ఎం. గోపి
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశంలో మహిళల రాజకీయ సాధికారత చాలా తక్కువగా ఉన్నదని చెప్పవచ్చును. మనదేశంలో సగంమంది మహిళలే ఉన్నారు. భారత రాజ్యాంగం పురుషులతోపాటు సమానంగా మహిళలకూ హక్కులు కల్పించినప్పటికీ వివిధ కారణాల వల్ల రాజకీయ రంగంలో వారి ప్రాతినిధ్యం అంతంతమాత్రంగానే ఉంటున్నది. మహిళలు ఆర్థిక, సాంఘిక, విద్యారంగాలలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా సాధికారత సంపాదించినపుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యపడుతుందని చెప్పవచ్చును. ఎందువలన అనగా రాజకీయంగా ఒక మహిళ అభివృద్ధిని సాధించినపుడు తనతోపాటు మొత్తం సమాజాన్ని కూడా అభివృద్ధి వైపు నడిపించుటకు తగిన చర్యలను తీసుకుంటుంది.
మహిళల రాజకీయ సాధికారత గురించి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మాటల్లో చెప్పాలంటే ”దేశంలోని ఏ కొద్దిమంది మహిళలలో రాజకీయ సాధికారత సంపాదిస్తే మహిళలందరూ సాధికారత సంపాదించి అభివృద్ధి చెందినట్లు కాదు”. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం ఏ కొద్దిమంది మహిళలే కాకుండా అధికమొత్తంలో ఉండాలని ఈ మాటలకు అర్థము. మహిళలకు రాజకీయ సాధికారతను అందించాలని భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో భాగంగానే ”మహిళా రిజర్వేషన్ బిల్లు” ప్రవేశపెట్టబడింది. ఈ బిల్లును మొట్టమొదటిసారిగా కేంద్రంలో అధికారంలో ఉన్న హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం 1996 సం|| సెప్టెంబర్ 12న లోక్‌సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకూ దీనిపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులోని రెండు సభలలో ఆమోదం పొందితే (ఇప్పటికే ఇది రాజ్యసభ ఆమోదం పొందింది) మహిళలు అన్ని రంగాలలో ముందున్న మహిళలు రాజకీయ రంగంలో కూడా సాధికారిత సాధిస్తారని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో రాజకీయంగా పలుకుబడి ఉన్న, రాజకీయ వారసత్వ కుటుంబాలకు చెందిన మహిళలు మాత్రమే రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు. మిగిలిన స్త్రీలకు ఈ అవకాశం అందడం లేదు. ఇందులో భాగంగానే ఈ ”మహిళా రిజర్వేషన్ బిల్లు యొక్క తీరుతెన్నులు, చరిత్ర, భారతదేశంలో మహిళల రాజకీయ సాధికారత ఏ విధంగా ఉన్నది, బిల్లు యొక్క ప్రయోజనాలు, అది ఎదుర్కొంటున్న సవాళ్ళను వివరించడమే ఈ వ్యాసము యొక్క ముఖ్య ఉద్దేశ్యము.”
63 సంవత్సరముల క్రితం, స్వాతంత్య్ర సంబరాల వేళ – దేశ అత్యున్నత శాసనసభా ప్రాంగణం మీద ఎగిరిన తొలిజెండా మహిళల బహూకృతి. ఆ పతాకాన్ని బాబూ రాజేంద్రప్రసాద్‌కు అందించింది హంసా మెహతా అనే స్త్రీమూర్తి. ఇన్నేళ్లకు మళ్లీ భారత పార్లమెంటు మీద స్త్రీజన చేతన జయకేతనయై ఎగిరింది (మార్చి 9, 2010). ‘అసలు మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఎందుకు’ అని ప్రశ్నించేవారికి కొదవలేదు. దేశజనాభాలో సగాన్ని సంప్రదాయ శృంఖలాల్లో బంధించి అడుగడుగునా వారి చొరవ, అభినివేశాలకు గోరీ కట్టే జాతి ఎలా పురోగమిస్తుందన్న ప్రశ్నకు జవాబు ఇచ్చేదెవరు? మహిళలకు భాగస్వామ్యం కల్పించినపుడే సమాజ అభ్యున్నతి త్వరితంగా సాధ్యపడుతుందన్న పూజ్య బాపూజీ మాట ఏనాడో మరుగున పడిపోయింది. ‘దేశచరిత్రలోనే గొప్ప సుదిన’మంటూ 1996లో తొలిసారి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపాదించినపుడు అన్ని పార్టీలు సహర్షితంగా స్వాగతించాయి. భారత రాజకీయ రంగ స్వరూప స్వభావాల్నే మార్చేసేటంత ప్రభావశీలత ఆ చట్టానికి ఉందన్న స్పృహ కలిగిన మరుక్షణం నుండే కొన్ని పార్టీల ధోరణి మారిపోయింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు – చరిత్ర :
మహిళా రిజర్వేషన్ బిల్లును 1996 సెప్టెంబర్ 12వ తేదీన అప్పుడు అధికారంలో ఉన్న హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వము 81వ రాజ్యాంగ బిల్లుగా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. తిరిగి ఈ బిల్లును 1998వ సంవత్సరములో అనగా 12వ లోక్‌సభలో అపుడు అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి (శ్రీఈజు) అటల్ బిహారీ వాజ్‌పాయి నాయకత్వంలో 84వ రాజ్యాంగ బిల్లుగా ప్రవేశపెట్టారు. ఇదే కూటమి 1999 సంవత్సరంలో అనగా 13వ లోక్‌సభలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 2002లో పార్లమెంటులో ప్రవేశపెట్టబడగా దీనిపై చర్చించడానికి నిరాకరించడమైనది. 2003 సంవత్సరములో ఈ బిల్లు 2సార్లు ప్రవేశపెట్టబడింది. 2004లో కేంద్రీయ ప్రగతిశీల కూటమి (ఏఆజు) ప్రభుత్వ హయాంలోనూ ప్రవేశపెట్టారు. అయినా ఫలితం దక్కలేదు. 2010, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. చివరికి ఈ బిల్లు 2010 సంవత్సరంలో మార్చి 9వ తేదీన 186 ఓట్లు సంపాదించుకుని రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ ఓటింగు సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కేవలం ఒకే ఒక ఓటు వేయడం జరిగింది. ఆ ఓటు వేసిన వ్యక్తి అనంతరావు జోషి. కాని ఇదే ఓటింగు సమయంలో కొన్ని పార్టీలు, పార్టీల సభ్యులు దీన్ని వ్యతిరేకిస్తూ ఓటింగును బహిష్కరించడం జరిగింది. దీనిని వ్యతిరేకించేవారి అభిప్రాయం ప్రకారం ఈ బిల్లు అమలులోకి వచ్చినట్లయితే ఈ బిల్లు వల్ల మహిళలకు రిజర్వేషన్ వర్తించి దాని ద్వారా కేవలం అగ్రకులాల మహిళలు మాత్రమే దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దానివల్ల బడుగు, బలహీనవర్గాలకు ఏమాత్రమూ ప్రయోజనం చేకూరదని వీరి వాదన. మహిళా రిజర్వేషన్ బిల్లును సమర్ధించేవారు మాత్రం, బిల్లు ఆమోదం పొందితే ఇపుడు అధికారంలో ఉన్న కొంతమంది మగవాళ్లు వారి రాజకీయ ఉద్యోగిత దూరమవుతుందనే భావనతో కొన్ని దుష్ట రాజకీయ శక్తులు ఒక కూటమిగా ఏర్పడి మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయుటకు, అమలుచేయుటకు ప్రయత్నాలు చేస్తున్నారని వీరి వాదన. చట్టసభలో మహిళలకు పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభలలోను 33 శాతము రిజర్వేషన్ సీట్లు కేటాయించాలన్నదే ఈ బిల్లు యొక్క ముఖ్య ఆశయం.
భారతదేశంలో మహిళల రాజకీయ సాధికారత – ఒక పరిశీలన :
1952 మొదటి సాధారణ ఎన్నికల నుండి ఇప్పటి 15వ లోక్‌సభ వరకూ ఎంత శాతం మహిళలు లోకసభకు ఎన్నికయ్యారో, వారి ప్రాతినిధ్యం ఏ విధంగా ఉన్నదో పరిశీలించడం ద్వారా భారతదేశంలో మహిళల రాజకీయ సాధికారత ఏ విధంగా ఉన్నదో తెలుసుకొనవచ్చును. ఆ వివరములను క్రింది విధంగా చెప్పవచ్చును మొదటి లోక్‌సభలో (1952-55) మొత్తం 466 మంది సభ్యులు ఎన్నిక అవగా అందులో కేవలం 23 మంది మహిళా శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. అనగా మొత్తం సభ్యులలో వీరి శాతం 4.9గా వుంది.
రెండవ లోక్‌సభలో (1957-62) మొత్తం సభ్యులు 474 కాగా అందులో 24 మంది మహిళలు ఉన్నారు. మొత్తం సభ్యులలో వీరు 5 శాతంగా ఉన్నారు.
మూడవ లోక్‌సభకు (1962-67) జరిగిన ఎన్నికలలో మొదటి రెండు లోక్‌సభల మహిళా సభ్యుల సంఖ్యతో పోల్చుకుంటే దీనిలో వీరి ప్రాతినిధ్యం పెరిగిందని చెప్పవచ్చును. ఇందులో మొత్తం సభ్యులు 500 కాగా అందులో 37 మంది మహిళలతో 7.4 శాతంగా వారి ప్రాతినిధ్యం ఉంది.
నాల్గవ లోక్‌సభకు (1967-70) మొత్తం 505 మంది సభ్యులు ఎన్నిక కాగా అందులో 31 మంది మహిళా ప్రతినిధులున్నారు. వీరి శాతం ఇందులో 6.3 శాతంగా వుంది.
ఐదవ లోక్‌సభ ఎన్నికలలో (1971-77) 26 మంది మహిళలు ఎన్నికయ్యారు. వీరి శాతం 5 కాగా ఇందులో మొత్తం ఎన్నికయిన సభ్యులు 510.
ఆరవ లోక్‌సభకు (1977-79) జరిగిన ఎన్నికల్లో మొత్తం సభ్యులు 533 కాగా 18 మంది మహిళా సభ్యులు ఎన్నికయ్యారు. మొత్తం 1 నుండి 15వ లోక్‌సభ వరకూ జరిగిన ఎన్నికల్లో ఈ ఆరవ లోక్‌సభ మహిళల ప్రాతినిధ్యం 3.3 శాతంతో అత్యంత తక్కువ మహిళా (సభ్యులను) శాతమును కలిగిన లోక్‌సభగా దీన్ని చెప్పవచ్చును.
1980-84లో జరిగిన ఏడవ లోక్‌సభ ఎన్నికల్లో 551 మంది మొత్తం సభ్యులుండగా అందులో 32 మంది మహిళా ప్రతినిధులు 5.8 శాతంగా వున్నారు.
ఎనిమిదవ లోక్‌సభలో (1984-89) 538 మంది మొత్తం సభ్యులు కాగా, 48 మంది మహిళా సభ్యులున్నారు. వీరి శాతం ఇందులో 8.5గా ఉంది.
తొమ్మిదవ లోక్‌సభ ఎన్నికల్లో (1989-91) మొత్తం సభ్యులు 529 కాగా మహిళా ప్రాతినిధ్యం 29 మందితో, 5.4 శాతంగా ఉంది. పదవ లోక్‌సభలో (1991-96) అంతకు ముందు దానితో పోల్చితే మహిళాసభ్యుల ప్రాతినిధ్యం చాలావరకూ పెరిగిందని చెప్పవచ్చును. ఇందులో మొత్తం మహిళా సభ్యులు 39 మంది ఉన్నారు. వీరి శాతం 7.2.
పదకొండవ లోక్‌సభ ఎన్నికల్లో (1996-97) మొత్తం సభ్యులు 545 కాగా అందులో 40 మంది మహిళాసభ్యులున్నారు. అందులో వీరి ప్రాతినిధ్యం 7.3 శాతంగా ఉన్నదని చెప్పవచ్చును.
పన్నెండవ లోక్‌సభకు (1998-99) జరిగిన ఎన్నికల్లో 545 మంది మొత్తం సభ్యులు. అందులో 44 మంది మహిళలున్నారు. వీరి శాతం 8. పదమూడవ లోక్‌సభలో (1999-2004) మొత్తం సభ్యులు 545 మంది ఎన్నిక కాగా అందులో 48 మంది మహిళాసభ్యులున్నారు. అనగా వీరి ప్రాతినిధ్యం ఇందులో 8.8 శాతం.
పద్నాల్గవ లోక్‌సభ ఎన్నికలలో మొత్తం సభ్యులు 542 కాగా 44 మంది మహిళాసభ్యులతో 8 శాతంగా ఉన్నారు. (2004-2009)
ప్రస్తుతం ఉన్న పదిహేనవ లోక్‌సభలో మొత్తం సభ్యులు 543 మంది కాగా అందులో 58 మంది మహిళా సభ్యులున్నారు. వీరి ప్రాతినిధ్యం ఇందులో 10.68 శాతంగా వుంది. మహిళల రాజకీయ సాధికారతకు సంపాదించి ఈ 15వ లోక్‌సభను అతిముఖ్యమైనదని చెప్పవచ్చు. ఎందువల్ల అనగా ఇది ఇప్పటి వరకూ జరిగిన అన్ని లోక్‌సభల కన్నా అత్యధిక మహిళా సభ్యులను అందించిన లోక్‌సభగా గుర్తింపు పొందినది. (2009)
పై వివరాలు భారతదేశంలో మహిళా రాజకీయ సాధికారత ఏ విధంగా ఉన్నదో తెలుసుకొనుటకు కొంతవరకూ దోహదపడతాయని చెప్పవచ్చును. మహిళా రాజకీయ సాధికారత మొదటిసారిగా ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం కొంతవరకూ పెరిగిందని చెప్పవచ్చు. కాని ఈ పెరుగుదల ఆశించినంత స్థాయిలో మాత్రము లేదని ఖచ్చితంగా చెప్పవచ్చును.
ఇప్పుడున్న మహిళా నేతల్లో భర్తను కాదని, తండ్రిని కాదని స్వతంత్రంగా పనిచేస్తున్న వారెందరు? బిల్లు ఆమోదం పొందితే ఎంతమంది మహిళలు స్వతంత్య్రంగా అధికారాన్ని చెలాయించగలరు?
భారతావని భావి గతి రీతుల్ని గుణ్మాకంగా ప్రభావితం చేసే మహిళా రిజర్వేషన్ బిల్లును ఎగువసభ అయిన రాజ్యసభ ఆమోదించింది. దిగువసభ అయిన లోక్‌సభలోనూ ఆమోదం పొందడమే తరవాయి. లోక్‌సభతోపాటు అసెంబ్లీలలోనూ మహిళలకు మూడవవంతు స్థానాలను ప్రత్యేకించే చట్టం అమలులోనికి రానుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును దేశమాతృమూర్తుల రుణం తీర్చుకోవడంగా కేంద్రన్యాయశాఖామంత్రి అభివర్ణించడం జరిగింది. స్త్రీల ప్రాతినిధ్యం ఇనుమడిస్తే రాజకీయరంగ ప్రక్షాళన జరుగుతుందని రాష్ట్రపతులుగా కె.ఆర్. నారాయణన్, అబ్దుల్‌కలాం అభిలాషించారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మొదటిసారి 1996 సంవత్సరంలో ప్రవేశపెట్టబడి ఇప్పటికి 14 సంవత్సరాలు యావజ్జీవశిక్ష అనుభవించినా ఇంకా విడుదల (ఆమోదం) కాకపోవడం చాలా దురదృష్టకరమైన విషయంగా చెప్పవచ్చు. ఇప్పటికి అయినా ఎటువంటి సమస్యలను ఎదుర్కొనకుండా, అన్నింటిని అధిగమించి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది ఆచరణలో సక్రమంగా పనిచేయాలని ఆశిద్దాం. ప్రస్తుతమున్న 15వ లోక్‌సభలో 58 మంది మహిళా సభ్యులు ఉండగా ఈ బిల్లు ఆమోదం పొందితే ఆ సంఖ్య 181 మందికి చేరుతుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags