అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

(గత సంచిక తరువాయి…)
` అనువాదం: ప్రభాకర్‌ మందార

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పని ఆరంభించిన తర్వాత నాకు అవసరమైన జీవశక్తి ఏదో దొరికినట్లయింది. అంతకు ముందు నేను పార్టీలో పని చేసినా తెలుగు వారి రోజువారీ జీవితాలను అంతగా దగ్గరగా చూసింది లేదు. విద్యార్థులతోనూ, బస్తీల్లోనూ పని చేశానుగానీ అది చాలా తక్కువ సమయం, పైగా ఎమర్జెన్సీ తర్వాత ఆ కాస్తా కూడా పోయింది. ఇక అప్పట్నించీ కూడా మేం కేవలం మాలాంటి వారి మధ్యనే తిరుగుతున్నాం.

మిత్రులకూ, ర్యాడికల్‌ కార్యాచరణకూ దూరమై.. ఘాజియాబాద్‌లో చేసిన పని నాకు అవసరమైన భావోద్వేగపరమైన మద్దతును ఇవ్వలేకపోయింది. అది నాకు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పనిలో దక్కింది! హెచ్‌బీటీ స్థాపించిన తర్వాత నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో (పరిపాలనాపరంగా అప్పుడు ఒక్కటే రాష్ట్రం) దాదాపు అన్ని ప్రాంతాలూ తిరిగాను. భిన్న రకాల నేపథ్యాలకు చెందిన ప్రజలను కలిశాను. పేద ప్రజల జీవితాలను దగ్గరగా, వారి దృష్టి కోణం నుంచి చూశాను. తెలుగులో రాయడం, చదవడం నేర్చుకున్నాను, ప్రధానమైన రెండు తెలుగు మాండలికాల్లో కొంత సౌకర్యవంతంగా మాట్లాడటం కూడా వచ్చింది. రచయితలు, అనువాదకులు, కవులు, కార్యకర్తలు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, పుస్తక విక్రేతలు, ప్రచురణకర్తలు.. ఇలా ఎందరెందరినో కలుసుకున్నాను. ముఖ్యంగా కొన్ని వందల తెలుగు లోగిళ్లను సందర్శించి ఉంటాను. ఎక్కడకు వెళ్లినా మేమెప్పుడూ హోటళ్లలో వుండేవాళ్లం కాదు. డబ్బు ఆదా అవుతుందనే ఆలోచనే కాకుండా (మా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే కదా) మాకు సహాయపడే వాళ్లతో సాన్నిహిత్యం పెరుగుతుందన్న ఉద్దేశంతో కూడా అలా చేసేవాళ్లం. ప్రజలతో కలసి ఉండటం, వాళ్ల ఇళ్లల్లో బస చేయడం, స్త్రీలతో మాట్లాడుతుండటం వల్ల తెలుగు సంస్కృతి, ఆహారం, సంగీతం, వినోదం వంటి వాటన్నింటి పట్లా మునుపటి కంటే నా అవగాహన పెరిగింది. ఆ అనుభవం నా దృక్పథాన్ని మరింత విశాలం చేసింది. ఇక నేను ఎక్కడ సభలు జరుగుతుంటే అక్కడకు వెళ్లి, బయట కూర్చుని మా హెచ్‌బీటీ పుస్తకాలను అమ్ముతుండే దాన్ని. హేతువాదుల మీటింగుల నుంచి భారతీయ జనతా పార్టీ సభల వరకూ.. ఎక్కడ కుదిరితే అక్కడ ఇలా పుస్తకాలు అమ్మేవాళ్లం. బీజేపీ సభల్లో సైతం కొందరు పాఠకులు దొరుకుతారన్నది నా ఆలోచన. చాలాచోట్ల` ఓ యుక్త వయసు అమ్మాయి ఇలా ఊరు మధ్యలో కూర్చుని పుస్తకాలు అమ్ముతోందంటే ఏమిటో చూద్దామని ఆశ్చర్యంతో వచ్చే వాళ్లూ ఉండేవాళ్లు. అలా నేను వందల మందితో మాటలు కలిపి, వాళ్లకు పుస్తకాల గురించి వివరించి చెప్పటమెలాగో నేర్చుకున్నాను.
ఈ కార్యక్రమాలన్నింటిలోనూ సీకే నన్ను కనిపెట్టుకునే వుండేవారు. తనెంతో వాత్సల్యంగా చూసుకునేవాళ్లు. మొదట్లో నాకు తోడుగా తనే అన్ని చోట్లకూ వచ్చేవారు. ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడ బస చేయాలో, ఎవర్ని కలవాలో సూచిస్తూ వుండేవారు. నేను నా సమస్యలన్నీ ఆయనతో పంచుకునేదాన్ని. ఇద్దరం కలసి ఆలోచించి, వాటికి ఎలాగైనా పరిష్కారాలు కనుక్కునేవాళ్లం. అయితే ఒకే ఒక్కసారి మాత్రం ఆయన ప్రతిస్పందించిన తీరు నన్ను చాలా చికాకుపరిచింది. ఓ సారి పని మీద నేను ఒక్కదాన్నే విజయవాడ వెళ్లాను. అక్కడ న్యాయవాది, మాజీ కమ్యూనిస్టు కర్నాటి రామ్మోహన రావు అనూహ్యంగా, ఇబ్బందికరంగా ‘ప్రొపోజ్‌’ చెయ్యటంతో నాకు తల తిరిగిపోయింది. హైదరాబాద్‌కు తిరిగి వస్తూనే ఈ విషయాన్ని సీకేకి ఫిర్యాదు చేశాను. అలాంటి భయంకరమైన వ్యక్తిని పరిచయం చేసినందుకు నేను తన మీద విరుచుకుపడుతుంటే` తను చాలా నింపాదిగా, ‘ఏం కాలేదు కదా’ అన్నారు. నా ఆందోళన, ఆగ్రహావేశాలను పట్టించుకోకుండా ఆయన అంత తేలికగా ఎలా స్పందించారో నాకు ఇప్పటికీ అయోమయంగానే అనిపిస్తుంది. ఆ సంఘటన జరిగిన తర్వాత దాదాపు పదేళ్ల పాటు నేనసలు విజయవాడలోనే అడుగుపెట్టలేదు. విజయవాడ మీదుగా ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు కూడా తలెత్తి బయటికి చూసేదాన్ని కాదు.
బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో కూడా ఒక ప్రొఫెసర్‌ నుంచి నాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇక అప్పటి నుంచీ నేను రకరకాల బృందాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడమెలాగన్నది పనిగట్టుకుని నేర్చుకున్నాను. అనుమానాస్పదంగా చూస్తుండే, నడి వయసు మగవాళ్ల నుండి తప్పించుకోవటం ఎలాగో నేర్చుకున్నాను. ఈ క్రమంలోనే బయటకి కాస్త కఠినంగా, టఫ్‌గా కనబడటం అలవరచుకున్నాను. మా పుస్తకాల రెండో, మూడో ప్రూఫులు చూడటం ఎలాగో తెలుసుకున్నాను. పుస్తకాలు, వాటి కవర్‌ పేజీలు డిజైన్‌ చేసేప్పుడు ఆర్టిస్టులతో కలసి ఎలా పనిచేయాలి, రచయితలూ అనువాదకులూ నిర్ణీత సమయంలో తమ పని పూర్తిచేసి ఇచ్చేట్టుగా వారిపై ఎలా ఒత్తిడి పెట్టాలి, ముఖ్యంగా బుక్‌ షాపుల నుంచి బకాయిలను ఎలా వసూలు చేయాలి.. వంటివిషయాలన్నీ ఒంటబట్టించుకున్నాను. వీటిలో చిట్టచివరిదే అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే జాలి గుండె గల సీకే వల్ల అలాంటి పనులు సజావుగా జరిగేవి కావు. ఆయనకు అవకాశం దొరికితే చాలు, అందరికీ పుస్తకాలను ఉచితంగా ఇచ్చేస్తుండేవారు. అనేక శాఖలుండే విశాలాంధ్ర, ప్రజాశక్తి వంటి పుస్తకాల షాపు యజమానులతో, మేనేజర్లతో గట్టిగా మాట్లాడి బకాయిలను రాబట్టటం ఎలాగన్నది కూడా నేర్చుకున్నాను. ఒకానొక సందర్భంలో అయితే పాత బకాయిలు వెంటనే కట్టకపోతే షాపు ముందున్న అద్దాలు పగలగొట్టేస్తానంటూ రాయి అందుకుని గొడవ కూడా చేశాను. నా ఆలోచన ఏమిటంటే` మహా అయితే నా మీద పోలీసు కేసు అవుతుంది.. (ఆ పోలీసులైనా ఒక ఆడ మనిషికి అలా రాళ్లు విసరాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ఆశ్చర్యపోతారు కదా), కానీ ఆ షాపు యజమానికి మాత్రం పగిలిన అద్దాలను మార్చుకునేందుకు వేల రూపాయలు వదులుతుంది కదా. వీటివల్ల నాకు చెడ్డపేరు వచ్చిన మాట వాస్తవం. కొందరు నన్ను మొహం మీదే ‘పిసినారి’ అనేవాళ్లు. నేను అడుగుతున్నది మాకు రావాల్సిన బకాయిలే కదా, తప్పెలా అవుతుంది? ఏమైనా, హెచ్‌బీటీ ఆదాయం మాత్రం పోకూడదు.
1984 చివరికల్లా.. తెలుగు నాట నలుచెరగులా పాఠకులతో, విస్తారమైన రచయితలు, అనువాదకుల మద్దతుతో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ అన్ని విధాలా నిలదొక్కుకుంది. మా పుస్తకాలు బాగా అమ్ముడవుతున్నాయి, పెట్టిన డబ్బు తిరిగొస్తోంది. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకూ, సభల వద్ద పుస్తకాలు అమ్మేందుకూ మరో ఇద్దరు ఉద్యోగుల్ని కూడా నియమించుకున్నాం. బాల్‌రెడ్డి, కె.సురేష్‌ వంటి మిత్రులు హెచ్‌బీటీ పుస్తకాలతో జిల్లాలకు వెళ్లేందుకు శ్రమకోర్చి, తమ సమయాన్ని వెచ్చించేవారు. (తర్వాతి కాలంలో బాల్‌రెడ్డి ‘మలుపు ప్రచురణలు’, కె.సురేష్‌ ‘మంచి పుస్తకం’ సంస్థలను ప్రారంభించారు). హెచ్‌బీటీలో ఉద్యోగులుగా పని చేసిన విశ్వేశ్వరరావు (శ్రీశ్రీ పబ్లికేషన్స్‌), సుబ్బయ్య (చరిత్ర పబ్లికేషన్స్‌) వంటి వారు సొంత ప్రచురణ సంస్థలు స్థాపించుకుని విజయవంతంగా నడిపారు. అలాగే కె.సంధ్య (ప్రగతిశీల ప్రజాస్వామ్య సంఘం` పీవోడబ్ల్యూ) వంటివారు క్రియాశీల కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు అయ్యారు. మేం హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ని ప్రారంభించిన తొలి రోజుల్లో కొన్ని వామపక్ష, ర్యాడికల్‌ వర్గాల వారు మా విషయంలో కొంత సందిగ్ధంగా వుండేవారు. కానీ మేం ప్రచురిస్తున్న పుస్తకాల జాబితా పెరిగి, మేమేమిటో మా పుస్తకాలే చెప్పటం మొదలుపెట్టిన తర్వాత ఆయా వర్గాలన్నింటి నుంచీ మాకు అమితమైన సహకారం లభించింది. అంబేడ్కర్‌ సాహిత్యాన్ని ప్రచురించడం వల్ల దళిత రాజకీయ వర్గాలతో సాన్నిహిత్యం పెరిగింది, అనతికాలంలోనే మేం వారితో కలసి పని చేయడం మొదలుపెట్టాం. మేం ప్రచురించిన ‘వైద్యుడు లేని చోట’ వంటి పుస్తకాలు వైద్య, ఆరోగ్య రంగాల్లో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి, ఆ సంస్థలతో మాకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి.
మేం పిల్లల చదువులు, బోధనాశాస్త్ర సంబంధ పుస్తకాలను ప్రచురించటం ఆరంభించినప్పుడు సర్వ శిక్షా అభియాన్‌, రాజీవ్‌ గాంధీ మిషన్‌ వంటి ప్రభుత్వ ప్రాజెక్టులు మా దృష్టికి వచ్చాయి. ఈ రోజుల్లోనే మేం ఇతర సంస్థలతో కలసి కొన్ని పుస్తకాలను సంయుక్తంగా ప్రచురించటం ఆరంభించాం. ఇలా హెచ్‌బీటీ ‘సహ ప్రచురణకర్త’గా తీసుకొచ్చిన మొట్టమొదటి పుస్తకం ‘భారతీయ పారిశ్రామిక పరిణామం’. 1924లో డి.ఆర్‌. గాడ్గిల్‌ రాసిన సుప్రసిద్ధ ‘ది ఇండస్ట్రియల్‌ ఇవల్యూషన్‌ ఆఫ్‌ ఇండియా’కు తెలుగు అనువాదం ఇది. దీన్ని 1988లో ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసెర్చ్‌’ సంస్థతో కలసి ప్రచురించాం. ఆ తర్వాతి కాలంలో ‘నేషనల్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌‘, ‘బొజ్జా తారకం ట్రస్ట్‌’, ‘అన్వేషి రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ వుమెన్స్‌ స్టడీస్‌’, ‘ది సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌’ వంటి సంస్థలతో కలసి అనేక పుస్తకాలను ప్రచురించాం.
మా పుస్తకాల ఖరీదులు తక్కువగా ఉన్నట్టే, దానికి అనుగుణంగానే మా జీతాలు కూడా తక్కువగా వుండేవి. జీతభత్యాల విషయంలో హెచ్‌బీటీలో మొదటి నుంచీ కూడా సమానత్వం పాటించేవాళ్లం. సంస్థను ప్రారంభించినప్పుడు 1980లలో అందరు ఉద్యోగులకు నెలకు రూ.500 చొప్పున జీతం వుండేది. కాలక్రమేణా అది 2000లో రూ.5,000లు, 2019లో రూ.12,000 అయింది. ఇలా సమానత్వం పాటించటం వల్ల సంస్థలో పుస్తకాల ప్యాకింగ్‌, పంపిణీ, రవాణా వంటి రోజువారీ పనులు చేసే ఉద్యోగులంతా నిజాయతీగా, సంస్థ పట్ల విధేయంగా, ఇష్టంగా ఉండటం సాధ్యమయింది. కానీ మా సీనియర్‌ ఉద్యోగులు అధిక వేతనాల కోసం ఇతర సంస్థల వైపు చూస్తూ క్రమేపీ మాకు దూరమవ్వటానికి కూడా ఇదే కారణమైంది. మా ఆఫీసు, మా పుస్తకాలన్నీ ఉద్యోగులందరికీ అందుబాటులో వుంటాయి. ఆఫీసు ఫోన్లను, కంప్యూటర్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకునేవారు. అలాగే 2010 వరకూ ఎప్పుడూ పవరో ఒకరు మా హెచ్‌బీటీ కార్యాలయంలోనే నివాసం వుండేవారు కూడా. ఆ మాటకొస్తే 1997 వరకూ సిరిల్‌, నేనూ కూడా హెచ్‌బీటీ ఆఫీసులోనే ఓ గదిలో
ఉండేవాళ్లం. అయితే కొందరు ఆఫీసు ఫోన్లను దుర్వినియోగం చేయడం, ఒకరు పని గంటల తర్వాత కార్యాలయాన్ని తమ ప్రేమ కలాపాలకు నెలువుగా మార్చుకోవడం వంటివి మా దృష్టికి రావటంతో ఇక అప్పటి నుంచీ ఆఫీసులో బస ఉండనిచ్చే సంప్రదాయాన్ని బంద్‌ చేశాం.
మరోవైపు 1984లో సిరిల్‌ లా చదవడం పూర్తి చేసి, హైదరాబాద్‌ బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. ఆ వెంటనే జె.పార్థసారథి, వి.సత్యనారాయణ వంటి సీనియర్‌ లాయర్ల వద్ద పనిచేయటం ప్రారంభించాడు. క్రమేపీ తను బడుగు వర్గాల వారికి అవసరమైన న్యాయపరమైన సహాయం అందించే పనిలో నిమగ్నమవటం మొదలుపెట్టాడు. అందుకు తగ్గట్టే మేం ఎంతోమంది ఉత్సాహవంతులైన, యువ న్యాయవాదులను కలుస్తూ వారితో స్నేహసంబంధాలను నెరపటం ఆరంభించాం. ఇలా తన మిత్రులతో కలిసి సిరిల్‌ ‘సలహా’ పేరుతో పేద ప్రజలకు న్యాయ సహాయం అందించే ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.
మా నాన్న 1981లో గుండెపోటుతో మరణించారు. అప్పటికి ఆయన వయసు అరవై ఒక్క సంవత్సరాలు. తన శేష జీవితాన్ని మనవలూ, మనవరాళ్లతో ప్రశాంతంగా గడపాలన్న కోరికతో అదే సంవత్సరం ఆయన మద్రాస్‌లోని అన్నా నగర్‌లో ఓ ఇల్లు కట్టుకున్నారు. ఆయన మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసిందనే చెప్పాలి. మేమిద్దరం కలసి గడిపిన సమయం చాలా తక్కువ. మేం ఒకర్నొకరం మరి కాస్త అర్థం చేసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సరిగ్గా ఆయన చనిపోవడానికి ఒక నెల ముందు నేను మద్రాస్‌ వెళ్లాను. నేను తిరిగి వచ్చేస్తుంటే వద్దన్నా వినకుండా నాన్న నాతో పాటు సిటీ బస్సులో రైల్వే స్టేషన్‌ వరకూ తోడుగా వచ్చారు. అప్పటికే బాగా పొద్దుపోయింది. నేను ఒక్కదాన్నే వెళ్లగలను నాన్నా అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆయన మీద నాకు విపరీతంగా కోపం వచ్చింది. పందుకంటే అంత రాత్రి ఆ వయసులో ఆయన ఇంటికి తిరిగి ఎలా వెళ్తారు? దారిపొడవునా ఆయన మీద చిర్రుబుర్రు లాడుతూనే ఉన్నాను. వద్దన్నా ఆయన వెంట వచ్చినందుకు ట్రైన్‌ కదిలే వరకూ విసుక్కుంటూనే వున్నాను. తర్వాత చాలా ఏళ్ల పాటు అది గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసు వికలమైపోతుండేది. నేనారోజు ఆయన పట్ల అంత నిర్దయగా ఎందుకు ప్రవర్తించానా అని బాధ కలుగుతుంటుంది.నాన్న చనిపోయినప్పుడు కొద్ది రోజుల పాటు నేను మద్రాస్‌లోనే వున్నాను. సిరిల్‌ కూడా నా వెంట వచ్చాడు. కర్మకాండలు నడిచినంతకాలం ప్రతి రోజూ ఓ పెద్ద బ్రాహ్మణుల గుంపు ఇంటికొచ్చేది. వాళ్లందరికీ ఇంట్లో వండి వడ్డిస్తుంటే నేనూ, సిరిల్‌, మా చెల్లెలు ముగ్గురం పక్కనే మరో గదిలో కూర్చుని పేకాడుకుంటూ ఉండేవాళ్లం. అమ్మకు అప్పటికి గట్టిగా అరవై ఏళ్లు కూడా ఉండవు. నాన్న మరణంతో ఆమె జీవితం ఒక్కసారిగా అనిశ్చితమైపోయింది. కొన్నాళ్ల పాటు నాన్న కట్టిన ఆ కొత్త ఇంట్లోనే వుండేది, మరికొన్నాళ్లు కూతుళ్ల ఇళ్ల మధ్య తిరుగుతూ గడిపేది, ఇందులో ముగ్గురు కూతుళ్లు అమెరికాలోనే వుండేవాళ్లు. ఒకసారి నన్ను చూడటానికి హైదరాబాద్‌ వచ్చినప్పుడు ‘నాకు నీ దగ్గరే వుండాలని వుందమ్మా’ అంది.
‘నా కూతుళ్లందరిలోకీ నువ్వే తక్కువ సమస్యాత్మకమైన దానివి, నీ దగ్గరే సౌకర్యంగా ఉంది, నువ్వు వాళ్లలా అనవసరంగా అన్నింట్లో జోక్యం చేసుకోవు’ అంది. అమ్మ మనసు అర్థమైంది. కానీ అప్పుడు సిరిల్‌, నేనూ హెచ్‌బీటీ ఆఫీసులోనే ఓ చిన్న గదిలో వుంటున్నాం. పైగా ఆ రోజుల్లో నేను ఎక్కువ సమయం ఇబ్రహీంపట్నంలోనే గడుపుతుండేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో అమ్మను హైదరాబాద్‌ తీసుకొస్తే సౌకర్యవంతంగా చూసుకోగలనా అన్నది పెద్ద సంశయంగా తయారైంది. సిరిల్‌కు ఏ అభ్యంతరం ఉండదని నాకు తెలుసు, కాకపోతే అమ్మ పనులన్నీ నేనే చూసుకోవాల్సి రావచ్చు. అది నాకు వీలయ్యేలా లేదు. ఇక నేనే తరచూ మద్రాస్‌ వెళ్లి అమ్మను చూసొస్తుండే దాన్ని. తను నా కోసం తపిస్తుండేది. అప్పుడు నేనే తల్లిని, ఆమె బిడ్డలా మారిపోయామా అన్న భావన కలిగేది.
7. ఇక ఆపదలను జయించడమే మిగిలింది
నేను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌లో పనిచేయడం మొదలుపెట్టి నాలుగేళ్ల అవుతుండగా రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలన్న నా చిరకాల కోరిక తిరిగి తలెత్తింది. 1980`1984 మధ్యకాలంలో నేను ఎక్కువగా మధ్యతరగతి జనంతోనే వ్యవహరించాల్సి వచ్చేది. వాళ్లంతా వామపక్షవాదులు, అంబేడ్కరిస్టులు. క్రమంగా నాకది అసంతృప్తిగా అనిపించేది. సాధారణంగా రచయితలకు, అనువాదకులకు అహం ఎక్కువ. ఒకోసారి వాళ్లతో వ్యవహరించడం ఇబ్బందిగా కూడా వుండేది. ఇక, బకాయీలను వసూలు చేసుకునేందుకు మేం రిటైల్‌ మార్కెట్‌ను అనుసరించాల్సి వస్తుండేది. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ చాలా వేగంగా అభివృద్ధి చెందడం చూసి అంతా నా పనిని అభినందిస్తుండేవారు. తొలినాళ్లలో నేను చేసిన కృషి వల్లనే అది సాధ్యమైనట్టు అనుకునేవారు. కానీ, నిజానికి హెచ్‌బీటీ సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం. అనేక రకాల వ్యక్తులతో కూడిన మా బృందం మొత్తం కలసికట్టుగా పని చేయడంవల్లనే ఈ ప్రగతి సాధ్యమయింది. 1980లలో రాడికల్‌ రాజకీయ కార్యకలాపాలు ఆంధ్ర ప్రదేశ్‌లో ఉవ్వెత్తున సాగుతుండేవి. ఆ వాతావరణంలో మా పుస్తకాలు ఊపందుకున్నాయి.
అత్యవసర పరిస్థితి అనంతరం మేం అనేకమంది స్ఫూర్తిదాయక ప్రముఖులతో సంబంధాలు ఏర్పరచుకున్నాం. చత్తీస్‌గఢ్‌లో శంకర్‌ గుహ నియోగి చేసిన కృషి గురించి అప్పటికే మేం వినివున్నాం. ఆయన చారు మజుందార్‌ రాజకీయాలకు ఆకర్షించబడ్డ వ్యక్తి. జైలు శిక్షను తప్పించుకోడానికి పశ్చిమ బెంగాల్‌ నుండి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లారు. అక్కడి దల్లి రాజ్హారా ప్రాంతంలో గని కార్మికులతో కలసి పనిచేశారు. 1977లో ‘చత్తీస్‌గఢ్‌ మైన్స్‌ శ్రామిక్‌ సంఫ్‌ు (సీఎంఎస్‌ఎస్‌)’ను ఏర్పాటు చేశారు.1982లో అదే ఛత్తీస్‌గఢ్‌ ముక్తి మోర్చా స్థాపనకు దారితీసింది. ఛత్తీస్‌గఢ్‌్‌ గని కార్మికుల సంఘం ప్రజాస్వామిక ఉద్యమాన్ని విశాల ప్రాతిపదికతతో నిర్వహించేందుకు ఏర్పడిన సంస్థ. కార్మికుల ఆరోగ్యం, విద్య, స్త్రీపురుష సంబంధాల వంటి రోజువారీ సమస్యలపై కూడా అది పోరాటాలు చేసింది. పార్లమెంటు సభ్యులూ, ధన్‌బాద్‌ లోని ట్రేడ్‌ యూనియన్‌ నిర్వాహకులూ అయిన ఎ.కె. రాయ్‌ని మేము 1983లో కలుసుకున్నాం. జార్జి రెడ్డి పబ్లికేషన్‌ ట్రస్ట్‌ ప్రారంభోత్సవ సభలో ప్రసంగించేందుకు ఆయనను ఆహ్వానించాం. హెచ్‌బీటీ ప్రచురించలేకపోతున్న పూర్తి రాజకీయ ప్రధానమైన పుస్తకాలను ప్రచురించేందుకు 1983లోనే మేం ఆ ట్రస్ట్‌ని ఏర్పాటుచేశాం. చార్లెస్‌ బెటెల్‌హైమ్‌ రచించిన ‘చైనా సిన్స్‌ మావో’ (చైనాలో ఏం జరుగుతోంది) వంటి పుస్తకాల అనువాదాలను జార్జి రెడ్డి పబ్లికేషన్‌ ట్రస్ట్‌ ద్వారానే తీసుకొచ్చాం. ఎ.కె. రాయ్‌ ఒక కెమికల్‌ ఇంజనీరు. కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆయన తన ఉద్యోగానికి రాజినామా చేశారు. నక్సల్‌బరీ ఉద్యమం మొదలైన తరువాత సీపీపం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆతర్వాత ఆయన జార్ఖండ్‌లో మార్క్సిస్ట్‌ కోఆర్డినేషన్‌ కమిటీని స్థాపించారు. ఆయన మాతో మూడు రోజులపాటు కలసి వున్నారు. శాంతస్వభావి అయిన ఎ.కె.రాయ్‌ ప్రభావానికి నేను ఎంతగానో గురయ్యాను. అప్పుడు ఆయన వయసు యాభై ఏళ్లుంటాయి. చాలా ఆచి తూచి మాట్లాడేవారు. ఆ మాటల్లో అద్భుతమైన స్పష్టత వుండేది. ఆయనకు అసలు బ్యాంకు అకౌంటే లేదని విన్నాను. తన వద్ద రెండో మూడో జతల బట్టలుండేవి. వాటిని తనే ఉతుక్కునేవారు.
హెచ్‌బీటీ పనిమీద వెళ్లినప్పుడు పొన్నూరులో కత్తి పద్మారావును కలుసుకున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘానికి అధ్యక్షులు. సంస్కృత భాషావేత్త. పొన్నూరు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవారు. మంచి వాక్చాతుర్యంతో ఉపన్యాసాలిచ్చేవారు. విస్తారంగా రచనలు చేసేవారు. ఆయన మాల కులం నుంచి వచ్చినవారు. బొజ్జా తారకంతో కలసి కారంచేడు బాధితుల పక్షాన పోరాడారు. దళిత మహాసభ వ్యవస్థాపకులలో ఒకరు. ఆయన ఒకసారి నాతో ‘‘మీరు గొప్ప సాహిత్యాన్ని ప్రచురిస్తున్నారు. కానీ ఆ పుస్తకాలు సంపన్నుల బీరువాల్లో చదవకుండా పడివుంటున్నాయి. ఎవరికైతే మార్పు చాలా అవసరమో వాళ్లు మీ పుస్తకాలను చదవలేరు’’ అన్నారు. దానికి నా వద్ద సమాధానం లేదు. హెచ్‌బీటీ పుస్తకాల అందుబాటు పరిమితమైనది. అందుకే నేరుగా పేద ప్రజలతో కలసి పనిచేయడానికి మించిన ప్రత్యామ్నాయం ఏదీ లేదనిపించింది.
మా పెళ్లయిన తరువాత సిరిల్‌, నేనూ పిల్లలు వద్దని నిర్ణయించుకున్నాం. పూర్తి స్థాయి కార్యకర్తలుగా పనిచేసేందుకు మాకు మేముగా మా జీవితాలను అంకితం చేసుకున్నాం. కార్యకర్తల పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారో మేం ప్రత్యక్షంగా చూశాం. పిల్లల పెంపకం కోసం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు, సాధారణంగా తల్లే ఎక్కువగా పాటుపడాల్సి వుంటుంది. నాకు అది ఇష్టం లేదు. పిల్లలు వద్దని తీసుకున్న నిర్ణయం వల్ల మా మీద ఆధారపడేవాళ్లెవరూ లేకుండా అయింది. మా నాన్న చనిపోయారు. మా అమ్మలో క్రమంగా మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. నేను మా పుట్టింటి వాళ్లకి దూరంగా వుంటున్నాను. సిరిల్‌కూ నాకూ మధ్య ఒక పరస్పర అవగాహన వుండేది. ఎవరికి ఇష్టమైన పని వాళ్లు చేసుకోవచ్చు. అందుకు పరస్పరం హృదయపూర్వకంగా సహకరించుకోవాలి. అప్పుడు నా వయసు ముఫ్పై సంవత్సరాలు. పూర్తి ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో వుండేదాన్ని. మరోపక్క ప్రపంచం రారమ్మని పిలుస్తోంది.
1980ల తొలి రోజులు అనేక రకాల క్రియాశీల కార్యకలాపాలకు అనుకూలంగా వుండేవి. అత్యవసర పరిస్థితిని తిరుగులేకుండా ఓడిరచి, దేశ వ్యాప్తంగా ఎంతోమంది నూతన రాజకీయ నేతలు ఆవిర్భవించారు. పాతుకుపోయిన సంప్రదాయాలను స్త్రీవాదులు గట్టిగా ప్రతిఘటిస్తున్నారు. కాంగ్రెస్‌ కంచుకోటల్ని ప్రాంతీయ పార్టీలు బద్దలు కొడుతున్నాయి. హిందూ పెత్తనం పేరుకుతగ్గట్టు అప్పటికింకా బలపడలేదు. కేంద్ర అధికారం బలహీనపడిరది. ‘విచ్ఛిన్నకర ధోరణులు’ అని ప్రభుత్వమూ, మీడియా అభివర్ణించేవి దేశంలో పెరుగుతున్నాయి. తెలంగాణాలోని సిరిసిల్ల, జగిత్యాల వంటి ప్రాంతాల్లో రైతాంగ పోరాటాలు తిరిగి ఊపందుకున్నాయి. కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో పీపుల్స్‌ వార్‌ గ్రూపు తన అసాధారణ వ్యూహాలతో ప్రభుత్వాన్ని సవాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటోంది. ఆ గ్రూపు పట్ల ప్రభుత్వ వైఖరి ‘అణచివేత`చర్చలు’ అనే రెండిరటితో సయ్యాటలాడుతుండేది. ఆ పరిస్థితిని పీపుల్స్‌ వార్‌ గ్రూపు తనకు అనుకూలంగా మలచుకుంది. తన ప్రభావాన్ని అనూహ్యంగా విస్తరించుకుంది. రైతాంగాన్ని సంఘటితపరిచి, అంతకు ముందు భూస్వాములు ఆక్రమించుకున్న భూముల్లో ఎర్రజెండాలు పాతి, భూస్వాములు నగరాలకు పారిపోయేట్టు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని టీ షాపుల్లో దళితులకు విడిగా వేరే గ్లాసుల్లో టీ ఇచ్చే వివక్షాపూరిత పద్ధతిని లేకుండా చేసింది. పీపుల్స్‌ వార్‌ గ్రూపు దళాలు, స్థానిక కేడర్‌ కలసి గ్రామాల్లో బహిరంగ న్యాయస్థానాలను నిర్వహిస్తూ తప్పు చేసినవాళ్లనూ, భూస్వాములనూ, రాజకీయ ప్రత్యర్థులనూ శిక్షించడం మొదలుపెట్టాయి. గుర్తింపు యూనియన్‌ కాకపోయినప్పటికీ సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) ద్వారా పీపుల్స్‌ వార్‌ గ్రూపు సింగరేణి బొగ్గుగనులను తన అధీనంలోకి తెచ్చుకుంది. పీపుల్స్‌వార్‌ గ్రూపు పోలీసులను (పౌరులను కాదు) లక్ష్యంగా చేసుకునేది. రాజకీయ నాయకులనూ, ఐఎఎస్‌ అధికారులనూ కిడ్నాపులు చేసేది. ఈ పనులన్నీ ప్రజల్లో ఆ గ్రూపు పరపతి పెరగడానికీ, యువతను ఆకర్షించడానికీ దోహదం చేశాయి. అప్పటి వాతావరణం వారికి అనుకూలంగా మారింది.
ఆ కాలంలో స్వచ్ఛంద సంస్థలు కూడా రాడికల్‌ భాషలో మాట్లాడటం మొదలుపెట్టాయి. భువనగిరి ప్రాంతంలో పనిచేసిన ‘కాంప్రహెన్సివ్‌ రూరల్‌ ఆపరేషన్స్‌ సర్వీస్‌ సొసైటీ’ (సీఆర్‌ఓఎస్‌ఎస్‌), క్షేత్ర స్థాయి ఎన్‌జీవోలతో కలసి పనిచేసే ‘ది రూరల్‌ డెవలప్‌మెంట్‌ అడ్వైజరీ సర్వీసెస్‌’ (ఆర్‌డీఏఎస్‌) అనే రెండు స్వచ్ఛంద సంస్థలు అలాంటివే. పేద ప్రజలను సంఘటితపరచడం, తిరుగుబాటు భాష మాట్లాడటం, స్వచ్ఛంద సేవా సంస్థ అన్న పాత గుర్తింపును వదిలించుకోవడం వంటి ప్రయోగాలు చేశాయి. పార్టీ నుండి బయటికి వచ్చిన వామపక్ష కార్యకర్తలు ఇలాంటి స్వచ్ఛంద సంస్థల్లో పెద్ద ఎత్తున చేరారు. మాలలనూ, మాదిగలనూ, వెనుకబడిన తరగతుల వారినీ తమ హక్కుల సాధనకోసం సంఘటితపరిచేవారు. వాళ్లు ఆయుధాలు చేపట్టలేదు. స్థానిక ప్రజా ప్రతినిధులతో, ప్రభుత్వ కార్యాలయాలతో కలసి పనిచేసేవారు. ఎంఎల్‌ (మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌) ముద్రను వదిలించుకోవాలని ప్రయత్నించే అనేకమంది వీళ్లతో కలిసి నడిచేవారు.
