అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

6. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌: పుస్తకాలే ప్రపంచం
ఎట్టకేలకు మేం 1980లో హైదరాబాద్‌కు తిరిగి రాగలిగాం. అందుకు ప్రధానంగా మమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తి అజయ్‌ సిన్హా. ఆయన జార్జి రెడ్డికీ, సిరిల్‌కీ ఇద్దరికీ సన్నిహిత మిత్రుడు,
ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగంలో లెక్చరర్‌గా పనిచేసేవాడు. మేం హైదరాబాద్‌లో వుంటే అక్కడి రాజకీయాలకు తోడ్పాటు అవుతామని ఆయన భావించాడు.

కానీ దురదృష్టవశాత్తూ, మేం అక్కడికి మారిన కొద్దికాలానికే అజయ్‌ మూర్ఛ వ్యాధితో తీవ్రమైన ఫిట్స్‌ వచ్చి, 29 ఏళ్ల అతి చిన్న వయసులో చనిపోయాడు.
హైదరాబాద్‌కు తిరిగి వెళ్లే ముందు మేం రకరకాల ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాం. ఆ సమయంలో దిల్లీలో సరిగ్గా మాలాంటి స్థితిలో, మాలాంటి సందేహాలతోనే చాలామంది వుండేవాళ్లు. నేను పుణె, బొంబాయి కూడా వెళ్లొచ్చాను. అక్కడ కూడా మాలాగే రకరకాల ఎంఎల్‌ గ్రూపులను వదిలేసి బయటకొచ్చి, ప్రజలతో కలిసి పని చెయ్యాలన్న ఆలోచనతో ఉన్న వాళ్లను చాలామందిని కలిశాను. ఆ రోజుల్లో మా అందరి మనసులను ఒకటే ప్రశ్న తొలుస్తుండేది` ‘ఇప్పుడేం చేయాలి?’. అందరం దాని గురించే మథన పడుతుండేవాళ్లం. సిరిల్‌ ‘లా’ చదివి, చట్టపరమైన విషయాల్లో
ఉద్యమానికి అవసరమైన మద్దతును అందించాలని నిర్ణయించుకున్నాడు. దాదాపు ఇదే సమయంలో మేం హైదరాబాద్‌లో సిరిల్‌ వాళ్ల చిన్నాన్న, సీపీఐ ఎంఎల్‌ చారు మజుందార్‌ గ్రూపు మాజీ కార్యకర్త అయిన సి.కె.నారాయణ రెడ్డిని కలుసుకున్నాం. ఆయన గతంలో చిత్తూరు జిల్లా నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. ఆయనని అంతా అభిమానంగా ‘సీకే’ అనే పిలిచేవాళ్లు. 1940`60ల మధ్య అందర్నీ ఇలా పొడి అక్షరాలతో సంబోధించటం.. అంటే చండ్ర పుల్లారెడ్డిని సీపీ అనీ, నీలం రామచంద్రయ్యని ఎన్‌ఆర్‌ అనీ.. ఇలా పిలవటం అప్పటి తరం కమ్యూనిస్టుల్లో ఓ అలవాటుగా వుండేది.
ఎమర్జెన్సీ సమయంలో సీకే జైల్లో వున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన తిరిగి పార్టీలోకి వెళ్లాలని అనుకోలేదు. దాంతో 1977 తర్వాత ఆయన వామపక్ష సాహిత్యాన్ని ప్రచురించే పని మొదలుపెట్టారు. ఆయన ప్రచురించిన తెలుగు అనువాదాల్లో మేరీ టైలర్‌ రాసిన ‘మై ఇయర్స్‌ ఇన్‌ యాన్‌ ఇండియన్‌ ప్రిజన్‌’ (భారతదేశంలో నా జైలు జీవితం)Ñ విలియం హెచ్‌.హింటన్‌ రచన ‘ఫాన్‌షెన్‌: ఎ డాక్యుమెంటరీ ఆఫ్‌ రెవల్యూషన్‌ ఇన్‌ ఎ చైనీస్‌ విలేజ్‌’ (విముక్తి); ఎడ్గర్‌ స్నో రాసిన ‘రెడ్‌ స్టార్‌ ఓవర్‌ చైనా’ (చైనాపై అరుణతార); టెడ్‌ ఆలెన్‌, సిడ్నీ గోర్డన్‌ల ‘ద స్కాల్పెల్‌, ద స్వోర్డ్‌: ద స్టోరీ ఆఫ్‌ డాక్టర్‌ నార్మన్‌ బెతూన్‌’ (రక్తాశ్రువులు) వంటివి ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆయనతో మా భేటీకి కొంత ప్రత్యేకత ఉంది. సీకే, కావటానికి సిరిల్‌ వాళ్ల చిన్నాన్నేగానీ నిజానికి సిరిల్‌, వాళ్ల తోబుట్టువులంతా వాళ్ల నాన్నవైపు కుటుంబానికి దూరంగా వుండే వాళ్లు. సిరిల్‌ తల్లిదండ్రులది కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జరిగిన వివాహం. అయితే తండ్రి వైపు కుటుంబం నుంచి ఆదరణ లేకపోవటంతో సమస్యలు తలెత్తాయి. అందుకే తండ్రి వైపు వాళ్లని సిరిల్‌ అసలు తమ బంధువులుగానే గుర్తించేవాడు కాదు. వాళ్లతో నేను సన్నిహితంగా ఉన్నా తనకు నచ్చేది కాదు. అయితే ఒక కామ్రేడ్‌గా సీకేతో మాత్రం తనకి ఎలాంటి ఇబ్బందీ వుండేది కాదు.
