ఇరవయ్యేళ్ళ మనోజ చురుకైన పిల్ల. పదో తరగతి వరకు చదువులో, ఆటపాటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో.. అన్నిట్లో ముందుండేది. ఆరోతరగతి నుంచి హాస్టల్లోనే చదువుకున్నా ఇంటి పనుల్లో అమ్మకి సాయం చేయడం, పొలం పనుల్లో నాన్నతోపాటు నడుం వంచి పనిచేయడం చేసేది. సెలవులకి ఇంటికి వస్తే ఒక్క క్షణం తీరిగ్గా కూర్చునేది కాదు.
చెల్లికి, తమ్ముడుకి చదువులో సాయం చేస్తూనో, అమ్మకి పనిలో సాయం చేస్తూనో, నాన్నతోపాటు పొలానికి వెళ్లడమో, ఇవేవీ కాకపోతే ఊర్లో ఉన్న బంధువుల్ని, స్నేహితుల్ని చుట్టబెట్టి రావడమో, పెద్దవారిని పలకరించిరావడమో.. ఏదో ఒకటి చేస్తూనే ఉండేది, ఖాళీగా మాత్రం కనపడేది కాదు. దాంతో మనోజ అంటే ఇంట్లోనే కాదు, ఊర్లోనూ అందరికీ ఇష్టం, అభిమానం. సెలవులు వస్తున్నాయంటే చాలు అందరూ ఎదురు చూస్తుండేవారు, మనోజ ఎప్పుడెప్పుడు వస్తుందా అని.
పదోతరగతి పరీక్షలు అయిపోయాకా ఇంటికి వస్తూనే ‘నాన్నా, నేను పరీక్షలు చాలా బాగా రాశాను, ఖచ్చితంగా 95% కన్నా ఎక్కువే వస్తాయి. ఇంటర్ మాత్రం బయటే చేర్పించండి నాన్నా. ఎంసెట్‌కి కోచింగ్ ఇచ్చే మంచి కాలేజీలు హైదరాబాద్‌లో ఉన్నాయి కదా, అక్కడే చేరతాను. మొదటి ప్రయత్నంలోనే మెడిసిన్‌లో సీట్ తెచ్చుకుంటాను. నేను డాక్టర్ అవ్వాలన్న మీ కోరిక, నా కల నెరవేర్చుకుంటాను’ అంటున్న కూతుర్ని మురిపెంగా చూసుకున్నాడు మనోజ తండ్రి. ‘ముందు నువ్వు ఆరోగ్యం మెరుగు పరుచుకో. ఆ తర్వాత మిగిలినోళ్ళ ఆరోగ్యం బాగుచేయడానికి డాక్టర్ ఔదువుగాని’ అంటున్న అమ్మ మాటలకి ‘నాకేమయ్యిందమ్మా, శుభ్రంగా ఉన్నాను’ అంటూ పోయినసారి సెలవులకి వచ్చినప్పుడు పెరట్లో తను నాటిన మొక్కలు చూసుకోడానికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిందే కాని మనసంతా మబ్బు కమ్మినట్టయ్యి మౌనంగా ఉండిపోయింది.
ఏడో తరగతి వరకు ఊర్లో బడిలో చదువుకున్న మనోజ ఆపైన బడి ఊర్లో లేకపోవడం, 14 కి.మీ. దూరంలో మండల కేంద్రంలో ఉన్న హైస్కూల్‌కి వెళ్ళడానికి బస్సులు కూడా సరిగ్గా లేకపోవడంతో ‘చదివింది చాలు, ఇంక మానేసి ఏ కుట్టుపనో, ఇంకేదన్నానో ఊర్లో ఉన్నది నేర్చుకో. ఇంట్లో మీ అమ్మకి, పొలం పనిలో నాకు సాయంగా ఉండు చాల్లే’ అని చెప్పేశాడు మనోజ తండ్రి. తల్లి మాత్రం ‘చిన్నప్పటి నుండి నువ్వు డాక్టర్ అవ్వాలి, బాగా చదువు అని చెప్పీ చెప్పీ ఇప్పుడు చదువే వద్దంటే ఏంటి అర్ధం’ అని గదమాయిస్తూనే, ‘రోజూ తిరుగుడు కష్టం, ఏమైనా అయితే ఇబ్బంది అనుకుంటే పోనీ హాస్టల్లో చేర్పిద్దాం, అక్కడే ఉండి చదువుకుంటుంది’ అని ఒప్పించింది. ‘చదువుతోనే ఆడపిల్లల జీవితాలకి భరోసా’ అని నమ్మి అదే విషయం తన కూతుళ్ళిద్దరితో చెప్తూ బాగా చదువుకోవాలని ప్రోత్సహించించింది. ఇప్పుడు కూడా అందుకే భర్తని ఒప్పించింది. అలా మనోజ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతిలో చేరిపోయింది.
మనోజ ఇల్లు వదిలిపెట్టి బయటకొచ్చి ఉండడం ఇదే మొదటిసారి. మొదట్లో ఇంటిమీద, ఊరిమీద కొంచెం బెంగ అనిపించినా, వందల మంది పిల్లలు, క్యాంపస్‌లోనే ఉండే టీచర్లు, మంచి భోజనం, చదువు, లైబ్రరీ, ఆటపాటలతో కొత్త ప్రదేశానికి త్వరగానే అలవాటు పడింది. కానీ మూడునెలలు గడిచేసరికి బరువు తగ్గింది, కొంచెం పాలిపోయినట్లు కనిపిస్తోందని ఆదివారాలు వచ్చినప్పుడు మనోజ తల్లి గమనించి ఆరోగ్యం గురించి అడిగితే తను బాగున్నానని, ఏ సమస్యా లేదని చెప్పేది. పెద్దమనిషి అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయని, ఒకవేళ అయితే ఏమి చేయాలో జాగ్రత్తలు చెప్పి, ఫోన్ చేయించితే వెంటనే వచ్చేస్తానని, భయపడొద్దని వచ్చిన ప్రతిసారీ చెప్పి వెళ్ళేది తల్లి.
ఆరు నెలలు గడిచేసరికి మనోజ ఇంకా పుల్లలా తయారైంది. సంక్రాంతి పండగ సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు తల్లి దగ్గర చేరి మెల్లగా తన సమస్యలని ఏకరువు పెట్టింది. తనకి మూత్రం పోసేటప్పుడు మంటగా ఉంటోందని, ఎక్కువసార్లు మూత్రం చేయాల్సి వచ్చినట్లు ఉంటుంది కానీ మూత్రం రాదని, ఎప్పటికీ కొంచెం చిక్కటి ద్రవంలాగా అవుతూనే ఉందని, అంతగా వాసన ఏమీ లేదని, ఒక్కోసారి క్లాసు అయిపోయాక లేచి నిలబడేటప్పటికి కూర్చున్న దగ్గర డ్రస్ తడిగా అవుతోందని, అలా రెండు మూడు క్లాసులు అయ్యేవరకు ఉండలేక మధ్యలో హాస్టల్‌కి వెళ్ళి డ్రాయర్లు మార్చుకుంటున్నానని, రోజులో రెండు మూడుసార్లు వాటిని ఉతుక్కోవాల్సి వస్తోందని చెప్పింది. ఇంకా, అప్పుడప్పుడూ పొత్తి కడుపులో నొప్పిలాగా వస్తుందని, కాళ్ళు గుంజుతుంటాయని, కొంచెం నీరసంగా కూడా ఉంటుందని, అలాంటప్పుడు నర్స్‌ని అడిగి గోలీ వేసుకుంటున్నానని చెప్పింది.
ఇవన్నీ విని ఖంగారు పడిన మనోజ తల్లి, వరసకి తనకు అక్క అయ్యే ఆశా వర్కర్‌ను ఇంటికి పిలిచి, ఎక్కడా అనొద్దంటూ విషయమంతా చెప్పింది. ‘ఇది తెల్లబట్ట సమస్య, భయం ఏమి లేదు, ఈ వయసులో ఇది మామూలే అని మాకు ఈ మధ్యే ట్రైనింగ్‌లో చెప్పారు’ అంటూ మనోజని కొన్ని ప్రశ్నలు అడిగింది. రక్త పరీక్ష చేయించితే హెచ్‌బి% 10 కూడా లేదు, రక్తం ఇంత తక్కువుంటే మరి ఈ సమస్యలన్నీ రావా అని కోప్పడి ఐరన్ మాత్రలు, మల్టీ విటమిన్ మాత్రలు ఇచ్చింది. డ్రాయర్లు ఉతికి ఎండకి వెయ్యి, అప్పుడప్పుడూ డెటాల్ కలిపిన నీళ్ళతో పిండెయ్యి. వీటన్నిటితోపాటు బాగా తిను, అదే మంచి మందు, అంటూ జాగ్రత్తలు చెప్పింది.
ఇవన్నీ పొల్లుపోకుండా పాటించినా మనోజ సమస్య తీరలేదు. కడుపు నొప్పి తరచూ రావడం, మూత్రంలో మంట ఎక్కువవ్వడం, ఒంటికి రక్తం పట్టకపోవడం, తెల్లబట్ట సమస్య తగ్గకపోవడంతో ఆ ఏడాది ఎండాకాలం సెలవులప్పుడు డాక్టర్ దగ్గరకి వెళ్ళారు. ప్రాధమిక పరీక్షలు అయిపోయాక, మనోజకి తీవ్రమైన మూత్రనాళ సమస్య ఉందని, అది యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా కాలంపాటు చికిత్స చేయకుండా వదిలేసినందుకు వచ్చి ఉంటుందని, తగ్గడానికి సమయం పడుతుందని, క్రమం తప్పకుండా మందులు వాడాలని హెచ్చరించింది డాక్టర్. అన్నిటికంటే ముఖ్యం శుభ్రంగా ఉండడం, బాత్రూములు శుభ్రంగా పెట్టుకోవడం అని కూడా చెప్పింది. కొంతమందికి రజస్వల అవ్వడానికి ముందు కొంత కాలం ఇలా జరిగే అవకాశం కూడా ఉంది, మందులు ఇస్తాను వేసుకో. మళ్ళీ నువ్వు హాస్టల్‌కి వెళ్ళే ముందు ఒకసారి వచ్చి కలువు అంది. సరే అన్నట్టు తలూపి, హాస్టల్లో టాయిలెట్లు ఎప్పుడూ తడిగానే ఉంటాయని, సరిగ్గా శుభ్రం కూడా చేయరని, చాలామంది బయటే, గచ్చుపైనే మూత్రం చేస్తుంటారని, వెళ్ళిన ప్రతిసారీ నీళ్ళు కొట్టి వెళ్ళినా వాసన, అక్కడక్కడా తెల్లతెల్లగా వైట్ డిశ్చార్జ్ ఆనుమాలు కనిపిస్తూనే ఉంటాయని, ఇది ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్ళినా మూడు రోజుల తర్వాత మళ్ళీ మామూలేనని, ఇక మరి శుభ్రత అంటే ఏమి చేయాలో అర్ధం కావట్లేదని మొత్తుకుంది. అలాగే, పదే పదే బట్టలుతకడం చూసి కొంతమంది సీనియర్లు తనపైన చీప్ కామెంట్స్ చేస్తున్నారని, అది అవమానంగా ఉందని, అమ్మానాన్నతో చెప్తే బడి మాన్పించేసి తీసుకెళ్ళిపోతారని, అలా అయితే డాక్టర్ అవ్వాలన్న తన కోరిక తీరదనే భయంతో చెప్పలేదని తలొంచుకుని దుఃఖంతో చెప్తుంటే మనోజ తల్లి గట్టిగా కౌగలించుకుని భయపడొద్దు, నీకు నేనున్నా అని భరోసా ఇచ్చింది.
డాక్టర్ కూడా మనోజ భుజం మీద చేయి వేసి ‘మందులు వాడితే సమస్య తగ్గుతుంది. కానీ శుభ్రత విషయంలో నేనేమీ చెప్పలేను. డ్రస్ చెమ్మ అవుతున్న నీ సమస్యకైతే ఒక మార్గం శానిటరీ ప్యాడ్ వాడడం. కానీ అదికూడా ఎక్కువ కాలం, రెగ్యులర్‌గా వాడొద్దు. రాషెస్ వచ్చి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది’ అని చెప్పింది. డాక్టర్ చెప్పింది నచ్చింది. వాడడం మొదలు పెట్టాక ఇంకెప్పుడూ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు.
అన్నట్టుగానే మనోజ తల్లి ప్రిన్సిపల్ దగ్గరకి వెళ్ళి పరిస్థితి వివరంగా చెప్తూనే ‘మా సంఘాల్లో మాట్లాడుకుని డిఇఓ దగ్గరకి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాము’ అని అంటుంటే ‘అంతదూరం ఎందుకు వెళ్ళడం, మాకు క్లీనింగ్ స్టాఫ్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతోంది. మేమే ఏదో ఒకటి చేస్తాము’ అంది ప్రిన్సిపల్. కానీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనబడలేదు మనోజకి. పైగా తనలాంటి సమస్యతో బాధపడుతున్న ఇంకొంతమంది అమ్మాయిలు కూడా బయటపడి తమ సమస్య గురించి మాట్లాడడంతో ఎవరికి వారు శుభ్రత పాటించడం మొదలెట్టారు. విద్యార్ధులే కమిటీలు వేసుకుని బాత్రూంల వాడకం గురించి పిల్లలతో గట్టిగా మాట్లాడుతూనే, ఒకపక్క వాడకంపై నిఘా పెట్టి, మరోపక్క క్లీనింగ్ చేసుకోవడం, ఫినాయిల్, చీపుర్లు, బ్లీచింగ్ వంటి అవసరమైన మెటీరీయల్‌ను ప్రిన్సిపల్ ద్వారా తెప్పించుకోడం చేస్తున్నారు. వీరందరికీ స్ఫూర్తి మనోజనే.
పదహారేళ్ళొచ్చి పదవ తరగతి పూర్తవుతుండగా మెచ్యూర్ అయిన మనోజకు మాత్రం తన యుటిఐ సమస్య ఇంకా తీరలేదు, ఒక్కోసారి విపరీతమైన కడుపునొప్పి, ఇంకోసారి భరించలేనంతగా మూత్రంలో మంట, పీరియడ్స్ సమయంలో అయితే నరకమే. ఒకపక్క బ్లీడింగ్ సమస్య, మరోపక్క మూత్రనాళంలో ఇరిటేషన్, కాల్చేసే వేడి, మంట. భరించలేక ఒక్కోసారి లుంగచుట్టుకుపోతూ ఏడ్చేది. ఇవేమీ లేని రోజు ప్రపంచం రంగులమయంగా తోచేది, అందరినీ పనిగట్టుకుని పలకరించేది. తన జీవితం ఏంటో తనకే అర్ధం అయ్యేది కారు. కానీ అది ఒక రొటీన్ కూడా అయిపోయింది. తల్లితో అప్పుడప్పుడూ ‘ఇలా ఎందుకవుతుందో తెలుసుకోడానికైనా నేను డాక్టర్ అవుతాను. నాలాగా అమ్మాయిలెవ్వరూ మెంటల్ టార్చర్ అనుభవించకూడదు’ అనేది. పదోతరగతి పరీక్షల తర్వాత, మొదటిసారి ఎక్కువ కాలం ఇంట్లో ఉండడంతో మనోజ అనారోగ్యం విషయం తండ్రికి కూడా తెలిసి ‘చదివింది చాలు, ఆడపిల్ల, అంత దూరాలు పంపను, పెళ్ళి చేసి అత్తారింటికి పంపడమే మిగిలింది’ అంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. అలా కలలు కన్న చదువుకి దూరమై, వేదన తగ్గించుకోడానికి పనినే మార్గంగా ఎంచుకుంది. ఇంట్లో పని, పొలం పనితో పాటు కూలి పనులకు కూడా వెళ్ళేది.
ఎలాగో నాలుగేళ్ళు గడిచిపోయాయి, ఇరవయ్యో పుట్టినరోజున మరీ మూడీగా ఉన్నట్లనిపించింది. ఓరోజు ‘నా సమస్య నాదే కదా, నా బాధ ఎవరికీ అర్ధం కాదు. ఈ మధ్య పెళ్ళి పోరు ఎక్కువైపోయింది. ఇంట్లో వాళ్ళకన్నా బయటి వాళ్ళ ఒత్తిడితో మానసిక హింసగా తయారైంది. భరించడం కష్టంగా ఉంది, నా ప్రమేయం లేకుండానే నా ఆలోచనలు చావు చుట్టూ తిరుగుతున్నాయి’ అని తన పుస్తకంలో రాసుకున్నది చెల్లి చూసి అమ్మతో చెప్పింది. అప్పటి నుండి తల్లి తనని ఒంటరిగా వదిలి పెట్టకుండా చూసుకుంటోంది.
ఒకరోజు భార్యాభర్తలిద్దరూ కలిసి మనోజని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆమె సమస్యకి పరిష్కారం చూపించమని ప్రాధేయపడ్డారు. ఆపరేషన్ లాంటిది అవసరమైతే చేయండి, తన పెళ్ళికోసం దాచిన డబ్బుంది, ముందు ఈ సమస్య నుండి బయటపడితే అప్పుడు కదా పెళ్ళి, అప్పటికి మళ్ళీ పోగేసుకోవచ్చు. కానీ తనని మామూలు మనిషిని చేయండి, బాధ భరించలేక చావాలని కూడా ఆలోచిస్తోంది అంటూ కాళ్ళావేళ్ళా పడ్డారు. వాళ్ళని శాంతింపచేసి ‘ప్రశాంతంగా వినండి, తన సమస్య చిన్నగా ఉన్నప్పుడే చికిత్స చేసి ఉంటే త్వరగా తగ్గేది. ఇప్పుడు ఇన్నేళ్ళుగా ముదిరిపోయాక ఇన్ఫెక్షన్ తీవ్రమయ్యాక చేయగలిగేది తక్కువ, కానీ చేద్దాం. ఇప్పుడు పెళ్ళి గురించి కాదు మీరు ఆలోచించాల్సింది, పిల్ల ఆరోగ్యం గురించి. క్రమం తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకుంటూ, మందులు వాడితే తగ్గుతుంది. అశ్రద్ధ చేస్తే కాన్సర్‌కి దారితీసే ప్రమాదం ఉంది’ అని వివరించింది. ‘అసలు అప్పుడే ఆ స్కూల్ మీద కేసు పెట్టాల్సింది, ఇప్పుడైనా ఆ పనే చేస్తా’ అని చిందులు తొక్కుతున్న తండ్రిని చూసి బిక్కచచ్చిపోయింది మనోజ.
అసలు సమస్య మనోజ ఆరోగ్యమా, లేక తనని అనారోగ్యంతోపాటు, తీవ్రమనోవేదనకి గురిచేసిన పరిస్థితులా? వందల మంది యుక్తవయసు అమ్మాయిలు ఉండే హాస్టళ్ళలో బాత్రూములు శుభ్రం చేయడానికి కనీస స్టాఫ్ లేకపోవడం, దానిపై సంబంధిత అధికారులు ఎవరూ అంతగా శ్రధ్ధ పెట్టకపోవడం, దానివల్ల ఎంతో మంది అమ్మాయిలు నరకం అనుభవించాల్సి రావడం, లేదా చదువు మానేసి వెళ్ళిపోవడం.. ఇవన్నీ బాలల హక్కుల ఉల్లంఘన అయినప్పుడు అవి తీవ్రమైన నేరంతో సమానమే కదా! అమ్మాయిలకి, మరీ ముఖ్యంగా హాస్టళ్ళలో ఉండే అమ్మాయిలకి, పునరుత్పత్తి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం అత్యవసరం కాదా? అతి చిన్న, కానీ అత్యంత ముఖ్యమైన పారిశుద్ధ్య పరిస్థితిని కల్పించలేకపోవడం వలన యుక్తవయసు అమ్మాయిల పునరుత్పత్తి ఆరోగ్యం దెబ్బతినడం, అది ఒక్కోసారి తీవ్రస్థాయికి చేరి భవిష్యత్తులో గర్భసంచి సమస్యలకు, కాన్సర్ ముప్పుకు కారణమవుతుంటే అది ప్రతిఒక్కరి ప్రాధాన్యతా అంశం కావాలి కదా!!
