భారతదేశంలో ఈ మధ్య మహిళా ఖైదీల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. పేదరికం, గతంలో జరిగిన మానసిక గాయాలు, వేధింపులు, మరియు అహింసాత్మకమైన, ఆర్థిక కారణాలతో చేసే నేరాల వంటి అనేక కారణాల వల్ల మహిళలు తరచుగా జైలు పాలవుతున్నారు.
చాలా మంది మహిళా ఖైదీలు తమ సన్నిహిత భాగస్వాముల నుండి హింసను అనుభవించారు, వారు చేసిన నేర కార్యకలాపాలలో తరచుగా మాదకద్రవ్యాలకు సంబంధించిన లేదా ఆస్తి సంబంధిత నేరాలలో పాల్గొనడానికి కారణం బలవంతం లేదా బ్రతకడం కోసమే అయి ఉంటుంది. వీరిలో అధిక శాతం మంది చికిత్స పొందని మానసిక ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. మన దేశంలోని అధిక శాతం జైళ్లు కేవలం పురుషుల అవసరాలకు అనుగుణంగానే రూపొందించబడ్డాయి. మహిళల కోసం ప్రత్యేక జైళ్లు తక్కువగా ఉండటం వల్ల, వారు రద్దీగా ఉండే సాధారణ జైళ్లలో ఉండాల్సి వస్తోంది. చాలా మంది మహిళలు మాదక ద్రవ్యాల కేసులు లేదా చిన్నపాటి నేరాల్లో ఇరుక్కుని, సరైన న్యాయ సహాయం లేక విచారణ ఖైదీలుగానే మిగిలిపోతున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మహిళలు ఎదుర్కొనే సామాజిక వివక్ష, వారిని కుటుంబాలు దూరం పెట్టడం వంటి అంశాలు వారి పునరావాసాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయి.
భారతదేశంలోని మహిళా ఖైదీలు ప్రస్తుతం వారి జనాభా పెరుగుదల, వారి అవసరాలకు అనుగుణంగా లేని జైలు వ్యవస్థల వల్ల తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మొత్తం ఖైదీలలో మహిళలు కేవలం 4.3% మాత్రమే ఉన్నప్పటికీ, 2000 నుండి 2022 మధ్య వారి సంఖ్య 162% పెరిగింది. ఇది దేశ సాధారణ జనాభా వృద్ధి రేటు (30%) కంటే చాలా ఎక్కువ. ఇంతగా సంఖ్య పెరుగుతున్నా, కేవలం 15-16 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో మాత్రమే ప్రత్యేక మహిళా జైళ్లు అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల 80% కంటే ఎక్కువ మంది మహిళా ఖైదీలు, పురుషుల కోసం రూపొందించిన సాధారణ జైళ్లలోని చిన్నపాటి గదుల్లో కిక్కిరిసి ఉండాల్సి వస్తోంది. ఈ రద్దీ కారణంగా పరిశుభ్రత, ఆరోగ్యం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మరో ప్రధాన సమస్య ఏమిటంటే, మహిళా ఖైదీలలో సుమారు 67% నుండి 75% మంది విచారణలో ఉన్న ఖైదీలే. వీరికి న్యాయపరమైన అవగాహన లేకపోవడం లేదా బెయిల్ ఇప్పించడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం వల్ల ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గిపోతున్నారు. వైద్య సదుపాయాల పరంగా కూడా తీవ్రమైన లోటు ఉంది. గైనకాలజిస్టులు, సైకాలజిస్టుల వంటి మహిళా వైద్య సిబ్బంది కొరత కారణంగా వారి శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది మహిళలు తమ చిన్న పిల్లలతో కలిసి జైళ్లలో ఉంటున్నారు. ఈ పిల్లలకు సరైన క్రెచ్‌లు (శిశు సంరక్షణ కేంద్రాలు), పౌష్టికాహారం, విద్యా సౌకర్యాలు విషయంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా ఆత్మహత్యల రేటు 2001-2019 మధ్య దాదాపు రెట్టింపు అయింది. ప్రస్తుత జైలు వ్యవస్థ “లింగ వివక్షతో” కూడి ఉందని గతంలో సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
ముఖ్యంగా నేరాలలో మహిళల ప్రమేయం మారుతున్న విధానం మహిళా ఖైదీల సంఖ్య పెరుగుదలను సూచిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో, మహిళలు చాలా అరుదుగా ఆస్తి నేరాలలో పాల్గొంటారు. కానీ ఎక్కువ మంది మహిళలు బహిరంగ ప్రదేశాలలో ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఉన్నారని పలు నివేదికలు తెలుపుతున్నాయి. ఉదాహరణకు ముంబై వంటి నగరాల్లో, మహిళలు వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల సంబంధిత నేరాలు, మోసం లేదా మానవ అక్రమ రవాణా మొదలైన వాటిలో కనిపిస్తారు. కానీ ఈ రకమైన నేరాలలో, సాధారణంగా పురుష సహచరుడు కూడా తోడుగా ఉంటున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) సమాచారం ప్రకారం, ఎక్కువ మంది మహిళా ఖైదీలు విచారణలో ఉన్నవారే. వివిధ అధ్యయనాల ప్రకారం, పేదరికంతో ముడిపడి ఉన్న చిన్న, పాకెట్ దొంగతనం లేదా వేరొకరి ఆదేశం మేరకు దొంగిలించబడిన వస్తువులను తీసుకెళ్లడం వంటి నేరాలకు అరెస్టయిన వారు చట్టపరమైన సహాయాన్ని పొందలేకపోవడం లేదా అపరాధం చెల్లించలేకపోవడం వల్ల నెలల తరబడి జైలులో ఉంటున్నారు. గతంలో విచారణలో ఉన్న మహిళా ఖైదీలకు బెయిల్ విషయంలో న్యాయవ్యవస్థ మరింత ఉదారంగా వ్యవహరించినప్పటికీ, ఇప్పుడు మహిళల బెయిల్ దరఖాస్తులు ఎక్కువగా తిరస్కరించబడుతున్నట్లు తెలుస్తుంది.
అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల మహిళా ఖైదీల సంఖ్య కూడా పెరిగింది. సరియైన గుర్తింపు పత్రాలు లేని వలసదారులపై చర్యలు తీవ్రతరం అయిన తర్వాత, ఇతర దేశాలకు చెందిన మహిళా ఖైదీల సంఖ్య, ముఖ్యంగా బంగ్లాదేశ్ జాతీయుల సంఖ్య పెరిగిందని జైళ్ల శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా, 7.3 లక్షలకు పైగా మహిళలు జైలులో ఉన్నారు, ఇది 2000 సంవత్సరం నుండి 57 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదల ఉన్నప్పటికీ, ప్రపంచ ప్రమాణాల ప్రకారం భారతీయ మహిళా ఖైదీల సంఖ్య తక్కువగానే ఉంది, అందుకే సంస్కరణలను ఇప్పుడు వేగవంతం చేయాలని, భారతదేశంలో మహిళల చలనశీలత పెరిగేకొద్దీ, మహిళా నేరస్థులు, మహిళా బాధితుల సంఖ్య పెరుగుతుందని ముంబాయిలోని టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ సోషల్ సైన్సెస్‌లోని ఆచార్య విజయ్ రాఘవన్ పేర్కొన్నారు.
ప్రపంచ దేశాల్లో మహిళా ఖైదీల సంఖ్య
గణాంకాల ప్రకారం చూస్తే, ఇండియాలో 2000లో 9,089 మంది మహిళా ఖైదీలు
ఉండగా, 2022లో అది 23,772కి పెరిగింది. ఇది 162% పెరుగుదల, జనాభా పెరుగుదల కంటే చాలా ఎక్కువ. అమెరికా, చైనా, బ్రెజిల్, రష్యా, థాయ్‌లాండ్ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాపంగా మహిళా ఖైదీలు పరిస్థితి పరిశీలిస్తే, యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధిక సంఖ్యలో 174,607 మహిళలు జైలులో ఉన్నారు. తరువాత చైనా (145,000), బ్రెజిల్ (50,441), రష్యా (39,153), థాయ్‌లాండ్ (33,057), ఇండియాలో (23,772) అధిక సంఖ్యలో మహిళా ఖైదీలు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళా ఖైదీలు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం 6వ స్థానంలో
ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పురుషుల జనాభా కంటే మహిళా జైలు జనాభా వేగంగా పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ ప్రకారం, మహిళల జైలు శిక్ష పేదరికం, మునుపటి వేధింపులు, శిక్షాత్మక మాదకద్రవ్య విధానాలతో ముడిపడి ఉంది.
భారతదేశంలో సగటున లక్ష జనాభాకు 29.69 మంది ఖైదీలు ఉన్నారని ఈ విశ్లేషణ సూచిస్తుంది. లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ప్రిజన్ స్టడీస్ అందించిన సమాచారం ప్రకారం, అమెరికాలో లక్ష జనాభాకు 700 మంది ఖైదీలు, రష్యాలో 650, దక్షిణాఫ్రికాలో 400, థాయిలాండ్‌లో 300, యుకెలో 132 మరియు కెనడాలో 102 మంది ఖైదీలు ఉన్నారు. 2022-2023 చివరి నాటికి, భారతదేశంలో మహిళా ఖైదీల సంఖ్య 23,772కి చేరుకుంది, మహిళా ఖైదీల జనాభా 2000లో 9,089 ఉంటే, 2023 నాటికి 21,510కి గణనీయంగా పెరిగింది, ఇది పెరుగుతున్న జైలు శిక్ష రేటును ప్రతిబింబిస్తుంది. మొత్తం జనాభాలో మహిళా ఖైదీలు కొద్ది శాతం ఉన్నప్పటికీ, చాలామంది విచారణలో ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో మహిళా ఖైదీలు ప్రత్యేక మహిళా జైళ్లలో కాకుండా సాధారణ జైళ్లలో ఉన్నారు.
భారతదేశంలో మహిళా ఖైదీల సంఖ్య ధోరణి (2002–2022)
భారత్‌లో 2002 నుండి 2022 మధ్య కాలంలో, పురుష ఖైదీల (77%) కంటే మహిళా ఖైదీల సంఖ్య (97%) అత్యంత వేగంగా పెరిగింది.
సంవత్సరం మహిళా ఖైదీలు పురుష ఖైదీలు
2002 12,047 3,10,310
2022 23,772 5,49,351
వృద్ధి రేటు ం97% ం77%
ఆధారం: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మరియు ఐ.సి.పి.ఆర్ వారి తాజా ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా’ నివేదిక.
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జూన్, 2022 నాటి లెక్కల ప్రకారం, దేశంలో మొత్తం జైళ్ల జనాభాలో మహిళలు 10,414 (3.42%) మంది మహిళా ఖైదీలు ఉన్నారు. మిజోరాంలో మహిళా ఖైదీల శాతం అత్యధికంగా 10.19%, తరువాత తమిళనాడు 6.59%, దాద్రా నాగర్ హవేలి 6.45%, ఆంధ్రప్రదేశ్ 5.52%, కేరళ 5.38%, పంజాబ్ 5.35%, పశ్చిమ బెంగాల్ 4.85%, మణిపూర్ 4.53% ఢిల్లీ 4.52% ఉన్నారు. 5 నుండి 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు జైళ్లలో తమ తల్లులతో నివసించడానికి అనుమతి ఉంది. జైళ్లలో 1369 మంది మహిళలు తమ పిల్లలను తమతో నివసిస్తున్నారు, వీరిలో 234 మంది పశ్చిమ బెంగాల్‌లో, 219 మంది ఉత్తరప్రదేశ్‌లో, 196 మంది బీహార్‌లో మరియు 138 మంది మధ్యప్రదేశ్‌లో ఉన్నారు.
రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో మహిళా ఖైదీలు (4,174) ఉన్నారు. మహిళా ఖైదీలు వారి వయస్సు ఆధారంగా పరిశీలిస్తే, ఎక్కువ మంది మహిళా ఖైదీలు దాదాపు 50.5% మంది 30-50 సంవత్సరాల వయస్సు గలవారు, తరువాత 18-30 సంవత్సరాల వయస్సు గలవారు 31.3% శాతం ఉన్నారు. అంటే యుక్త వయస్సు గల వారు ఎక్కువగా నేరాలకు పాల్పడి, జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు తెలుస్తుంది. మహిళా ఖైదీల సంఖ్య ఈ మధ్య పురుషుల కంటే ఎక్కువగా పెరుగుతుంది. దానికి పలు సామాజిక, ఆర్థిక కారణాలతో పాటు సమాజంలో జరిగే సామాజిక మార్పులు కూడా ఒక కారణం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి గణాంకాలు పరిశీలిస్తే, తెలంగాణ జైళ్ల శాఖ 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక గణాంకాలను విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే జైళ్లలో ఖైదీల ప్రవేశాలలో 11.8 శాతం వృద్ధి నమోదైందని, మహిళా ఖైదీల సంఖ్య కూడా పెరిగిందని. 2024లో 2,785 మంది మహిళా ఖైదీలు ఉండగా, 2025లో ఈ సంఖ్య 2,880కి చేరిందని ఆ నివేదిక పేర్కొంది.
కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘ఉమెన్ ఇన్ ప్రిజన్స’ (కారాగారాల్లో మహిళలు) పేరుతో ఒక నివేదికను విడుదల చేస్తుంది, జైళ్లలో ఉన్న మహిళల హక్కులు, వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కల్పించడం ఈ నివేదిక ముఖ్య ఉద్దేశ్యం. ఆ నివేదికలో మహిళా ఖైదీల జీవితాలను మెరుగుపరచడానికి 134 సమగ్ర సిఫార్సులు ఉన్నాయి. ఇవి గర్భం, ప్రసవం, మానసిక ఆరోగ్యం, ఉచిత న్యాయ సహాయం, సామాజిక పునరేకీకరణ, సంరక్షణ బాధ్యతలపై దృష్టి సారిస్తాయి.
ముగింపు: జైలు నుండి విడుదలైన మహిళలు ఎదుర్కొనే సామాజిక వివక్షను తొలగించడానికి ఆర్థిక సహాయం, ఉపాధి, పిల్లల సంరక్షణ, కౌన్సెలింగ్‌తో కూడిన సమగ్ర ‘ఆఫ్టర్ కేర’ ప్రోగ్రామ్ ఉండాలి. మాజీ ఖైదీలను పోలీసులు వేధించకుండా చూడాలి. ఖైదీలకు కూడా ఓటు వేసే హక్కు కల్పించాలి, తద్వారా వారు ప్రజాస్వామ్యంలో సమాన పౌరులుగా భావించే అవకాశం ఉంటుంది. జైలులో వేధింపుల నివారణకు పటిష్టమైన వ్యవస్థ ఉండాలి. మహిళలు జైలుకు వెళ్లే ముందు తమ పిల్లల సంరక్షణ కోసం ఏర్పాట్లు చేసుకునే అవకాశం కల్పించాలి. ఆరు ఏళ్లు పైబడిన పిల్లలకు కుటుంబం లేని పక్షంలో చైల్డ్ కేర్ హోమ్స్‌లో చేర్చాలి. తల్లితో పిల్లల అనుబంధం దెబ్బతినకుండా తరచుగా సమావేశాలు, సుదీర్ఘ సందర్శనలకు అనుమతించాలి. విచారణలో ఉన్న మహిళా ఖైదీలు తమ గరిష్ట శిక్షా కాలంలో మూడవ వంతు పూర్తి చేస్తే వారికి బెయిల్ మంజూరు చేయాలి. పూచీకత్తు సమర్పించలేని పేద మహిళలను ఎక్కువ కాలం జైలులోనే ఉంచకుండా నిర్ణీత గడువులోగా విడుదల చేయాలి. గర్భిణీలు, బాలింతలకు ప్రత్యేక వసతి, పోషకాహారం అందించాలి. ప్రసవం తర్వాత కనీసం ఏడాది పాటు పరిశుభ్రమైన వాతావరణంలో విడిగా ఉంచాలి. ఖైదీలకు కనీసం వారం వారం మహిళా కౌన్సిలర్లు లేదా సైకాలజిస్టుల సేవలు అందుబాటులో ఉండాలి.
జైలులో ఉన్న మహిళలకు పరిష్కారాలలో సరైన పారిశుధ్యం, ఆరోగ్య సంరక్షణతో అంకితమైన, లింగ-ప్రతిస్పందించే సౌకర్యాలను ఏర్పాటు చేయడం, లక్ష్యంగా చేసుకున్న పునరావాస కార్యక్రమాలను అమలు చేయడం, చట్టపరమైన సహాయం అందించడం, చిన్న నేరాలకు కస్టోడియల్ కాని చర్యలను ఉపయోగించడం వంటివి, వేగవంతమైన న్యాయ సేవలు అందించడం లాంటివి మహిళా ఖైదీలకు మరింత అవసరం. ప్రధానంగా మహిళా జైళ్లలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, వసతిని మెరుగు పరచాలి, పెద్ద నగరాల్లో కాకుండా చిన్న నగరాల్లో ఉన్న జైళ్లని ఆధునీకరించాలి, ప్రతి రాష్ట్రానికి కనీసం ఒక పెద్ద మహిళా జైలు ఉండాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫార్సు చేస్తుంది, వాటిని అమలు పరచాలి. స్త్రీలు, పురుష ఖైదీల నుండి పూర్తిగా వేరువేరు భవనాలు లేదా విభాగాలలో ఉండాలి. పెద్ద సామర్థ్యం గల జైళ్లకు బదులుగా చిన్న, తక్కువ నియంత్రణ కలిగిన, మెరుగైన జీవన యూనిట్ల మాదిరిగా ఉండేలా ఏర్పాట్లు అవసరం. గైనకాలజిస్టులు, మనోరోగ వైద్యులు మరియు మానసిక ఆరోగ్య మద్దతుతో వారికి ఆరోగ్య సేవలను క్రమం తప్పకుండ అందించాలి. ముఖ్యంగా ఎక్కువ శాతం ఉన్న విచారణలో ఉన్న ఖైదీలకు న్యాయ సలహాదారులను అందించడం, విడుదల తర్వాత ఆర్థిక స్వాతంత్య్రానికి సహాయపడటానికి రూపొందించబడిన శిక్షణా కార్యక్రమాలు, పునరావృత నేరాలను తగ్గించడానికి సామాజిక, ఆర్ధికంగా వారికి ఆదƒTకోవడానికి లక్ష్యంగా చేసుకున్న కార్యక్రమాలు నిర్వహించడం కూడా ముఖ్యమైన అంశం. మహిళా కేసులను త్వరగా పరిష్కరించడానికి వేగవంతమైన కోర్టులు, మహిళా ఖైదీలతో గౌరవంగా ప్రవర్తించడానికి, లింగ-నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి జైలు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కూడా మహిళా ఖైదీలను మార్చడానికి ఉపయోగపడే అంశం. చివరగా మహిళా ఖైదీలని సమాజంలో ఉన్నతమైన పౌరులుగా మార్చాల్సిన బాద్యతను ప్రభుత్వం ముఖ్యమైన అంశంగా పరిగణించి వారి అభివృద్ధికై మరిన్ని జీవనోపాధి, నైపుణ్యా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గ్రామీణాభివృద్ధి విభాగం, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, న్యూఢిల్లీ
