రెండు నెలల క్రితం అందరికీ తెలిసిన ఒక ముస్లిం జర్నలిస్టు, తనతో సంబంధం వున్న సమయంలో తనపై పలుసార్లు హింసాత్మకంగా లైంగిక దాడి జరిపారని, తన కిష్టమైన వస్తువులు పగల గొట్టారని, తమ మధ్య సంబంధాన్ని బయటకి చెప్పకుండా ఆపాడని, తన కిష్టం లేని గొడ్డు మాంసం తినిపించాడని ఆయనతో కలిసి జీవించిన మహిళ ఇంస్టాగ్రామ్‌లో రాసింది.
ఈమె ఆధిపత్య కులంలో పుట్టి, స్త్రీవాద సంస్థలతో పరిచయాలుండి, దేశంలోని పెద్ద పౌర హక్కుల సంస్థలో పని చేసే లాయర్. ఆయన పౌరసత్వ నిరసనల సమయంలో అరెస్టయి కస్టడీలో టార్చర్‌కి గురయిన కాశ్మీరీ ముస్లిం. హిందుత్వ దేశంలో ముస్లింల పరిస్థితుల గురించి అనేక పరిశోధాత్మక వ్యాసాలు రాసే జర్నలిస్టు. చట్ట వ్యవస్థ తమ వంటి వారికి న్యాయం చేకూర్చదని, ఢల్లీిలో ప్రగతిశీల శిబిరాల్లో ఇటువంటి పిత్రుస్వామ్య ధోరణులు సర్వ సాధారణమని, కాబట్టి ఇతర అమ్మాయిలకి హెచ్చరిక చేసేందుకు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నానని చెప్పింది. https://x.com/anon_feminist1/status/1924898591027675617/photo/1.
ప్రతి రోజూ ముస్లింలకి, స్త్రీలకి వ్యతిరేకంగా ద్వేష పూరిత ప్రచారాన్ని చేసే హిందూత్వ గుంపులు తన బాధని వాడుకోవాలని చూస్తారని, వాళ్ళకి ఈ విషయాల పట్ల ఏ మాత్రం సహానుభూతి లేదనే విషయం తనకి తెలుసనీ కూడా రాసింది. https://x.com/anon_feminist1/status/1925277979204071892?sR19 ఆమె చేసిన హెచ్చరిక హిందుత్వ గుంపులు పట్టించుకోలేదు ఆయన మీదా, ఆయన కుటుంబం మీద వారాల తరబడి సోషల్ మీడియాలో దాడులు చేశాయి. ఆమెని ఒక ముస్లిం పురుషుడితో కలిసున్నందుకు నానా బూతులూ తిట్టాయి, నీకిలా కావాల్సిందే అంటూ శాపనార్ధాలు పెట్టాయి. మణిపూర్‌లో, మహిళా మల్ల యోధుల విషయంలో మాకు న్యాయం కావాలని అభ్యర్ధించినా పట్టించుకోని జాతీయ మానవ హక్కుల కమిషన్ మేలుకుని ఢల్లీి పోలీసులని అదిలించి నేను ఫిర్యాదు చెయ్యను మొర్రో అన్న ఈమె గురించి యాక్షన్ టేకెన్ రిపోర్టు ఇయ్యమని ఆదేశించింది.
2016లో తలెత్తిన మీ టూ సోషల్ మీడియా మాధ్యమంగా అనేక రంగాల్లో మగ స్వామ్య విశ్వ రూపాన్ని అందరి ముందూ ఆవిష్కరించింది. నల్ల జాతి బాలికలు, స్త్రీల మీద జరిగే హింసని ముందుకు తీసుకురావటానికి తరానా బర్క్ 2006లో మొదలు పెట్టిన ఈ ఉద్యమం హాలీవుడ్ దర్శకుడు హార్వే విన్స్టెయిన్, వుడీ ఎల్లెన్, రోమన్ పొలంస్కీల లైంగిక దుష్ప్రవర్తనతో సహా, సినిమా, ఫ్యాషన్, ఆర్ట్, రాజకీయాలు, స్టాండ్ అప్ కామెడీ, స్టార్ట్ అప్, అకడమిక్, సంగీత రంగాల్లో ఎంత మంది మగవాళ్ళు తమ అధికారాన్ని తమ క్రింద పని చేసే స్త్రీలపై లైంగిక ఆధిక్యతగా ఎట్లా అర్ధం చేసుకుంటారో అందరికీ తెలిపింది. అప్పటి వరకూ ‘రసికులు’ అని తోటివాళ్ళు మురిసిపోయే మగవాళ్లు ఆడవాళ్ళ దృక్పధం నుండి చూస్తే పచ్చి అధికారాన్ని వాడుకునే మగస్వాములని చూపించింది. ప్రగతిశీల మగవాళ్లు కూడా దీనికి అతీతం కాదని అందరికీ తెలిసింది.
1997లో భన్వారీ దేవి కేసు విచారిస్తూ, పని స్థలాల్లో స్త్రీలని లైంగిక వేధింపుల నుండి కాపాడాల్సిన బాధ్యత సంస్థలు, ప్రభుత్వాలు తీసుకోవాలని అంటూ సుప్రీమ్ కోర్టు జారీ చేసిన ఆదేశాలు ఒక దశాబ్దం పాటు విశ్వవిద్యాలయాల్లో, కొన్ని ఇతర సంస్థల్లో వేధింపుల వ్యతిరేక కమిటీలని ఏర్పాటు చెయ్యటానికి కృషి జరిగింది. 2013లో వచ్చిన సక్షం కమిటీ అనేక విశ్వవిద్యాలయాల్లో ఇవి పని చేసే పరిస్థితులు లేవని వెల్లడిరచింది. వేధింపులని సరిగ్గా పట్టించుకోకపోవటంతో విద్యార్థినులతో కోపం, నిరాసక్తత కూడా ఉన్నాయని చెప్పింది.
సరిగ్గా మూడేళ్ళ తర్వాత మన దేశంలో వచ్చిన ఈ మీ టూ లో భాగంగా ఎం.జె. అక్బర్‌తో సహా ప్రముఖ జర్నలిస్టులు, నానా పాటేకర్ వంటి నటులు, వైరముత్తు వంటి సంగీత దర్శకులు, కె సచిదానంద వంటి సాంస్కృతిక విమర్శకులు, జతిన్‌దాస్ వంటి ఆర్టిస్టులతో సహా తమని వేధించారని అనేక మంది యువ బాధితులు ముందుకొచ్చారు. రాయా సర్కార్ అనే అమెరికన్ స్కాలర్ కూర్చి పెట్టిన ‘లిస్టు’ లో అకడమిక్ రంగంలో లారెన్స్ లియాంగ్ వంటి ప్రగతిశీల మేధావులు తమని లైంగికంగా వేధించారని కొంతమంది చెప్పారు. ఢల్లీిలో దాస్తాయే రంగంలో ప్రముఖుడయిన మహమూద్ ఫారూఖీ మీద లైంగిక దాడి కేసు నమోదయ్యింది. దళిత బహుజన మేధావుల లిస్టు కొంత ఇంటర్నెట్‌లో తిరిగింది కానీ విడుదల కాలేదు. ఇది ప్రధానంగా ప్రచారం కోసం జరిగిన ఉద్యమం. కేసులు వేసి ఆయా మగవాళ్ళని శిక్షించటం కంటే, తమ అనుభవాలని పంచుకుని ఆయా మగవాళ్ళు తమ వికృత ప్రవర్తనని కొనసాగించకుండా చెయ్యటం దీని ఉద్దేశం. లైంగిక వేధింపులు, అణచివేతలు అరికట్టడంలో చట్ట వ్యవస్థ తీవ్ర వైఫల్యం, వాటికి గురయ్యే ఆడవాళ్ళ పట్ల సమాజం చూపించే అనుమానం, వాళ్ళు అనుభవించే అవమానం నుండి పుట్టిన వేధింపుల గురించిన అవమానాన్ని మగవాళ్ళకి బదిలీ చెయ్యటంలో మీ టూ ఉద్యమం కొంత సఫలీకృతమైంది.
ప్రక్రియల పరంగా చూస్తే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అన్ని సంస్థల్లో ఇంటర్నల్ ఫిర్యాదు కమిటీలు పెట్టి వాటిని స్త్రీల సంక్షేమ విభాగంలో రిజిస్టర్ చేసుకోవటం తప్పనిసరి చేశారు. అవి ఎంతో కొంత పని చేస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు కొన్ని అడుగులు ముందుకి వేసాయి. కరుడు గట్టిన మగస్వామ్యం నడిచే సినిమా రంగంలో కూడా కొంత గట్టి పోరాటమే నడిచింది. తన సహనటిపై కిరాయి గూండాలతో లైంగిక దాడి జరిపించిన మలయాళ నటుడు దిలీప్ దారుణానికి నిరసనగా కేరళలో సినిమా రంగంలోని ఆడ
వాళ్లు విమేన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఏర్పాటు చేసారు. ప్రభుత్వంపై వత్తిడి చేసి జస్టిస్ హేమ కమిషన్ వేయించారు. ఐదేళ్లు పోరాడి ఆ నివేదికని విడుదల చేయించారు. తర్వాత ఇంకొంత మంది బయటి కొచ్చి తమకి జరిగిన అన్యాయాలు చెప్పారు. 30 కేసులకు పైగా నమోదు అయ్యాయి. తెలుగు సినిమా రంగంలో జరిగే వేధింపుల గురించి శ్రీ రెడ్డి నిరసన తర్వాత ప్రభుత్వం హై లెవెల్ కమిటీ వేసింది. అది 2022లో తన నివేదికని ప్రభుత్వానికి సమర్పించింది కానీ దాన్ని బయటికి రాకుండా బుట్ట దాఖలు చేశారు.
మాట్లాడిన ఆడవాళ్లకి నష్టం కూడా జరిగింది. ఎం.జె.అక్బర్ వంటి మగవాళ్ళు పరువు నష్టం దావా వేశారు. సినిమా రంగంలో వేధింపుల గురించి మాట్లాడిన వాళ్లకి సినీ పెద్దలు పని ఇవ్వలేదు. బలమైన సభ్యులు వున్న చోట కొంతమందికి ఉద్యోగాల నుండి
ఉద్వాసన జరిగింది ఇంటర్నల్ ఫిర్యాదు కమిటీలు విద్యాసంస్థల్లో చిన్న చిన్న గొడవలు, ఫిర్యాదుల గురించి మాత్రమే చర్యలు తీసుకోగలుగుతున్నాయి. ఎప్పుడో జరిగినవి ఇప్పుడెందుకు అని కొందరు, మరి సాక్ష్యాలు లేకుండా ఈ ఉట్టి మాటలు ఏంటి అని మరి కొందరు అంటే, కొన్ని కొర్పొరెట్ సంస్థలు ఆడవాళ్ళని తీసుకోకుండా ఉంటే అసలు గొడవే ఉండదు కదా అనే వాదన కూడా చేశాయి.
అయితే ఇప్పుడు పని స్థలాల్లో వేధింపులతో పాటు, ప్రగతి శీల యాక్టివిజం, జర్నలిజం, ఇతర ఉద్యమ స్థలాల్లో వున్న యువతులకి తమ తోటి కామ్రేడ్ల నుండి ఎదుర్కునే హింస, వేధింపులు, దగా అత్యంత పెద్ద సమస్యగా పరిణమిస్తున్నాయి. ఢల్లీిలో ముస్లిం జర్నలిస్టుకి సంబంధించిన ఈ వివాదంతో పాటే అందరికీ ప్రియుడయిన ఉత్తరప్రదేశ్‌కి చెందిన దళిత నాయకుడు తనకి పెళ్లయింది అని చెప్పకుండా తనతో శారీరక సంబంధం పెట్టుకుని, వాడుకుని వదిలేసాడు అంటూ బాధితురాలు జాతీయ మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. ఆమె ఐరోపాలో దళిత పరిశోధక విద్యార్థి. మరొక బాధితురాలు ప్రముఖ ప్రగతిశీల యు ట్యూబర్ గురించి ఫిర్యాదు చేస్తే, ఇంకొక ఐ ఐ టి విద్యార్థిని, ఒక రాడికల్ విద్యార్థి సంఘంలో తన సీనియర్ తనని బలవంతం చెయ్యటం గురించి సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసింది.
ప్రగతి శీల పురుషులతో దగ్గరి సంబంధాల్లో యువతులు ఎదుర్కుంటున్న ఈ హింస వేధింపులకి రెండు పార్స్వాలు వున్నాయి. ఆడవాళ్లకి పెళ్లి అన్నది ఇప్పటికీ సమాజంలో స్టేటస్‌గా కొనసాగుతోంది, అనేక సామాజిక నియమాలు ఇప్పటికీ పెళ్లినే గుర్తిస్తాయి కాబట్టి లైంగిక సంబంధం పెట్టుకుంటే పెళ్లికి మాత్రమే దారి తియ్యాలనే వత్తిడి పని చేస్తోంది. ప్రస్తుత నయా ఉదారవాద సంస్కృతిలో వ్యక్తిగత స్వేచ్ఛ మాత్రమే కాదు, పెళ్లి కూడా ఒక వ్యక్తిగత సాఫల్యానికి, పెళ్లి కాకపోవటం వైఫల్యానికి సూచికగా మారింది. అన్ని వనరులు వుండి, అన్ని విలువలు తెలిసిన యువతులు తమ జీవితాలని తమకు అనుగుణంగా మలుచుకోకుండా, తాము జీవితంలో కష్ట పడి సాధించిన పవర్‌ని స్వంతం చేసుకోకుండా మగవాళ్ల ప్రేమని జీవిత కేంద్రంగా చేసుకోవటానికి ఇదొక ప్రధాన కారణం.
రెండవది, ఆయా ప్రగతి శీల చోట్లలో వుండే మగవాళ్లకి స్త్రీవాద విలువల పట్ల పెద్దగా ఆసక్తి లేకపోవటం. వాళ్ళు లెఫ్ట్ రాడికల్స్ కావచ్చు, ముస్లిం ప్రగతిశీల పురుషులు కావచ్చు, బహిరంగ జీవితాల్లో పాటించే అనేక మంది మగవాళ్ళు నిలబడే ప్రజాస్వామ్య విలువలకి, అంతరంగ జీవితంలో పాటించే పితృస్వామ్య విలువలకి మధ్య వారికి ఏ ఘర్షణ కనపడట్లేదు. రాడికల్ లెఫ్ట్ సంఘాల్లో, సంస్థల్లో, పార్టీల్లో పురుషుల స్త్రీ వ్యతిరేకత గురించి స్త్రీవాద విమర్శల రచనలు వున్నాయి. ముస్లింలలో మగస్వామ్య ధోరణుల గురించి, స్త్రీ వ్యతిరేకత గురించి ముస్లిం స్త్రీవాదులు తీవ్ర విమర్శనే పెట్టారు. కేరళ లోని ముస్లిం యువత దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు కానీ దేశంలో ఇతర చోట్ల ఈ స్పృహ పెద్దగా కనిపించట్లేదు. బహుజన వాది ఐలయ్య గారు ప్రతిపాదించిన ‘దళిత పితృస్వామ్యం ప్రజాస్వామ్య బద్ధమైనది’ అనే సిద్ధాంతాన్ని, ఇక్కడి దళిత స్త్రీవాదులు తీవ్రంగా విమర్శిస్తే, మహారాష్ట్రలో కుముద్ పావుడే, ఊర్మిళా పవర్, కర్ణాటకలో డు సరస్వతి వంటి అనేక దళిత స్త్రీవాదులు తమ రాజకీయ సమూహాలలో మగస్వామ్యం ఎలా ఉంటుందో రాశారు. కానీ ఇప్పటికీ అనేక మంది యువ పురుష అంబెడ్కర్ వాదులు ఈ సిద్ధాంతాన్ని పట్టుకుని వేళ్ళాడటమే కాక లైంగిక వేధింపులకు పాల్పడిన పురుషులని సమర్ధిస్తుంటారని, తమ సంఘాల్లో దళిత యువతులకు నిర్ణయాధికారం ఇవ్వరని, తమని కేవలం టోకెన్‌గా మాత్రమే వాడుకుంటారని యువ దళిత స్త్రీవాదులు చెప్తున్నారు. ఒక రకంగా చూస్తే అన్ని రకాల రాడికల్ సంఘాల్లో మగస్వామ్య వ్యతిరేక స్త్రీవాద విలువలు ముందుకెళ్లాల్సింది బదులు వెనక్కి పోయాయి.
చట్ట వ్యవస్థలు సరిగా పనిచేయకుండా, ప్రగతి శీల శిబిరాల్లో స్త్రీవాద విలువలు వెనక్కెళ్ళిన ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా వేదికగా మీ టూ అంటూ ఏనోన్ ఫెమినిస్టులాగా ఎందుకు తమ బాధని ఎందుకు చెప్పకూడదని యువ స్త్రీవాదులు అడుగుతున్నారు. కానీ 2016లో మీ టూ కి వేదికగా పనికొచ్చిన సోషల్ మీడియా ఇప్పుడు స్త్రీ వ్యతిరేక గాలులకి ప్రధాన వేదికగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ ద్వేష గుంపులు, హిందూత్వ గుంపులు సోషల్ మీడియాని ఆయుధంగా మార్చుకున్నాయి. దీని వేదికగా ప్రగతిశీల మగవాళ్ల గురించి ఏ ఫిర్యాదు వచ్చినా సరే దాన్ని మొత్తం ప్రగతిశీలతకి ఆపాదించి ప్రచారం చెయ్యటం, వెంటాడి వేధించడం మొదలుపెట్టాయి. దేశం మొత్తం మీద స్త్రీలపై జరిగే హింసని పట్టించుకోని వివిధ రాజ్య వ్యవస్థలు ఈ సంఘటనల్లో మాత్రం అత్యుత్సాహంతో వీరి వెంట పడుతున్నాయి.
1970లు, 80 లలో స్త్రీవాద ఉద్యమంలో ఇటువంటి మగవాళ్ళని తన్నటం, వాళ్ళ ఇళ్ల ముందు ధర్నాలు చెయ్యటం మామూలుగా ఉండేది. మన నక్సల్ అన్నలు, అక్కలు కూడా ఇవే పద్ధతులు పాటించారు. నెమ్మదిగా ఈ పద్ధతుల వల్ల సంఘాలు కొత్త గూండాలుగా తయారవటం తప్ప పరిస్థితులు మారవని అర్ధమయింది. తర్వాత చట్టాల్ని మార్పించాం. పోలీసు స్టేషన్లలో కేసులు వేసి ఆయా బాధితులు ధర్నాలు చేస్తే సమర్ధించటం చేస్తున్నాం. అవి కొన్ని సార్లు పనిచేస్తాయి. మగస్వామ్యం చేసే గాయాలకి ఒకప్పుడు స్త్రీవాద సంస్థల్లో ‘లిజనింగ్ గుంపులు’ పనికొచ్చేవి. ఇప్పుడు అత్యాచార సంఘటనలకి వ్యతిరేకంగా జరిగే న్యాయ పోరాటాలు తప్ప ఇటువంటి వినే చోట్లే తక్కువయ్యాయి. కేసులెయ్యటం, లేకుంటే వ్యక్తులుగా థెరపీకి వెళ్ళటం రెండే మన ముందున్న ఎంపికలు. ఈ చోటు లేని తనం ఆయా స్త్రీలు, వ్యక్తులపై అసాధారణ బరువుని మోపుతోంది. మగస్వామ్యం చేసే గాయాలకు సామూహికంగా చికిత్స చేసుకోవటం ఎలా అన్నది ఇప్పుడు మన ముందున్న పెద్ద ప్రశ్న.
ఈ విషయంలో తమిళనాడులో ఇటీవల బాధితులు జరిపిన కొన్ని ప్రయత్నాలు చట్టం నుండి, వ్యక్తిగత బాధ్యత నుండి, మీ టూ రేపిన చర్చని కొంత ముందుకు తీసుకెళ్లాయి. ఆర్ట్, నాటక రంగంలో దీన్ని గురించి చర్చించే ప్రయత్నాలు జరిగాయి. 2013 నుండి 2022 మధ్య ఇలంగోవన్ ఉరఫ్ కణ్ణగి అనే ప్రముఖ నాటక రచయత తన సోదరుడు నడిపే మనల్మగూడి అనే నాటక సంస్థలో నటించటానికి వచ్చిన అనేక మంది అబ్బాయిలపై జరిపిన లైంగిక వేధింపులు, అత్యాచారాల గురించి వాళ్ళు 2023 లో ఫేస్బుక్ వంటి వేదికల్లో రాసినవన్నీ కలిపి బాధితులే నవంబర్ 2024లో ఒక పుస్తకం తీసుకొచ్చారు. దాని పేరే, Kalkidai: Healing Sexual and Other Violence in the Context of Art (రాతి మేక: కళా రంగంలో లైంగిక, ఇతర హింసల నుండి కోలుకోవటం) (https://www.thenewsminute.com/tamil-nadu/the-book-that-wont-forget-survivors-of-alleged-sexual-abuse-challenge-writer-konangis-legacy. ఇదే నేపథ్యంలో తనపై చిన్నప్పుడు జరిగిన లైంగిక దాడి నుండి సమాజ దాడి నుండి తానెట్లా కోలుకున్నారో, ఇతరులు దీన్నుండి ఎలా తమని తాము కాపాడుకోగలరో చరిత్రకారిణి డా. పొన్ని అరసు ఈ వీడియో ఫిలిం ద్వారా 2023లో విశ్లేషాత్మకంగా వర్ణించారు. https://www.youtube.com/watch?vRJGGSOn2IW4M. క్రిందటి నెల చివరి వారంలో చెన్నైలో జరిగిన కులవై నాటక ఉత్సవంలో దీని మీద రెండు కధనాలని బాధితులు నాటక రూపంలో పంచుకున్నారు.
తమకి న్యాయం జరిగిందని బాధితులు భావించాలంటే నిందితులకి శిక్ష పడటం అవసరం. కానీ న్యాయ వ్యవస్థ వారి గొంతుల్ని వినటానికి సిద్ధంగా లేనప్పుడు హింస నుండి బ్రతికి బయటపడిన వాళ్ళు తమ బాధని ఇతరులకి వినిపించి, తేరుకుని, కోలుకోవటానికి కళ, నటన, రచన వంటి ఇతర మార్గాలని ఎంచుకోవచ్చని ఈ ప్రయత్నాలు మన ముందుకి తెస్తున్నాయి.