సీకే చిత్తూరు జిల్లా చల్లావారిపల్లెకు చెందిన ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. ఇంట్లో తనే చిన్న కొడుకు. ఆయన చదువు అంతా మదనపల్లెలో, తిరుపతిలో సాగింది. మదనపల్లెలో కాలేజీలో చదువుకునే రోజుల్లోనే సోషలిస్టులతో కలసి రాజకీయంగా చాలా క్రియాశీలంగా మారారు. జయప్రకాష్‌ నారాయణ దక్షిణ భారత పర్యటనకు వచ్చినప్పుడు సీకే ఆయనతో పాటే ఉన్నారు. 1950లలో సోషలిస్టులతో విభేదించి భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)లో చేరారు. అది చీలినప్పుడు సీపీఎంలోకి మారారు. నక్సల్‌బరీ ఉద్యమం మొదలయ్యాక సీపీఐ`ఎంఎల్‌ చారుమజుందార్‌ గ్రూపులో చేరారు. గుంటూరు జిల్లా గుత్తికొండ బిలంలో జరిగిన ఆ గ్రూపు మొట్టమొదటి సమావేశంలో కూడా సీకే పాల్గొన్నారు. 1971లో అరెస్ట్‌ అయిన తర్వాత ఆయన ఆ గ్రూపును వదిలిపెట్టారు. తర్వాతా ఎన్నోసార్లు అరెస్టు అయ్యారు, ఎమర్జెన్సీ సమయంలో జైలుకు కూడా వెళ్లారు. చివరి దఫా జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన దృష్టి పుస్తక ప్రచురణ వైపు మళ్లింది. మొదట ‘జనతా ప్రచురణలు’ పేరిట, ఆ తర్వాత ‘అనుపమ ప్రచురణలు’ పేరిట పుస్తకాలను తేవటం మొదలుపెట్టారు.
సీకే పరిచయం అయిన తర్వాత నిర్మలమైన ఆయన వ్యక్తిత్వానికి నేను ఫిదా అయిపోయాను. అంతవరకూ దొరకని తండ్రిలాంటి ఆదరణేదో నాకు సరైన సమయంలో ఆయన నుంచి లభించింది. నేను ఏదీ దాచుకోకుండా ప్రతీదీ ఆయనతో పంచుకునేదాన్ని. చివరకు తనకు నచ్చవని తెలిసిన విషయాలను కూడా ఆయనకు చెప్పుకునేదాన్ని. తను ఎంతో హుందాగా ఉంటారు, చాలా సున్నితమైన మనిషి. అయితే దేని మీదైనా ఆయనకు కోపం వచ్చినా, తను మనస్తాపానికి గురైనా తనని ఎవరూ శాంతింపజెయ్యలేరు, చాలా మొండిగా కూడా అయిపోతారు. అయితే నా విషయంలో పెద్ద ఊరట ఏమిటంటే నేనేం చేసినా ఆయనకు కోపం వచ్చేది కాదు. నా పట్ల తనెంతో శ్రద్ధ తీసుకునేవారు. ఆ మాటకొస్తే ఒక్క నేననే కాదు, తనకు ‘మంచివాళ్లు’గా అనిపించిన చాలామందిని తను ఇలాగే చూసుకునేవారు. ఆయన మనుషులను` మంచివాళ్లా, చెడ్డవాళ్లా` అన్నట్టు, ఇలా రెండే రకాలుగా చూసేవాళ్లు. సీకే విషయంలో తప్పకుండా చెప్పుకోవాల్సిన గొప్ప గుణం ఏమిటంటే నిరంతరాయంగా మాట్లాడుతూనే ఉండే ఇతర కమ్యూనిస్టుల మాదిరిగా కాకుండా తను` ఇతరులు చెప్పింది వినేవాళ్లు. శ్రద్ధగా వినడానికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు.
సీకే ప్రతి రోజూ కొందరిని తప్పకుండా కలుస్తుండేవాళ్లు. తను కలిసే వారిలో కూడా రకరకాల నేపథ్యాలకు చెందిన వ్యక్తులు
ఉండేవాళ్లు. ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వాధికారులనీ, రాజకీయనాయకులనీ కలుస్తుండేవారు. ఒక కమ్యూనిస్టుగా పార్టీకి విరాళాలు సేకరించేందుకు తనకు తెలిసిన సినిమా వారినీ, వ్యాపారవేత్తలనూ కలిసేవారు. ఇక ప్రచురణ కర్తగా అయితే చెప్పనే అక్కర్లేదు` ఆయనకు ఎంతోమంది రచయితలతో, అనువాదకులతో, పాఠకులతో విస్తృతమైన సంబంధాలుండేవి. చిత్తూరులోనూ, చుట్టుపక్కలా ఆయన సామాన్య ప్రజలకు ఎంతో మందికి సాయం చేస్తుండేవాళ్లు. ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే తనే ఆసుపత్రులకు తీసుకెళ్లేవారు, డాక్టర్లతో మాట్లాడేవారు, అవసరమైతే వాళ్లకు డబ్బు కూడా సర్దుబాటు చేసేవారు. మధ్యవర్తిగా ఉంటూ కుటుంబ వివాదాలను పరిష్కరిస్తుండే వాళ్లు. తనకు తెలిసిన వాళ్లకు చెప్పి, ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించేవాళ్లు… ఇలా అసలు ఆయన ప్రయత్నించని అంశమంటూ వుండేది కాదు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి పనిలోనూ తను ఎంతో నిజాయితీగా ఉండేవాళ్లు. విలువలు, తను నమ్మిన ఆదర్శాల విషయంలో రాజీ ప్రసక్తే లేదు.
వివిధ పనుల మీద మేమిద్దరం కలిసి తరచుగా బస్సుల్లో, రైళ్లలో రాష్ట్రమంతా తిరిగేవాళ్లం. తనతో కలిసి విస్తృతంగా ప్రయాణాలు చేయటం వల్ల ఆయనను చాలా దగ్గర నుంచి చూసే అవకాశం నాకు దక్కింది. రోడ్డు మీద వెళ్లేప్పుడు అరటిపండు తొక్క కనిపిస్తే.. సీకే అక్కడి వరకూ వెళ్లి దాన్ని తీసి, దూరంగా పడేసేవాళ్లు. దాని మీద కాలు వేసి ఎవరు జారిపడతారోనన్న ముందు జాగ్రత్త అది. భార్యలనుగానీ, పనివారినిగానీ వేధించే వాళ్లంటే ఆయన అస్సలు పడదు. వాళ్లను సహించేవారు కాదు, కనీసం వాళ్లని కలవటానికి కూడా ఇష్టపడేవాళ్లు కాదు. రాజకీయ, వ్యక్తిగత జీవితాల మధ్య ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలూ పాటించని ఇలాంటి కమ్యూనిస్టుతో కలిసి పనిచేయడం నాకు చాలా ఆహ్లాదంగా అనిపించేది. 1990ల తొలినాళ్లలో హైదరాబాద్‌లో వీధి కుక్కల సమస్య మీద ఆయన పెద్ద పోరాటమే చేశారు. వీధుల్లో నడుచుకుంటూ వెళ్లే పేదలు, సామాన్యులే ఎక్కువగా కుక్క కాట్లకు బలి అవుతున్నారంటూ తను ఎంతో చలించిపోయేవారు నేను నా వ్యక్తిగత సమస్యలను కూడా ఆయన ముందుంచేదాన్ని. సిరిల్‌తో నా పోట్లాటలు, మిత్రులతో విభేదాలు, నా తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లతో ఇబ్బందుల వంటివన్నీ పరిష్కారం కోసం ఆయన భుజాల మీదే పెట్టేసేదాన్ని. ఆయన ప్రతి విషయంలోనూ నాకు మద్దతుగా నిలిచేవారు.
కొన్ని పుస్తకాల విషయంలో మాత్రం నేనూ, సీకే తీవ్రంగా విభేదించుకునే వాళ్లం. ఎన్నో ఏళ్ల పాటు సాంప్రదాయిక మార్క్సిస్టు సంస్కృతితో గాఢమైన అనుబంధం పెంచుకుని, దాన్లోనే జీవించిన ఆయనకు` నేను మార్క్సిజాన్ని విమర్శించటం నచ్చేది కాదు. రష్యాలో స్టాలిన్‌ హయాంలో జరిగిన అకృత్యాల గురించి అయితే మా ఇద్దరి మధ్యా నిరంతరాయంగా వాగ్యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. (నా దృష్టిలో స్టాలిన్‌ చేసినవి అకృత్యాలు, కానీ సీకే దృష్టిలో అవి` అనివార్యంగా తటస్థించే విపరిణామాలు.) అలాగే కాంబోడియాలో ఖ్మేర్‌ రోజ్‌ గురించీ, చివరికి ‘గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌’ పుస్తకంలో అరుంధతీ రాయ్‌ ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌పై చేసిన విమర్శల వంటి వాటిపైన కూడా మా ఇద్దరి మధ్యా వాడిగా చర్చలు జరుగుతుండేవి. అయితే ప్రధానమైన విషయాల్లో మాత్రం మా ఇద్దరి మధ్యా పూర్తి ఏకాభిప్రాయం ఉండేది. ముఖ్యంగా` మహిళా ఉద్యమం, దళిత ఉద్యమం లేవనెత్తిన పలు అంశాల పట్లÑ పేద ప్రజల జీవితాల్లో ఆరోగ్యం, విద్యలకున్న ప్రాముఖ్యత తదితర అంశాల్లో మా ఇద్దరిదీ తిరుగులేని ఏకాభిప్రాయమే. తనతో కలిసి ప్రచురణలను ప్రారంభించిన తొలి రోజుల్లో నేను ఓ రోజు గాంధీ రాసిన ‘హింద్‌ స్వరాజ్‌’ తెలుగు అనువాదాన్ని ప్రచురిద్దామని ప్రతిపాదించినప్పుడు ఆయన భగ్గుమంటూ లేచారు. అలా చేస్తే రాజీనామా చేసి వెళ్లిపోతానని కూడా బెదిరించారు. గాంధీ రాసిన దాంట్లో ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా
ఉందేమో అన్న సూచనను కూడా తను సహించలేకపోయారు.
సిరిల్‌, నేనూ వివిధ ఎంఎల్‌ గ్రూపుల నుంచి బయటకు వచ్చిన ఇతర కార్యకర్తలను కూడా కలుసుకున్నాం. ఎంఎల్‌ కార్యకర్తలను, వారి చర్చలను చూస్తుంటే విస్తృత అధ్యయనం లేకపోవటం, భిన్న ఆలోచనా ధారల పట్ల అవగాహన లేకపోవటమన్నది ఒక స్పష్టమైన వెలితిగా కనిపించింది మాకు. కార్యకర్తల్లో అవగాహనను, చర్చల స్థాయిని పెంచేందుకు దోహదపడే పుస్తకాలను, వ్యాసాలను ప్రచురించాల్సిన అవసరం చాలా ఉందనిపించింది. వెతికి చూస్తే అలాంటి విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు తెలుగులో పెద్దగా అందుబాటులో లేవని అర్థమైంది. అందుకని వాటిని ప్రచురించే పనిని మేమే చేపట్టాలని నిశ్చయించుకున్నాం. రకరకాల చర్చల తర్వాత మేం సీకేతో కలిసి ప్రచురణ సంస్థను ప్రారంభించే సమయానికి వీరయ్య చౌదరి, సి.భరతుడు కూడా మాతో జత కలిశారు. పశువైద్యుడు, సామాజిక కార్యకర్త అయిన వీరయ్య చౌదరి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు కొల్లా వెంకయ్య కుమారుడు. ఇక గుంటూరులో కాలేజీ లెక్చరర్‌గా పనిచేసే భరతుడికి పుస్తకాలంటే అమితమైన ప్రేమ, తను కొల్లా వెంకయ్యతో కలిసి పని చేసేవాడు. మేమందరం కలసి పుస్తక ప్రచురణ కోసం ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేశాం. సొసైటీనో, ప్రైవేటు కంపెనీనో కాకుండా ట్రస్ట్‌ని ఏర్పాటు చేసుకోండని శాంతా సిన్హా తండ్రి, చార్టెడ్‌ అకౌంటెంట్‌ మామిడిపూడి ఆనందం మాకు సలహా ఇచ్చారు. ట్రస్ట్‌ అయితే మాకు స్వేచ్ఛ ఎక్కువగా వుంటుందన్నారు. ప్రభుత్వాలు అణచివేత ధోరణులను అవలంబిస్తూ, ప్రచురణ హక్కులను కాలరాస్తున్న నేపథ్యంలో ట్రస్ట్‌ అయితే మీకు చాలా ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. మా ట్రస్ట్‌కి ‘హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌’ అనే ఒక తటస్థ పేరును ఎంచుకున్నాం. తద్వారా` అభిప్రాయపరంగా పాఠకులను ప్రత్యేకించి ఏదో ఒక పక్షం వైపు మళ్లించే ప్రత్యేక
ఉద్దేశమేమీ మాకు లేదని స్పష్టం చేయాలనుకున్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రచురణా సంస్థల పేర్లన్నీ కూడా` అరుణతార, పీస్‌ బుక్‌ సెంటర్‌, నవోదయ, ప్రజాశక్తి` ఇలా సిద్ధాంతపరంగా తమ మొగ్గు ఎటువైపో సూచిస్తున్నట్టు వుండేవి. మా ట్రస్ట్‌ పేరులో అలాంటి సంకేతాలేవీ వుండకూడదని భావించాం. సీకే, సి.భరతుడు, ఎం.టి.ఖాన్‌, విఠల్‌ రాజన్‌, గీతా రామస్వామి పేర్లతో 1980 ఫిబ్రవరిలో ‘హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌’ రిజిస్టర్‌ అయింది. ఎం.టి.ఖాన్‌ కవి, పాత్రికేయుడు. విఠల్‌ రాజన్‌ అప్పుడే కెనడా నుంచి తిరిగి వచ్చి హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీలో చేరారు. ప్రారంభించిన నెల రోజుల్లోపే ఆయన హెచ్‌బీటీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. మిగతా వాళ్లంతా కొనసాగారు, ఈ ప్రయాణంలో మరెంతో మంది జత కలిశారు కూడా.
తొలిగా మేం` రక్తాశ్రువులు, కూలి గింజలు, వేమన్న వాదం` అనే మూడు పుస్తకాలతో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణలను ప్రారంభించాం. వీటిలో రక్తాశ్రువులు ‘ది స్కాల్‌పెల్‌, ది స్వోర్ట్‌: ది లైఫ్‌ ఆఫ్‌ డాక్టర్‌ నార్మన్‌ బెతూన్‌’కు తెలుగు అనువాదం, దాన్ని అనుపమ ప్రచురణల కింద సీకే అప్పటికే ప్రచురించగా, మంచి ప్రాచుర్యం పొందింది. దాన్ని మేం పునర్ముద్రించాలనుకున్నాం. ‘కూలి గింజలు’ తక్కళి శివశంకర పిళ్ళై మళయాళంలో రాసిన ‘రండిదంగాళి’ నవల ‘టూ మెజర్స్‌ ఆఫ్‌ రైస్‌’ అన్న పేరుతో ఇంగ్లీషులో వెలువడగా దాన్ని తెలుగులోకి అనువదింపజేశాం. ఇక ‘వేమన్న వాదం’ ఎన్‌.గోపి ఎంపిక చేసి, వ్యాఖ్యానం సమకూర్చిన వేమన పద్యాల సంకలనం. వేమన పదిహేడవ శతాబ్దికి చెందిన కవి, తత్వవేత్త. సామాన్యులకు కూడా అర్థమయ్యేలా తేట తెలుగు నుడికారంలో రాసిన తన పద్యాలలో కులం గురించీ, నీతినియమాల గురించీ విస్తృతంగా చర్చించారు. వామపక్ష భావజాలం వైపు మొగ్గుచూపుతూనే, అప్పటి సమకాలీన వామపక్ష వర్గాల ఆలోచనా ధోరణికి విభిన్నంగా వుండాలన్న మా ఆకాంక్షకు ఈ మూడు పుస్తకాలూ ప్రాతినిధ్యం వహించాయి.
ఆ మూడు పుస్తకాలను ప్రచురించేందుకు మొదట మేం రూ.25,000 సమకూర్చుకున్నాం. ముద్రణ ఖర్చులు తప్పించి ఎడిటింగ్‌తో సహా మిగతా పనులన్నీ స్వచ్ఛందంగా చేశాం. ఖర్చులు బాగా తగ్గించుకుని పరిమితమైన వనరులతో పని చేయటం మొదలుపెట్టాం. నేను, నాతో పాటు కృష్ణ అనే మరో ఉద్యోగి. ఇద్దరం వేతనంగా నెలకు రూ.500 తీసుకునేవాళ్లం. ప్రముఖ ప్రచురణ సంస్థ ఓరియంట్‌ లాంగ్మన్‌ ఛైర్మన్‌ జె.రామేశ్వరరావు వాళ్ల ఆఫీసు వెనకాల వున్న రెండు గదులను పెద్ద మనసుతో మాకు ఉచితంగా ఇస్తే.. అందులోనే హెచ్‌బీటీ కార్యాలయం పెట్టుకున్నాం. రామేశ్వరరావు కూతురు లక్ష్మి నాకు మంచి స్నేహితురాలు. ఆ తర్వాత నిధులు సమకూర్చుకునే పని మొదలుపెట్టాం. మా ట్రస్ట్‌లో సభ్యులుగా నమోదైన వారికి మా పుస్తకాలన్నింటిపైనా 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించాం. ఎక్కడికి వెళ్లాలన్నా పుస్తకాలను అట్టపెట్టెల్లో పెట్టుకుని, వాటితో మేం బస్సులు, రైళ్లలోనే వెళ్లేవాళ్లం. నేను నా బట్టలు, సామాన్ల సంచీని భుజానికి తగిలించుకునని, రెండు చేతులతో రెండు పుస్తకాల పెట్టెలు పట్టుకుని ఎంతదూరమైనా అలా వెళ్లిపోతుండేదాన్ని. మొదట్లో అదేమంత కష్టంగా అనిపించేది కాదుగానీ రాను రానూ మేం ప్రచురించే పుస్తకాల సంఖ్య పెరగడంతో రెండు చేతుల్లో ఇరవై కిలోల బరువున్న పుస్తకాల పెట్టెలను పట్టుకుని వెళ్లటం కష్టంగా తయారైంది. దీంతో తీవ్రమైన నడుము నొప్పి బారినపడ్డాను. అది దీర్ఘకాలిక సమస్యగా కూడా తయారైంది. ఆ రోజుల్లోనే నాకు` ఏ పని చేసేప్పుడు మన శరీర భంగిమ ఎలా ఉండాలన్న ‘ఎర్గానమిక్స్‌’ మీద అవగాహన ఉండి ఉంటే ఎంత బాగుండేదనిపిస్తుంది.
1980లో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడం నా డిప్రెషన్‌కు ఒక మంచి ఔషధంలా పని చేసింది. నేను ఎంత ఉత్సాహంతో ఆ పనుల్లో మునిగిపోయానో మాటల్లో చెప్పలేను. పుస్తకాలను అమితంగా ప్రేమించే నాకు.. ఒక ప్రచురణ సంస్థను ప్రారంభించటాన్ని మించి సంతోషాన్నిచ్చే అంశం ఇంకేముంటుంది? కొద్ది సంవత్సరాల్లోనే హెచ్‌బీటీ మంచి పురోగతి సాధించింది. సీకే, నేనూ రాష్ట్రమంతా తిరిగాం. ఎంత ప్రయాస అయినా ప్రతి నగరం, ప్రతి పట్టణం, చివరికి కాస్త పెద్ద పెద్ద గ్రామాలకు కూడా వెళ్లి రచయితలను, ఆలోచనాపరులు, కార్యకర్తలందరినీ కలుసుకునేవాళ్లం. ఊరు మధ్యలో ఓ కూడలి చూసుకుని, అక్కడే రెండు టేబుళ్లు, వాటి మీద ఓ పెట్రొమాక్స్‌ లైటుతో అప్పటికప్పుడు బుక్‌ స్టాలు పెట్టే వాళ్లం. అది చూసి ఎంతోమంది కార్యకర్తలు వస్తుండేవాళ్లు. వాళ్లందరితో మాట్లాడుతుండే వాళ్లం. ఈ సంభాషణ` మన పుస్తకాలను అమ్మడానికీ, వాళ్ల ఆలోచనలను తెలుసుకోడానికీ రెంటికీ
ఉపయోగపడేది. మా తిండీ, బసా అంతా స్థానికంగా ఉండే కామ్రేడ్స్‌, రచయితల ఇళ్లలోనే. వీరిలో సీపీఐ నుంచి ఎంఎల్‌ వరకూ అన్ని పార్టీలకు, అన్ని గ్రూపులకు చెందినవాళ్లూ వుండేవాళ్లు. తెలిసిన వాళ్లెవరూ లేని చోట్ల ఏ రైల్వే స్టేషన్‌లోనో, బస్‌ స్టాండ్‌లోనో పడుకున్న సందర్భాలూ చాలానే ఉన్నాయి. ఈ ప్రయాణాల్లోనే బోలెడన్ని చర్చలు, అనువాదాల బాధ్యతలు అప్పగించటం, ప్రచురణ కోసం మూల రచనలను తీసుకోవటం వంటివన్నీ జరిగిపోతుండేవి. మొదటి మూడిరటి తర్వాత నాలుగో ప్రచురణగా ‘ఏడు తరాలు’ తీసుకొచ్చాం. అలెక్స్‌ హేలీ ‘రూట్స్‌’కి సహవాసి గొప్పగా అనువాదం చేసిన ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులు గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే గత నలభై ఏళ్లుగా హెచ్‌బీటీ ప్రచురణల్లో అమితమైన జనాదరణ పొందిన, అత్యధికంగా పునర్ముద్రణలు పొందిన పుస్తకాల్లో ఒకటిగా నిలుస్తోంది ఇది.
హెచ్‌బీటీ ఆవిర్భావం నాటికి తెలుగు ప్రచురణల రంగంలో ఒక రకమైన స్తబ్దత ఆవరించి
ఉంది. ఆ రోజుల్లో ప్రధానమైన పుస్తకాలన్నింటినీ చాలావరకూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ప్రజాశక్తి (సీపీఎం), విశాలాంధ్ర(సీపీఐ)లే ప్రచురిస్తుండేవి. ఆ సమయానికి ఆ సంస్థలు కూడా మందకొడిగా తయారై, పాత కమ్యూనిస్టు పుస్తకాలనే పునర్ముద్రించుకుంటూ పోతుండటంతో కొత్త పుస్తకాలు బాగా తగ్గిపోయాయి. ఈ దశలోనే ప్రముఖ కమ్యూనిస్టు రచయితలైన కంభంపాటి సత్యనారాయణ, మహీధర రామమోహనరావులిద్దరూ కలిసి ఓ రోజు మా కార్యాలయానికి వచ్చారు. అందుకు కారణం లేకపోలేదు. వాళ్లిద్దరూ తమ తమ రంగాల్లో దిగ్గజాల్లాంటి వారు. కంభంపాటి సత్యనారాయణ చరిత్రకారులు, ఆయన ఆంగ్లంలో రాసిన ‘ఎ స్టడీ ఆఫ్‌ ద హిస్టరీ అండ్‌ కల్చర్‌ ఆఫ్‌ ద ఆంధ్రాస్‌’ రెండు భాగాలను 1975లోనే సీపీఐ ప్రచురణల విభాగం ‘పీపుల్స్‌ పబ్లిషింగ్‌ హౌస్‌’ ప్రచురించింది. అది ఆంధ్రుల రాజకీయ, ఆర్థిక, సామాజిక చరిత్రను తార్కిక, భౌతికవాద దృక్పథంతో పరిశోధిస్తూ చేసిన తొలి విలక్షణమైన రచన. దాన్ని మహీధర రామమోహన రావు ‘ఆంధ్రుల సంస్కృతి`చరిత్ర’ పేరిట తెలుగు చేశారు. అయితే ఇది తమ సంప్రదాయ ‘పార్టీ లైన్‌’కు అనుగుణంగా లేదంటూ ప్రచురించేందుకు వారి మాతృసంస్థ అయిన ‘విశాలాంధ్ర’ నిరాకరించింది. దీంతో వాళ్లిద్దరూ` మా ఆలోచనలు అంత సంకుచితంగా ఉండకపోవచ్చన్న నమ్మకంతో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌కు వచ్చారు. మాటల మధ్యలో కంభంపాటి ఎమర్జెన్సీకి ముందు మా ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ర్యాలీల్లో తాను కూడా మాతో కలసి నడిచిన సంగతిని గుర్తు చేశారు. దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించటం వెనక బహుశా` ‘నా ఆలోచనలు విశాలం అయినప్పుడు మీరు కూడా అలానే
ఉండొచ్చుగా’ అని చెప్పకనే చెప్పటం, తన పుస్తక ప్రచురణకు మమ్మల్ని ఒప్పించటం ఆయన ఉద్దేశం కావచ్చు. కారణం ఏదైనా ఆయన రచన మా చేతుల్లోకి రావటం` మాకు పెద్ద వరంగా మారింది. 1981లో మేం దాన్ని ప్రచురించినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చింది. పుస్తకం సమీక్షకుల మన్ననలు అందుకోవటమే కాదు, మహీధర రామమోహన రావు అనువాదానికీ మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచీ ఆ రెండు సంపుటాలూ ఎన్నో ఏళ్లుగా పునర్ముద్రణలు పొందుతూనే ఉన్నాయి. వాళ్లిద్దరూ చనిపోయేంత వరకూ కూడా నాకు సన్నిహిత మిత్రులుగానే ఉన్నారు. నేను ఎప్పుడు విజయవాడ వెళ్లినా వాళ్లిద్దరిలో పవరో ఒకరి ఇంట్లో వుండేదాన్ని. ఇద్దరూ నన్నెంతో ఆదరంగా చూసుకునే
వాళ్లు. కమ్యూనిస్టు ఉద్యమం సంగతులెన్నో పంచుకునేవాళ్లు. కొడవటిగంటి కుటుంబరావు, శారద, చలం వంటి విఖ్యాత తెలుగు రచయితల గురించి, వాళ్ల రచనల గురించి బోలెడన్ని విషయాలు చెప్పేవాళ్లు. దీంతో నాకు అప్పటి వరకూ అంతగా పరిచయం లేని విస్తృత తెలుగు సాహిత్య ప్రపంచానికి ద్వారాలు తెరుచుకోవటం ఆరంభమైంది.
చూస్తుండగానే ఎంతో మంది రచయితలు, అనువాదకులు మాతో కలిసి పనిచేసేందుకు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. 1940ల నాటి తెలంగాణా రైతాంగ పోరాటం గురించి సరిపల్లి కృష్ణారెడ్డి రాసిన నవల ‘ఉప్పెన’ను 1981లో ప్రచురించాం. అలాగే న్యాయవాది బొజ్జా తారకం ఒక మ్యాగజైన్‌లో ‘పోలీసులు అరెస్టు చేస్తే..’ అనే దానిపై సీరియల్‌గా రాస్తుంటే అదో సంచలన విజయం సాధించింది. దాన్ని కూడా 81లోనే పుస్తక రూపంలో ప్రచురించాం. నాటి నుంచి నేటి వరకూ కూడా హెచ్‌బీటీ ప్రచురణల్లో అత్యంత జనాదరణ పొందిన పుస్తకంగా అది కొనసాతూనే ఉంది. దశాబ్దాలుగా, భిన్న తరాలకు చెందిన కార్యకర్తలు ఆ పుస్తకాన్ని తమ కరదీపికగా చూసుకుంటూనే ఉన్నారు. 1981లోనే మా ఎనిమిదో పుస్తకంగా ప్రముఖ అంతరిక్ష పరిశోధకులు మహీధర నళినీమోహన్‌ రాసిన ‘గ్రహణాల కథ’ తీసుకొచ్చాం. మొట్టమొదటిసారిగా సైన్సు సంగతులను, పద్ధతులను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా వివరించిన ఆ పుస్తకం ఎంతో ఆదరణ సంపాదించుకుంది. నళినీమోహన్‌ మాస్కో యునివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. నేషనల్‌ ఫిజికల్‌ లాబరేటరీలో పనిచేసే వారు, తర్వాతి కాలంలో మాకోసం ఆయన మరెన్నో సైన్స్‌ పుస్తకాలు రాశారు.
1982 మాకు మర్చిపోలేని గొప్ప అనుభూతులను ఇచ్చిన సంవత్సరం. హెచ్‌బీటీ ప్రచురణల్లో మైలురాళ్లుగా నిలిచిపోయిన అనేక పుస్తకాలను మేం ఆ ఏడాదే ప్రచురించాం. సంక్లిష్టమైన సామాజిక, సైద్ధాంతిక అంశాలను కూడా ఆసక్తిగా, అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు 1970లలో ఇంగ్లీషులో, ఎంతో సృజనాత్మకంగా, బొమ్మలతో ‘ఫర్‌ ది బిగినర్స్‌’ అనే సిరీస్‌ పుస్తకాలని తేవటం మొదలుపెట్టారు. వాటికి లభిస్తున్న ఆదరణ చూసి, వాటిని మనం తెలుగులో ఎందుకు తేకూడదని ఆలోచించాం. మొట్టమొదటగా ప్రముఖ మెక్సికన్‌ కార్టూనిస్ట్‌ ర్యూస్‌ వెలువరించిన ‘మార్క్స్‌ ఫర్‌ బిగినర్స్‌’ అనే పుస్తకాన్ని ప్రచురించాం, దాన్ని కె.బాలగోపాల్‌ తెలుగు చేశారు. మేం ఆఫ్‌సెట్‌ ప్రెస్‌లో ముద్రించిన తొలి పుస్తకం ఇది. అప్పటి వరకూ అక్షరాలను ఎంతో శ్రమతో చేతితో కంపోజ్‌ చేసే లెటర్‌ ప్రెస్సుల్లోనే ముద్రించేవాళ్లం. ఆ తర్వాత ఆఫ్‌సెట్‌లో, అదే ‘బిగినర్స్‌’ సిరీస్‌లో భాగంగా లెనిన్‌, మావో, క్యూబా, దాస్‌ కాపిటల్‌ పుస్తకాలనూ తీసుకొచ్చాం. అయితే అవేవీ చాలాకాలం వరకూ విజయవంతం కాలేదు. 1982లోనే ధనంజయ్‌ కీర్‌ రచన ఆధారంగా బి.విజయభారతి రాసిన అంబేడ్కర్‌ జీవిత చరిత్ర పుస్తకాన్ని ప్రచురించాం. హెచ్‌బీటీ నుంచి అంబేడ్కర్‌ పుస్తకాల పరంపర దీనితోనే మొదలైంది. మా పుస్తకాలలో మరో మైలురాయి వంటిది ‘వైద్యుడు లేని చోట’. డేవిడ్‌ వెర్నెర్‌ రాసిన ‘వేర్‌ దేర్‌ ఈజ్‌ నో డాక్టర్‌’కు డా. ఆలూరి విజయలక్ష్మి చేసిన ఈ తెలుగు అనువాదం అనేక సంవత్సరాల పాటు విస్తృతంగా అమ్ముడు పోయింది.
మహాశ్వేతా దేవి రచనలను తెలుగులో తీసుకురావటం కూడా ఆ సంవత్సరమే మొదలుపెట్టాం. ఆమె రాసిన ‘శ్రీ శ్రీ గణేష్‌ మహిమ’ నవలను సూరంపూడి సీతారాం నేరుగా బెంగాలీ నుంచి తెలుగులోకి అనువదించారు. మా కేటలాగ్‌లో మహాశ్వేతా దేవి తొలి పుస్తకం ఇది. ఆ తర్వాత ఆమె రచనలను ఎన్నింటినో వరసగా ప్రచురిస్తూ వచ్చాం. వాటిలో హజార్‌ చురాసీర్‌ మా (ఒక తల్లి), అరణ్యేర్‌ అధికార్‌, దాయిన్‌, బషాయ్‌ టు డు, రుదాలి (నాలుగు కథల సంపుటి), ఛోళీ కే పీఛే (బ్రెస్ట్‌ స్టోరీస్‌) వంటివీ వున్నాయి. ప్రచురణకు అనుమతి కావాలని మేం అడగ్గానే ఆమె ఓ చిన్న కాగితం మీద, చాలా క్లుప్తంగా తన సమ్మతిని రాసిచ్చారు. వీటిలో చాలా రచనలను నేరుగా బెంగాలీ నుంచి తెలుగులోకి అనువదించి ఇచ్చిన సూరంపూడి సీతారాం అప్పుడు మాతో వుండటం మా అదృష్టం. సీతారాం కలకత్తాలో పని చేస్తుండేవారు. అక్కడ ఆయన ఉన్న ఇంటి యజమానురాలు విఖ్యాత బెంగాలీ రచయిత బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ రాసిన ‘అరణ్యక’ నవల నుంచి చిన్న చిన్న ఘట్టాలను అప్పుడప్పుడు ఊరిస్తూ చెబుతుండేదట. ఆ కథ విని పొంగిపోయిన సీతారాం మూలరచనను స్వయంగా తనే చదువుకుంటే ఇంకెంత బాగుంటుందో అన్న ఆశతో బెంగాలీ నేర్చుకున్నారు. తర్వాత తనే ఆ పుస్తకాన్ని ‘వనవాసి’ పేరుతో తెలుగులోకి అనువదించారు.
అప్పట్లో రచయితలు ఎలాంటి పారితోషికం అడగకుండానే తమ పుస్తకాలను తెలుగులో ప్రచురించేందుకు మాకు అనుమతులు ఇవ్వటం మాకు గొప్ప మేలు చేసిందనే చెప్పాలి. ఏడు తరాల (రూట్స్‌) కోసం అలెక్స్‌ హేలీని సంప్రదిస్తే కాగితం మీద ‘పర్మిషన్‌ గ్రాంటెడ్‌’ అన్న రెండే పదాలు రాసి పంపేశారు. ఇంకా ర్యూస్‌, మేరీ టైలర్‌ వంటి వారు (ప్రత్యేకించి విదేశాలలో వున్న రచయితలు) చాలా ఉదారంగా మాకు అనుమతులిచ్చారు. రచయితలంతా వామపక్ష, స్త్రీవాద ఉద్యమాల ఉరవడిలో కలసి నడుస్తున్న సమయం అది, మధ్యలో ఏజెంట్లు అంటూ ఎవరూ ఉండేవారు కాదు. మా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలకు కూడా లైసెన్స్‌లుగానీ, కాపీరైట్స్‌ గానీ వుండవు. మా ప్రచురణలను వాడుకునేందుకు ఉచితంగానే అనుమతులిస్తుంటాం, విజ్ఞానం ప్రతి ఒక్కరికీ అందుబాటులో వుండాలన్నది ఒక్కటే ధ్యేయం.
