నక్కా హేమా వెంక్రటావు
క్రైస్తవ మత(ఠ) ప్రతినిధులైన ఇరువురు మహిళలు క్రైస్తవ, ప్రపంచాన్ని సందిగ్ధంలో పడవేసిన సంవత్సరం, 2009. సిస్టర్ ఆల్ఫోన్స్ చర్చి చేత పునీతురాలిగా ప్రకటింపబడింది. క్రైస్తవ విలువలుగా ప్రకటింపబడిన వాటిని, అధికార వర్గాల దురాగతాలను, దుశ్చర్యలను ధిక్కార స్వరంతో ప్రశ్నిస్తూ వచ్చిన సిస్టర్ జెస్మె చర్చి నుండి బయటకు నెట్టి వేయబడింది. అదే సమయంలో కేరళకు చెందిన సిస్టర్ అభయ హత్య ఉదంతంలో ఇద్దరు ఫాదర్స్‌ను, ఒక నన్‌ను సిబిఐ అరెస్టు చేయడం, సిస్టర్ అనూప మేరీ ఆత్మహత్య, తోటి సన్యాసిని లైంగిక హింస అప్పటికే క్రైస్తవ ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేసున్నాయి. అప్పుడే సిస్టర్ జెస్మె తన అనుభవాను, ఆవేదన, ఆకాంక్షలను ‘ఆమెన్’గా ప్రచురిస్తుంది.
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ మఠాధిపతులు పుస్తకాన్ని అప్రకటితంగా నిషేధిస్తారు. తస్లిమా నస్రీన్ ‘లజ్జ’కు ఫత్వా విధించినట్టో లేక జస్వంత్ సింగు ‘జిన్నా’ పుస్తకాన్ని బహిష్కరించినట్టు కాకపోయినా ‘ఆమెన్’ ప్రకంపనల నుంచి తమను తాము కాపాడుకోవడానికి చర్చిలోని ఒక వర్గం సిస్టర్ జెస్మెను ఒక ‘వేశ్య’గా, ఏసుక్రీస్తును అప్పగించిన శిష్యుడు ‘జుదా’ లాంటి ద్రోహిగా అభివర్ణిస్తుంది. పుస్తక ప్రచురణ అపివేయడానికి డబ్బు ఆశ కూడా చూపుతారు. పునీతురాలిగా ప్రకటించబడిన ఆల్ఫోన్సా గురించి గాని, విద్రోహిగా ముద్రింపబడిన జెస్మె గురించి గానీ కొన్ని యింగ్లీషు పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. కాని యిప్పటి వరకు తెలుగుసాహిత్య వేదికపై ‘ఆమెన్’ గురించి గాని కనీసం క్రైస్తవ స్త్రీల గురించి గానీ చర్చ జరగలేదు. దానికి కారణం మైనార్టీలలో మైనార్టీలుగా క్రైస్తవ మహిళలు మిగిలిపోవడమే కావచ్చు.
‘ఆమెన్’ పరిచయం
ఈ పుస్తకంలో మత సైద్దాంతికత, వాటికి నిబద్దులైన వ్యక్తులకు మధ్య జరిగే సంఘర్షణ, అధికారిక పితృస్వామ్య ధోరణులు, విద్యార్హతలతో వచ్చే అంతరాల వివక్ష, సేవాభావంతో పేదల విద్యకై ప్రారంభించబడిన విద్యా సంస్థలలో డొనేషన్లు, కాపిటేషన్ ఫీజులను ప్రవేశపెట్టి పేదలకు విద్యావకాశాలు మృగ్యం చేసి, కార్పోరేటు ధోరణిలో పయనించడం, చర్చి చేసిన బ్రహ్మచర్య ప్రమాణాలకు విరుద్ధంగా సిస్టర్లు, ఫాదర్లు సన్యాసిని, సన్యాసుల మధ్య శారీరక సంబంధాలు, నన్స్ మధ్య సంబంధాలు, వాటిని చూసి చూడనట్టు ప్రవర్తించే అధికారగణం, విద్యార్థుల మధ్య ఉండవలసిన స్వేచ్ఛాయుత స్నేహపూరిత సంబంధాలు, వారి వికాసానికి, సమాజాన్ని అర్థం చేసుకోవటానికి తోడ్పడే సాహిత్యం, సినిమాలు, మనుష్యుల మధ్య ఉండే రాగద్వేషాలు యిలా ఎన్నో అంశాలను ‘ఆమెన్’ మన ముందు ఆవిష్కరించి, మనల్ని ఆలోచన సంద్రంలో ముంచెత్తుతుంది.
ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, అందరితో కలివిడిగా వుండే జెస్మె కాథలిక్ మతాన్ని నిబద్దతతో ఆచరించే కుటుంబం నుంచి వచ్చింది. ఆమె పి.యు.సి. చదువు తర్వాత సన్యాసినిగా మారటానికి ‘కార్మెల్ మదర్’ మఠంలో చేరుతుంది. కేరళలో క్రీ.శ. ఒకటవ శతాబ్దంలోనే ప్రవేశించిన క్రైస్తవ మతం అప్పటికే వేళ్ళూనికొని ఉంది. ఆ కుటుంబాలలో దేవుని సేవకు బిడ్డలు అంకితం కావడం అసాధారణం కాకపోయినప్పటికీ, జెస్మె దగ్గర బంధువులలో అప్పటి వరకు ఎవరూ సన్యాసినిగా మారలేదు. అందుకే చిన్నప్పటి నుంచి తనలోనే దాచుకున్న కోరికను జెస్మె బయట పెట్టినప్పుడు వారు ఆశ్చర్యపోతారు. కాని ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఎట్టి పరిస్థితిలోనూ కాన్వెంటు గడప దాటి రాకూడదని జీవితాన్ని తుది వరకు అక్కడే గడపాలని ఆశీర్వదించి పంపుతారు.
మఠంలో శిక్షణకు చేరిన జెస్మెకు చాలా విషయాలు విస్మయాన్ని కల్గిస్తాయి. అప్పుడప్పుడే చర్చిలో (1974లో) ప్రార్థనలు మలయాళంలో వుండాలన్న ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉద్యమం ఊపందకుంటుంటే పాత తరానికి చెందిన వారు సంప్రదాయవాదులు వ్యతిరేకించడాన్ని, ప్రజాస్వామ్యానికి భిన్నంగా వుందని భావిస్తుంది. అప్పట్నుంచి ప్రతి విషయాన్ని జీసస్ బోధనల వెలుగులో విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే జెస్మెకు యూనివర్శిటీలో సెకండు ర్యాంకు వస్తే వేరొకరి కోసం మూడవ ర్యాంకులోకి నెట్టబడటాన్ని కూడా ‘విధేయత’లో భాగంగా ఒప్పుకున్నా మనసులో సంఘర్షణకు బీజం పడుతుంది. శిక్షణా కాలంలో టీచరుగా పనిచేస్తున్న సందర్భంలో పనిచేయని కాలానికి కూడా సంతకాలు పెట్టించుకోవడాన్ని నిరసించినా మళ్ళీ విధేయతలో భాగంగానే చేస్తుంది. కాబోయే సన్యాసినుల మధ్య ఏర్పడుతున్న శారీరక సంబంధాలు కంగారు పుట్టిస్తుంటే అంతకంటే మించి పాప సంకీర్తన (కన్‌ఫెషన్) సమయంలో ‘పవిత్ర ముద్దు’ పేరిట చేసే వెకిలి చేష్టలు ఇతరులను ఎలా యిబ్బందికి గురి చేస్తాయో మర్యాద పూర్వకంగానే ఫాదరుకు తెలియజేస్తుంది. పాశ్చాత్య సంస్కృతిలో వారి వాతావరణానికి అనుగుణమైన సంప్రదాయాలు భారతదేశంలో అనుసరించవలసిన అవసరం లేదని తెగేసి చెబుతుంది. 1970కు ముందు అట్టడుగు వర్గానికి చెందిన విద్యార్హతలు తక్కువగా వున్నవారిని వంటపనిలోనో, తోటపనిలోనో, పార్లర్‌లో పనిచేయించే సంస్కృతి తగ్గినా వాటి ఛాయలు వర్గాల్ని చదువు, డబ్బు, రంగు హోదాలతో నిర్ణయించడం పోలేదంటుంది ‘జెస్మె’.
మఠంలో యిరువురు సన్యాసినులు సన్నిహితులుగా మెలిగితే వారి మధ్య వుండే అనుబంధాన్ని ‘స్పెషల్ లవ్’గా ముద్ర వేసేవారు. ఇది పలుకుబడి కలిగిన సిస్టర్ల విషయమైతే బయటకు పొక్కదంటుంది జెస్మె. అందుకు తోటి వారితో జాగ్రత్తగా వుండటానికి ప్రయత్నిస్తుంది. దేనిని అయితే తప్పించుకుందామని ప్రయత్నిస్తుందో అదే సిస్టర్ ‘బెమీ’ రూపంలో ఎదురుపడుతుంది. అదే కాలేజీలో పని చేస్తున్న సిస్టర్ ప్రేమలేఖలు రాసి యిబ్బంది పెడుతుంటే తట్టుకోలేని జెస్మె తన పైన ఉన్న సిస్టర్లకు తెలియచేసినా ఫలితం లేకపోతుంది. పైగా ఆమె కోపానికి గురి కాకుండా సహకరించవలసిందిగా కోరినప్పుడు ఆశ్చర్యపోతుంది. ఇక గత్యంతరం లేని పరిస్థితులలో ‘బెమీ’కు లొంగిపోతుంది. ఇదే విషయాన్ని పాప సంకీర్తనలో ఫాదర్‌కు చెప్పినా ప్రయోజనముండదు. ఆ మఠాధిపతి (మదర్ ప్రొవిన్షియల్) సహాయంతో ఆ సిస్టరును బదిలీ చేయిస్తుంది. అలా స్పెషల్ లవ్ అంకం నుంచి బయటపడుతుంది జెస్మె.
నిధుల దుర్వినియోగం, రిజర్వుడు సీట్ల మినహాయింపు, మోసం, ‘అత్యధిక’ ఫీజుల వసూలు జెస్మెను బాధించినా, భయంతో మౌనంగా వుండిపోతుంది తప్ప ప్రతిఘటించ లేకపోతుంది. కాలేజీలో సైతం కుళ్ళు రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఎదురుతిరిగిన విద్యార్థుల ప్రజాస్వామిక ఆకాంక్షలను అర్థం చేసుకోకపోగా, వారిని నక్సలైట్లుగానో, మార్క్సిస్టులు గానో చిత్రిస్తూ వారికి కాండక్టు సర్టిఫికెట్లు కూడా యివ్వకుండా యాజమాన్యం యిబ్బంది పెడుతుంది. కాలేజిలో జరిగే ఎన్నికలలో సైతం మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రగతిశీల విద్యార్థినులను గెలవకుండా చెయ్యడానికి సిస్టర్ జెస్మెను పావుగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తే నిరాకరిస్తుంది. ఫలితంగా విద్యార్థుల ప్రతికూల (వారి దృష్టిలో) చర్యలకు జెస్మెను బాధ్యులను చేస్తారు.
మఠానికి సంబంధించిన విధివిధానాలు ఏర్పాటుచేసే కమిటీలో జూనియర్ సిస్టర్‌గా జెస్మెకు స్థానం లభిస్తుంది. ఆ కమిటీ ద్వారా వారి మఠంలో అనేక సంస్కరణలను ప్రతిపాదిద్దామనుకున్న జెస్మెకు నిరాశే మిగులుతుంది. మఠంలోని వారు క్రీస్తు బోధనలను మరచి పాలనాధికారానికే ప్రాధాన్యతను ఇవ్వటాన్ని నిరసిస్తుంది. అలాగే తప్పు చేసిన సిస్టర్లను శిక్షించేకంటే ప్రేమతోనే వారిని మార్చాలని ప్రతిపాదిస్తుంది. వీటికి సభ ఆమోదం తెలిపినా ఆ తర్వాత కమిటీలో జెస్మెకు స్థానం లభించదు. కారణం సిస్టర్లు నమ్రతతతో ఉండాలే కాని, పదిమందిలో జూనియర్ సిస్టర్లు మాట్లాడటాన్ని యిష్టపడరు’ అంటుంది.
చర్చి ఆదేశాలను పాటించే వారికి కావలసింది ‘గుడ్డి విధేయత’ కాదని ‘బాధ్యతాయుతమైన విధేయత’ అవసరమంటుంది. చర్చిలో క్రైస్తవ బోధనలకు వ్యతిరేకంగా పాశ్చాత్య ధోరణలు రుద్దబడ్డాయంటుంది. పెళ్ళికాని సెయింట్ పాల్ క్రీస్తు అనుచరుడైనప్పటికీ స్త్రీల పట్ల వివక్షత, వ్యతిరేకత చూపించి చర్చిలలో స్త్రీలకు ప్రాముఖ్యత లేకుండా చేసాడని వాపోతుంది. స్త్రీలు సువార్తను బోధించడం గాని, పురుషులపై పెత్తనం కల్గివుండకూడదని, స్త్రీలు కేవలం పిల్లలను కనడం ద్వారానే రక్షింపబడతారన్న పాతవాదనను తిరస్కరిస్తుంది. పాల్ గొప్ప అధ్యాత్మిక శిష్యుడైనప్పటికీ అతని దృక్పథాన్ని సమర్థించలేకపోతుంది. యిదే చర్చి ఫాదర్లకు మాత్రం స్వేచ్ఛని యిచ్చి స్త్రీలపై ‘అణచివేత’ ఈనాటికి కొనసాగిస్తుంది. సిస్టర్లు సినిమాలు కూడా చూడకూడదని ఆంక్షలు వున్నాయి కానీ ఫాదర్లు మాత్రం పండుగలకు పబ్బాలకు తమ మత సంబంధిత దుస్తులను కూడా వేసుకోకుండా వెళ్ళే స్వేచ్ఛ (వివక్ష) ను ప్రశ్నిస్తుంది. ప్రిన్సిపాల్‌గా విద్యార్థులకు కూడా మగపిల్లలతో సమానంగా స్వేచ్ఛ వుండాలని కోరుతుంది. ఇంతే కాకుండా విద్యార్ధుల సలహాలతో సంప్రదింపులతో వారి సమస్యలను పరిష్కరించాలనుకుంటుంది, అలాగే చేస్తుంది కూడా! ఇది పనిభారం పెంచడంతో కూడినదిగాను, సంప్రదాయ ధోరణులకు వ్యతిరేకంగా వుండటం చేత మేనేజిమెంటుకు రుచించదు.
అనేక సినిమాల గురించి ముఖ్యంగా మలయాళ సినిమాల గురించి చక్కటి అవగాహనతో చర్చిస్తుంది. లాక్‌జోన్ నిర్మించిన ‘అచ్చమ్ రంగష వాడు కథవెషన్’ (టి.వి. చంద్రన) చాకోలేట్, నిరకు, వేదబ్రహ్మం యిలా ఎన్నో సినిమాలను వాటి కథాంశాలను మనకు పరిచయం చేయటానికి ప్రయత్నం చేస్తుంది జెస్మె. సమాజంలోని సమస్యలకు మానవ సంబంధాలకు అద్దం పట్టే సినిమా మీడియాను ప్రశంసిస్తుంది. ప్రశంసించడమే కాదు కాన్వెంటులో జరిగే ప్రార్థనలలో వాటి కథాంశాలను భాగం చేస్తుంది. విద్యార్ధులు వ్రాసిన కథాంశంతో ‘పెరల్స్ ఇన్ ఎ లోన్లీ ఐల్యాండ్’ అనే డాక్యుమెంటరీని (మలయాళంలో) నిర్మిస్తుంది. దానిని మలయాళ మనోరమ దినపత్రిక, ఎయిర్ ఇండియాల నుంచి అవార్డు లభిస్తుంది. ఈ సినిమాలు వ్యాపార ధోరణి నుంచి విడివడి ఉన్నత విలువలను సమాజానికి అందిస్తాయి. ఇతర కాలేజిలలో సినిమాను చూసిన తరువాత విద్యార్ధుల చర్చలు పెడుతుంది. సినిమాలు చూడటానికి విద్యార్ధులను సిద్దపరచటం, చర్చలు అవసరమంటుంది జెస్మె. ‘లెస్బెయనిజమ్’ మీద, లైంగికత స్వేచ్ఛ యిలాంటి ఎన్నో అంశాలు చర్చిస్తే తప్ప వాటిని తప్పుడు ధోరణిలో విద్యార్థులు అర్థం చేసుకునే అవకాశముందంటుంది. లేకపోతే ఒక విధంగా ఆ సంబంధాలకు ఆమోదం తెలిపినట్టే అంటుంది. జెస్మె చేసిన ప్రతిపాదన కూడా ఆమెపై వ్యతిరేక ప్రచారాన్కి ఉపయోగపడతాయి. జెస్మెకు సినిమాలే కాదు సాహిత్యం కూడా చాలా యిష్టం. దక్షిణ కేరళలోనే కాలేజి స్థాయిలో ‘పుస్తక ప్రదర్శన’ ను ఏర్పాటు చేస్తుంది. దాని ప్రారంభం ఒక వీధి పుస్తక విక్రేత ద్వారా చేయిస్తుంది. దానిలో భాగంగానే కవిత్వపఠనం, పత్రికా ప్రదర్శన కేరళ రాష్ట్ర అవతరణ సందర్భంగా కేరళ చరిత్రను పరిచయం చేస్తుంది. ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ పుస్తకావిష్కరణ చేయాల్సిందిగా ప్రచురణ కర్తలు జెస్మెను కోరుతారు. ఆ పుస్తక రచయిత నళిని జమీల పరిచయం వున్నప్పటికీ కాన్వెంటు యంత్రాంగానికి భయపడి మానుకున్నా, మీడియా వ్యక్తుల ప్రోత్సాహంతో ఒప్పుకుంటుంది. అనుకున్నట్టుగానే అభ్యంతరాలు వెల్లువ ముంచెత్తుతుంది. అయినా సరే క్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చాడని, తాను అదే బాటలో పయనిస్తానని ధైర్యంగా చెబుతుంది. ఏ స్త్రీ కూడా ‘వేశ్య’ గా మారాలని కోరుకోదని పరిస్థితులు, సమాజం ఆమెను అలా తయారుచేస్తుందని వాదిస్తుంది. ఇలా యిన్ని వైవిధ్యాల మధ్య తన 25 ఏళ్ళ సన్యాసి జీవితం గడిచిపోతుంది.
సిస్టర్ జెస్మె విధానాలు నచ్చని మఠ యాజమాన్యం ఆమెను బలిపీఠం ఎక్కించడానికి రంగం సిద్దం చేస్తుండగా ఒక ఆకాశరామన్న ఉత్తరం వస్తుంది. అందులో జెస్మె ”బ్లూ ఫిలింలు” చూడటమే కాకుండా, ‘స్త్రీ పనివారి’ కి కూడా చూపించి వాళ్ళతో అనైతిక సంబంధాలు కలిగివుంది. కాబట్టి ఆమెను ప్రిన్సిపాల్ పదవి నుంచి తప్పించాలన్నది సారాంశం. తనమీద విశ్వాసం లేకుండా ఆ లేఖను నమ్మి ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పకుండా వచ్చేస్తుంది. అక్కడితో ఆగకుండా ఆ ఆకాశరామన్న ఉత్తరం గురించి కాన్వెంటులో ప్రతి ఒక్కర్ని యాజమాన్యం ప్రశ్నిస్తుంటే ప్రిన్సిపాల్‌గా తనకు ఏమి విలువనిస్తారని వాపోతుంది. ఇలాంటి సమస్యే హాస్టల్ విద్యార్థినులకు, సిబ్బందికి వచ్చినప్పుడు తాను ఎంత సున్నితంగా వ్యవహరించిందో గుర్తుకు వచ్చి కన్నీటిపర్యంతమవుతుంది. ఈ క్లిష్ట పరిస్థితులలో తోటి సిబ్బంది, విద్యార్థినులు జెస్మెకు తోడుగా వుంటారు.
ఒక ఆకాశరామన్న ఉత్తరం వలన తను శిక్షింపబడేకంటే సన్యాసి జీవితాన్నే వదులుకోవాలని మొదటిసారిగా అనుకుంటుంది. అదే విషయాన్ని కాన్వెంటు ప్రతినిధులకు తెలుపుతుంది. కాని వారు ఒప్పుకోరు. ఒక డాక్టరును కలవమని సలహా యిస్తారు. ఆరోగ్య రక్షణ పేరిట మానసిక చికిత్సను గోప్యంగా తనకే తెలియకుండా చెయ్యాలనుకున్న వారి ఎత్తుగడలను జెస్మె అడ్డుకుంటుంది. తనని తొలగించుకోవటానికి ‘పిచ్చి’ అనే ముద్రవేసి, వైద్యాన్ని అందించాలనే వారి కుట్రను త్రిప్పికొడుతుంది. కాని అనుక్షణం వారిభయంతో టేబుల్ మీద తన ప్లేటులోని ఆహారం కూడా తీసుకోకుండా కిచెన్ నుంచి తెప్పించుకోవడమో, అందరికోసం వుంచిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఆఖరుకు జెస్మె కుటుంబాన్ని కూడా మభ్య పెట్టి, మానసిక చికిత్స చేయించటానికి ప్రయత్నిస్తారు మఠ యాజమాన్యం. కుటుంబసభ్యులు ఆమోదించకపోగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తారు. కాన్వెంటు బయట స్నేహితుల అండతో కుటుంబ సభ్యుల ద్వారా కొన్ని సర్టిఫికెట్లతో కట్టుకున్న బట్టలతో ఎవరూ లేని సమయంలో బయట పడుతుంది జెస్మె.
ఇంటికి వచ్చిన జెస్మెకు ఘనస్వాగతం ఏమీ లభించదు. కుటుంబ సభ్యులలోని కొందరు సూటిపోటి మాటలతో బాధిస్తారు. జెస్మె ఎవరితోనైనా లేచిపోయివుంటే లేదా పెళ్ళి చేసుకొని వుంటే తమ గుండెల మీది బరువు తగ్గేదని నిందిస్తారు. చచ్చిపోతే కొన్ని రోజుల మర్చిపోయేవాళ్ళమంటారు. మళ్ళీ మధ్యవర్తుల ద్వారా కాన్వెంటుకు పంపటానికి ప్రయత్నాలు జరుగుతాయి. క్రైస్తవ మతాధికారి బిషప్ కూడా తిరిగి వచ్చిన జెస్మెను సాదరంగా ఆహ్వానించినట్టు కనపడినా యాజమాన్య విధివిధానాలకు అడ్డుపడకూడదని కాలేజికి సెలవు పెట్టించి ప్రార్థనా సెంటరుకు పంపుతారు. జెస్మె అక్కడకు చేరకముందే ఆమె పిచ్చిదన్న వార్తలు అక్కడ ప్రచారమవుతాయి. యిక్కడే ఏసుక్రీస్తు తనతో సంభాషించినట్టు తన 33 సంవత్సరాల ‘నాలుగ్గోడల’ సన్యాసిని జీవితానికి స్వస్తిపలికి విశాల ప్రపంచంలోకి నిజమైన క్రైస్తవ విలువలకోసం బ్రతకడానికి ప్రభువు ఆదేశించాడని చెబుతుంది. అక్కడ్నుంచి రెండు సంవత్సరాలు ఢిల్లీకి శెలవు మీద వెళ్ళిపోతుంది. అదే సమయంలో విద్యారంగంలో కృషికి జిల్లా అవార్డు పొందుతుంది. ఢిల్లీలో యువతకోసం పనిచెయ్యడానికి వెళ్ళినా కవిత్వంతో బంధాల్ని తెంచుకోదు. పోయిట్రీ క్లబ్‌లో కవితలు చదువుతుంటుంది. అప్పటివరకు సంప్రదాయ సన్యాసిని వస్త్రధారణను యిష్టం లేకపోయినా వదులుకుంటుంది. అక్కడ కార్యక్రమాలు ఎప్పటికీ మొదలు కాకపోయేటప్పటికి, యిక కేరళకు వెనుదిరిగి తన సన్యాసి జీవితానికి స్వస్తి పలకాలనుకుని, కుటుంబానికి తెలియజేస్తుంది. కాని వారు ఎటువంటి సహాయాన్ని ఆశించవద్దంటారు. అందుకే మీడియా స్నేహితుల సహాయంతో కేరళ చేరుకొని తన ఉద్ధేశాన్ని మఠానికి తెలియచేస్తుంది. తనపైన జరుగుతున్న అసత్యప్రచారాల దృష్ట్యా మీడియా ముందు వాస్తవాలను వెల్లడిస్తుంది. జెస్మెకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్న మఠయాజమాన్యం పెదవి విప్పదు. పదవీ విరమణ చేసిన డబ్బుతోనే బ్రతుకు కొనసాగిస్తుంది. మొదట్లో క్రైస్తవేతరులు, విద్యార్థులు జెస్మెను అభినందిస్తారు. తరువాత ఎంతోమంది ఫాదర్లు, సిస్టర్లు రహస్యంగా మద్దతు తెలుపుతారు. అందుకే ప్రజల మధ్య, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య క్రీస్తు విలువలతో బ్రతకటానికి విశాల ప్రపంచంలోకి వచ్చానని ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తుంది సిస్టర్ జెస్మె.
సమీక్ష
జెస్మె ఆత్మకథలో అనేక పార్శ్వాలు ఉన్నా ప్రధానంగా మనల్ని ప్రభావితం చేసేవి మతం పునాదిలో వుండే పితృస్వామ్య భావజాలం, వ్యవస్థీకృత రూపంలో నన్స్‌పై జరుగుతున్న హింస, చర్చిలో క్రీస్తు బోధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న వివక్ష. ప్రపంచీకరణ నేపథ్యంలో విలువల పతనం, పోటీ తత్వంతో క్రైస్తవ సంస్థలు, మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు రాకపోవడం మనల్ని కలిచి వేస్తాయి.
క్రీస్తు సిద్దాంతాలకు తిలోదకాలు యిచ్చి చర్చి సెయింట్ పాల్ దారిలో మహిళా సాధికారత సాధ్యం కాదనుకుంటే మరి ఎలా సాధ్యం? తనపై మానసిక చికిత్సకు ఒత్తిడి రాకపోయినట్లయితే క్రైస్తవ భక్తురాలిగా కాన్వెంటులోనే వుండిపోయేదాన్నంటుంది. అంటే కొన్ని మార్పులు ప్రవేశపెడితే మరింత మానవీయతతో కాన్వెంటులో వుండిపోవాలను కుంటుంది. కాని చర్చి ప్రతినిధి అయిన ఫాజోమ్ కల్లిత 25 శాతం క్రైస్తవ సన్యాసినులు అసంతృప్తితో ఉంటే మౌళికంగా క్రైస్తవ మఠాలు (నన్నరీ) అనే వ్యవస్థ ఉండాలని కోరుకుంటుందా? అలాగే మలబార్ చర్చికు సంబంధించిన మతాధిపతి ప్రకారం నన్స్ చాలా దయనీయమైన పరిస్థితులలో సాధికారతకు ఆమడ దూరంలో ఉన్నారు. కాబట్టి వారికి స్వేచ్ఛ అవసరమను కుంటుందా? విద్య, ఆత్మాభిమానం, స్వయంశక్తి మీద నమ్మకం ఉన్న జెస్మె స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమ సాంఘీకస్థాయి, వేళ్ళూనుకున్న వివక్ష, స్త్రీల హక్కుల్ని, స్వాతంత్య్రాన్ని, జ్ఞానాన్ని, శక్తిని హరించివేయగలిగిన పురుషాధిపత్యం మానవీయ సంబంధాలను పటాపంచలం చేస్తుందని నమ్ముతుందా? మఠాధిపతులు, ఫాదర్లు రకరకాలుగా సిస్టర్లను సేవకులుగా ఉపయోగించుకుంటూ, వారిని బలిపశువులుగా మార్చే పితృస్వామిక ధోరణులకు ఆలవాలమైన మతం గురించి మాట్లాడకపోవడం మనల్ని అయోమయంలో పడవేస్తుంది. వ్యవస్థ మారకుండా స్వేచ్ఛ సాధ్యం అనుకోవడం శోచనీయం కాదా?
క్రైస్తవ విలువలు, స్త్రీని భోగవస్తువుగా చూపే వ్యాపార పితృస్వామిక లక్షణాలు అవి మానవ సంబంధాలపై చేసే పెత్తనం ఎన్ని రూపాలుగా, విధాలుగా వుంటాయో, వాటివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు ఎలా వుంటాయో జెస్మె జీవిత గాథ వివరించినా వాటి పరిష్కారాలు, మూలాలు ఎక్కడున్నాయో వివరించడంలో విఫలం అవుతుంది. ఉద్యమాల ఫలితంగా సాధించుకుంటున్న ‘లైంగిక హక్కుల్ని’, బ్రహ్మచర్యం బరువుగా మారి తమ సహజ ప్రేరణలను చర్చి నియంత్రిస్తుంటే ‘మౌనం’ సమాధానం కాజాలదు. ప్రతీదీ ప్రశ్నించి చర్చకు పెట్టిన ‘జెస్మె’ ప్రజాస్వామిక యుగానికి అనుగుణంగా ‘సన్యాసి’ ని జీవితం ఎలా వుండాలో నిర్వచించలేకపోయింది.
ఎప్పుడూ జెస్మె ఆత్మరక్షణలో పడిపోవడమే కాని వాటిని అంతర్గత చర్చకు పెట్టగలగడం కాని అలా వివక్షతకు గురవుతున్న వారిని ఒక త్రాటి మీదకు తేగలిగిన దాఖలాలు లేవు. మత చట్రంలో స్వేచ్ఛకు, హక్కులకు అవకాశమే లేదు. అసమానత, నియంతృత్వ రూపం పునాదిగా నిర్దేశించబడిందే మతం అయినప్పుడు స్త్రీలు ఎప్పుడో ఒకప్పుడు ఆ చట్రాన్ని బద్దలు కొట్టకమానరు. అదే జెస్మె విషయంలోనూ జరిగింది. సంస్కరించబడవలసిన మత విలువలు గురించి, అవెందుకు సంస్కరించబడాలో స్పష్టత లేకపోయినా దైనందిన జీవితంలో సాగుతున్న సంఘర్షణకు అద్దం పట్టే ‘అమెన్’ సంప్రదాయక చెర నుంచి స్త్రీని విడిపించాలన్న తపన మాత్రం కన్పిస్తుంది. స్త్రీలు అస్తిత్వంలో వున్న సామాజిక వ్యవస్థలో సంఘర్షిస్తూ జీవించే స్థైర్యాన్ని సంపాదించుకోవాలని జీవితానుభవం నేర్పినా కాన్వెంటు నాలుగ్గోడల మధ్య సంఘర్షణను మాత్రమే ఎత్తిచూపుతుంది. నాలుగ్గోడలను దాటిన తరువాత ‘స్త్రీ’ గా తాను ఎదుర్కొనబోయే సమస్యలపట్ల జెస్మెకు సరైన ఆలోచన వుండదు.
చర్చిలోని ఆధిపత్య ధోరణి విధేయతను గుడ్డిగా కాకుండా బాధ్యతాయుతమైన విధేయతగా మారాలన్న ప్రజాస్వామిక ఆకాంక్ష మత(ఠ)ంలో ఎప్పటికీ సాధ్యపడదు. మత నిబంధనల ప్రకారం స్త్రీ అణగద్రొక్కబడిందిగా వున్నప్పుడు క్రైస్తవ మత యాజమాన్యం ఎందుకు అంగీకరిస్తుంది! మత భావజాలం స్త్రీలను ఎదగనివ్వక పోవడానికి కారణమయినప్పుడు, మత వ్యవస్థను రూపుమాపినప్పుడే స్త్రీలకు స్వేచ్ఛా సమానత్వం ఏర్పడి ఉన్నతమైన సమాజం ఏర్పడుతుంది. సమాజంలో వుండే వివక్షకు, దోపిడీకి కారణమైన మౌళిక అంశాల పట్ల ఉదాసీనంగా వుంటే భావవాదంలో మునిగిన వారమే అవుతాం. గ్లోబలైజేషన్‌లో స్త్రీ, ఆమె అనుభవాలు ఒక సరుకుగా మారుతున్న తరుణంలో జెస్మె ఆత్మకథ ఒక మౌళికమైన మార్పుకు, మానవ సంబంధాల ఉన్నతీకరణకు తోడ్పడాలని కోరుకుందాం.
జెస్మె చేసే పోరాటం వ్యక్తిగతం కాకపోయినా దానికి కొన్ని పరిధులు ఉన్నాయి. సహజంగా దానికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. చరిత్రలో చూసినట్టయితే ‘ప్రొటెస్టెంటీసమ్’ (16 శతాబ్దపు అపుడున్న చర్చికు వ్యతిరేకంగా పోరాడిన వర్గం) అలా ఉత్పన్నమయింది. అలా చర్చకు వ్యతిరేకించిన వర్గం ఈ రోజుకి ‘స్త్రీ’కి సమానత్వాన్ని యివ్వలేకపోయింది. ఆధిపత్యాలు, అణచివేతలు మామూలే! అయినా, దాని నిర్ణీత లక్ష్యం ‘స్వేచ్ఛా, స్వాతంత్య్రం’ కాదు. మతంలో ఇప్పటికి వర్గ, కుల, లింగ, ప్రాంత, భాషా పీడనకు అవకాశం ఉంది. మతపరమైన పాలకవర్గాలు తమ అధికారం చేజారిపోతున్నపుడు కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టవచ్చు. మతం ఎప్పుడూ రాజ్యానికి అనుబంధంగానే వుంది. రాజ్యం యొక్క పోకడలకు అది నిలువుటెత్తు అద్దం. ‘సంక్షేమ’ ఫోజు నుంచి సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఏజెంటుగా మారిన రాజ్యం చేతిలో ఈ రోజున మతం కీలు బొమ్మయ్యింది. అన్ని రకాల పీడనలకు, దోపిడీకి, అణిచివేతకు గురవుతున్న వర్గాలు సమిష్టిగా పోరాడినప్పుడే చివరి లక్ష్యాన్ని చేరుకుంటాం. ప్రజాస్వామిక ఆకాంక్షలతో మన ఉద్యమం మతతత్వ వ్యతిరేక పోరాటంగా రూపుదిద్దుకున్నప్పుడే జెస్మె లాంటి ఎంతోమంది సిస్టర్లకు, స్త్రీలకు విముక్తి. జెస్మె ఆలోచనా దృక్పథంలో గందరగోళం, పరస్పరమైన భిన్నమైన అభిప్రాయాలు, సమగ్ర తాత్వికత లోపించడం చూస్తాం. దానికి మతం యొక్క అణిచివేతే కారణం. మతం అణచివేతకు ఆయుధంగా ఉపయోగపడ్తుంది. కాబట్టి దాని రూపురేఖలు మార్చే సంస్కరణవాదం కంటే ఆ వ్యవస్థను బద్దలు కొట్టి, స్త్రీ స్వేచ్ఛను మన్నించి ప్రజాభీష్టానికి అద్దం పట్టే సమాజ ఆవిష్కరణకు అందరం సిద్దం కావాలి.
మారుతున్న సమాజంలో ”సిస్టర్లు”, స్త్రీలు పితృస్వామిక చట్రాన్ని ప్రశ్నించి, దానికి మూలమైన మత పునాదులను కదిల్చే లేదా కూల్చటానికి విప్లవీకరించే తత్వాన్ని అలవరచుకొని సలక్షణమైన వ్యక్తిత్వంతో ఎవరి యుద్దం వారు చేసుకుంటూ సంఘటితంగా కదిలి రావటానికి ”ఆమె”న్ ను ఆయుధంగా మలుద్దాం!
ఆమెన్!
(ఆమెన్ అంటే ”అట్లే అగుగాక” అని అర్థం.)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags