యాపకాయలు అనబడు ‘ది బెస్ట్‌’ కత – వినోదిని మాదాసు

‘‘యాపకాయలు కొంటాం… యాపకాయాలు కొంటాం…’’
ఈ అరుపు కోసమే నిన్నటి నుండి ఎదురు చూస్తా ఉంది ఎలిజబెత్‌. అక్క విక్టోరియా అంట్లు తోముతావుంటే ఎదురుగా బక్కెటు నిండా నీళ్లు పెట్టుకొని వాటిని కడుగుతా ఉంది. ఆ మొయినే వాటినొదిలేసి రోడ్డు మీదకి పరిగెత్తింది.

‘‘ మ్మేయ్‌… ఎల్‌ జా..!’’ వెనక నుండి పిలస్తా వుంది విక్టోరియా.
‘‘ యాపకాయలో… యాపకాయలో! ఇట రావయ్యా తాతా’’ పెద్దవాళ్లని ఇమిటేట్‌ చేస్తూ పిలిచింది. అయితే అక్కడ రోజు వచ్చే ముసలాయన లేడు. యాపమాను కింద తొట్టిఆటో పెట్టుకొని ఎవరో ఇద్దరు నిలబడి ఉన్నారు. ఆడా, మగా! ఈసారి ఆమె కూడా అరుస్తోంది. ‘‘యాపకాయలు కొంటాం… యాపకాయలు కొంటాం…’’ కొంతమంది చిన్న పిల్లలు దగ్గర కెళ్లి తొట్టిఆటోని చిత్రంగా చూస్తున్నారు. ఎలిజబెత్‌ కూడా వెళ్ళింది. పెద్ద తక్కెట, బోరెం సంచులు తీసి బయట పెడతన్నారు వాళ్ళు. చిన్నగా అక్కడికి ముసలోళ్లు, ఆడోళ్ళు చేరారు.
వాళ్లిద్దరూ యాపకాయలు కొనడానికి వచ్చినట్లు లేదు. ఏదో చిన్న ఫంక్షన్‌ కొచ్చినట్లు రెడీ అయి వచ్చారు. పొద్దున ఎనిమిది కూడా కాలా… అప్పుడే వచ్చేశారు. ఆమె నూనె పూసి తలకాయ నున్నగా దువ్వుకొని, జడ అల్లుకొని వచ్చింది. చిన్న అంచు చీర కట్టుకొని, మంచి చెప్పులేసుకొని ఉంది. ఆయనా అంతే! ఇస్త్రీ చేసిన ప్యాంటూ చొక్కా వేసుకొని పక్క పాపటి తీసుకొని ఒక పక్కకి దువ్వుకొని ఉన్నాడు. ఇద్దరూ టింబర్‌ డిపోలో కనపడే రెండు బలమైన యాపమొద్దుల్లా కుదిమట్టంగా వున్నారు.
వాళ్లు మాట్లాడే మాటలు కూడా వాళ్ళేసుకున్న బట్టల్లాగా, దువ్విన తలల్లాగా నున్నగా ఉన్నయ్‌. వాళ్లు చెప్పిన మాటల్లో ముఖ్యమైనవి-
నెంబర్‌ వన్‌ : ఇంతకు ముందు కిలోకి ఎవరెంత ఇచ్చినా మేం మాత్రం మూడు మాట్లు ఎక్కువిస్తాం.
నెంబర్‌ టు : ఏ రోజు డబ్బులు ఆ రోజే ఇస్తాం. రోజూ వస్తాం.
నెంబర్‌ త్రీ : ఒక రెండు కిలోలకి ముందే మీ చేతిలో అడ్వాన్సు పెడతాం.
నెంబర్‌ ఫోర్‌: మాకు తప్ప యాపకాయలు ఎవరికీ అమ్మకూడదు.
భలే సంతోషం వేసింది ఎలిజబెత్‌కి. పోయినేడాది వచ్చిన డబ్బుల్తో చెరొక్క కొత్త డ్రస్సు కొనిచ్చింది వాళ్ళమ్మ. దానికి చున్నీ లేదు. ఈ యెండాకాలం సెలవుల తర్వాత ఎలిజబెత్‌ ఆరో తరగతికి వెళుతుంది. విక్టోరియా ఎనిమిదో తరగతికి. ‘ఈసారి చున్నీలున్న డ్రస్సులు, ఎత్తు చెప్పులు కొనుక్కోవాల. నవంబర్‌లో రాబోయే బర్త్‌డేకి కేక్‌ కట్‌ చేయాల. అన్నిటికంటే ముక్యం-అమ్మని మెత్తటి చెప్పులేసుకోమన్నాడు డాక్టరుగారు-కాబట్టి అమ్మకి మెత్తటి చెప్పులు కొనాల. వీటన్నిటికీ ఎక్కువ డబ్బులు కావాల… ఎక్కువ డబ్బులు కావాలంటే ఎక్కువ యాపకాయలు కావాల… ఎక్కువ యాపకాయలు కావాలంటే ఎక్కువ చెట్లకు తిరగాల. ఎక్కువ చెట్లకి తిరగాలంటే ఎక్కువ చోట్లకు పోవాల. ఎక్కువ చోట్లకు పోవాలంటే పెందలాడే లేవాల. ఎవరూ లేవకముందే చీకటితోనే లేచి చెట్ల కాడికి పోవాల. అప్పుడే ఎక్కువ దొరుకుతాయి. పెద్ద గోతం తీసుకుపోవాల. మళ్లీ బళ్ళు తెరిస్తే కుదరదు కదా! ఈ సెలవుల్లోనే అన్నీ సంపాదిచ్చుకోవాల…’ ఒకటే ఆలోచనలు!
గబా గబా ఇంట్లోకెళ్లి నిన్న ఏరిన కాయలు తెచ్చి ఇచ్చింది. వాళ్ళిచ్చిన డబ్బులు చూసి యాప చెట్టు మీద కూర్చున్న చిన్ని పిట్టలాగా వెలిగినయ్‌ ఎలిజబెత్‌ కళ్ళు. ‘అదే ముసలి తాత అయితే ఇందులో సగం కూడా ఇవ్వడు. ఇక నుంచి రోజూ వీళ్లకే అమ్మాలి!’ అనుకుంది.
ఉరుకుతా పోయి ఆ డబ్బులు వాళ్లమ్మ చేతిలో పెట్టింది. ‘‘ఏందిరా ఇన్ని డబ్బులిచ్చారు…! భలే వాళ్ళేనే… ఇక నుంచి ఈళ్ళకే అమ్మండి’’ అనుకుంటా అందులోంచి కొన్ని డబ్బులు తీసి ఎలిజబెత్‌ చేతిలో పెట్టి చెప్పింది. ‘‘అక్కా నువ్వు ఏమన్నా కొనుక్కొచ్చుకొని తినండి!’’
నిమిషంలో ఎలిజబెత్‌ విక్టోరియాలు బయటున్నారు. ఆ డబ్బుల్తో బండిమీద మాడికాయలు కొనుక్కుంటే చిన్నసైజు.. అది కూడా ఒకటే వస్తుంది. అందుకే ఇద్దరు కల్సి ముత్తమ్మవ్వ కాడికి పోయారు. ఇళ్ల మజ్జ నుండే ఆ చిన్న మట్టి రోడ్డు పక్కన నేల మీద పీటేసుకొని కూర్చోనుంది ముత్తమ్మవ్వ. ఎదురుగా జానెడెత్తు బల్లమీద మామిడికాయలు వరసగా పేరుస్తా వుంది. గోతం సంచిలోంచి కాయలు తీసి కత్తితో డాగులు కట్‌ చేసి టబ్బులో ఉన్న నీళ్లలో ముంచి కడిగాక…! మూరెడు కర్ర చివర కర్చీఫ్‌ అంత గుడ్డ కట్టి, అపుడప్పుడు ఈగల్ని తోలతా వుంది.
ఆడకి బోయి ఎదురుగా నిలబడి మూడు పెద్ద సైజు మాడికాయలు కొనుక్కున్నారు. అయి పెద్దవే గానీ డాగు కట్‌ చేసి కడగడం వల్ల సగం కంటే తక్కువే మిగిలింది. ఆ మూడిట్లో ఒక మంచిది యేరి ‘‘ఇది అమ్మకి’’ అనుకుంటా యడంచేతిలో పట్టుకుంది విక్టోరియా. మిగిలిన రెండిట్లో మంచిది, పెద్దది యేరి ఎలిజబెత్‌కి ఇచ్చింది. ఎలిజబెత్‌ దానిని తీసుకోకుండా ‘‘ఇది నువ్వే తిన్‌ లే.. అది నాకియ్‌’’ అంది చిన్న కాయ కోసం చెయ్యి చాపి. ఈ మూడిట్లో కాస్త బాగాలేనిదదే! ‘‘వొద్దులే, నువ్వే తిను’’ అని చెల్లెలి చేతిలో పెట్టి మళ్లీ… ‘‘అమ్మ చెప్పినట్టినాలి గదా.. యెవురికయినా యేమైనా ఇయాల్సివస్తే మనకున్న దాంట్లో మంచిది యేరి వాళ్లకియ్యాలని కదా! అందుకే నువ్వే ఇది తిను… నేనిది తింటా’’ అంది విక్టోరియా. ఇద్దరూ ఇంక ఆత్రం ఆపుకోలేక కొరికి తినుకుంటా, చీక్కుంటా, కారిన రసాన్ని మోచేయి దాకా నాక్కుంటా ఇంటివైపు నడిచారు.
తెల్లారి చీకటితోనే లేచి అక్క చెల్లెళ్లిద్దరూ ప్లాస్టిక్‌ బియ్యం గోతాలు ఒక నాలుగు, జానెడెత్తు ప్లాస్టిక్‌ డబ్బాలు రెండు తీసుకొని బయల్దేరారు. ‘‘అన్నం తినిపోండే’’ అని వాళ్లమ్మ అంటే ‘‘మళ్లొచ్చి తింటాంలే… లేటయితే అందరూ అన్ని యేరుకొని పోతారు…’’ అనుకుంటా ఉషారుగా, ఆశగా బయలుదేరారు. రోజు ఎనిమిది గంటలకి కాస్త యేమన్నా తిని బయలుదేరే వాళ్లు. ప్రకాష్‌ నగర్‌ పిల్లలంతా అంతే..! ‘‘ఈరోజు మనం ఫస్టు ఫస్టు పోతన్నాం కదా! ఎవరూ రాకముందే తొందర తొందరగా యేరుకొని ఈ గోతాలన్నీ నింపుకొని ఇంటికి మోసుకుందాం. అన్నం తిని మళ్లీ పోదాం… ఈసారి యెక్కువ సంచులు ఎత్తుకు పోదాం. అయన్నీ గోతాలు నింపుకొని ఇంటికి మోసకొచ్చుకుందాం…!’’ కళ్ళల్లో పండటానికి ముందు నిగ నిగ లాడే యాపకాయ మెరుపు. మూతి కూడా అంతే ఆశతో మెరుస్తా వుంది.
తీరా చెట్ల కిందకి పోయే సరికే… అక్కడంతా ప్రకాష్‌ నగర్‌ పిల్లలే… అందరూ ఆడపిల్లలే… వీళ్ల సావాస గత్తెలే… ఎప్పుడొచ్చారో ఏందో… అందరూ పడీ పడీ యేరుకుంటన్నారు. ‘‘అందరూ మనలాగే అనుకొని వచ్చుంటార్లే! ఆటో వాళ్లు చేసిన మాయ’’ నవ్వుకుంటా అంది విక్టోరియా. అందరూ ‘యేందబ్బా’ అంటే ‘యేందబ్బా’ అని పలకరిచ్చుకుంటా నవ్వుకుంటా, యేరుకుంటన్నారు.
గొంతుక కూర్చొని, ఎదురుగా డబ్బా పెట్టుకొని యేరుకున్నవి యేరుకున్నట్టే ఆ డబ్బాలో వేసుకుంటన్నారు. చేతికందినన్నీ యేరాక డబ్బాలో వేయటం, డబ్బాని ఒకడుగు ముందుకు జరపటం, అట్లా కూర్చొనే ఒకడుగు ముందుకు జరగటం. డబ్బా నిండగానే లేచిపోయి గోనెసంచిలో పోసుకొని రావటం. కొంత మంది చాలా ఒడుపుగా ఉన్నారు. రెండు చేతుల్తో యేరతన్నారు.
‘‘నువ్వు ఎదురుగా డబ్బా పెట్టుకొని అట్లా కూచోనుంటే నాకు ఇంకొక లాగా కనపడతంది మ్మే ఎల్‌జా…’’ అని అన్నమ్మక్క ఒక్కటే మొయినంగా నవ్వుతావుంది. ‘‘నువ్‌ మాత్రం…? అందరమంతేలే కానీయ్‌…’’ బుజ్జక్క యేరతానే నవ్వుకుంటా అంది. అందరూ ‘కిస్‌ కిస్‌’ మని నవ్వుకున్నారు. ‘‘ఈ యాపకాయలేరినన్ని రోజులు నాకు రాత్రి పూట కాళ్లు నొప్పులొస్తయక్కా…’’ ఎలిజబెత్‌ అంది. ‘‘నాగ్గోడా వస్తయ్‌’’ అని విక్టోరియా, తతిమా పిల్లలు అన్నారు. ‘‘ఈ మాత్రానికే నెప్పులొస్తే యెట్టమ్మాయ్‌. ఇంక నువ్వు కలుపులేం తీస్తావ్‌! ఎట్లా చేస్తన్నారనుకుంటన్నావ్‌ మరి మన అమ్మోళ్ళు… ఇంక ఈ పని నయం గదా… అదే వరిచేలో నాట్లయితే వొక చేత్తో నారు కట్ట పట్టుకొని ఇంకో చేత్తో ఒక్కొక్క మొక్క తీసుకొని వొంగి మునుంలో నాటుకుంటా, యెనక్కి యెనక్కి అడుగేసుకుంటా పోవాల. బురదలో కూరకపోయిన అడుగు లాక్కొని మళ్లీ యెనక బురదలో యేసుకొని అదిమి పెట్టుకోవాల…! మేమంతా ఆ పన్లు చేస్తన్న వాళ్లమేగా…!’’ కళ్ల ముందు నాట్లు కనపడతా వుంటే చెప్పింది బుజ్జక్క. ‘‘నాకు తెల్సులేక్కా… నిరుడు నేను గోడా పోయా మమ్మతో కల్సి’’ అంది విక్టోరియా.
చుట్టు పక్కలున్న చెట్లు కూడా అయిపోయినయ్‌. టైము పదకొండయిపోతావుంది. గోతం నిండేదాకా ఇళ్లకు పోగోడదనుకున్నారు. పొద్దుట్నుంచి ఏం తినకపోవడం వల్ల అందరికీ ఆకలవుతావుంది.! చివరికి ఎట్లనో సంచులు నిండినయ్‌. పెద్ద వయసు అక్కోళ్ళంతా పెద్ద పెద్ద గోతాలు తెచ్చుకున్నారు. తలా ఒక గోతం నెత్తిమీదకి వేరే వాళ్లు ఎత్తితే ఎత్తుకొని ఇంటికి నడిచారు. ఇంట్లో పెద్దోళ్లందరూ ‘ఏం తినకుండా పోయి ఇంతసేపా ఉండేది?’ అని పండిన యాపకాయలాంటి తీపి కోపాలు పడతావున్నారు. ఆరోజు సాయంత్రానికి వచ్చిన ఆటోవాళ్ళు ఇచ్చిన డబ్బుల్తో కాళ్లు నెప్పులు మాయమైపోయినయ్‌ ఎలిజబెత్‌కి. వీళ్లు పొద్దున పోయి సాయంత్రం దాకా యేరడం, వాళ్లు మాపిటేళ్ల వచ్చి ఏరోజు డబ్బులు ఆరోజు ముద్దరశుద్ధిగా చేతిలో పెట్టి కాయలు ఎత్తుకుపోయేవాళ్ళు. తూకంలో కూడా ఎట్లాంటి మోసం ఉండేది కాదు.
అసలేమాత్రం ఊహించని అన్నన్ని డబ్బుల్ని చూసుకొని ఆడపిల్లల మొహాలు వెలిగి పోతన్నయ్‌. బాగా పండి గుజ్జుగుజ్జుగా బంగారం రంగులో చమక్కుమని మెరుస్తున్న యాపకాయ గుత్తుల్లా ఉన్నయ్‌. ఈ మూడ్రోజులూ పాత సైకిలు, పాత గోతాలు, పాత తక్కెటతో యాపకాయలు కొనే పాత తాత వస్తానే ఉన్నాడు. వొట్టి చేతుల్తో తిరిగి పోతానే ఉన్నాడు. యెవురూ ఆయనకి కాయలమ్మడమే లేదు. మూడో రోజు వెనక్కి తిరిగిపోతా ‘అన్నన్ని డబ్బులు నేనేడ నుండి తెచ్చిచ్చేదితల్లా’ అనుకుంటా ఎదురు గాలికి తొక్కలేక ఆ డొక్కు సైకిలు తొక్కుకుంటా వెనక్కి తిరిగాడు. తీగలకి అడ్డం వస్తుందని కరెంటు వాళ్లు కొట్టి రోడ్డు పక్కన పడేస్తే ఎండిపోయి, వడలిపోయిన సన్నటి యాపకొమ్మలా నిస్సత్తువగా …
నాలుగు రోజులు గడిచాక ఆ ఆటోవాళ్లు ఒక మాట చెప్పారు. ఆటో రిపేరు కొచ్చిందని బాగుచేయించుకొని రావడానికి రెండు మూడు రోజులు పట్టిద్దని, ఈలోపు ఎవురికీ అమ్మొద్దని…! తాతొచ్చి కొనేప్పుడు ఆడపిల్లలంతా ప్రకాష్‌నగర్‌ చుట్టుపక్కలుండే చర్చి కాంపౌండ్‌, హైస్కూలు, మగపిల్లల హాస్టల్‌ మాత్రమే తిరిగి ఎరుకునేవాళ్ళు. ఈ ఆటోవాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఆడెక్కడో అల్లంత దూరంలో వుండే కబేళా, చెరువుగట్టు, సమాధుల తోట, ఆస్పత్రి, దెయ్యాల మేడ దాకా వెళ్ళి యేరుకుంటన్నారు. ఇదివరికి పదిమంది లోపే ఉండే పిల్లలు ఇప్పుడొక పదిహేను పదహారు మంది దాకా పోగయ్యారు. అప్పుడు మజ్జానం దాకే యేరి ఇళ్లకొచ్చేవాళ్ళు. ఇప్పుడు యెండని కూడా లెక్క చేయకుండా సాయంత్రం దాకా యేరతానే వుంటన్నారు.
ఈనాల్రోజులూ ఆడపిల్లలంతా ఏ చుట్టాలిళ్లకో, ఊర్లకో పోవటం మానుకున్నారు. యెండకి ఇంట్లో కూర్చొని ఆటలాడటం, మావిడికాయలు చీకడం మానేశారు. ఆడపిల్లలంతా డబ్బాలో, గిన్నెలో తీసుకొని గోతాలు సంకలో బెట్టుకొని బయలుదేరి చెట్లెమ్మటబడి తిరుగుతా ఉన్నారు. కొంతమందైతే పొద్దున తినిపోతే మళ్ళీ సాయంత్రమే తింటన్నారు. కొంతమందేమో రాత్రి మిగిలిపోయిన అన్నంలో ఏదో ఒకటి వేసుకొని బాక్సు తెచ్చుకుంటన్నారు. ఒకరోజు అన్నమ్మక్క ఒక మాట చెప్పింది. తనకెవరో చెప్పారంట. చెరువు అవతల డొంకరోడ్డు దాటి చాలా దూరం పోయాక… ఓ.. ఒవ్వక్కడ చానా చానా యాపచెట్లుంటయంట… యెవురూ యేరుకోక మోకాలెత్తున కుప్పలు కుప్పలుగా రాలి పడ్డాయంట. ఆడికి పోదామంది. అందరూ ఆ దారిన పడ్డారు.
పెద్దపెద్ద గోతాలు తీసుకొని ఆడికి నడిచి పోయే సరికేనే ఓపికంతా పోయింది. అయినా మళ్లీ కాస్త నీళ్లుతాగి ఆటోవాళ్లిచ్చే డబ్బులు గుర్తుచేసుకొని, ఉషారు తెచ్చుకొని యేరటం మొదలుపెట్టారు. అందరిలోకి చిన్నది ఎలిజబెత్తే! ఈ మజ్జనే మొలచిన యాపమొక్కలా ఉంటది. ఎండిన యాపకాయ రంగుతో సన్నగా పొడుగ్గా… లేత చిగురాకు మొహంతో! మజ్జానానికి అందరి గోతాలు నిండాయి. గోతాలు నెత్తికెత్తుకొని అందరూ ఇళ్లకి బయలుదేరారు. గోతం ఎత్తి నెత్తిమీద పెట్టిచ్చుకొని కొంచెం దూరం నడిచే వరకూ బాగానే ఉంది ఎలిజబెత్తుకి. ఇంక అక్కడ నుంచి బరువు మొదలయింది. నిమిష నిమిషానికి పెరిగిపోతా వుంది. నెత్తిమీద ఏదో పెద్ద బండరాయి పెట్టినట్టు, దానిమీద పచ్చడిరోలు పెట్టినట్టు, దానిమీద నాలుగు ఇటికరాళ్ళు పెట్టినట్టు… అడుగు ముందుకు పడటం లేదు. కళ్లు బైర్లు కమ్ముతా వున్నయ్‌.. కళ్ల ముందు ఏదో చీకటి చీకటిగా అవుతా వుంది. అంతే! దబ్బున పడిపోయింది ఎలిజబెత్‌. ‘ఎల్‌ జా’ అని అర్సుకుంటా తన గోతం కూడా కింద పడేసి గబాల్నపోయి చెల్లిని లేపి గుండెల కానిచ్చుకొని కూర్చోపెట్టుకుంది విక్టోరియా. గోతాలకి మూతి ముయ్యనందున సగం కాయలు చెల్లా చెదురుగా పడిపోయినయ్‌. ఎలిజబెత్‌కి మోచేతులు, మోకాళ్లు కొట్టుకుపోయినయ్‌. మొహం కూడా ఎడం పక్కంతా దోక్కుపోయింది. అందరూ వాళ్ల గోతాలు కూడా దించుకున్నారు. పరిస్థితంతా కాస్త సర్దుకున్నాక, అందరూ సహాయం చేస్తే గోతాలు నెత్తికెత్తుకొని నడక మొదలు పెట్టారు. మజ్జ మజ్జలో ఆగుకుంటా, దించుకుంటా ఇల్లు చేరారు అక్కచెల్లెళ్లు. ఆ తర్వాత వాళ్లమ్మ ఎంత చెప్పినా వినకుండా అంతదూరం నుండి గోతం మొయ్యడం అలవాటు చేసుకుంది ఎలిజబెత్‌!
మూడు రోజులైనయ్‌. ఆర్రోజులైనయ్‌. మూడో ఎక్కంలాగా తొమ్మిది రోజులైనయ్‌. అయినా ఆటోవాళ్లు రాలేదు. అయితే ఎవురెవురిచేతో కబురు పంపుతావున్నారు. తొందరలో వస్తామని… తొందరపడి ఎవరికీ అమ్మొద్దని..! రోజు రోజుకీ అందరి ఇళ్లల్లో యాపకాయల గోతాలు పెరుగుతా వున్నయ్‌. గోతాలు చాలక కొంతమంది మంచాల కింద, ఇళ్లలోపల మూలల్లో పోసి గోతాలు తీసుకపోతావున్నారు. ఎలిజబెత్‌ ఇంటి నిండా యాపకాయలే! యాడ చూసినా అయ్యే! ఎప్పుడూ ఇంట్లో వాల్చి ఉండే పట్టెమంచం కిందంతా అయ్యే! ఒక మూల పోసిన పోగు పైకి పైకి పెరుక్కుంటా పెరుక్కుంటా పోతంది. ఎంత పెరుగుతుందో అంతగా కిందకి జారుకుంటా నట్టింట్లోకి వచ్చేసినయ్‌ కాయలు! ఇల్లంతా ఒక్కటే వాసన! యాప వాసన! గుడ్డలు, గిన్నెలు, అన్నాలు, కూరలు, నీళ్లు, మనుషులు కూడా! చివరికి మాటలు కూడా! మొన్న దోసకాయ పచ్చి బద్దల పచ్చడితో అన్నం తింటావుంటే చితికి పోయిన యాపకాయ నోట్లో కొచ్చింది ఎలిజబెత్‌ కి.
వీళ్ల ఇల్లే కాదు అందరిళ్లూ అంతే! చిన్నగా వానలు మొదలయినయ్‌. తడిసిపోయిన కాయల్ని ఏరుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంటి నిండా ఈగలు ముసురుకుంటన్నయ్‌! ‘‘ఏందమ్మాయ్‌, ఈ ఇల్లంతా ఇట్లా చేశారు.. ‘ఆగం అంకమ్మ కొలుపు’ చేశారుగా.. ఈ వాసన, ఈ ఈగలు మా ఇంట్లోక్కూడా వస్తన్నయిగా’’ అంది బయట నిలబడి చేటలో బియ్యం చెరుక్కుంటా విజయమ్మ ఆంటీ! ఈ విషయం ఎట్లా తెల్సిందో… యాపకాయిల తాత ఖాళీ గోతాలు సంకలో పెట్టుకొని ప్రతి ఇంటి ముందు నిలబడి బతిమిలాడతా ఉన్నాడు. ‘పోయినసారి కంటే ఎక్కువే ఇస్తాలే’ అంటన్నా ఎవరూ ఆయన్ని పట్టిచ్చుకోలా. ఎందుకంటే ముందు రోజురాత్రే ఆ ఆటో వాళ్ళిద్దరూ కబురుబెట్టారు. ఆయనకి యాక్సిడెంటై కాలిరగడం వల్ల ఈ పది రోజులు రాలేకపోయామని, ఎట్టి పరిస్థితుల్లో రేపు ఆదివారం వస్తామని నమ్మకంగా కబురు పెట్టారు. అందుకని!
ఆడపిల్లలంతా హుషారుగా ఉన్నారు. కొంత మంది చర్చి కూడా ఎగ్గొట్టారు. ఆ టైం లో గాని వాళ్లొస్తే ఎట్లా అని! చాలామంది లెక్కలేసుకుంటున్నారు… రెండు రకాలు! ఒకటి – ఇవన్నీ ఎంత తూగొచ్చు, ఎన్ని డబ్బులు రావొచ్చు? రెండు – వచ్చిన డబ్బుతో ఏమేం కనుక్కోవచ్చు? బట్టలు, మంచి మంచి సోకైన చెప్పులు, రాబోయే క్రిస్టమస్‌ పండక్కి ఇప్పుడే లోలాకులు, గాజులు, మెడలోకి రకరకాల దండలు! తలలో పెట్టుకొనే స్లైడ్స్‌, క్లిప్పులు, పెద్ద పెద్ద రంగు రంగుల రబ్బరు బ్యాండ్లు…! పెద్ద వయసు అక్కల లెక్కలు వేరే ఉన్నయ్‌. ఎలిజబెత్‌ విక్టోరియా లెక్కల్లో వాళ్ళమ్మ కోసం మెత్తటి చెప్పులున్నయ్‌.
ఎలిజబెత్తు, విక్టోరియా ఇద్దరూ చర్చి కెళ్లేటప్పుడు వాళ్లమ్మ చందావేయమని, వచ్చేటప్పుడు మాడికాయలు కొనుక్కొచ్చుకొమ్మని చిల్లర డబ్బులిచ్చింది. ‘సాయంత్రం వాళ్లొచ్చి యాపకాయలు కొనుక్కు పోతే చానా డబ్బులొస్తయ్‌ గామ్మా. ఆ డబ్బుల్తో డాగులుపడ్డ కాయలు కాకుండా సెంటర్‌కి పోయి మంచికాయలు కొనుక్కొచ్చుకుందుర్లే’ అంది. ఇద్దరూ చర్చి అయ్యాక ఇక సండే స్కూలుకి కూడా ఆగకుండా వచ్చేశారు. భలే సందడిగా ఉన్నారు. ఏప్రిల్‌ నెలలో వచ్చే యాపపూలగుత్తిలా సంతోషంతో వికసించి పోయారు. చూడగా చూడగా సాయంత్రం అయిదు గంటలకు వాళ్లిద్దరూ ఆటో తీసుకొని వచ్చారు.
ఒక్కొక్కసారి పెద్ద ఈదురుగాలి తోలి కాయాలన్నీ గుత్తులు గుత్తులుగా రెమ్మలతో సహా రాలిపడతయ్‌. ఏరుకోటానికి చెట్టు కిందకి పోగానే అవి కనబడినప్పుడు భలే సంతోషమనిపిస్తుంది. వేళ్లతో యారలేనన్ని… దోసిళ్లతో ఎత్తలేనన్ని! అప్పుడు చీపురుతో ఊడ్చుకొని చేటలతో ఎత్తి, గోతాల్లో పోయాల. అట్లాంటి రోజు ఎంత సంతోషమో! ఈ ోజు కూడా అంతే! మూలల్లోవి, మంచాల కిందవీ అక్కడ పోసినయ్‌.. ఇక్కడ పోసినయ్‌.. అన్నీ చీపుర్లతో శుభ్రంగా చిమ్ముకొచ్చి చేటల్తోయెత్తి గోతాల్లో నింపుకొచ్చి యాపమాను కిందున్న ఆటో కాడకి చేర్చారు పిల్లలంతా. ప్రకాష్‌ నగరంతా యాపవాసన తెరలు తెరలుగా కమ్ముకుంటంది. ఆడపిల్లలంతా ఆ వాసనని గుండెల నిండా పీల్చుకుంటన్నారు. ఇప్పుడిక చెట్ల కింద, చెట్ల మీద కాయలు కనపడటం మానేసినయ్‌. రేపటి నుంచి ఇక ఈ కాయలు కూడా కనపడవ్‌..! అది తల్చుకుంటే పిల్లల మనసులు కాయలు లేని ఖాళీ చెట్ల లాగా అయిపోతన్నయ్‌.
అన్నమ్మక్క ఒక చిన్న కాగితం మీద ఒక్కొక్కళ్ల పేరు రాయడం, దాని ఎదురుగా ఎన్నేసి కిలోలో రాయడం, దాని ఎదురుగా ఎన్ని డబ్బులోస్తయ్యో రాయడం! మొత్తం పద్దెనిమిది మంది ఆడపిల్లల పేర్లు. అందరికంటే ఎక్కువ డబ్బులు అన్నమ్మక్కకి. తర్వాత బుజ్జక్క. ఆ తర్వాత గ్రేసు. తర్వాత చిన్ని…! వాళ్లకెన్నేసి డబ్బులొస్తయ్యో తెలియగానే వాళ్ళల్లో ఎక్కడ లేని సంతోషం! ఆ యాపమాను కొమ్మకే ఉయ్యాలేసి ఊగుతున్నట్టు… చిటారు కొమ్మల్లో పెట్టిన తుట్టె లోంచి తేనె జారి, తెరిచిన నోట్లో ధారగా కారతన్నట్టు.. కొమ్మల్లో ఏదో బుల్లి పిట్ట బుజుక్‌ బుజుక్‌ న ఆడాడే తిరుగుతున్నట్టు…!
చాలా జాగ్రత్తగా వెంట తెచ్చుకున్న దబ్బనంతో అన్ని గోతాల మూతులు కుట్టి ఆ తొట్టిఆటోలో ఒకదానిమీద ఒకటివేసి ఏమాత్రం వంకర లేకుండా చాలా కరెక్టుగా పేర్చుకున్నారు. ప్యాంటు జేబులోంచి మడత బెట్టిన ఒక కట్ట డబ్బులు బయటకు తీశాడతను. అందులో రకరకాల నోట్లున్నయ్‌. పాతయ్యి, కొత్తయ్యి.. నలిగినయ్యి! అంతలోకి ఎవరో ఒకాయన బండేసుకొనొచ్చి ఆడ ఆగుతా, కొంచెం గాబరాగా ‘‘గుర్నాదం ఈడున్నావా.. ఎంతసేపట్నుంచో ఫోన్‌ చేస్తా వుంటే అస్సలు కలవనేలేదు. నా చిన్నకొడుక్కి అర్జంటుగా ఆపరేషన్‌ చేయాలన్నారు.. లేకపోతే కష్టమంటన్నారు… ఇరవై నాలుగ్గంటల నెప్పొచ్చింది. నువ్వు ఈ పక్కనున్నావని సుబ్బారావ్‌ చెబితే ఎతుక్కుంటావచ్చా. పిల్లోడి ప్రాణం కాపాడు. నాల్రోజుల్లో డబ్బులు రాగానే ఇచ్చేస్తా’’ మొహానికి చేతిరుమాలు అడ్డం పెట్టుకొని బోరున ఏడ్చాడు. ఆడాడ బయట కూర్చున్న వాళ్లంతా చుట్టూ చేరారు. ‘‘అయ్యో.. ఇవి ఈ ఆడపిల్లల కోసం పెట్టుకున్న బేరం డబ్బులు గదా! ఇవి ఎట్లా ఇచ్చేది?’’ ‘‘అమ్మా వసంతా… నువ్వన్నా చెప్పమ్మా… చావు బతుకుల సమస్యమ్మా… కాస్త ఆలస్యం అయితే ఏమవుద్దో ఏమోనమ్మా… వాడిని ఆసుపత్రిలో పెట్టి ఎట్లైనా డబ్బులు తెస్తానని నీ మీద నమ్మకంతో ఇట్లబడి వచ్చానమ్మా, డబ్బు కడితేనే ఆపరేషన్‌ బల్ల ఎక్కిస్తామని చెప్పారు’’ ఆయనింకా పెద్దగా ఏడుస్తూ చెప్పాడు. ఈయనేమో ఇవ్వడానికి అస్సలు ఇష్టపడటం లేదు! ఆయనేమో ఏడ్చుకుంటా కాళ్లు పట్టుకుంటన్నాడు. ఇళ్లల్లో ఉన్నవాళ్లు కూడా బయటి కొచ్చి గుమికూడారు. తలా ఒక మాట మాట్లాడారు. ‘పాపం చిన్నబిడ్డ, ప్రాణం మీదకొచ్చింది’, ‘అమ్మో…. ఇరవై నాలుగ్గంటల నొప్పంటే మాటలా… యెమ్మటే ఆపరేషన్‌ జెయ్యాల… లేకపోతే ఇంగంతే సంగతి’, ‘డాక్టర్లు కూడా ఏమి చెయ్యలేరు.. ఆపరేషన్‌ చెయ్యాల్సిందే.’ ఎవరెన్ని చెప్పినా, చివరికి అందరిదీ ఒకే మాట- ‘‘ఆ డబ్బులిచ్చి దబ్బున పంపయ్యా ముందు.. పిల్లలకి తర్వాతిద్దువులే’’, ‘‘ముందా డబ్బులిచ్చి పంపూ…! పిల్లోడి ప్రాణం ముక్యం!’’ ఈయన అయిష్టంగానే ఆ డబ్బాంతా తీసి ఆ వచ్చినాయన చేతిలో బెట్టాడు. ఆయన రెండు చేతులెత్తి దండంబెట్టి బండేసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ చేరినోళ్లందరికీ ఒక ప్రాణాన్ని కాపాడాం అనీ… ఏదో కొంత త్యాగం చేశామనీ.. భలే పెద్దరికంగా ప్రవర్తించాం అనీ.. గొప్ప సంతృప్తిగా వుంది.
ఇదంతా పది నిమిషాల్లో జరిగిపోయిది. పిల్లలకేం పెద్దగా అర్ధం కాలేదు. మొన్నోరోజు ఎలిజబెత్‌ పెద్ద జాంకాయ కొనుక్కొని వస్తుంటే చెయ్యి జారి కిందపడి దొర్లుకుంటా దొర్లుకుంటా పోయి అడ్డంగా వున్న పేడకడికి అతుక్కుని ఆగింది. ఒక్క నిమిషం నిలబడి పోయి దాన్నే చూసి చూసి చివరికి దాన్నలా వదిలేసి కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే ఆడ్నుంచి కదిలి వెళ్లిపోయింది. ఇప్పుడూ అంతే అనిపిస్తోంది ఎలిజబెత్‌కి! ‘‘ఒక పసిబిడ్డ ప్రాణం కాపాడారు మీరంతా… చాలా పెద్ద మనసులు మీవి.! అందుకే పెద్దోళ్లు అంటుంటారు, ‘గుణం ముఖ్యం.. కులం కాదని’ అంటూ రెండు చేతులెత్తి ఆమె దండం బెట్టింది. వెంటనే అతను కూడా దండం పెట్టాడు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని ఆటో నడుపుకుంటా వెళ్లిపోయారు. పోతన్న ఆటోలో ఇంతెత్తున పేర్చిఉన్న యాపకాయలు పోతావుంటే పిల్లలంతా నోళ్లు వెళ్లబెట్టుకొని చూస్తావున్నారు. మూడ్నెల్లక్రితం ఎండలు ముదరక ముందు వాళ్లకు చదువు చెప్పే చిన్నారక్క పెళ్లి చేసుకొని ట్రాక్టరెక్కిపోతా వుంటే పిల్లలంతా నీళ్లు నిండిన కళ్లతో టాటా చెప్పుకుంటా నిలబడి పోయారు. ఇపుడు కూడా అంతే..! టాటా చెప్పడానికి కొంతమంది పిల్లలకి చేతులు పైకి లేస్తే.. ఎవ్వరు చూడకుండా దించేసుకున్నారు..!
ఆ రాత్రి ఎలిజబెత్తుకి కలలే కలలు. వాళ్లిద్దరొచ్చి తలా ఇన్నేసి డబ్బులు పంచుతున్నారంట. ఎలిజబెత్తు చేతినిండా ఇన్ని డబ్బులు బెట్టారు. ఎలిజబెత్తు అక్కతో కల్సి ఏంటెంటో కొనుక్కుంటా వుంది. చున్నీ ఉన్న తళుకు తళుకు డ్రస్సు, ఎత్తు చెప్పులు, గాజులు, లోలాకులు, అమ్మ మెత్తటి చెప్పులు, వాటితో పాటు రెండు చేతుల్తో పట్టుకునేంత పెద్ద పెద్ద మామిడి కాయలు..! ఫ్రెష్‌గా, నిగనిగలాడుతూ! అమ్మా శామీ అన్నయ్య అక్క అందరూ చుట్టూ కూర్చొని రెండు చేతుల్తో పట్టుకొని ఆ పెద్ద పెద్ద మాడికాయల్ని కొరుక్కొని తింటన్నారు…! లేచి చూస్తే ‘కలా?’ అని నీర్సం వచ్చింది. ఇవే కలలు కొంచెం అటూ ఇటుగా రోజూ వస్తన్నయి ఎలిజబెత్తుకి. దాదాపు నెలరోజులు గడిచిపోయినయ్‌. వాళ్లిద్దరూ అతీలేరు గతీలేరు. కబురూ లేదు.. కాకరకాయా లేదు. ఇప్పటిదాకా ఎవరికీ, ఎక్కడా కనబడను కూడా కనబడలా..! వూర్లో వాకబు చేస్తే అందరికీ పైసా వుంచుకోకుండా చెల్లించారంట! అప్పుడు అర్థమయ్యింది అందరికీ. ఒక్క ప్రకాష్‌ నగర్‌లో మాత్రమే డబ్బులియ్యకుండా పిల్లోడి ఆపరేషన్‌ డ్రామా ఆడి జంపయ్యారని.. మోసం చేసి పిల్లల రెక్కల కష్టం ఆటోకెత్తుకుపోయారని! డబ్బులెగ్గొట్టి పత్తా లేకుండా పారిపోయారని! వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా కంత్రీవాళ్లని, కేడీవాళ్లని, అదని ఇదని రోజూ తిట్టుకుంటా వున్నారు పెద్దోళ్లు. ఆడోళ్లయితే మెటికలు విరిచి సాడుపోస్తా తిడతన్నారు. రోజులు గడిచే కొద్దీ ప్రకాష్‌ నగర్‌లోని పెద్దోళ్లతో పాటు పిల్లలు కూడా ఆ విషయం కొంచెం కొంచెం మర్చిపోయారు. వానలు మొదలయ్యాయి. బళ్లకి పోతన్నారు.
బడిలో స్టేజి పక్కనున్న పెద్దయాపచెట్టును చూసినప్పుడు, ఇళ్ళదగ్గర యాపమానును చూసినప్పుడు ఎండిన యాపకాయంత దిగులుగా ఉంటుంది ఎలిజబెత్తుకి. ఇప్పుడు ఎలిజబెత్తు కల మారింది. వాళ్లిద్దరూ వచ్చి ఎలిజబెత్తు అరిచేతిలో రహస్యంగా ఏదో పెట్టి పోతన్నారు. గుప్పిట విప్పి చూస్తే శిలువ మీద మేకుకొట్టిన రక్తం వోడుతున్న యేసయ్య అరచేతిలా తన అరిచెయ్యి! ఒకరోజు సాయంత్రం వానబడతావుంటే ‘‘అమా… ఓ మా…!’’ అనుకుంటా బయట గోడవారగా సైకిల్‌ నిలబెట్టి శామీ లోపలకొచ్చాడు. శామీ యెనక బాబుగాడు. ఆ యెనకే తడ్సుకుంటా గుప్పెట్లో కాగితం పట్టుకొని వచ్చింది అన్నమ్మక్క. ఆమె వెనకే తడుసుకుంటా కొంతమంది ఆడపిల్లలు, పెద్దోళ్లు లోపలకొచ్చారు. ఇల్లు నిండిపోయింది. తడిసిన పాంటు జేబులో చెయ్యిపెట్టి తడిసిపోయిన డబ్బులకట్ట బయటకి తీసి వాళ్లమ్మ చేతిలోబెట్టాడు శామి. గుప్పెట్లో కాగితం విప్పి ఒక్కొక్క పిల్ల పేరు, ఎన్ని కిలోలు, ఎంత డబ్బులు- అని అన్నమ్మక్క చదువుతావుంటే ఎలిజబెత్తు వాళ్లమ్మ మడత బెట్టిన నోట్లనివిప్పి తడిని పైటచెంగుతో అద్దుకుంటా, ఒక్కొక్క ఆడపిల్లకి ఇచ్చుకుంటా పోయింది. పిల్ల రాకపోతే వాళ్ల అమ్మో, నానో వచ్చి తీసుకున్నారు. ఎవురూ రాకపోతే బుజ్జక్క ‘‘నేనిస్తాలే’’ అని తీసుకుంది. అటు ఇటూ రావాల్సిన చిల్లర్ని వాళ్ళ మజ్జనే సర్దుబాటు చేసింది ఎలిజబెత్తు వాళ్లమ్మ. చివరగా ఎలిజబెత్తు, విక్టోరియా ‘ఇహిహీ..ఇహిహీ’ అని నవ్వుకుంటా చిగురాకు మొహల్తో వచ్చి వాళ్లమ్మ చేతిలోంచి చివరి డబ్బులు తీసుకున్నారు. సంతోషం, సందడి తొక్కిసపడి ఆడపిల్లల మొహాలు బిగదీసి కట్టిన యాపకాయల గోతాల్లా బిర్రుగా ఉబ్బిపోయినయ్‌! ‘‘శామీ అన్నయ్యా, త్యాంక్యూ త్యాంక్యూ…!’’ అనుకుంటా పిల్లలూ, ‘‘బలేపని చేశావులేరా శామీ..’’, ‘‘ఎట్లయినా శామీ గాడు శామీ గాడే..’’ అనుకుంటా పెద్దలూ వెళ్లిపోయారు.
‘‘అరే శామీ.. ఇందుకేనా పొద్దునవచ్చి ‘మొత్తం ఎంతక్కా’ అని అడిగావ్‌…’’ అని వీపు మీద ముద్దుగా అరచేత్తో ఒకటి కొట్టింది అన్నమ్మక్క. నవ్వు బయటికి రాకుండా పెదాలు లోపలికి తీసుకొని కళ్లతో నవ్వాడు శామీ. నూనూగు మీసాలు. ‘‘మొగుడూ పెళ్లాం మార్కెట్లో కనబడ్డారంట.. ముందు ‘లెవ్వులే..’ అనీ.. ‘తర్వాత ఇస్తాంలే’ అనీ .. ఏదేదో చెప్పి తప్పించుకోటానికి చూసారంట’’, ‘‘ఈ శామీ గాడు గట్టిగానే అడిగుంటాడు.. లేకపోతే ఇస్తారా.. అసలే మనమంటే అలుసైతే’’ అనుకుంటా అన్నమ్మక్క, బుజ్జక్క బయటికి నడిచారు.
… … …
అందరూ అన్నాలు తిన్నాక. పిల్లలు ముగ్గురూ చాపేసుకొని చదువుకుంటన్నారు. ‘అన్నయ్యా ! ఎట్లా దొరికారు వాళ్లు’ అడిగింది విక్టోరియా గుసగుసగా. ‘‘ఎంక్వయిరీ చేస్తే కేసానపల్లి దిక్కునున్నారని తెల్సింది. బాబుగాడ్ని తీసుకొని సైకిల్‌ మీద యెతుక్కుంటా ఆ చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగా.. ఏ ఊర్లోనయినా చర్చియేరియాలోకి పోయి అడిగితే- ఊర్లో వాళ్ళకైతే డబ్బులిచ్చారనీ, మాకు మాత్రం డబ్బులెగ్గొట్టి, మా పిల్లల యాపకాయలన్నీ ఎత్తుకపోయారనీ చెబుతున్నారు. ఇక దొరకరనుకొని తిరిగొస్తావుంటే ఫకీరుపల్లెలో దొరికారు. మనూర్లో డ్రామా ఆడారని మీరు చెప్పారే… అదే డ్రామా… ‘పసి పిల్లాడికి ఇరవై నాలుగ్గంటలనొప్పి’ డైలాగ్‌ నడుస్తా వుంది. నేనుబోయి గబుక్కున వాడి చేతిలోంచి డబ్బులు లాక్కున్నా.. గోల గోల అయింది. అక్కడున్నోళ్లందర్నీ నా మీదకి ఉసిగొల్పాడు. వాళ్ళెంత మోసగాళ్లో చెప్పా..! వాళ్ళు ఆ కంత్రీ వాళ్లని బాగా తిట్టి, వాళ్ల యాపకాయల గోతాలన్నీ తొట్టి ఆటోలోంచి దించేసుకున్నారు. లెక్కజూసి మనకెంత రావాలో తీసుకొని తతిమావి వాళ్లకే ఇచ్చా…’’ అని వీళ్ల మొహాలు చూసి ‘‘ఇంకోటి కూడా ఇచ్చా…’’ అన్నాడు.
‘‘యేందన్నయ్యా అది…’’ బుగ్గల నిండా ఉత్సాహంతో అడిగింది విక్టోరియా.
‘‘ది బెస్ట్‌ !! ’’
‘‘అమ్మ చెప్పే ‘ది బెస్టా’ అన్నయ్యా… అంటే ఏమిచ్చావ్‌…?’’ చాలా డవుట్‌గా అడిగింది ఎలిజబెత్‌.
శామీ ఎడమ పిడికిలి గట్టిగా బిగిచ్చి కొంచెం ఫోర్స్‌గా ఎలిజబెత్‌ ముక్కు దాకా తెచ్చి ఠక్కుమని ఆపేశాడు.
‘అప్హ్‌ా…’ అని టక్కున మొహం వెనక్కి తీసుకుంది ఎలిజబెత్‌.
‘‘అంటే… గుద్దు గుద్దావా…’’ నోరెళ్ల బెట్టింది విక్టోరియా.
ఎలిజబెత్‌ తన మొహం ముందు ఆగిపోయిన అన్న పిడికిలి గబుక్కన పట్టుకొని పరిశీలనగా చూసి, శ్యాం కళ్లల్లోకి చూసింది. అంతే…! పెదవుల చివర్లు కిందికి వొంగిపోయినయ్‌. పెద్ద పెద్ద కన్నీటిబొట్లు టప టపా రాలిపోతుంటే- ‘అన్నయ్యా…’ అనుకుంటా పెద్దగా ఏడ్చింది.
‘హుష్‌…’ అని నోటి మీద వేలు పెట్టుకుని అమ్మకి తెలియొద్దన్నట్టుగా సైగ చేశాడు.
శ్యాం చెయ్యి వేళ్ల కణపుల నుండి మణికట్టు దాకా ఆడాడా చర్మం లేచిపోయి, గాట్లుపడి, చిన్నచిన్న గాయాలతో కొంచెం వాసిపోయి వుంది. విక్టోరియాకి కళ్లనిండా నీళ్లు తిరిగినయ్‌. ఆ ఎడంచేత్తోనే ఇద్దరి కళ్ళూ తుడిచాడు. చొక్కా జేబులోకి చెయ్యి పోనిచ్చి ఏదో తీసి ఇద్దరి మొహాల దగ్గరికి తెచ్చి గుప్పిట తెరిచాడు. అరచేతిలో అయిదారు పళ్లు.
‘‘యాపకాయలకి బదులు డబ్బులు తెచ్చా-కులం తక్కువ పిల్లలని అన్నందుకు ఈ పళ్ళు తెచ్చా …!’’
అక్కచెల్లెళ్లిద్దరికీ స్లోగా అర్థమయింది.
చిన్న చిన్నగా నవ్వటం మొదలు పెట్టారు.. విరగబడి… పగలబడి… నవ్వుకుంటా, ఆపకుండా అంటానే ఉన్నారు- ‘‘ది బెస్ట్‌… ది బెస్ట్‌… ది బెస్ట్‌… ది బెస్ట్‌… ది బెస్ట్‌… !!!!!

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.