తొలి ఐదేళ్లూ.. అంటే 1980 నుంచి 1985 మధ్య రచయితలు, అనువాదకులు, పాఠకులు.. అందరి నుంచీ మాకు మంచి స్పందన వచ్చింది. సగటున మేం లెటర్‌ ప్రెస్‌లో అయితే 3,000 కాపీలు, ఆఫ్‌ సెట్‌లో అయితే 5,000 ప్రతుల వరకూ ముద్రించే వాళ్లం. ఇదంతా.. ఇతర తెలుగు ప్రచురణ కర్తలు జనాకర్షణ నవలల్లాంటివి తప్పించి మిగతా పుస్తకాలను 1000 కాపీలు వెయ్యటానికి కూడా భయపడిపోతున్న రోజుల్లో! ఈ కాలంలో హెచ్‌బీటీ ప్రచురించిన పుస్తకాల్లో తప్పకుండా చెప్పుకోదగ్గవి: మా కథ (‘లెట్‌ మి స్పీక్‌! టెస్టిమొనీ ఆఫ్‌ డొమితిలా, ఎ వుమెన్‌ ఆఫ్‌ బొలీవియన్‌ మైన్స్‌’, ఇది బొలీవియాలోని తగరపు గనుల్లో కార్మికురాలైన డొమితిలా బారియోస్‌ డి చుంగారా రాసిన కథ)Ñ హొవర్డ్‌ ఫాస్ట్‌ రచన ‘స్పార్టకస్‌’Ñ ఇ.హెచ్‌.కార్‌ రాసిన ‘చరిత్ర అంటే ఏమిటి?’ (వాట్‌ ఈజ్‌ హిస్టరీ?)Ñ జనతా పార్టీ ప్రభుత్వం 1977`1980 మధ్య తొలగించిన ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు` రొమిలా థాపర్‌ ‘తరతరాల భారత చరిత్ర’ (ఏన్షియెంట్‌ ఇండియా)Ñ బిపన్‌ చంద్ర ‘ఆధునిక భారత చరిత్ర’ (మోడర్న్‌ ఇండియా) వంటివెన్నో వున్నాయి. దాదాపు ఇదే సమయంలో పిల్లల చదువులు, విద్యా బోధనా రంగానికి సంబంధించిన పుస్తకాలనూ ప్రచురించటం మొదలుపెట్టాం. వీటిలో మొట్టమొదటగా ప్రచురించింది టెట్సుకో కురొయనాగి రాసిన ‘రైలు బడి’ (టోటో చాన్‌: ది లిటిల్‌ గర్ల్‌ ఎట్‌ ది విండో). ఈ పుస్తకం తెలుగునాట ఎందరి హృదయాలకు చేరువైందో. ఇప్పటికీ పునర్ముద్రణలు పొందుతూనే ఉంది. ఆ తర్వాత వరసగా గిజుభాయ్‌ పుస్తకాలను తెలుగులో తీసుకొచ్చాం. గిజుభాయ్‌ బధేకా పిల్లల చదువులు, బాల సాహిత్యం వంటి అంశాల్లో కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఎనలేని కృషి చేశారు, గుజరాతీలో విస్తృతంగా రాశారు. దాదాపు ఇంగ్లీషులో అందుబాటులో ఉన్న ఆయన రచనలన్నింటినీ తెలుగులో తీసుకొచ్చాం. తర్వాత అత్యంత ప్రభావశీలమైన సోవియెట్‌ (ఉక్రేనియన్‌) విద్యావేత్త ఆంటన్‌ మకరెంకో, భారతీయ విద్యావేత్త కృష్ణ కుమార్‌ పుస్తకాలను కూడా ప్రచురించాం.
ఈ రోజుల్లోనే మేం మరో ప్రయోగం చేశాం. 16`70 పేజీల మధ్య ఉండే చిన్న చిన్న పుస్తకాలు (బుక్‌లెట్స్‌) తీసుకొచ్చి, వాటిని 1 రూపాయి వెలకే అందించటం ఆరంభించాం. నిజానికి ఇవి కొడవటిగంటి కుటుంబరావు, డా.గురుకుల మిత్రా, రొమిల్లా థాపర్‌ వంటి వారు రాసిన చిన్న చిన్న వ్యాసాలు. హేతువాదం, వేదాల్లో ఏముంది, శాస్త్రీయ దృక్పథం వంటి రకరకాల అంశాలపై తీసుకొచ్చిన ఈ చిన్న పుస్తకాలకు విపరీతమైన ఆదరణ లభించింది. మేం వీధుల్లో స్టాల్స్‌ పెట్టి స్వయంగా విక్రయించినంత కాలం ఇవి ఎన్నో కాపీలు అమ్ముడు పోతుండేవి. మేం స్టాల్స్‌ పెట్టటం మానేసి, పుస్తకాలను షాపులకు ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత వీటి ప్రచురణను బాగా తగ్గించాల్సి వచ్చింది. ఎందుకంటే పల్చగా ఉన్న ఈ బుక్‌లెట్స్‌ని పుస్తకాల స్టాండ్స్‌లో పెట్టి ప్రదర్శించటం కష్టంగా ఉందనీ, వెన్ను బలంగా లేక వంగిపోయి పాడవుతున్నాయనీ ఫిర్యాదులు చేస్తూ, షాపుల వాళ్లు వీటిని తీసుకోటానికి నిరాకరించటం మొదలుపెట్టారు. దీంతో చేసేది లేక మేం వీటి ప్రచురణనే తగ్గించుకున్నాం. తర్వాత చిన్న పిల్లల పుస్తకాలను ప్రచురించే ప్రయత్నం కూడా చేశాం. అయితే వాటి కోసం బొమ్మలు వేయించాలి, రంగుల్లో ముద్రించాలి, మంచి దళసరి కాగితం వాడాలి, వీటన్నింటికీ తోడు కొత్త మార్కెటింగ్‌ వ్యవస్థనూ ఏర్పాటు చేసుకోవాల్సి రావటంతో ఖర్చు బాగా ఎక్కువైపోతోంది. దీంతో ఈ ప్రయత్నాలను మేం కొద్ది రోజుల్లోనే విరమించుకోవాల్సి వచ్చింది.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.