అరణ్య
ఈ మధ్య న్యూస్‌పేపర్ చదువుతుంటే చాలా బాధ కలుగుతున్నది. హత్యలు, ఆత్మహత్యలు, చంపడాలు, చంపుకోవడాలు… పసిపిల్లల నుండి వృద్ధుల దాకా అన్నీ చావు వార్తలే. వాటికి క్రైమ్ కార్నర్ అనీ, క్రైం న్యూస్ అనీ ప్రత్యేకమైన పేజీలు కేటాయించి, ఆకర్షించే శీర్షికలు పెట్టి పత్రికలు చావును కూడా కమర్షియల్ ఎలిమెంట్‌గా మార్చివేస్తున్నాయి. రైతులు, వృత్తికారులు, విద్యార్థుల ఆత్మహత్యలు తరచు పత్రికలలో కనిపిస్తూనే ఉన్నా, గత రెండు మూడేళ్లుగా ఎక్కువగా జరుగుతున్న ఆత్మహత్యలు ప్రేమికులవి. ఇటీవల వాటి సంఖ్య మరీ ఎక్కువగా ఉండటమే చాలా బాధ కలిగిస్తున్న విషయం.
ప్రేమ… జీవితంలో ఒక మధురమైన అనుభూతి. రెండు మనసుల, మనుషుల తీయని కలయిక… జీవితమంతా రంగుల మయం చేసుకునే క్రమంలో తొలి దశ… వైవాహిక బాంధవ్యానికి పునాది వేసుకునే బలీయమైన బంధం… జీవితాన్ని నిర్వచించుకునే క్రమంలో ఇద్దరు వ్యక్తుల పరస్పర అవగాహనతో వారి జీవితాన్ని చక్కని నియమబద్ధమైన రీతిలో ముందుకు నడిపించే ప్రక్రియే ప్రేమ. జీవితమంటే నిలిచి ఉండే బలం ప్రేమది. అందుకే వందలాది మంది ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్ననూ ప్రేమించడాలు ఆగడం లేదు., ప్రేమించి పెళ్ళి చేసుకోవడాలు ఆగడం లేదు. అందుకేనేమో మన కవులు అంటారు… ”ప్రేమకు మరణం లేద”ని.
అసలు ప్రేమికులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? తమ ప్రేమను పునాదిగా చేసుకుని జీవితాన్నంతా సుఖమయం చేసుకోవాల్సిన ప్రేమికులు ఎందుకు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు? జీవితంలో వందల కొద్దీ ఆటుపోట్లను ఎదుర్కోవలసిన జంటలు చిన్న చిన్న సమస్యలకే ఎందుకు జీవితాలను బలి చేసుకుంటున్నాయి? రెండు, మూడు పదుల వయస్సులోనే చావుదారి పట్టాల్సినంతగా వారికి ఎదురయ్యే సమస్యలేమిటి? అసలు ప్రేమికుల ఆత్మహత్యలకు కారణాలేమిటి? మీడియాకు గానీ, తల్లిదండ్రులకు గానీ, సమాజాలకు గానీ, ప్రభుత్వాలకు గానీ ఈ ప్రశ్నలు, వాటికి సమాధానాలు అవసరం లేదు. ప్రేమించినా, ప్రేమించి పెళ్ళి చేసుకున్నా, ప్రేమ సఫలమైనా, విఫలమైనా, ఎవరినీ నిందించకుండా ప్రేమికులు తమంతట తాము చనిపోయినా… వారికి తెలిసిందొక్కటే! ఆ ప్రేమికులను కించపరిచేలా మాట్లాడటం… వారి ప్రేమను నీచంగా చిత్రీకరించటం. అందుకే ప్రేమికుల ఆత్మహత్యలకు కారణాలు వారికి పట్టదు. అయినా సరే! ఒక బాధాకరమైన సమస్యను విశ్లేషించి కారణాలు వెతికి పట్టుకుంటే కనీసం కొందరికైనా సమస్య మూలాల అర్థమవుతాయనే బాధ్యత తోనైనా సమస్య లోతుల్లోకి వెళ్ళాలి.
భారతదేశానికి తప్ప ప్రపంచంలో మరే ఇతర దేశానికి లేని భయంకరమైన, నీచమైన రుగ్మత కులం. సమాజాలు ఎంత ఆధునికీకరించ బడుతున్ననూ ప్రజల జీవితాలలో నుంచి కులం మాత్రం వేరవడం లేదు. ఒకే కులం లోపలి వ్యక్తులు మాత్రమే వివాహ ధర్మం ఆచరించాలనే షరతుతో సమాజం ఎప్పటికప్పుడు కులం పునాదులను మరింత బల పరుస్తుందే తప్ప కులనిర్మూలన, కులరహిత సమాజం ఏర్పాటు దిశగా అడుగులు వేయడానికి ఇష్టపడటం లేదు. సమాజం ఆచరించే ఈ తప్పుడు మార్గం కుటుంబాలకు కూడా వ్యాప్తి చెందింది. ఈనాటి కుటుంబాలు కులాన్ని ఆచరించే సంకుచిత బానిస కేంద్రాలుగా మారిపోయాయి. అందుకే కులాంతర వివాహాలను ఏ కుటుంబం కూడా అంగీకరించడం లేదు… సహించడం లేదు. ప్రేమికుల ఆత్మహత్యలకు ఇది ఒక ప్రధానమైన కారణం. కులాన్ని చూసి ప్రేమించే సంకుచితత్వం ప్రేమికులకు లేకపోవడం వారి లోపమై, వారి విశాలతత్వం, స్వచ్ఛత, నిష్కల్మషత్వం కుటుంబంలో పెద్దలకు సహించరానిదిగా మారిపోతున్నది. పిల్లల ప్రేమ తమకు ఇష్టం లేకున్ననూ ఇద్దరిదీ ఒకే కులం అయితే పెళ్ళికి ముందో, తర్వాతో పెద్దలు వారిప్రేమను సులువుగా అంగీకరిస్తున్నారు. కులాలు వేరయితే మాత్రం ఆ ప్రేమికులెంత ఉన్నతస్థాయికి వెళ్ళిననూ కులకుటుంబ మేధావులు మాత్రం వారి ప్రేమను ససేమిరా అంగీకరించరు. చిన్నతనం నుంచి కుల ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను పూర్తిగా పాటిస్తూ వస్తున్న పిల్లలు తమ జీవితాన్ని తాము నిర్ణయించుకునే ఒకే ఒక్క విషయంలో కులాన్ని అప్రధానం చేస్తే పెద్దలు, సమాజం భరించలేకపోతున్నారు. పిల్లలను కులం పేరుతో కట్టడి చేస్తూ వారిలో సంకుచిత ధోరణులను పెంచుతూ కులం దాటి పెళ్ళి చేసుకునే ఆలోచనలే మొలకెత్తనీయడం లేదు. కులానికి సంబంధించిన భావనలను గ్రంథాలలో, కళా రూపాలలో, ఆచారాలలో గుప్పిస్తూ, కులం పట్ల వెర్రి అభిమానం పెరిగేలా చేస్తూ, కులరహిత, కులబాహ్య జీవితాన్ని తప్పుగా చెప్పే నియమాలు, కట్టుబాట్ల చట్రంలో పిల్లలను బంధిస్తున్న కుటుంబం, సమాజాలు… ఆ బంధాలను తెంచుకుని వివాళ స్వేచ్ఛా ప్రపంచంలోకి పోయే పిల్లల ప్రయత్నాన్ని నిర్ధాక్షిణ్యంగా అణిచి వేస్తున్నారు. అసలు కులాన్ని పాటించే, ఆచరించే ఈ పెద్దలలో చాలా మందికి కులాల పుట్టక, ఏర్పాటు, మనుగడలు ఏయే సామాజిక పరిస్థితులలో జరిగాయో, ఎంతటి జుగుప్సా, కరమైన నియమాల ప్రాతిపదికన జరిగాయో, ఎంతటి వివక్ష, బానిసత్వాలను పాటించే విధంగా జరిగాయో తెలియదు. వారసత్వ క్రమంలో పై తరాలు చెప్పిన దాన్నే తు.చ. తప్పకుండా పాటించడం తప్ప కులాల విషయంలో సరైన అవగాహనే చాలామంది పెద్దలకు లేదు. ఒకానొక బలమైన సామాజిక వర్గం, పరాన్నభుక్కుల్లా బ్రతుకుతూ తాము శిష్టవర్గమని చెప్పుకుంటూ, తమ మనుగడ కోసం కుల వ్యవస్థ, కుల నియమాలు, కుల పునాదులు సృష్టించి తమకున్న పలుకుబడి, ఆధిపత్యంతో వాటిని కొనసాగింపజేస్తున్నారనే నగ్నసత్యం చాలా కుటుంబాలకు తెలియదు. ఈ సందర్భంలో అలాంటి ఒకానొక పక్షపాత, హేయమైన కులచట్రంలో బందీ అయి, తమ పిల్లల జీవితాలను ఆ కులానికి బలి ఇవ్వడంలో పెద్దలే ప్రధాన పాత్ర పోషిస్తున్నారని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ప్రేమికులు తమజీవితం తాము గడిపేందుకు వారే ప్రధాన అవరోధంగా మారిపోయారు. ఈ సందర్భంలో మూడు ప్రధానమైన సమర్థింపులు పెద్దల నుండి సహజంగా వినిపిస్తుంటాయి. మొదటిది – సమాజంలో విలువలను, నీతిని, నియమాలను, సంస్కృతిని కాదని వారు కులం తప్పితే ఆ ప్రేమికుల ప్రేమను ఎలా అంగీకరిస్తారు? అనేది… అసలు సమాజం అంటే ఏమిటి? కొందరు వ్యక్తుల సమిష్టి జీవనం. ఆ వ్యక్తులకు కొన్ని విషయాలలో సారూప్య అంశాలు, నిబంధనలు ఉంటాయి. అయినంత మాత్రాన సమాజానికి నియంతగా వ్యవహరించే అధికారం లేదు. ధిక్కరించ వీలులేని నిరంకుశ సంస్థగా మారే హక్కు లేదు. సమాజం తప్పు దారిన ప్రయాణిస్తుంటే, ఒంటి చేత్తో సరైన మార్గంలో పెట్టిన సంస్కర్త లెందరో ఉన్నారు. అందుకే సమాజం విమర్శలకు, వ్యతిరిక్తతలకు అతీతమేమీ కాదు. ఆ మాటకొస్తే సమాజాలు తొంబై శాతం తప్పుడు విలువలు, సంస్కృతి, నియమాలతో కూడుకున్నవే. అసలు సమాజంలో విలువలను, నియమాలను ఎవరు సృష్టించారు? ఫలానా సంస్కృతి, ఆచరణ మార్గాలే ప్రామాణికమని ఎవరు నిర్ణయించారు? అలా నిర్ణయించిన వారి అర్హతలేమిటి? ఆయా విలువలు, నియమాలు వ్యక్తి స్వేచ్ఛకు, జీవితానికి భంగం కలిగించే రీతిలో ఉన్నపుడు వ్యక్తి ఆ విలువలకే సర్దుబాటు కావాలా? తన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఫణంగా పెట్టి సంఘ మనుగడ కోసమే పాటు పడాలా? ఎందుకు తన వ్యక్తిత్వాన్ని సమాజం కోసం తాకట్టు పెట్టాలి? తన స్వేచ్ఛను గుర్తించని, అంగీకరించని సమాజనియమాలను తాను మాత్రం ఎందుకు గౌరవించాలి? సామాజిక శాస్త్రాల పట్ల అణువంత అవగాహన ఉన్న ఎవరికైనా తెలిసే విషయం – వ్యక్తి స్వేచ్ఛ తరువాతే కుటుంబం, సమాజం, దేశం., ఇంకేదైనా! అలాంటి తన స్వేచ్ఛను సమాజానికి ఎందుకు బందీని చేయాలి? అలా చేయమనటం ఎంతవరకు సమంజసం? ప్రేమికులు కూడా సమాజంలో వ్యక్తులుగానే ప్రాథమిక సభ్యత్వం కలిగి ఉన్నారు. వారు కూడా సమాజాన్ని ఈ విధంగా ప్రశ్నిస్తే సమాజం దగ్గర ఏం జవాబు ఉంది? అలాంటి అసృష్టి, బలహీన నియమాలను పట్టుకు వేళ్ళాడే సమాజ విలువలను, సంస్కృతిని, అది భజనచేసే కులాన్ని ధిక్కరిస్తే నష్టమేమిటి? కులం లేకుండా బతకగలమనే ధైర్యం, ఆత్మవిశ్వాసం తమకు లేనందుకు బాధపడుతూ, ఆ ధైర్యంతో ముందుకుపోయే ప్రేమికులను అభినందించాల్సింది పోయి పెద్దవాళ్లు వాళ్ళను అడ్డుకుంటే అది అతిపెద్ద తప్పిదం కాక మరేమవుతుంది?
ఇక రెండవ సమర్థింపు – చిన్నతనం నుండి వారిని పెంచి, పోషించి వారి అవసరాలు తీర్చి, వారికేది అవసరమో కనుక్కుని అన్నీ సమకూర్చిన తాము, వారి భాగస్వామిని కూడా సమకూర్చగలము కదా! అలాంటపుడు తమను కాదని పెళ్ళి చేసుకుని వారి దారి వాళ్లు చూసుకుని ప్రేమికులు తమను అవమానించడం లేదా? అనేది… ఇది కూడా సరైన వాదన కాదు. చిన్నతనం నుండి పిల్లలను పెంచి పోషిస్తూ వచ్చిననూ పెరుగుదల క్రమంలో ఏదో ఒక వయస్సు వద్ద ఆ బాధ్యత ఆగిపోతుంది. అంటే ఆ ఫలానా వయస్సు నుండి పిల్లలు తమ స్వంత ఆలోచనలతో ముందుకు పోతుంటారు. అది ఏదో ఒక వయస్సులో ప్రారంభమవ్వాల్సిందే. కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులనేవి ఆ వయస్సు అర్హతను నిర్ణయిస్తుంటాయి. సగటున ఈ మధ్య కాలంలో దాదాపు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య నుంచి పిల్లలు స్వతంత్రంగా వ్యవహరించటం ప్రారంభిస్తున్నారు. ఆడపిల్లలైతే మరికొంత ఆలస్యంగా… (అలా వ్యవహరించే సామర్థ్యం ఉన్ననూ, కుటుంబాలు, సమాజాలు ఆడపిల్లలను నియమాల చట్రంలో అణిచివేస్తుంటాయి కనుక…). ఈ వయసు నుండి చదువు, ఉద్యోగం లాంటి వ్యక్తిగత విషయాలలో పెద్దలు కేవలం సూచన చేసే వారిగా మాత్రమే ఉంటారు. కానీ అదే పెళ్ళి విషయంలో మాత్రం శాసించేవారిగా మారిపోతారు. పెద్దలు కుదిర్చిన వివాహాలలో కూడా అమ్మాయి లేదా అబ్బాయి నచ్చడం వరకే పిల్లల స్వేచ్ఛ తర్వాత కట్నకానుకలు, పెళ్ళి జరిగే తీరు, విందు వినోదాలు, మర్యాదలు అన్నీ పెద్దల ఇష్టానుసారమే సాగుతాయి (అమ్మాయిల విషయంలో అయితే చాలా సార్లు ఎంపిక స్వేచ్ఛ కూడా ఉండదు. పెద్దల మాట మేరకు సర్దుబాటు చేసుకోవలసిందే). ఇక అబ్బాయి లేదా అమ్మాయి పెద్దలతో చెప్పకుండా ఎవరినైనా ఇష్టపడితే పెద్దలు వెంటనే అదొక తప్పుడు చర్యగా భావిస్తూ దాన్ని వ్యతిరేకిస్తారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అసలు పిల్లలకు భాగస్వాములను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కూడా లేదన్న మాట. పెద్దలు కుదిర్చిన సంబంధాలలో ఆ స్వేచ్ఛ ఉన్నట్లు కనిపించిననూ అది పెద్దల నియంత్రణలో, వారి కనుసన్నలలో లభించే స్వేచ్ఛగా మనకు అర్థమవుతుంది. అంటే ఒకానొక వయసు దాటాక, పరిణతి చెందే ఆలోచనలు ఏర్పడ్డాక కూడా పిల్లలకు స్వాతంత్య్రం ఇవ్వడం లేదు. పెద్దలు కూడా మంచి సంబంధాలు కుదిర్చి, చక్కని భాగస్వాములను అందించగలరు కావచ్చు… కానీ పరిణతి చెందిన యువతీయువకులకు ఎందుకు ఎంపిక స్వేచ్ఛ ఇవ్వలేకపోతున్నారు? భాగస్వామిని కుదర్చటం వేరు, ఎంచుకోవటం వేరు. వాటి మధ్య చాలా తేడా ఉంది. జీవితకాలమంతా కొనసాగే కష్టసుఖాల, యజమాని బానిసత్వాల, ఒడిదొడుకుల, ప్రేమానురాగాలు లేని యాంత్రిక జీవితాల అనుభవాలను భరించే క్రమంలో అడుగడుగునా ప్రస్ఫుటమయ్యే లెక్కకు లేనన్ని తేడాలున్నాయి. కనుక చిన్నతనంలో పాలసీసాలు, పుస్తకాలు సమకూర్చామనే అధికారంతో భాగస్వామిని కూడా సమకూర్చుతామనే అధికారం కలిగి ఉంటామనుకోవటం, అలా ఉండాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఇక పెళ్ళి చేసుకుని భార్యాభర్తలై ప్రేమికులు స్వతంత్రంగా గడపడాన్ని అవమానం అనుకునే సమాజం సంకుచిత భావన నుంచి కూడా పెద్దలు బయటకు రావాలి. జీవితం గడపటం అనేది పూర్తిగా వ్యక్తిగతమైనది. ఎవరి వ్యక్తిగత జీవితంపై వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సంఘంతో ప్రతిచర్యలు జరపాల్సి ఉన్ననూ, అందుకు పిల్లలు తమ వ్యక్తిగత జీవితాన్ని సంఘం కోసం ఫణంగా పెట్టాలని, లేకుంటే అది తమకు అవమానమే అని పెద్దలు భావించటం సహేతుకం కాదు. పిల్లల చర్యను ఒక మంచి చర్యగా, అభ్యుదయ చర్యగా అభినందించాలి కానీ అది తమకు అవమానం అని వారిని దూరం నెట్టరాదు.
మూడవ సమర్థింపు – ప్రేమ వివాహలన్నీ విఫలమవు తున్నాయని, పెద్దలు కుదిర్చిన సంబంధాలే చక్కగా ఉంటున్నాయని, ప్రేమ అనేది అవగాహన లేని వయస్సులో జరిగే తాత్కాలిక ఆకర్షణ అని, అది చిరకాలం నిలిచే పెళ్ళి సంబంధం కాదనే వాదన… ప్రేమ వివాహలు కొన్ని చోట్ల విఫలమవుతున్న మాట నిజమే. అయితే అంతకంటే ఎక్కువగా పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా విచ్చుకుపోతున్నాయి. కుటుంబాన్ని, పెద్దలను, సమాజాన్ని ఎదిరించి ప్రేమించి పెళ్ళిచేసుకున్న ప్రేమికులను, వారి చర్యలను భూతద్దంలో చూడటం వల్ల వచ్చే అనుమానమే ఇది. ప్రేమ వివాహాలు విఫలమవుతున్నాయి కనుక పెద్దలు కుదిర్చిన వివాహాలే మంచివని సూత్రీకరిస్తున్నపుడు మరి పెద్దలు కుదిర్చిన వివాహాల వైఫల్యాల మాటేమిటి? పంచభూతాల సాక్షిగా నాతిచరామి అంటూ, వేదవేదాంగాలలో ప్రావీణ్యులనుకునే పురోహితుల మంత్రాల మధ్య జరిగిన ఎన్నో పెళ్ళిళ్ళు ఎందుకు పెటాకులవుతున్నాయి? దీన్ని బట్టి పెద్దలు కుదిర్చన వివాహాలన్నీ ‘తూచ్’ అని అనుకోవాలా? – ఒక జంట విడిపోవటం, కలిసుండటం అనేవి ఆ దాంపత్యంలో అవగాహన, సర్దుబాటు, కష్టసుఖాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమికులు అందరినీ ఎదిరించి పెళ్ళి చేసుకుంటారు కనుక వారికి ఆర్థిక, సామాజిక ఇబ్బందులన్నీ ఒకేసారి ముసురుకుంటాయి. దాంతో వారి జీవితంలో అంతకు ముందున్న ప్రేమ, ఆకర్షణలను ఆ ఇబ్బందులు డామినేట్ చేస్తాయి. అయినంత మాత్రాన వారి మధ్య ప్రేమ తగ్గిపోయిందనే ముగింపుకు రావడం సరి కాదు. ఇక ప్రేమికుల విడాకులను వైఫల్యంగా ఎవరైనా అనుకుంటే, నిజానికి పెద్దలు కుదిర్చిన వివాహాలలో కంటే ప్రేమికులలోనే అవగాహన, అర్థం చేసుకునే మనస్తత్వం, కలిసి కష్టసుఖాలు అనుభవించే తత్వం, స్త్రీ పురుష సమానత్వం, సంకుచిత భావాలకు లోబడని తత్వం ఎక్కువగా ఉంటాయి. పెద్దలు కుదిర్చిన సంబంధాలలో విడాకులకు కారణమయ్యే కట్నం, గృహహింస, అర్థం చేసుకోకపోవడాలు, వివాహేతర సంబంధలు వంటి చాలా సమస్యలు ప్రేమికులకు ఉండవు. కనుక ఇన్ని చక్కని లక్షణాలునన్ననూ ప్రేమికులు విడాకులు తీసుకుంటున్నారంటే, అందుకు ఏవో శక్తివంతమైన, బలీయమైన కారణాలు ఉండి ఉంటాయన్న కోణంలో ఆలోచించాలి తప్ప వాటిని వైఫల్యాలుగా ముద్రవేయటం సమంజసం కాదు.
ఇలా మూడురకాల సమర్థింపులు పెద్దల నుండి వినిపిస్తున్ననూ, వాటిలో సంపూర్ణంగా వాస్తవం లేదని స్పష్టంగా చెప్పవచ్చు. పెద్దలతో పాటుగా సమాజం కూడా ప్రేమికుల ఆత్మహత్యలకు ప్రత్యక్ష కారణమవుతుంది. ప్రేమికులు తమ ఇష్టానుసారంగా కులమతాలు, ఆచార వ్యవహారాల పట్టింపులు లేకుండా పెళ్ళి చేసుకోవడం వల్ల కుటుంబంపై తన ఆధిపత్యం పోతుందనే ఒకానొక అభద్రతతో సమాజం ఆ ప్రేమికులను, కొన్ని సార్లు ఆ కుటుంబాన్ని వెలివేసేందుకు సిద్ధమవుతుంది. ప్రేమికుల చర్యను ‘లేచిపోవడం’ గా చిత్తించి, అదొక అసాంఘిక చర్యగా ముద్రవేస్తుంది. ఇతర పిల్లలు ఆ బాటలో పోకుండా మానసిక బలహీనతలను వారిలో సృష్టింపచేస్తుంది. ప్రేమికుల పిల్లలకు అధికారిక గుర్తింపు ఇవ్వకుండా వారిని కులంలేని పిల్లలుగానో, నీతి లేని పిల్లలుగానో గుర్తించి వారిని అనుక్షణం చిత్రవధకు గురిచేస్తుంది. వారికి సామాజిక పలుకుబడిని పూర్తిగా తగ్గించి వారిని ద్వితీయశ్రేణి వ్యక్తులుగా చూస్తుంది. మానసిక ధైర్యం తగ్గి ఆత్మహత్యల పాలు పడుతున్నారంటే ఆ ప్రేమికులు ఈ సమాజాల వల్ల, పెద్దల వల్ల ఎంత క్షోభ చెంది ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
కనుక తక్షణ కారణాలు ఎన్ని ఉన్ననూ ప్రేమికుల మరణాలకు ప్రధానకారణం పెద్దలు, సమాజమే. ధైర్యంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న వారిని ఈ పెద్దలు, సమాజం ఎన్ని రకాల బాధలకు, అవమానాలకు గురిచేస్తుందో కళ్ళారా చూశాక, అటు వాళ్ళను ఎదిరించలేక, ఇటు తాము విడిపోలేక నిష్కల్మష మనసు గల ప్రేమికులు ఆత్మహత్యల దారి పడుతున్నారు. వారి మరణాలైనా కనీసం ఈ పెద్దలను, సమాజాలను కరిగించటం లేదు. పైగా ”నీతి తప్పిన వాళ్ళు” అనే ముద్రతో కించిత్తైనా బాధపడటం మానివేశారు. అందుకే మారాల్సింది ప్రేమికులు కానేకాదు. పెద్దలు, వారిని నడిపించే సమాజాలు మారాలి. ఇప్పటికే వేలాదిమంది ప్రేమికులు తమ జీవితాలను చాలించారు. ఇకనైనా వారి వివాహ విషయంలో వారికే స్వేచ్ఛనిచ్చి, వారిని అధికారంతో కాకుండా అనురాగంతో అక్కున చేర్చుకునే ఆదర్శ ‘పెద్దరికాన్ని’ అలవర్చుకోవాలి. అప్పుడే ఆ అమాయక ప్రేమికుల మరణాలు ఆగిపోయి సంకుచిత భావనలు లేని నూతన వివాహ వ్యవస్థ సృష్టించబడి ముందు తరాలను పురోగమింప చేస్తుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags