వయసు పైబడినా ఏమాత్రం అలసత్వం చూపించకుండా అహర్నిశలు పనిచేస్తున్నారు లక్ష్మీరాజీవగారు. ఈ వయసులో కూడా ఆమె చలాకీతనం, ఉత్సాహం నేటి తరానికి మార్గదర్శకం. చంటి ప్రసన్న కేంద్రాన్ని స్థాపించి 30 ఏళ్ళకు పైగా మహిళా సాధికారత దిశగా ఎన్నో కార్యక్రమాలు చేసారు.
అక్కడితో ఆగక అక్షరాన్ని నమ్ముకున్న ఆమె ఎన్నో రచనలు చేసారు. తాను రాయడమే కాకుండా పలువురు మహిళలతో రాయించారు. ఇంకా రాయిస్తున్నారు. వాటిని చంటి ప్రసన్న కేంద్రం పేరుతో ప్రచురిస్తు న్నారు. వాటిలో “DECCAN CROWN – TELANGANA WOMEN EMPOWERMENT” పేరుతో ఈ మధ్యనే ఇంగ్లీషులో వచ్చిన పుస్తకం ఒకటి. వాటితో తెలంగాణ చరిత్ర సంస్కృతిని నలుదిశలా వ్యాపింప చేస్తున్నారు. నిరంతరం పనిచేయడమే మనిషి మనసుకు, శరీరానికి ఆరోగ్యకరం.. అని విశ్వసించే రాజీవ జీవితంలోని ఒడిదుడుకులను ఆమె మాటల్లోనే తెలుసుకుందాము.
ప్ర. నమస్తే అక్కా! బాగున్నారా?
జ. బాగున్నాను గిరిజా! రా! కూర్చో.
ప్ర. మీ తల్లిదండ్రులు, తోబుట్టువుల గురించి చెప్పండి.
జ. అమ్మ పేరు వై. రాజేశ్వరమ్మ. గృహిణి. ఇంట్లోనే రామాయణం, భారతం లాంటి పుస్తకాలు చదువుకుంది. చాలా ధైర్యవంతురాలు. మా చిన్నప్పుడే నాన్న మరణించడం వల్ల ఇద్దరు చిన్న ఆడపిల్లలతో ఆమె పడిన కష్టాలు నాకు ఎప్పుడూ గుర్తుంటాయి. ఆ ధైర్యం, స్ఫూర్తి నన్ను ఇక్కడిదాకా నడిపించాయి. నాన్న పేరు ఈడ వెంకటేశ్వర గౌడ్. తహసీల్దారుగా పనిచేసేవారు. డ్యూటీలోనే అకస్మాత్తుగా మరణించారు. నాకు ఒక చెల్లెలు. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నా చెల్లి పేరు స్వరాజ్యలక్ష్మి. నాకంటే ఏడాది చిన్నది. ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట మా వూరు.
ప్ర. మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. నాకు ఏడాదిన్నర వయసులో మా నాన్న మరణించాడు. అప్పుడు చెల్లి పదినెలల పాప. మా పెద్దనాన్న సీతారామయ్య గౌడ్ వెంటనే మమ్మల్ని ఏలూరుకు తీసుకుపోయారు. వాళ్ళకు సీతారామాంజనేయ పేరుతో లీ ల్యాండ్ బస్ సర్వీసు వ్యాపారం ఉండేది. అలా నా బాల్యం అంతా అక్కడే గడిచింది. మా పెద్దమ్మ లక్ష్మీనరసమ్మకు పిల్లలు లేనందువల్ల నన్ను అల్లారు ముద్దుగా పెంచింది. నేను ఏలూరులోని సెయింట్ థెరిసా కాన్వెంట్ స్కూల్ అండ్ కాలేజ్‌లో పాఠశాల స్థాయి నుంచి బిఏ దాకా చదువుకున్నాను.
ప్ర. మీ ఉద్యోగ వివరాలు చెప్పండి.
జ. నేను చదువుతున్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అప్పుడే వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంటులో ఉద్యోగం వచ్చింది. నేను డిగ్రీ పూర్తి అయ్యాక హైదరాబాదు వచ్చి ఉద్యోగంలో చేరాను. తర్వాత మా చెల్లిని హైదరాబాదుకు తీసుకు వచ్చాను. తనకు డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల బి ఎస్సీ నర్సింగ్‌లో చేరింది.
ప్ర. తర్వాత ఏం జరిగింది?
జ. నాకు జర్నలిజం పట్ల ఆసక్తి. అందువల్ల రెండు సంవత్సరాలు ఉద్యోగానికి సెలవు పెట్టాను. మద్రాసులో జర్నలిజం కోర్సు చదవాలని నా కోరిక. అంతే అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడ రెండేళ్ళు ఉన్నాను. అనుకోని అవాంతరాల వల్ల జర్నలిజం కోర్సు పూర్తి చేయలేకపోయాను.
ప్ర. మీ పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? ఎలా? జరిగింది.
జ. నేను మద్రాసులో చదువుకునేటప్పుడు నా లెక్చరర్ స్నేహితుడు తరచుగా అతనిని (వాసన్) కలవడానికి వచ్చేవాడు. ఆయన ‘గురుదక్షిణ’ సినిమా ప్రొడ్యూసర్. అతనితో నా పెళ్ళి 1968 ఫిబ్రవరిలో జరిగింది. హంగూ ఆర్భాటం ఏమీ లేకుండా దండలు మార్చుకున్నాం. ఆయన తమిళ బ్రాహ్మణుడు.
ప్ర. మీ పిల్లల గురించి చెప్పండి.
జ. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద పాప రాజీవ పెళ్ళైన ఏడాది లోపల చెన్నైలో పుట్టింది. చిన్న పాప రజని 1971 మేలో సంగారెడ్డిలో పుట్టింది. ఇద్దరూ ఉన్నత విద్యావంతులు. రజని ఆస్ట్రేలియాలో ఉంటోంది.
ప్ర. మీ ఉద్యోగ వివరాలు చెప్పండి.
జ. మద్రాసు నుంచి నెలల బిడ్డతో వచ్చి జనగామలో తిరిగి ఉద్యోగంలో చేరాను. వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు వారి పిల్లల హోంలో నేను సూపర్‌వైజర్‌గా పని చేసాను. నాకు పిల్లలంటే చాలా ప్రేమ. నా పిల్లలతో సమానంగా వాళ్ళను ప్రేమించాను. ఎక్కువ కాలం కామారెడ్డిలో పని చేసాను. పోచవ్వ, మల్లమ్మ, ఎల్లయ్య, పెంటయ్య లాంటి పేర్లు పిల్లలకు ఉండేవి. వాటిని మార్చి అందమైన పేర్లను రిజిష్టర్లో నమోదు చేసాను. నవత, చైతన్య, చేతన, రవళి, సూర్య, నాట్య, సంగీత, చంద్రిక, చిత్ర లాంటి ప్రకృతి, కళలకు సంబంధించినవి, చైతన్యాన్ని సూచించే ఇలాంటి పేర్లు రాసాను. ఆ పేర్లతో పిల్లలను పిలిస్తే వాళ్ళు చాలా సంతోషించేవారు.
ప్ర. అలా పేర్లు మార్చి పెట్టడంలో మీ ఉద్దేశం ఏమిటి?
జ. నేను బహుజన పక్షపాతిని. ముఖ్యంగా నా బహుజన కులాలు గౌరవించబడాలని ఖచ్చితంగా అనుకుంటాను. ఆ వర్గాల నుంచి వచ్చిన పిల్లలు రేపు పెద్ద చదువులు చదువుకొని, ఉద్యోగవంతులైనప్పుడు వారి హోదాకు తగినట్లుగా ఉన్నత వర్గాల పిల్లలకు
ఉండే లాంటి పేర్లు ఉండాలని అలా మార్పు చేసాను. ఆ పేర్లు పిల్లలకు చాలా నచ్చాయి. వాళ్ళు తమ పదోతరగతి పరీక్షలు కూడా ఆ పేర్లతోనే రాసారు. కొందరు ఉద్యోగాలలో స్థిరపడ్డారు. పదవీ విరమణ కూడా చేసారు. ఇప్పటికీ కొందరు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. అమ్మా! అని ఆప్యాయంగా మాట్లాడుతారు.
ప్ర. పేర్లు మార్పు చేయడం వల్ల తల్లిదండ్రుల నుంచి కాని పై అధికారుల నుంచి కానీ ఇబ్బందులు ఏమీ రాలేదా?
జ. ఎందుకు రాలేదు? వచ్చాయి. ఈమె ఎవరు మార్చడానికి? ఈమెకు ఏం హక్కుంది? అనుకున్న వాళ్లెవరో నా పై అధికారులకు కంప్లైంట్ చేశారు. అమాయకులైన కొందరు తల్లిదండ్రులను రెచ్చగొట్టారు. అంతే! మేము మొక్కులు మొక్కితే పుట్టిన పిల్లలకు ఆయా పేర్లు పెట్టుకున్నాము. ఆ పేర్లు మారిస్తే పిల్లలకు ఏమైనా అవుతుందేమోననే భయంతో చాలా మంది తల్లిదండ్రులు నామీద పోట్లాటకు వచ్చారు. పాపం వాళ్ళు అమాయకులు. మూఢనమ్మకాలు వాళ్లలో ఎక్కువగా ఉన్నాయి. కంప్లైంట్ అందుకున్న మా డైరక్టర్ రాజ్యంసిన్హా (ఆమె ఎం.వి.ఎఫ్ శాంతాసిన్హాకు అత్తగారు) నా మీద తనిఖీకి వచ్చారు. కానీ నా పనితనాన్ని, పిల్లల పట్ల నా ప్రేమను, నా మీద పిల్లలకున్న అభిమానాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఆనందంతో “ఈ పిల్లలకు తల్లివైనావమ్మా!” అని ప్రశంసించారు. దానితో ఆ గొడవ సద్దుమణిగింది.
ప్ర. మీరు కొంతకాలం కువైట్ వెళ్ళారని విన్నాను. మీరు అంతగా ప్రేమించే ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది?
జ. నాకు అమ్మానాన్న లేరు. నేను చెల్లెలు ఎంతో అన్యోన్యంగా ఉండే వాళ్ళం. తనను ముద్దుగా చంటి అని పిలుచుకునేదాన్ని. తను కూడా బి ఎస్సీ నర్సింగ్ చేసి మెడికల్ డిపార్ట్మెంటులో పనిచేసేది. కాన్పు కష్టమై అకాలమరణం పొందింది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క తోడు లేకుండా పోయింది. చంటి మరణాన్ని నేను జీర్ణించుకోలేక పోయాను. డిప్రెషన్‌లోకి వెళ్లి పోయాను. చంటి స్నేహితురాలు డా. విద్య కువైట్‌లో ఉండేది. ఆమె నన్ను చూడడానికి వచ్చింది. నేనున్న పరిస్థితిని చూసి స్థల మార్పిడి కొరకు నన్ను వెంటనే కువైట్ తీసుకపోయింది. అలా నేను అనుకోకుండా అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. అనివార్య కారణాలవల్ల అక్కడే కొంతకాలం ఉండిపోయాను.
ప్ర. అక్కడ ఎన్నాళ్ళు ఉన్నారు? ఎప్పుడు తిరిగి వచ్చారు?
జ. కువైట్‌లో ఏడేళ్లు ఉన్నాను. కొంతకాలం టీచర్‌గా పనిచేసాను. అది నాకు నచ్చలేదు. నేను అద్దెకున్న ఇంట్లోనే ఇంటి యజమాని అనుమతి తీసుకొని చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పేదాన్ని. ఇక్కడ పని చేసింది కూడా పిల్లలతోనే కనుక ఆ పని నాకు సంతృప్తికరంగా ఉండేది. మధ్యలో ఒకసారి మాత్రం హైదరాబాదుకు వచ్చి వెళ్ళాను. ఇరాక్ కువైట్ యుద్ధసమయంలో 1990లో హైదరాబాదుకు తిరిగి వచ్చాను.
ప్ర. కువైట్ నుంచి తిరిగి వచ్చాక మళ్ళీ మీ ఉద్యోగంలో చేరారా?
జ. అలా తిరిగి వచ్చిన వాళ్ళు మళ్ళీ తమ ఉద్యోగంలో చేరారని తెలిసింది. నేనూ ప్రయత్నించాను కానీ ఆ అవకాశం రాలేదు. అప్పటి మా డైరక్టర్ చందనాఖాన్. వెళ్ళి ఆమెను కలిసాను. నా పోస్టును ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ గెజిట్ పబ్లిష్ చేసారని తెలిసింది. అది నాకు రావాలంటే కోర్టు ద్వారానే సాధించుకోవాలని ఆమె చెప్పారు. అక్కడితో వదిలేసాను. తర్వాత శాంతాసిన్హా డైరెక్టర్‌గా ఉన్న ఎం.వి.ఎఫ్ (మామిడి పూడి వెంకటరంగయ్య ఫౌండేషన్) లో రెండేళ్లు పనిచేసాను.
ప్ర. చంటి ప్రసన్న కేంద్రం ఎప్పుడు స్థాపించారు? ఆ వివరాలు చెప్పండి.
జ. 1993 రామాంతపూర్‌లో చంటి ప్రసన్న కేంద్రం ఏర్పాటు చేసాను. మా చెల్లెలిని చంటి అని పిలిచే వాళ్ళం. నా పేరులోని ప్రసన్నతో కలిపి చంటి ప్రసన్న కేంద్రం పేరు మీదనే రిజిష్టర్ అయింది. పదేళ్ళ తర్వాత మేడ్చల్‌కు మారింది. అక్కడ దశాబ్ది ఉత్సవం ఘనంగా జరిగింది.
ప్ర. చంటి ప్రసన్న కేంద్రం నుంచి ఏమేం పనులు చేసేవారు?
జ. పల్లెలు తండాలను దత్తత తీసుకున్నాం. మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేసే వాళ్ళం. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఆయిల్ పెయింటింగ్ నేర్పించే వాళ్ళం. ఫినాయిల్, సర్ఫ్ తయారీ విధానం నేర్పించే వాళ్ళం. స్త్రీలకు వయోజన విద్య కూడా ఉండేది. స్త్రీలకు తరచుగా మెడికల్ క్యాంపులు నిర్వహించి, వాళ్ళ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే వాళ్ళం. పుస్తకాలను, ప్రత్యేక సావనీర్లను (ఐదు) ప్రచురించడం జరిగింది.
ప్ర. చంటి ప్రసన్న కేంద్రం జూట్ వస్తువుల తయారీలో చాలా కృషి చేసిందని విన్నాను. ఆ వివరాలు చెప్పండి.
జ. అవును, మీరు విన్నది నిజమే. 1996 నుంచే చంటి ప్రసన్న కేంద్రంలో జూట్ ట్రైనింగ్ కం తయారీ యూనిట్ మొదలైంది. మొదట్లో రకరకాల బ్యాగులు తయారు చేసే వాళ్ళం. నేషనల్ జూట్ బోర్డు వాళ్ళు సహకారం అందించారు. లింగమూర్తి, భారతిగార్లు మొదట జూట్ బ్యాగులు తయారు చేసేవారు. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేనూ మొదలు పెట్టాను. వాళ్ళు మధ్యలో ఆపేసారు. కానీ నేను చాలా ఏళ్ళు కొనసాగించాను. చంటి ప్రసన్న కేంద్రం మేడ్చల్‌కు మారాక జూట్ వీవింగ్ మొదలు పెట్టాం. 18 మగ్గాలు, 20 భారీ మిషన్స్‌తో వీవింగ్ జరిగేది. గుంత మగ్గాలు, పెట్టె మగ్గాల పైన జూట్ బట్ట నేయించే వాళ్ళం. వరంగల్ నుంచి మాస్టర్ వీవర్స్‌ను పిలిపించి నేయడం నేర్పించాము. డోర్ మ్యాట్స్, కార్పెట్స్ తయారు చేయించే వాళ్ళం.
పాతబస్తీ నుంచి ఆలంభాయిని పిలిపించి ప్రత్యేక శిక్షణ ఇప్పించడం వల్ల బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు, ట్రాలీ బ్యాగులు తయారు చేసేవాళ్ళు. శ్రీకాకుళం నుంచి ట్రైనర్స్‌ను పిలిపించి, రెండు నెలలపాటు వాళ్ళకు వసతి ఏర్పాటు చేసి, వేతనాలు చెల్లించి ఉయ్యాలలు తయారు చేయడానికి శిక్షణ ఇప్పించాము. ప్రతి శిక్షణ ఉచితంగా ఇచ్చే వాళ్ళం. మా వాళ్ళు అందమైన జూట్ ఉయ్యాలలు తయారు చేసే వాళ్ళు. కోయం బత్తూర్ నుంచి కూడా ట్రైనర్స్ వచ్చే వారు. నేషనల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ (చీI=ణ) వాళ్ళతో కలిసి పనిచేసాం. ఢిల్లీ, కాన్పూర్, బాంబే, ఆస్ట్రేలియాలలో జూట్ ప్రదర్శన మరియు అమ్మకాలు జరిగేవి. మా దగ్గర శిక్షణ పొందిన మహిళలు ఇప్పటికీ వాళ్ళు సొంతంగా ఆర్థికంగా నిలదొక్కు కుంటున్నారు.
ప్ర. మీరు చేసిన ఇతర కార్యక్రమాలు ఏమిటి?
జ. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రవీంద్రభారతిలో గ్రామీణ మహిళలతో ప్రోగ్రాం ఇచ్చాం. ఈ సందర్భంగా ప్రత్యేక సంచికను ప్రచురించాము. స్త్రీలకు హెల్త్ క్యాంపులు నిర్వహించాం. కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించాము. మా కుటుంబంలో కూడా కులాంతర, మతాంతర వివాహాలు జరిగాయి. మా అమ్మాయి రజిని ఆస్ట్రేలియన్ అబ్బాయిని పెళ్ళి చేసుకుంది. వాళ్ళ అమ్మాయి అంటే నా మనవరాలు ఈ మధ్యనే ఉక్రెనియన్ అబ్బాయిని పెళ్ళి చేసుకొని నా ఆశీసుల కోసం హైదరాబాదు వచ్చి వెళ్ళింది. ఇలా ఖండాంతరాలలో కూడా మా కుటుంబంలో పెళ్ళిళ్ళు జరిగాయని చెప్పడమే నా ఉద్దేశం.
ప్ర. చంటి ప్రసన్న కేంద్రం అదే ఉత్సాహంతో పని చేస్తోందా?
జ. లేదనే చెప్పాలి. దానికి కారణాలు చాలా వున్నాయి. దానిని ఎన్ జీ ఓగా కాకుండా ప్రభుత్వరంగ సంస్థగా నడిపితే బాగుంటుందని అనిపించింది. ప్రత్యేకంగా మహిళల కొరకు దేశంలో ఎక్కడా వొకేషనల్ శిక్షణా కేంద్రం లేదు. కలకత్తా, కోయంబత్తూర్లలో ఉన్నాయి. కానీ అవి కో ఎడ్యుకేషన్ సెంటర్స్. మేడ్చల్ జూట్ శిక్షణాకేంద్రం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. కనుక దానిని వొకేషనల్ సెంటర్ ఫర్ వుమెన్ (VTCW) గా మార్చాలని ఆశ పడ్డాను. స్వరాష్ట్రంలో అది తీరని కోరికగానే మిగిలిపోయింది.
ప్ర. మరి, ఆ దిశగా మీరేమీ ప్రయత్నాలు చేయలేదా? చేస్తే ఆ వివరాలు చెప్పండి.
జ. ఎందుకు చేయలేదు, చాలా చేశాం. CPK ట్రస్టు మెంబర్స్, CPK శిక్షణ పొందిన 20, 30 మంది మహిళలతో కలిసి అప్పటి లేబర్ మినిష్టర్‌ను కలిసి విషయం వివరించి మేడ్చల్‌లో ఒక ఎకరం భూమి ఇవ్వమని అడిగాం. అది కాదంటే, గత 30 ఏళ్ళుగా ఖాళీగా వున్న మేడ్చల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వున్న వొకేషనల్ సెంటర్ భవనాన్ని ఇస్తే, అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పాం. (మా మిషనరీతో పాటు ఎస్టాబ్లిష్ చేసి పని మొదలు పెట్టి కొంత కాలం నడిపించి స్వల్ప వ్యవధిలోనే ప్రభుత్వానికి అప్పగించాలని అనుకున్నాం.) అలా ఎన్నో సార్లు రాజకీయ నాయకులు, సంబంధిత అధికార్ల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాను. కానీ పని మాత్రం కాలేదు. (అది ఈ ఇంటర్వ్యూ చేసేనాటికీ పాడు పడి ఖాళీగానే కనిపించింది.) అందుకే నిరాశతో ఆ మిషనరీ, మగ్గాలు అన్నీ ఉప యోగించుకునే వాళ్ళకు ఉచితంగా ఇచ్చేసాను. ఇప్పుడు సాహిత్యం మీద మరింత దృష్టి పెట్టాను. ప్రస్తుతం కలమే నా ఆయుధం.
ప్ర. మీ రచనా వ్యాసంగం ఎప్పుడు మొదలైంది?
జ. చాలా చిన్న వయసు నుంచే నేను రాయడం మొదలు పెట్టాను. 1970 లోనే ‘ కొత్తచిగుళ్ళ’, ‘ రాబందులు-విస్ఫోటనం’ అనే కవితా సంకలనాలు వచ్చాయి. పోస్టు కార్డు మీద మహిళా బులిటెన్ మొదటిసారి తీసాను. అందులో కథ, కవిత, పొడుపు కథ లాంటి అంశాలు ఉండేవి. ఇంగ్లీషులో కూడా ‘ Love in One’ మరియు ‘Dorling to Thee’ వచ్చాయి. ‘కొత్తనిజం’, ‘మనసు మంట’ అనే కథా సంకలనాలు వచ్చాయి. నడుస్తున్న కథ, రాబోవుతరం స్త్రీ అనే రెండు నవలలు వచ్చాయి.
ప్ర. మీరు పిల్లలతో పనిచేసారు కదా? బాలసాహిత్యం ఏమైనా రాసారా?
జ. నేను వుమెన్ అండ్ చైల్డ్ వెల్ ఫేర్ డిపార్ట్‌మెంటులో పిల్లల హోంలో పనిచేసిన అనుభవంతో బాలసాహిత్యం కూడా రాసాను. బాల జ్యోత్స్న, రవ్వలు, నీకు తెలుసా?, మా బడి మేమే కట్టుకున్నాం అనేవి. కొన్నాళ్ళు బాల సాహిత్యం పత్రిక కూడా నడిపాను.
ప్ర. మీ సంపాదకత్వంలో వచ్చిన పుస్తకాల గురించి చెప్పండి.
జ. ధిక్కార, స్త్రీ శక్తి, బహుజన మహిళా కలాలు (స్వగతాలు) అనేవి నా సంపాదకత్వంలో వచ్చిన పుస్తకాలు. ఈ మధ్యనే తెలంగాణ వైభవం – మహిళా చైతన్యం అనే పుస్తకం కూడా నా సంపాదకత్వంలోనే వచ్చింది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళలు, స్త్రీలు, ప్రాచీన కట్టడాలకు సంబంధించి 44 మంది మహిళలు రాసిన వ్యాస సంకలనం అది. ఇలాంటి పుస్తకం వల్ల తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచమంతటా తెలియచేసేటందుకు ఆ పుస్తకాన్ని “DECCAN CROWN TELANGANA – WOMEN EMPOWERMENT” అనే పేరుతో ఇంగ్లీషులో కూడా తీసుకువచ్చాం. దానికి దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది.
ప్ర. చివరి ప్రశ్న.. నేటి తరానికి మీరిచ్చే సందేశం ఏమిటి?
జ. ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు. కానీ అవసరమైనప్పుడు ఆత్మస్థైర్యంతో ఉండడం లేదు. అది పెంచుకోవాలి. ఆర్థికంగా బలపడుతున్నారు కానీ సామాజిక అవగాహన, అనుబంధాలు, విలువలు తెలియడం లేదు. సమాజానికి ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ అవగాహన పెరుగుతుంది. ఆ దిశగా అడుగులు చేయాలి నేటి యువతరం.