సిరిల్‌ నేనూ అప్పుడప్పుడు ఎంఎల్‌ కేడర్‌ని, ప్రత్యేకించి పీపుల్స్‌వార్‌ కార్యకర్తల్ని కలిసేవాళ్లం. వారిని గౌరవించేవాళ్లం. వారి విశిష్టతలని మేం గుర్తించాం. పార్టీ తప్పొప్పుల గురించి ఆ కొద్దిమందితో అరమరికలు లేకుండా చర్చించేవాళ్లం. ముఖ్యంగా పేద ప్రజలపై, ఇతర విప్లవ గ్రూపులపై ప్రయోగించిన హింసÑ కుల, లింగ వివక్ష, స్త్రీలపై కొందరు నాయకుల లైంగిక వేధింపులు, అభ్యంతరకరమైన ప్రవర్తనలుÑ ఆదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ వంటి ప్రాంతాల్లో బీడీ, తునికాకు కాంట్రాక్టర్ల నుండి బలవంతపు వసూళ్లు, అక్కడ ప్రజాపోరాటాల్లో రాజీపడటం, హైదరాబాద్‌తో సహా పెద్ద పట్టణాల్లో రియల్టర్ల నుండి అక్రమ వసూళ్లుÑ తమ కేడర్‌ లంచగొండితనాన్ని, కమిషన్లు దండుకోడాన్ని చూసీ చూడనట్టు వదిలేయడంÑ అటవీ ప్రాంతాల్లో ఆదివాసీలను కాదని సెట్లర్స్‌ పక్షాన నిలబడడం (చాలామంది సెటిలర్స్‌ కోస్తాంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన కమ్మ కులానికి చెందిన మాజీ కమ్యూనిస్టులు లేదా ఎంఎల్‌ పార్టీ నాయకుల బంధువులు) వంటి అంశాలపై మేం వారితో నిస్సంకోచంగా, స్వేచ్ఛగా చర్చించేవాళ్లం. వాళ్లు మా పట్ల అభిమానంచూపేవారు. వాళ్లంతా తమ పార్టీకి నిబద్ధులైన కార్యకర్తలు. పోలీసు ఎన్‌కౌంటర్లలో ఆ పార్టీ వాళ్లు ప్రాణాలు కోల్పోయినప్పుడు మాకు బాధగా అనిపించేది. అయితే, ప్రజాస్వామిక కేంద్రీకృతవాదం పేరుతో చర్చను నిరాకరించే పార్టీ, ఆధిపత్య వ్యవస్థతో కూడిన పార్టీ, ప్రజల వాస్తవిక సమస్యలకంటే అధికార సాధనకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే పార్టీ మాకు అనుకూలమైనది కాదు. రాడికల్‌ నాయకులు వీటన్నింటినీ ప్రైవేటుగా అంగీకరిస్తారు. కానీ వాళ్ల పార్టీ మాత్రం వారి మాటలను పరిగణనలోకి తీసుకోదు. బహిరంగ వేదిక మీద వాటిని ఒప్పుకోదు.
న్యాయశాస్త్రాన్ని ప్రజా ఉద్యమాలకు అనుకూలంగా ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించే లక్ష్యంతో సిరిల్‌ అతని మిత్రులు జి. మనోహర్‌, జె. పార్థ సారథి, జనార్దన్‌, సి.వి. మోహన్‌ రెడ్డి, కలసి 1984 తొలినాళ్లలో ‘సలహా’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. వాళ్లంతా హైదరాబాద్‌లోని ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టులో విజయవంతంగా ప్రాక్టీస్‌ చేస్తున్నవారే. మనోహర్‌ ఒక ప్రభుత్వ ప్లీడర్‌. మోహన్‌ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్‌కు రెండు పర్యాయాలు అడ్వొకేట్‌ జనరల్‌గా వున్నారు. వాళ్లతో కలసి పనిచేసిన ఇతర న్యాయవాదులు కొండవీటి అర్జున్‌ రెడ్డి, కె. జైరాజ్‌, నల్లపు ప్రహ్లాద్‌. న్యాయస్థానాల్లో సంపన్నులను ఎదుర్కొంటున్న పేదలకు ఉచితంగా న్యాయసేవలు అందించే న్యాయవాదులతో కూడి వుండేది సలహా. చట్టాన్ని దాని పరిమితులలోనే కొంతమేరకైనా పేద ప్రజలు ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చన్నది సిరిల్‌ నమ్మకం. అయితే అందుకు న్యాయవాదులకు ఒక సంస్థ ఉండటం, దానికనుగుణంగా మొదట పేదవాళ్లని చైతన్యపరచడం అవసరం. ప్రభుత్వ కార్యనిర్వాహకుల, చట్టాల సహాయం కూడా కావాలి. అలాగే అధికారుల స్థాయిలో కొంతమేరకు లాబీయింగ్‌, వకాలతు కూడా అవసరం. సలహా ప్రజా సమస్యలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలను కలుసుకుని వారికోసం వర్క్‌షాప్‌లను నిర్వహించింది. న్యాయస్థానాల్లోనూ, బయటా సిరిల్‌ చేసే పనుల వల్ల అతనికి బొజ్జా తారకం, పద్మనాభ రెడ్డి, బీఎస్‌ఏ స్వామి వంటి న్యాయవాదులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. బీఎస్‌ఏ స్వామి 1995 నుంచి 2004 వరకు ఆంధ్ర ప్రదేశ్‌ హై కోర్టులో జడ్జిగా పనిచేశారు. బొజ్జా తారకం ఒక అగ్రగామి దళిత కార్యకర్త. మాజీ స్వతంత్ర శాసన సభ్యులు బొజ్జా అప్పలస్వామి కుమారుడు, ప్రముఖ కవి బోయి భీమన్న అల్లుడు. నేను బొజ్జా తారకం గురించి ఇంతకు ముందు రెండు సందర్భాల్లో ప్రస్తావించాను. మొదటిది అత్యవసర పరిస్థితిలో ఆయన అరెస్ట్‌ అయిన సందర్భం. రెండవది అంబేడ్కర్‌ పుస్తకాలను ఆయన అనువాదం చేసిన సందర్భం. ఆ పుస్తకాలను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టే ప్రచురించింది. నాకు ఆకాలంలో సన్నిహితుడైనందువల్ల ఆయన గురించి ఇక్కడ మరింత వివరంగా చెప్పాలి.
బొజ్జా తారకం మానవ హక్కుల యోధుడు. అంబేడ్కరిస్టు. ప్రముఖ కవి, రచయిత. సీనియర్‌ న్యాయవాది. ఆయన రచనలు ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణాల్లోని ప్రతి గ్రామానికీ చేరాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రతి దళిత కుటుంబాన్నీ ఆయన మాటలు తాకాయి. స్త్రీవాదులు, పర్యావరణవాదులు, మానవ హక్కుల కోసం, ఇండ్లు లేని వారికోసం పాటుపడేవారు, ఫ్యాక్టరీ కార్మికులు, పట్టణ పేదలు, ముస్లింలు, ఆదివాసీలు, ఇతర అట్టడుగు వర్గాలకు చెందినవాళ్లు ఇలా అన్ని రకాల కార్యకర్తలను ఆయన ప్రభావితం చేశారు. నేను తారకంను వాళ్లింట్లో మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఆయన ఒక కార్యకర్తను ఇలా ప్రశ్నించడం విన్నాను: ‘‘నువ్వు ఇప్పటివరకూ జైలుకు పోలేదు, ఒక్కసారైనా అరెస్టు కాలేదు, మరి నిన్ను నువ్వు ఒక కార్యకర్తగా ఎలా చెప్పుకుంటావు?’’ ఆ మాటకు నేను ఒక్కసారి స్తబ్ధురాలినయ్యాను. ఇది 1980ల తొలినాళ్లనాటి మాట, ఒకప్పటి విప్లవకారులంతా అన్ని ఉద్యమాలకు దూరంగా వుండేందుకు, ప్రధాన స్రవంతిలో డబ్బు సంపాదనకోసం పాకులాడేందుకు ప్రయత్నిస్తున్న సమయమది. బొజ్జా తారకం మావోయిస్టు నేత కాదు. జనాన్ని మిలిటెంట్లుగా వెళ్లమని ప్రేరేపించేవాడు కాదు. అత్యవసర పరిస్థితి సమయంలో కూడా విశాలమైన అవగాహన, దాపరికంలేని విశ్వాసాలున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. పుస్తకాలను ఆయన విశ్లేషణాత్మకంగా చదివేవారు. కవిత్వం మొదలుకుని నాటకరంగం వరకూ అన్నింటిపై ఆసక్తి వుండేది. సంగీతంతో సహా అనేక అంశాలపై చర్చిస్తూ మేం చాలాసార్లు కారంచేడుకు సుదీర్ఘ ప్రయాణాలు చేశాం. తను న్యాయవాదిని కాకపోయి వుంటే` ఏ సంగీతకారుడినో, నటుడినో అయ్యుండేవాడినని తరచూ అనేవారు.
బొజ్జా తారకం తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని పచ్చలనడుకుడ అనే చిన్న గ్రామంలో జన్మించారు. గోదావరి నది అక్కడే సముద్రంలో కలుస్తుంది. వారి తండ్రి బొజ్జా అప్పలస్వామి సుప్రసిద్ధ అంబేడ్కరిస్ట్‌ దళిత నేత. ఆయన రెండు సార్లు శాసన సభకు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి రెండుసార్లూ గెలుపొందారు. దళిత పిల్లల కోసం ఆయన పాఠశాలలను స్థాపించారు. తన భార్య మావుళ్లమ్మకు స్వయంగా చదవడం, రాయడం నేర్పించారు. బ్రహ్మ సమాజవాదిగా తన జీవితాన్ని సంఘ సంస్కరణలకు అంకితం చేశారు. 1942లో అంబేడ్కర్‌ నెలకొల్పిన షెడ్యూల్డ్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌కు స్థానిక శాఖను ఏర్పాటు చేశారు. ఒక విప్లవవాదిగా బొజ్జా అప్పలస్వామి దళితుల అసైన్డ్‌ భూములను కాపాడేందుకు ఆ ప్రాంతంలో మిలిటెంట్‌ భూ పోరాటాలను నడిపారు. ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న కాలంలో బ్రాహ్మణుడైన సంఘ సంస్కర్త, తూర్పు గోదావరి జిల్లా విద్యాధికారి కంభంపాటి తారకం ఆయనకు తమ ఇంట్లో ఆశ్రయం కల్పించి ఆదుకున్నారు. అందుకు కృతజ్ఞతగా బొజ్జా అప్పలస్వామి తన కుమారుడికి తారకం అని ఆయన పేరే పెట్టుకున్నారు.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.