… ”ఆడదానికి ప్రకృతి అన్యాయం చేసిందంటారు. కానీ అన్నిటికన్నా ఆడదానికి హెచ్చు అన్యాయం చేసింది వివాహవ్యవస్థ… వివాహవ్యవస్థ ననుసరించి వచ్చిన సామాజిక పరిణామాలన్నీ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేశాయి” అంటారాయన. ఆలోచిస్తే స్వచ్ఛంగా, నిజాయితీగా, సత్యంగా వుండాలనుకునే ఆడవాళ్ళు యిమడలేరు… ఏమాత్రం స్త్రీకి స్వేచ్ఛలేని బిగుతైన చట్రం యిదని యిప్పుడు గత ఇరవైయేళ్ళుగా మనం మాట్లాడుకుంటున్నాం గానీ ఒక పురుషుడయ్యుండి ఆనాడే యింత స్పష్టంగా వివాహవ్యవస్థని నిర్వచించడం నిజంగా శ్లాఘనీయం.
ఇదంతా అలా వుంచితే యివ్వాల్టికీ లైంగికానుభూతుల్ని గురించి స్త్రీలుగా, రచయితలుగా మనం మాట్లాడ్డానికి యింకా జంకుతున్నాం గానీ స్త్రీలు ఈ వైవాహిక జీవితంలో పొందలేకపోతున్న శరీరచందాలను గురించి కూడ కొ.కు నలభయ్యిల్లోనే మాట్లాడ తారు… మనిషికి ప్రేమించడానికయినా, ద్వేషించడాని కయినా కొంత మానసికమైన స్వేచ్ఛ వుండాలి.
అటువంటి మానసికమైన స్వేచ్ఛ లేకుండానే మన సమాజంలో చాలామంది భర్తలతో కాపురాలు చేస్తూ వున్నారు. స్వేచ్ఛలేనిచోట ఖచ్చితంగా ప్రేమ వుండదు… ప్రేమ లేకపోవడం వల్లనే స్త్రీలు సంసారాల్లో శారీరికానుభూతుల్ని పొందలేకపోతున్నారని కొ.కు అభిప్రాయం. ఇవ్వాల్టికీ ఈ అంశం మీద రావలసినంత సాహిత్యం రాకపోవడం విచారించదగ్గ విషయం…
భారత నారీత్వం స్పెషల్ రబ్బరులాంటిది… ఎంతలాగినా తిరిగి యథాస్థితికి వచ్చి ఏమీ జరగనట్టుగా మసులుకుంటుంది. దాన్నే మనవాళ్ళు ఆకాశానికెత్తారు… ఇంకా ఎత్తుకున్నారు అని కూడా అంటారాయన.
గృహహింస చట్టం యిటీవలొచ్చింది… సరేఁ స్త్రీలమీద తీవ్రతరమయిన అనేక రకాల దాడులకయితే అసలు చట్టాలే లేవు. కుటుంబరావు గారేమంటారంటే చట్టాలు చేయలేని పని మనిషి లోపలి సంస్కారం చేస్తుంది. సంస్కారవ్యాప్తి చేయగలిగితే చాలు అని…
కుటుంబరావుగారి మొత్తం సాహిత్య పరిశ్రమంతా కూడ మనిషిలో సంస్కార సాధన కోసం ఆయన చేసిన ప్రయత్నమే.
అలాగే వివాహేతర లైంగిక సంబంధాల విషయంలో కూడ కుటుంబరావుగారు వ్రాసినన్ని కథలు మరే యితర రచయితా రాయలేదేమొనన్పిస్తుంది… అనుకునో, అనుకోకుండానో స్త్రీపురుషుల నడుమ ఏర్పడే లైంగిక సంబంధాలను గొప్పగా సమర్ధించడమూ, అలాగని తప్పుబట్టి నిందలేసి గుండెలు బాదుకోమనో చెప్పడాయన… వాటిని అత్యంత సహజమయిన విషయాలుగా పరిగణిస్తాడు…
”రంకుతనాల గురించి రాద్ధాంతాలు చేస్తారెందుకూ? మగ వాళ్ళకు లేని పవిత్రత ఆడదానికెందుకు?… పురుషులకు నిజంగా పాతివ్రత్య విశ్వాసముంటే ఇతర భార్యలతోనూ, సానులతోనూ ఎందుకు పోతారు. చూడగా చూడగా నీతి అన్నది ఆడదాన్ని చిత్రహింస చేయడానికి మగాడు సృష్టించిన నరకంలాగ అన్పిస్తోంది” అని ఒక పాత్రచేత అన్పిస్తాడు.
ప్రేమ, ప్రణయం, దాంపత్యాల మీద ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఎంతగా వుంటుందో కూడ ఆయన చాలా కథల్లో చెప్తాడు.
సాంఘిక కథలే కాకుండా ఐతిహాసికం, వైజ్ఞానికం, కల్పనాకథలు, గల్పికలు, అలిగరీలు అన్నీ కూడ ఆయన సృజనాత్మక శక్తికి ప్రతీకలు.
జీవితం అర్థం కావాలంటే మార్క్సిజం అర్థం కావాలని పూర్తిగా విశ్వసించిన కొ.కు మార్క్సిజం అందించిన ప్రాపంచిక దృక్పథంతో వర్గ స్వభావ స్పృహని కలిగి తెలుగు సమాజ, సాంస్కృతిక, జీవితరంగాలనన్నింటినీ పరిశీలించి సాహిత్యాన్ని సృష్టించారు. స్పందనా హృదయంతోపాటుగా ఆయనకున్న విస్తారమైన జీవితానుభవం, సామాజికావగాహన, చిత్తశుద్ధి ఈ సాహిత్య సృష్టికి దృఢమైన పునాదులు వేయగలిగాయి.
ఆయన కథావస్తువు గురించీ, ఆయన తడిమిన అనేక అంశాల గురించీ యింకా ఎంత చెప్పుకున్నా అది అసమగ్రమే అవుతుంది కాబట్టి యిది నిజానికి ఒక విహంగ వీక్షణం. ముందే చెప్పుకున్నట్లుగా వేల పేజీల సాహిత్యాన్ని సృష్టించి పాఠకుల కందించిన కొ.కు గురించి యిలా రెండు పేజీల్లోనో, ఒక ప్రత్యేక సంచికలోనో చెప్పేసుకోవడం సాధ్యం కాదు. ఇది కేవలం ఆయన స్మరణ మాత్రమే…
వాస్తవ జీవితాన్ని కల్పనా సాహిత్యం ద్వారా పాఠకులకు అందించి వారి భావసంస్కార ప్రేరణకు తోడ్పడడమే ఆయన ధ్యేయం… ఆ అందించడం అత్యంత నేర్పుగా అందించారు కాబట్టే ఈ కొత్తతరం కొ.కుని చదవాలని పాతతరం మళ్ళీమళ్ళీ వాటిని చదివి సంస్కార క్షాళన చేసుకోవాలని మనమంతా కోరుకుందాం…
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags