వయసును మనం పట్టించుకోక పోయినా అది మనలను పట్టించు కుంటుంది. ఎన్ని కసరత్తులు చేసినా ఈ శరీరం పుట్టి పెరిగి కొన్ని పనులు చేసి పండి, వడలి, చివరకు రాలిపోతుంది. ఇదంతా వేదాంతామని అనిపించొచ్చు, కానీ అనాదిగా సాగిపోతున్న నిజమిదే. ఎంత విర్రవీగినా వయసును తప్పించుకు తిరగడం కష్టం. ఇక ఆడవారిలో అయితే లేత తమలపాకు వంటి యవ్వనం నుండి మెనోపాజ్ చేరే వరకు శరీరంలో మార్పులు వస్తూనే ఉంటాయి.
కౌమారం, యవ్వనం దాటాక, ఉన్నట్టుండి సమయమంతా గబగబా జర్రుజర్రున జారి ఒక్కసారిగా ఏళ్ళన్నీ నలభై దగ్గర ధభీమని ఆగుతాయి.
‘‘నాకు వయసు వచ్చేసిందే బాబు, వయసు వచ్చేసింది’, అని చెప్పుకుంటూ తిరుగుతాము. అదేదో ఓటమిలాగా. అస్త్రాలు త్యజించేస్తున్నట్లు. మొదట్లో వయసు కనపడకుండా ఫేస్ ప్యాక్లు, యాంటి ఏజింగ్ సీరమ్లు వాడుతున్నా సరే, పెద్ద పెద్ద వరదల మధ్య చెల్లాచెదురైన చిన్న చిన్న ఆనకట్టల్లా ఇటువంటి నిస్సహాయపు చర్యలు కూడా పనిచేయని పరిస్థితికి వచ్చేస్తాము. బహుశా కాస్త వ్యాయామం, మరికాస్త శ్రద్ధ డైట్ మీద పెడతామేమో. కానీ ఇవన్నీ పెద్దరికాన్ని మాలిమి చేసుకోడానికి ఉపయోగపడతాయేమో కానీ పెద్దరికాన్ని ఆపలేవు కదా.
పదహారేళ్ళ నుండి 35 వచ్చే వరకు ఆడవారిలో ఉండే అందంపై బోల్డన్నీ కావ్యాలు ప్రబంధాలు వచ్చాయి. కానీ నలభైలు దాటినా వాళ్ళందరూ సపోర్టింగ్ కారక్టర్లుగా మారిపోతారాదేంటో. నలభైలు దాటిన ఆడవారిని బాహిర్ ప్రపంచం చూసే దృష్టి మారిపోతుంది. ఆడవారు కూడా తమని తాము బయట నుండే వీక్షించుకోవడానికి అలవాటు చేస్తారు. కాబట్టి, వారిని వారు కూడా తగ్గించుకునే చూస్తారు.
ఒక రహస్యం చెప్పనా! వయసు రావడం ఏదో బాధపడే విషయంగా పరిగణిస్తారు, కానీ వయసు పెరగడం వలన ఎన్నో లాభాలుంటాయని గుర్తిం చరు. ఉదాహరణకు మనలో పెరిగే ఆత్మవిశ్వాసం.
అనుభవం ఎక్కువ అవడం వలనో లేక అనభవాల వలన పెరిగే పరిజ్ఞానం వలనో మనం కొన్ని సమస్యలను చాలా మామూలు దృష్టితో చూడడం అలవడుతుంది. ఉదాహరణకు పిన్న వయసులో ఉన్నవారికన్నా అతి సాధారణంగా పనిచేయగలిగే నేర్పు, మంచి నెగోషియేషన్ స్కిల్స్ (Negotiation Skills), అస్సర్షన్ (Assertion), పర్ఫెక్షన్ ఇవన్నీ చూస్తాం. ఎందుకంటే అప్పటికే వాళ్ళు చాలా పండిపోయి ఉంటారు, లేదా ఆయా పనులలో ఆరితేరిపోయి ఉంటారు.
Repetition gives power.
అవును, వయసు పవర్ ఇస్తుంది. ఆత్మ విశ్వాసం పెంచుతుంది. ఆకు చాటు పిందెలాగా సిగ్గుసిగ్గుగా మోహబంధం నుండి ప్రేమ బంధం లోకి, అక్కడ నుండి పెళ్లి బంధంలోకి ఆ తరవాత మాతృత్వంలోకి నెట్టబడిన మహిళ ముప్ఫయి ఐదేళ్ల తరవాత ఒక స్పష్టతను సంతరించుకుంటుంది. ఆమె అవసరాలేమిటో అర్థం చేసుకున్నా లేకపోయినా మసక మసక అపోహలలో ఇరుక్కుపోయిన మనిషి స్పషంగా తనకేం కావాలో తెలుసుకుంటూ ఉంటుంది. ఐతే ఆమెకేం కావాలో ఆమెకు తెలీదని చెప్పడం అబద్ధమే. అది తెలీకుండా చేసిన వ్యవస్థ, లేదా తెలిసిన పడనీయని వ్యవస్థ, లేదా కుటుంబము, ముఖ్యంగా పిల్లలు ఆమె కాళ్ళకు బంధనాలవుతారు. కొన్నిసార్లు ఇంకా స్పష్టత రాని మహిళను కూర్చోబెట్టి, ‘నీకేం కావాలి’ అని ఆడిగీతే ఆమెకు సమాధానం దొరకవచ్చు కానీ అది ఒప్పుకుంటే ఘోరమైన స్పందన రావచ్చు.
ఉదాహరణకు భర్త లేదా అత్తమామలు ఆమెని హింసించే వారైతే, వాడిని వదిలేస్తే బావుండు, లేదా, వీళ్ళు త్వరగా చనిపోతే బావుణ్ణు’, అనుకుంటుంది అనుకోండి. చంపేంత ధైర్యం చేయదని తెలిసినా, ఆమె పడే బాధ వలన అలా అనుకోవడం కూడా చెడ్డ అన్నట్లు ఆమెని అతి దుర్మార్గురాలిలా చూస్తారు. అందుకే పాపం ఆమె రియాలిటీలోకి పోవాలనుకోదు. అంటే కానీ రియాలిటీ తెలియకకాదు.
సరే మళ్ళీ మనం వయసు దగ్గరికి వద్దాము. నలభై దాటేసరికి ఆడవారికి చాలా వరకు ఉన్న భ్రమలు తీరిపోతాయి. రెక్కల గుర్రం మీద రాజు రాడు, తనని ఎత్తుకుపోడు. ఒకవేళ పాతికేళ్లకే వచ్చి ఎత్తుకుపోయాడనుకోండి, ఆమెకు నలభై ఏళ్ళు వచ్చే సరికి వాడు అందరి వంటివాడే అని తేలిపోతుంది. కాబట్టి తన జీవితాన్ని తానే ఉద్ధరించుకోవాలి కానీ మరెవరో వచ్చి ఉద్దహరించరు, అనే జ్ఞానం ఆమెకెంతో మేలు చేస్తుంది. అలా ఆమె తన స్వతంత్రతను ప్రేమించడం మొదలుపెడుతుంది. తల్లితండ్రులకున్న పరువు సమస్య, కొత్త మొగుడికి ఉన్న ప్రేమ, అత్తామామలకున్న ఆపేక్ష యవ్వనంలో ప్రతిబంధకంగా మారినా, నలభైలు దాటిన ఆడవారిని అంతగా బాధించవు. కనుక ఆమె చలనశీలత (Mobility) పెరుగుతుంది. తద్వారా ఆమె ఆత్మ విశ్వాసం, తన ఆలోచనలపై ఒప్పుదల (Conviction) పెరుగుతాయి.
దాని మీద ఎవరితో ఏం మాట్లాడితే పనులు సాగుతాయో ఆమెకు అర్థం అవుతుంది కాబట్టి, ఆమె వ్యవహార దక్షత పెరుగుతుంది. కానీ మనస్ఫూర్తిగా గొడవలకు దిగే ఆడవారికి దీవించి, వారిని తప్పుకు తిరిగే తెలివిని పెంచుకుంటుంది.
మన సమాజంలో వయసుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ‘పెద్దవారిని గౌరవించుము’ అని చిన్న పిల్లలకు బానిసత్వము చిన్నప్పుడే బోధిస్తాం కనుక, అందులోని లాభం ఎంతో కొంత ఈ నలభైలు దాటిన మహిళలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి కాస్త పని పురమాయించి చేయించుకునే అధికారం కూడా దర్జాగా వస్తుంది.
అంతేనా? చెబితే భరించలేరు గాని, ఆమెకు లైంగిక స్వేచ్ఛ కూడా పెరుగుతుంది. అంతకాలం మొగుడు మీద అభిమానం తోనో, ఆచారాల నమ్మకంతోనే పిరికిగా ఉన్న మనిషి, ఎంతో కొంత ధైర్యం సంపాదించి జంకు కొద్దిగా వదిలించుకో గలుగుతుంది. ఒకవేళ ఏదైనా వైవాహికేతర సంబంధంలోకి వెళ్లాలన్నా, సమాజం గురించి కాక తన గురించి, తన భద్రత గురించి ఆలోచించే తెలివిడి పెరుగుతుంది.
పని సాధించుకునే సమర్ధత, చలనశీలత, స్పష్టత, ఆర్ధిక వెసులుబాటు, భావాత్మక స్వతంత్రత, ఆమె సృష్టించున్న ఆత్మీయతలు, స్నేహాలు-ఇవిగాక, అప్పటికే ఆమె వ్యక్తిత్వం స్పష్టంగా ప్రకాశిస్తూ ఉంటుంది గనక ఆమె అభిప్రాయానికి ఆలోచనలకు కూడా విలువ పెరుగుతుంది. తన ఆరోగ్యాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకునే మార్గాలు కూడా తెలుసుకుంటుంది.
ఇదంతా భద్రజీవుల కథ! పైన చెప్పిన పవరే పొందని ఆడవారు ఇంకా ఉన్నారా అంటే బోల్డంత మంది ఉన్నారనే సమాధానమే వస్తుంది. దానికి మన వ్యవస్థని తప్పుబట్టాలి కానీ మహిళలను కాదు. అత్తగారు, ఆడపడుచు వంటి అధికారాలతో వారి నిలువరించడం వెనక అసలు రాజకీయాన్ని అర్థం చేయిస్తే ఇక వారిని ఎవరు ఆపగలరు?
కాబట్టి వయసు రావడం మంచిదే, కాదంటారా?
